తాజా స‌మాచారం

తలరాతలు మారుతున్నాయ్‌

* పేపరు-5 మార్కుల కేటాయింపులో తప్పులు!
* మారబోతున్న మౌఖిక పరీక్షల అభ్యర్థుల జాబితా
* ఏపీపీఎస్సీ అలసత్వంపై గ్రూపు-1 అభ్యర్థుల రుసురుస
ఈనాడు, అమరావతి: గ్రూపు-1 (2011) ఉద్యోగాల భర్తీ కథ మళ్లీ మొదటకొచ్చింది. వ్యయప్రయాసాలకోర్చి..ప్రధాన పరీక్షల్ని మళ్లీ నిర్వహించి ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా మరోసారి మారబోతుంది. మార్కుల కేటాయింపు విధానాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో దాఖలైన పిటిషన్‌కు జవాబిచ్చేందుకు వివరాలను పరిశీలిస్తున్నప్పుడు దొర్లిన తప్పు వెలుగులోకి రావడంతో సోమవారం నుంచి జరపాల్సిన మౌఖిక పరీక్షలను ఏపీపీఎస్సీ నిరవధికంగా వాయిదావేసి, కొత్త జాబితా రూపకల్పనలో నిమగ్నమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రూపు-1 నోటిఫికేషన్‌ను అనుసరించి జరిపిన ప్రాథమిక(ప్రిలిమ్స్‌) ప్రశ్నపత్రంలో దొర్లిన తప్పులపై అభ్యర్థులు ట్రైబ్యునల్‌, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేశారు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల్ని అనుసరించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయాలు వేర్వేరుగా ప్రధాన పరీక్షల్ని జరిపాయి. ఏపీపీఎస్సీ కిందటేడాది సెప్టెంబరు 14 నుంచి 29 వరకు జరిగిన ప్రధాన పరీక్షలకు 2,780 మంది హాజరయ్యారు. రాష్ట్ర విభజనతో 151 పోస్టులు మాత్రమే ఏపీపీఎస్సీ పరిధిలోనికి వచ్చాయి. అందులోనూ ఆరు పోస్టులకు అర్హత కలిగిన వారు లేకపోవడంతో మిగిలిన 145 పోస్టుల్లో ఒక్కోక్క దానికి ఇద్దరు వంతున మొత్తం 290 మందిని మౌఖిక పరీక్షలకు ఎంపికచేశారు.
ప్రశ్నల్లో దొర్లిన తప్పులతో..!: ప్రధాన పరీక్షల్లో ఒకటైన పేపరు-5(అర్థమేటిక్‌, స్టాటిస్టిక్స్‌ అంశాలతో కూడిన)లో 42 (150) మార్కులకు సంబంధించిన ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. దీనిపై న్యాయనిపుణుల సలహాల్ని అనుసరించి తప్పులు దొర్లిన ప్రశ్నల్ని తీసేసి..విభాగాల వారీగా మొత్తమ్మీద 150కు మార్కుల్ని కేటాయించాలని నిర్ణయించారు. ఇక్కడే అధికారులు, పరీక్షనిర్వాహకుల(ఎగ్జామినర్ల) మధ్య లోపించిన సమన్వయంతో కథ అడ్డం తిరిగింది. కమిషన్‌ నిర్ణయాన్ని అనుసరించి మార్కుల కేటాయింపులో జాగ్రత్తల్ని తీసుకోకుండా సాధారణ పద్ధతిలో అభ్యర్థులకు 5వ పేపరులో 150కు వచ్చిన మార్కులను పరిగణనలోనికి తీసుకున్నారు. మిగిలిన పరీక్షల్లో వచ్చిన మార్కులకు వీటిని కలిపేసి ప్రాధాన్య క్రమంలో అభ్యర్థుల ఎంపిక జాబితాను తయారు చేశారు. గతనెల 12వ తేదీన ఈ జాబితా వెల్లడించగా పలువురు అభ్యర్థులు 5వ పేపరులో ‘మార్కుల కేటాయింపు’ విధానాన్ని న్యాయస్థానంలో ప్రశ్నించడంతో ఏపీపీఏస్సీ తరఫున జవాబు చెప్పేందుకు అధికారులు వివరాలను సేకరిస్తుండగా కమిషన్‌ ‘స్కేలింగ్‌’ నిర్ణయాన్ని అనుసరించలేదని స్పష్టం కావడంతో కంగుతిన్నారు. మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారిలో 133 మంది పూర్వ అభ్యర్థులే (2013 నాటి మౌఖిక పరీక్షలకు ఎంపికైన వారి జాబితాలో) ఉన్నారు. వీరు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఎంపిక జాబితా మారబోతుండడం గమనార్హం. ఏపీపీఎస్సీ అలసత్వంపై అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌, కార్యదర్శి శాయి మాట్లాడుతూ ‘‘జవాబుపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి సమస్యల్లేవు. పేపరు-5లో మార్కుల కేటాయింపులోనే సమస్యలొచ్చాయి. వీటిని సరిదిద్ది కొత్త జాబితాను వారంలోగా ప్రకటించేందుకు చర్యల్ని తీసుకుంటున్నామని’’ వెల్లడించారు.

Posted on 11-02-2017