close

తాజా స‌మాచారం

21న‌ ఉద్యోగ ప్రకటనల జారీ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిసెంబ‌రు 21న‌ పలు రకాల ఉద్యోగ భర్తీ ప్రకటనలు జారీచేయనుంది. దేవాదాయ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-3, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌-గ్రేడ్‌-1, అసిస్టెంట్‌ కమిషనర్‌, మరో శాఖకు చెందిన అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రిక్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇతర ప్రకటనలు జారీచేసేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలోని కమిషన్‌ కార్యాలయంలో 20న‌ జరిగిన కమిషన్‌ సమావేశంలో ఉద్యోగ ప్రకటనల జారీ గురించి క్షుణ్ణంగా చర్చించారు. పంచాయతీ కార్యదర్శుల ఖాళీల వివరాలు వచ్చినందున డిసెంబ‌రు 26 నాటికి ఆ ప్రకటన జారీచేసే విషయాన్ని కమిషన్‌ ఆలోచిస్తోంది. గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాల భర్తీ ప్రకటనల జారీపై ప్రభుత్వం నుంచి వచ్చే స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్లు కమిషన్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు. గ్రూపు-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూపు-1లో కలపాలా? వద్దా? అన్న దానిపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా సమాచారం ఇంకా అందలేదన్నారు. మొత్తం మీద కమిషన్‌ తరఫున జరగాల్సిన ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియను ఈ నెలాఖరు నాటికి తప్పనిసరిగా పూర్తి చేస్తామని వెల్లడించారు.

Posted on 21.12.2018