తాజా స‌మాచారం

అర్ధరాత్రి దరఖాస్తు.. పక్కపక్కన హాల్‌ టికెట్‌ నెంబర్లు

* గ్రూప్‌-2లో మాస్‌ కాపీయింగ్‌ కోసం పక్కా ప్రణాళిక.. అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన
* అప్రమత్తంగా ఉన్నామన్న ఏపీపీఎస్సీ
ఈనాడు, అమరావతి: గ్రూప్‌-2 పరీక్షకు హాజరవుతున్న వారిలో అర్ధరాత్రి దరఖాస్తు చేసుకున్న కొంతమంది అభ్యర్థుల హాల్‌ టిక్కెట్ల నెంబర్లు పక్కపక్కనే వస్తున్నాయనే ఆరోపణలు పలు అనుమానాలకు తావిస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండటాన్ని అదునుగా చేసుకుని కొంతమంది పక్కావ్యూహాంతో అర్ధరాత్రి పూట దరఖాస్తు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పగటిపూట దరఖాస్తు చేసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా అదే సమయంలో చాలా మంది దరఖాస్తు చేసుకుంటారు కనుక ఒకేచోట నుంచి ఇద్దరు కలిసి దరఖాస్తు చేసుకున్నవారి హాల్‌ టిక్కెట్ల నెంబర్లలో చాలా వ్యత్యాసం ఉంటుంది. అదే అర్ధరాత్రి దాటిన తర్వాత దరఖాస్తు చేసుకునేవాళ్లు తక్కువగా ఉంటారు కనుక కలిసి దరఖాస్తు చేసుకుంటే ఆ రెండు హాల్‌టిక్కెట్లు పక్కపక్కన వస్తాయని గుర్తించి కొంతమంది ప్రణాళిక ప్రకారం ఇలా చేసినట్లు తెలిసింది. దీనివల్ల రాత పరీక్ష సమయంలో కాపీయింగ్‌కు పాల్పడే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే ప్రతిభావంతులైన అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ వ్యవహారాన్ని కొందరు అభ్యర్థులు తాజాగా ఏపీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై ఏపీపీఎస్సీ కార్యదర్శి శాయి వివరణను ‘ఈనాడు’’ కోరగా ‘‘ఈ వ్యవహారం మా దృష్టికి తీసుకొచ్చింది. అప్రమత్తమయ్యాం. జిల్లా కలెక్టర్లకు, పరీక్షా కేంద్రాల నిర్వహణకు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశాలిస్తున్నాం. మా వంతు బాధ్యతగా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తాం. విధి నిర్వహణలో పర్యవేక్షకులు విఫలమైతే వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.
ఫిబ్రవరి 26వ తేదీన ఎపీపీఎస్పీ గ్రూపు-2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ను నిర్వహించనుంది. ఈ పరీక్ష రాసేందుకు 6.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఫిబ్రవరి 19 రాత్రి వరకూ 3 లక్షల మంది వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

Posted on 20-02-2017