close

తాజా స‌మాచారం

1:50 ఎంపిక విధానంతో నష్టపోతాం

* గ్రూపు-2 ప్రాథమిక పరీక్ష రాసిన సామాజిక వర్గాల అభ్యర్థుల ఆందోళన
* సివిల్స్‌ విధానాన్ని అనుసరించాలని అభ్యర్థన
ఈనాడు - అమరావతి: సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రవేశపెట్టిన ప్రాథమిక, ప్రధాన పరీక్షల విధానంలో చోటుచేసుకోబోయే పరిణామాల పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 26న జరిగిన గ్రూపు-2 ప్రాథమిక పరీక్ష రాసిన వారికి వచ్చిన మార్కుల్ని అనుసరించి తొలి 49100 మంది అభ్యర్థుల (982 పోస్టులకు 50 మంది వంతున)ను ప్రధాన పరీక్షకు ఏపీపీఎస్సీ ఎంపిక చేయబోతోంది. సామాజిక వర్గాల వారీగా కాకుండా పరీక్ష రాసిన వారి మొత్తంలో నుంచి తొలి వరుసలో ఉన్న అభ్యర్థుల్ని ఎంపికచేయబోతున్నందున తాము వెనుకబడిపోతామని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అవేదన చెందుతున్నారు. నగరాలు, పట్టణాల్లో ఉంటూ ప్రత్యేకంగా శిక్షణ పొందిన వారే ప్రధాన పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారని, దీనివల్ల సామాజిక వర్గాల వారీగా కేటాయించిన పోస్టులకు అభ్యర్థులు లేని పరిస్థితులూ తలెత్తుతాయని వీరు పేర్కొంటున్నారు. గతంలో.. ప్రకటించిన పోస్టుల సంఖ్య అనుసరించి ఒకే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసేవారు. దీనివల్ల ఈ సమస్యే ఉత్పన్నం కాలేదు. తాజా సంస్కరణలతో 982 ఉద్యోగాల భర్తీకోసం 49100 మందికి జనరల్‌ ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు అర్హత లబిస్తుంది. చివరి ర్యాంకు 49100 ర్యాంకు వచ్చిన ఓపెన్‌ కాంపిటీషన్‌ అభ్యర్థికి కూడా మెయిన్స్‌ రాసే అవకాశం లభిస్తుంది. ఇదే సమయంలో ఇతర సామాజిక వర్గాల వారు దూరమైపోతారని ఓ సీనియర్‌ ఆచార్యులు పేర్కొన్నారు. ఇది సామాజిక వర్గాల వారికి ఉన్న అవకాశాన్ని దెబ్బతీయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. గ్రూపు-2 ప్రాథమిక పరీక్షను 4,83,321 మంది రాశారు. 982 ఉద్యోగాల్లో సగం జనరల్‌ కేటగిరీలోగా పోగా మిగిలిన పోస్టులను ఇతర సామాజిక వర్గాల వారికి కేటాయిస్తారు. మరోవైపు ప్రధాన పరీక్షకు అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో కాకుండా సామాజికవర్గాల వారీగా ఎంపిక చేస్తే జనరల్‌ కేటగిరీ వారు వెనుకబడతారు.
ఇంజినీరింగ్‌ ఉద్యోగాల భర్తీలో వ్యత్యాసం కనిపించలేదు
దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఆచార్య ఉదయ్‌భాస్కర్‌, కార్యదర్శి వైవీఎస్టీ శాయిను వివరణ కోరగా.. ‘‘స్క్రీనింగ్‌ టెస్ట్‌, ప్రధాన పరీక్ష విధానం అమల్లోకి తేబోతున్న సమయంలోనే యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్‌లో మాదిరిగా ప్రిలిమ్స్‌ నుంచి సామాజిక వర్గాల వారీ (1:12 నుంచి 1:15 వరకు)గా అభ్యర్థులను ఎంపిక చేయడానికి అధికారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరాం. ప్రస్తుతానికి పూర్వ విధానం ప్రకారమే అనుసరించాలని సూచించింది. దానికి అనుగుణంగానే చర్యలు తీసుకుంటున్నాం. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రిలిమ్స్‌ ద్వారా ప్రధాన పరీక్ష రాసిన వారి వివరాలను పరిశీలించగా ఎలాంటి అసమానతలు కనిపించలేదు. గ్రూపు-2 విధానంలోనూ అదే జరుగుతుందని భావిస్తున్నాం. అన్ని వర్గాల వారికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. గ్రూపు-1 ఉద్యోగాల భర్తీలో 1:50 విధానం ఎప్పట్నుంచో అమల్లో ఉంది. దీన్ని జీఓ 570 అనుసరించి అమలు చేస్తున్నాం. ఈ జీఓను తొలుత హైకోర్టును కొట్టేయగా అనంతరం సుప్రీంకోర్టు (ఏపీపీఎస్సీ వర్సెస్‌ బాలోజి బహదావత్‌ కేసు) సమర్థించింది’’ అని వివరించారు.
దరఖాస్తుల్ని చూడకుండా..!
దరఖాస్తుల్లో అభ్యర్థులు పేర్కొనే వివరాలను పరిశీలించడం లేదు. ఎంపిక సమయంలో మాత్రమే చూస్తున్నారు. దీంతో సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల్ని ఎంపిక చేయాలంటే ముందుగానే ధ్రువపత్రాల పరిశీలన జరగాల్సి ఉంటుంది. లేదంటే కొత్త సమస్యలు వస్తాయి. లక్షల దరఖాస్తులను ముందుగానే పరిశీలించడం సాధ్యమవుతుందా? అన్న అంశాన్నీ చూడాల్సిన అవసరం ఉందని మరికొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.
* సివిల్స్‌-2015 ప్రిలిమ్స్‌లో జనరల్‌ కేటగిరిలో 107.34, ఓబీసీ-106.00, ఎస్సీ-94.00, ఎస్టీ-91.34, పీహెచ్‌-1-90.66, పీహెచ్‌-2 76.66, పీహెచ్‌-3 40.00 కటాఫ్‌గా వచ్చింది. ఇక్కడ ప్రతి కేటగిరీ కటాఫ్‌లోనూ మార్పు ఉంది. వీటిని దృష్టిలో ఉంచుకునే సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికకు అవకాశాన్ని కల్పించాలని ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి నివేదించింది.

Posted on 03-03-2017