తాజా స‌మాచారం

తప్పయి పోయింది.. న్యాయం చేయండి

* వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాటు చేశాం
* గ్రూప్‌-2 విద్యార్థుల విన్నపం
* అవకాశం ఇవ్వలేమంటున్న ఏపీపీఎస్సీ
ఈనాడు - అమరావతి: పరీక్ష తొందరపాటు కొందరు గ్రూపు-2 అభ్యర్థుల పాలిట అశనిపాతం అయ్యింది. పలువురు అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌ నెంబర్లు, ప్రశ్నపత్రం కోడ్‌కు తగినట్లు కాకుండా..వేరే వృత్తాల్ని నింపారు. దీంతో వారి జవాబుపత్రాల మూల్యాంకనం నిలిచిపోయింది. దీంతో తమకు న్యాయం చేయాలని ఆ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) కార్యాలయాన్ని అర్థిస్తున్నారు.
గతనెల 26వ తేదీన గ్రూపు-2 ప్రాథమిక పరీక్ష(స్క్రీనింగ్‌ టెస్ట్‌) రాసిన వారిలో తొలి 25వేల జవాబుపత్రాల్ని స్కానింగ్‌ చేయగా 800 వరకు వివరాలు సరిగ్గా నమోదుకానందున మూల్యాంకనం జరగలేదు. ఈ పరీక్ష రాసే సమయంలో అభ్యర్థులు కొందరు ప్రశ్నలకు తగినట్లు జవాబులు రాసినప్పటికీ హడావుడిలో వ్యక్తిగత వివరాల నమోదులో తప్పులు చేశారు. వైటనర్‌ ఉపయోగించి దొర్లిన తప్పును సరిచేయకూడదని...వివరాల నమోదులో తప్పులు చేసినట్లయితే జవాబుపత్రాల మూల్యాంకనం జరగదని ఏపీపీఎస్సీ పదేపదే పేర్కొంది. సూచనల రూపంలో రాత పూర్వకంగానూ అభ్యర్థులకు సూచించింది. అయినప్పటికీ అభ్యర్థులు కొందరు తప్పులు చేసేసి, ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జరిగిన పొరబాట్లను పరిశీలిస్తే...హాల్‌టిక్కెట్‌ నెంబరు 10546 ఉంటే 10456గా వృత్తాల్ని నింపారు. జవాబుపత్రాల మూల్యాంకనం కంప్యూటర్‌ ద్వారా జరుగుతున్నందున నెంబరు, అభ్యర్థి పేరు సరిగ్గా ఉంటేనే మూల్యాంకనం జరుగుతుంది. ఈ రెండింట్లో ఎక్కడ తప్పు జరిగినా జవాబుపత్రం మూల్యాంకనం జరగదు. అలాగే ప్రశ్నపత్రాల్ని ఏ,బీ,సీ,డీ సిరీస్‌లో ముద్రించారు. ఈ ప్రక్రియలో ప్రశ్నలు, జవాబులు ఒకటే అయినా....వరుసక్రమం మారిపోతుంది. దీనివల్ల ‘ఏ’ పేపరుకు బదులు ‘బీ’ వృత్తాన్ని నింపితే మూల్యాంకనం దానికి తగినట్లే జరుగుతుంది. పరీక్ష అయిన అనంతరం జరిగిన తప్పు(చేతిలో ఉన్న సమాధానపత్రం నకలు)ను గమనించి అభ్యర్థులు పలువురు లబోదిబోమంటున్నారు. జవాబుల్ని తాము బాగా రాశామని, ఎలాగోలా న్యాయం చేయాలని వారు అధికారుల్ని ప్రాధేయపడుతున్నారు. అవకాశం ఇవ్వడం ద్వారా ఎటువంటి నష్టం ఉండదని చెబుతున్నారు.
ఆక్షేపణ వస్తుంది: ఏపీపీఎస్సీ.. పోటీ పరీక్షల విషయంలో అదీ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు చేసే తప్పులను సవరించుకునేందుకు అవకాశం ఇవ్వడం కష్టమని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఉదయ్‌భాస్కర్‌ పేర్కొన్నారు. దీనివల్ల ప్రతిభావంతులైన అభ్యర్థుల నుంచి, కోర్టుల నుంచి ఆక్షేపణ వస్తుందని పేర్కొన్నారు. పరీక్ష రాసే సమయంలో అభ్యర్థులు తీసుకోవల్సిన జాగ్రత్తలపై పదేపదే అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తుచేసి, పరీక్ష రాసిన వారు హడావుడిలో తప్పులు చేసేసి, ఇప్పుడు బాధపడితే తామేమి చేయగలగమని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ శాయి పేర్కొన్నారు. ఒక్కొక్క ఓఎంఆర్‌ షీట్‌ను మాన్యువల్‌గా సరిచేయాలన్నా...కంప్యూటరు ప్రోగ్రామింగ్‌ను మార్చాలన్నా ఇబ్బందినేనని పేర్కొన్నారు.

Posted on 08-03-2017