తాజా స‌మాచారం

'గ్రూపు-2' మూల్యాంకనం 147 ప్రశ్నలకే

ఈనాడు, అమరావతి: గ్రూపు-2 స్క్రీనింగ్ టెస్ట్ జవాబుపత్రాన్ని 147 మార్కులకు మూల్యాంకనం చేయనున్నారు. 150 మార్కుల ప్రశ్నపత్రంలో 3 తప్పులు దొర్లినందున, వాటిని తొలగించి మూల్యాంకనం చేస్తామని ఏపీపీఎస్సీ అధ్యక్షుడు ఉదయ్‌భాస్కర్ బుధవారం(మార్చి 15) వెల్లడించారు. వారం లేదా పది రోజుల్లో ఫలితాల్ని వెల్లడిస్తామన్నారు.
త్వరలో ఏఈఈ రాత పరీక్ష మార్కులు
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఉద్యోగ ప్రధాన రాత పరీక్ష మార్కులను సాధ్యమైనంత త్వరగా వెల్లడించేందుకు ఏపీపీఎస్సీ కృషి చేస్తోంది. ప్రాథమిక 'కీ'పై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం మెకానికల్ ఇంజినీరింగ్, జనరల్ స్టడీస్, సివిల్-మెకానికల్ పేపరు-2, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పేపరు-2కు సంబంధించి తుది 'కీ'ని ఖరారు చేశారు. పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ఉద్యోగ రాత పరీక్ష మార్కులను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.
ధ్రువపత్రాల పరిశీలన ద్వారా..
ఏఈఈ మార్కుల ప్రకటన అనంతరం సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలకు పిలుస్తారు. ఆయా పోస్టులకు తగినంత మంది పరిశీలనకు రాకుంటే ప్రాధాన్య క్రమంలో కింది వరుసలో ఉన్న వారిని పిలుస్తారు. ఇదే సమయంలో ఏఈ ఉద్యోగానికి ఎంపికైతే అభ్యర్థుల ఎంపిక (ఛాయిస్) ఏమిటన్న దానిపై అంగీకారం తెలుసుకుంటామని కమిషన్ వర్గాలు తెలిపాయి.

Posted on 16-03-2017