తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ పరీక్షల్లో రుణాత్మక మార్కులు!

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలో నిర్వహించబోయే పరీక్షల్లో రుణాత్మక మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఒక్కో తప్పు సమాధానానికి మూడో వంతు మార్కును తగ్గించాలనేది ఆలోచన. తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో ప్రాథమికంగా దీనిపై నిర్ణయం తీసుకుని ఈ మేరకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది. ఇందుకు సర్కారు అనుమతి లభిస్తే త్వరలో విడుదల కానున్న ప్రకటనల నుంచే ఈ పద్ధతిని అమలు చేయాలని కమిషన్ భావిస్తోంది. అలాగే 50 వేల మంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే పరీక్షకు ప్రిలిమ్స్‌ కూడా నిర్వహించాలని యోచిస్తోంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షల సిల‌బ‌స్‌లో మార్పులపై కసరత్తు చేస్తున్న కమిషన్ తుది సిల‌బ‌స్‌లో పర్యావరణ పరిరక్షణ, సుస్థిరాభివృద్ధి లాంటి అంశాలను చేర్చనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

Posted on 03-07-2016