తాజా స‌మాచారం

ఏపీపీఎస్సీ గ్రూప్‌ - 1 ఇంటర్వ్యూల నిలిపివేత

* మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ట్రైబ్యునల్‌
ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) గ్రూపు -1 కేటగిరీ కింద 172 పోస్టుల భర్తీ నిమిత్తం ఏప్రిల్ 18 నుంచి మే 10 వరకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలను నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా ట్రైబ్యునల్‌ (ఏపీఏటీ) మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. మెయిన్‌ రాత పరీక్షల్లో తప్పులు దొర్లిన నేపథ్యంలో ఇంటర్వ్యూలను ఎలాంటి మార్గదర్శకాలు లేకుండా స్కేలింగ్‌ విధానాన్ని అనుసరించడాన్ని సవాలు చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్‌.ముకుందరావు, మరో ఇద్దరు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లపై విచారించిన ట్రైబ్యునల్‌ సభ్యులు ఎన్‌.జానకిరామారావు ఇంటర్వ్యూల నిర్వహణను నిలిపివేస్తూ ఏప్రిల్ 4న‌ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. గ్రూప్‌ - 1 పోస్టుల భర్తీ నిమిత్తం 2011లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా ఇందులో ఆరు ప్రశ్నలు తప్పులు దొర్లడంతో ఈ వివాదం ట్రైబ్యునల్‌, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. చివరికి ఆరు ప్రశ్నలు తొలగించి అర్హుల జాబితాను రూపొందించి రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా మెయిన్స్‌ నిర్వహించారు. మెయిన్స్‌ ఫలితాలకు ముందే అభ్యంతరాలుంటే చెప్పాలని, తప్పుగా ఉన్న ప్రశ్నలను తొలగించి ఇంటర్వ్యూలకు జాబితాను రూపొందించాలని గతేడాది నవంబరు 5న నిర్ణయించింది. దీని ప్రకారం అర్హుల జాబితాను రూపొందించి ఇంటర్వ్యూలకు ఫిబ్రవరి 13 నుంచి మార్చి 15 వరకు షెడ్యూలు విడుదల చేసింది. అయితే ఒక్కసారిగా ఏపీపీఎస్సీ ఆ నిర్ణయాన్ని మార్చుకుని స్కేలింగ్‌ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చి కొత్తగా అర్హుల జాబితాను రూపొందించి ఇంటర్వ్యూలను ఏప్రిల్ 18 నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. దీనివల్ల పిటిషనర్లు అవకాశాన్ని కోల్పోవడంతో వీరు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది జె.సుధీర్‌ వాదనలు వినిపిస్తూ ఏపీపీఎస్సీ తెరపైకి తీసుకొచ్చిన స్కేలింగ్‌ విధానానికి మార్గదర్శకాలు లేవన్నారు. ఈ విధానం ప్రకారం ఎంపిక జరుగుతుందని నోటిఫికేషన్‌లో ప్రస్తావించలేదన్నారు. నోటిఫికేషన్‌లో చెప్పకుండా స్కేలింగ్‌ విధానాన్ని అమలు చేయడం చెల్లదన్నారు. ఈ విధానాన్ని ఎలా అమలు చేశారన్న విషయంలో స్పష్టత లేదని, ఏపీపీఎస్సీ చరిత్రలో స్కేలింగ్‌ విధానాన్ని అమలు చేయలేదన్నారు. ఏపీపీఎస్సీ రెండోసారి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు చెబుతోందని, అందులో నిపుణులు ఎవరో వెల్లడించలేదని చెప్పారు. మొత్తం వ్యవహారం పారదర్శకంగా లేదని, ఇందులో ఎన్నో సందేహాలున్నాయని పేర్కొన్నారు. మొదటి జాబితాలో ఎంపిక కాని కొంతమంది కోసం స్కేలింగ్‌ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లుందని తెలిపారు. వాదనలను విన్న ట్రైబ్యునల్‌ ఇంటర్వ్యూలను నిలిపివేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది.

Posted on 05-04-2017