తాజా స‌మాచారం

ఏఈఈ అభ్యర్థుల జాబితా వెల్లడి

* 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలన
* ఏఈ అభ్యర్థుల జాబితా వచ్చే వారం
* వెల్లడించిన ఏపీపీఎస్సీ

ఈనాడు, అమరావతి: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈఈ) ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. వీరి ధ్రువపత్రాల పరిశీలన ఏప్రిల్ 26వ తేదీ నుంచి హైదరాబాదులోని కమిషన్ కార్యాలయంలో జరగనుంది. 1:2 నిష్పత్తిలో ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తున్నారు. రాత పరీక్షల్లో మార్కుల్ని అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ అర్హతల ధ్రువపత్రాలు, ఇతరత్రా కారణాలవల్ల పలువురు వెనుకబడే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి. దీనివల్లే ధ్రువపత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తున్నామన్నాయి.
అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితానూ వచ్చే వారం ప్రకటిస్తామని ఎపీపీఎస్సీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ రెండు పోస్టులకు ఎంపికైన వారుంటే ఏ ఉద్యోగానికి ప్రాధాన్యం ఇస్తారో ధ్రువపత్రాల(ఏఈఈ) పరిశీలన సమయంలో అభ్యర్థుల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకుంటామని పేర్కొన్నారు. దీనివల్ల ప్రాధాన్య క్రమంలో వెనుక వరుసలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుందని తెలిపారు.
మౌఖిక పరీక్షల వాయిదా!
ఏప్రిల్ 18 నుంచి జరగాల్సిన గ్రూపు-1 మౌఖిక పరీక్షలను ట్రైబ్యునల్ ఆదేశాలవల్ల వాయిదా వేసినట్లు ఎపీపీఎస్సీ తెలిపింది. ప్రధాన పరీక్షల్లో దొర్లిన తప్పులకు మార్కులు కేటాయించే విషయమై అభ్యర్థులు ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా 'స్టే ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిని తొలగించాలని కోరుతూ ఎపీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేసి, రెండు రోజులపాటు వాదనల్ని వినిపించింది. తదుపరి విచారణ సోమవారానికి(ఏప్రిల్ 17) వాయిదాపడింది. ఇక్కడ వ్యతిరేకత వ్యక్తమైతే హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో ఎపీపీఎస్సీ వర్గాలు ఉన్నాయి.

Posted on 15-04-2017