close

తాజా స‌మాచారం

ఏపీలో గ్రూపు-1 ప్రిలిమ్స్‌లో రెండు ప్రశ్నపత్రాలు

* నేడు గ్రూపు-2 ప్రకటన?
ఈనాడు, అమరావతి: ఏపీలో గ్రూపు-1 పరీక్షల నిర్వహణలో మార్పులపై డిసెంబ‌రు 26న‌ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకు గ్రూపు-1 ప్రాథమిక పరీక్ష కింద ఒక పరీక్షనే నిర్వహించేవారు. కమిషన్‌ ప్రతిపాదించిన మేరకు ఖరారు చేసిన కొత్త విధానంలో పేపరు-1, పేపరు-2 కింద రెండు పరీక్షలను రెండు గంటల చొప్పున నిర్వహిస్తారు. ఒక్కొక్క పరీక్ష 120 ప్రశ్నలతో 120 మార్కులకు (మొత్తం 240) ఉంటుంది. మెయిన్స్‌లో ఆంగ్లం అర్హత పరీక్షగా ఉండేది. దీంతోపాటు తెలుగును ప్రత్యేకంగా నిర్వహిస్తూ అర్హతను తప్పనిసరి చేశారు. తెలుగును ఆంగ్ల పరీక్ష మాదిరిగానే 150 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. మిగిలిన ఐదు పరీక్షలను కూడా పేపరు-1నుంచి పేపరు-5 వరకు ఒక్కోదానికి మూడు గంటల వ్యవధినిచ్చి నిర్వహిస్తారు. ఒక్కో పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. 75 మార్కులకు మౌఖిక పరీక్షను నిర్వహిస్తారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారిక ఉత్తర్వులనిచ్చింది. కమిషన్‌ ప్రతిపాదించిన పాఠ్యప్రణాళికకు కూడా ఆమోదం తెలిపింది. గ్రూపు-1 ప్రకటనతోపాటు అధ్యాపకులు, ఇతర ఉద్యోగాల భర్తీ ప్రకటనలను 31లోగా జారీ చేస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. 27వ తేదీన‌ గ్రూపు-2 ప్రకటన వెలువడవచ్చు.

Posted on 27.12.2018