ఏపీపీఎస్సీ > వ‌న్ టైం రిజిస్ట్రేష‌న్

ఉద్యోగార్థులూ...ఒక్కసారి నమోదైతే చాలు!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతులు లభించి, నియామకాలకు మార్గం సుగమమవుతోంది. గ్రూప్స్‌ సిలబస్‌ను కూడా ఏపీపీఎస్‌సీ దాదాపు ఖరారు చేసింది. ఈ సందర్భంగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రవేశపెట్టిన ‘వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌’ (ఒక్కసారి వివరాల నమోదు) ఉద్యోగార్థులకు తప్పనిసరి. నియామక ప్రకటనల జారీ వరకూ వేచివుండకుండా వెంటనే అభ్యర్థులు ఈ నమోదు చేయించుకుంటే మంచిది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించే అభ్యర్థుల్లో విశ్వాసాన్ని కల్పించడానికీ, తమ విధుల్లో పారదర్శకతను తీసుకురావడానికీ కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటిస్తోంది. దీనిలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు పద్ధతిని అనుసరిస్తోంది. దీంతోపాటు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష విధానాన్ని ప్రవేశపెడుతోంది.
ఏపీపీఎస్‌సీ నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేయదలచుకున్న అభ్యర్థులు వన్‌టైమ్‌ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) విధానంలో వివరాలు ముందుగా నమోదు చేసుకోవాల్సివుంటుంది. దీనిలో ఎప్పటికప్పుడు వివరాలు మార్పులు చేర్పులు చేసుకోవటానికి వీలుంటుంది.
రిజిస్ట్రేషన్‌ చేసుకునేదెలా?
www.psc.ap.gov.in; www.apspsc.gov.in కు లాగిన్‌ అవ్వాలి.
* వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.
* నేరుగా నియామకాలు, శాఖాపరమైన పరీక్షలు అని రెండు విభాగాలు కనిపిస్తాయి. కావాల్సిన విభాగాన్ని ఎంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేవారు Direct Recruitmentను ఎంచుకోవాలి.
* ఏదైనా సమాచారం కోసం యూజర్‌ మాన్యువల్‌పై క్లిక్‌ చేయాలి.
* ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు తమ సమాచారాన్ని సరిచేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
ప్రయోజనాలు ఏమిటి?
* ఓటీపీఆర్‌ ఐడీ జనరేట్‌ అయిన తరువాత అభ్యర్థి మొబైల్‌కూ, ఈ మెయిల్‌కూ వస్తుంది.
* ఒకసారి ఓటీపీఆర్‌ నమోదు చేసుకొన్నాక ఓటీపీ (వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌) లభించిన తర్వాత పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో నెట్‌బ్యాంకింగ్‌ (బ్యాంకింగ్‌ లేదా డెబిట్‌ కార్డు/ క్రెడిట్‌ కార్డ్‌) ద్వారా చెల్లించవచ్చు. అభ్యర్థులు ఏపీ ఆన్‌లైన్‌ (మీసేవ) కేంద్రాలలో నగదు రుసుము చెల్లించవచ్చు.
* నమోదు చేసిన వివరాలను అభ్యర్థులు అవసరమైన రీతిలో మార్చుకోవచ్చు.
* ఈ సమాచారాన్ని హాల్‌టికెట్‌ నామినల్‌ రోల్స్‌ రూపొందించడానికి ఉపయోగిస్తారు. వీటితోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను ఈ-మెయిల్‌కి పంపటానికి ఉపయోగపడుతుంది.
* ఏపీపీఎస్‌సీ నిర్వహించే ఏ పరీక్షకైనా ఓటీపీఆర్‌ ఐడీ ఉపయోగపడుతుంది. ఇలా నమోదు చేసుకున్నవారి సెల్‌ఫోన్‌ నంబర్లకు ఉద్యోగ ప్రకటనల జారీ సమయంలో సంక్షిప్త సమాచారం పంపిస్తారు. దానికి తగ్గట్టుగా వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సివుంటుంది.
* ఫొటోగ్రాఫ్‌, సంతకంతో సహా అభ్యర్థుల వివరాలు వారు దరఖాస్తు చేసుకునే సమయాన్ని తగ్గిస్తాయి. పరీక్షకు ముందూ, తర్వాతా దరఖాస్తు ఫారం నింపటంలో సమయం తగ్గుతుంది.

 

Posted on 27-06-2016