close

ఏపీపీఎస్సీ > వ‌న్ టైం రిజిస్ట్రేష‌న్

ఏపీపీఎస్సీ వ‌న్ టైం రిజిస్ట్రేష‌న్ ఇలా...

ఒకే విద్యార్హత‌తో ప‌లు ప‌రీక్షలు రాసుకోవ‌చ్చు. అయితే ప్రక‌ట‌న‌లు వెలువ‌డిన ప్రతిసారీ వివ‌రాలు న‌మోదు చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దీనికి ప‌రిష్కార‌మే...వ‌న్ టైమ్ రిజిస్ట్రేష‌న్...ఉద్యోగార్థుల సౌల‌భ్యం కోసం ప్రవేశ‌పెట్టిన కొత్త విధానం. ఒక్కసారి వివ‌రాలు న‌మోదుచేస్తే చాలు. మీ అర్హత‌తో ఉన్న ఉద్యోగాల‌న్నింటికీ ఆ స‌మాచార‌మే స‌రిపోతుంది. టీఎస్‌పీఎస్సీ గ‌త ఏడాదే ఈ విధానాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) కూడా ఈ ప‌ద్ధతినే ఆచ‌రిస్తోంది. వ‌న్ టైమ్ రిజిస్ట్రేష‌న్ ద్వారా అర్హత‌ల‌కు త‌గ్గ ప్రక‌ట‌న వెలువ‌డ‌గానే మొబైల్ ఫోన్లు, ఈ-మెయిళ్లకు స‌మాచారం వ‌చ్చేస్తుంది.

న‌మోదు చేయండిలా...
ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ (http://apspsc.gov.in/) లోకి వెళ్లగానే అందులో వ‌న్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేష‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. వెంట‌నే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌, డిపార్ట్‌మెంట్ టెస్ట్ అని రెండు ట్యాబ్‌లు వ‌స్తాయి. అందులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎంచుకుని కంటిన్యూ బ‌ట‌న్ క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత న్యూ రిజిస్ట్రేష‌న్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు ఓటీఆర్ ద‌ర‌ఖాస్తు వ‌స్తుంది. అందులో అభ్యర్థులు వివరాలను పొందుపరచాలి. పూర్తి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, గ్రామం, మండలం, జిల్లా, కులం, మతం, మాతృ భాష, అంగవైకల్యం ఉంటే వాటి వివరాలు, ఉద్యోగం చేసినా లేదా చేస్తున్నా వాటి వివరాలు, శాశ్వత చిరునామా, ప్రస్తుత చిరునామా, విద్యార్హతలు - ఒకటో తరగతి నుంచి డిగ్రీ/ డిప్లొమా, పీజీ, ఎం.ఫిల్‌, పి.హెచ్‌.డి వరకు ఉత్తీర్ణత తేదీ, సంవత్సరం, హాల్‌ టికెట్‌ నంబర్లతో సహా తెలియజేయాల్సి ఉంటుంది. ఇంకా ఏవైనా అద‌న‌పు విద్యార్హత‌లు ఉంటే యాడ్ క్వాలిపికేష‌న్ బ‌ట‌న్ క్లిక్‌చేసి వివ‌రాలు న‌మోదుచేయాలి.

ప్రతి స్థాయిలో (టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఇతర అన్ని పరీక్షలలో) వచ్చిన మార్కుల వివరాలను శాతంలో గానీ గ్రేడ్‌ రూపంలో గానీ తెలియ‌జేయాలి.
ఐడెంటిఫికేషన్‌ గుర్తులు అంటే పుట్టుమచ్చలు/ గాయపు గుర్తులు మొదలైనవాటిని 10వ తరగతి సర్టిఫికెట్‌లో ఉన్నవాటినే పేర్కోవాలి. ఆధార్‌కార్డు ఉంటే ఆ వివ‌రాలు కూడా న‌మోదు చేయాలి.
అన్ని స‌ర్టిఫికెట్లు ద‌గ్గర పెట్టుకుని వివ‌రాలు న‌మోదుచేయాలి.

ఫొటో, సంతకం
పై సమాచారాన్నంతటినీ పొందుపరిచాక చివరగా జేపీఈజీ ఫార్మాట్‌ 50 కేబీ పరిమాణంలో 3.5 సెం.మీ అడ్డం, 4.5 సెం.మీ నిలువు ప‌రిమాణంలో కలర్ లేదా బ్లాక్‌- వైట్‌లో ఉన్న మీ ఫొటోని అప్‌లోడ్‌ చేయాలి. దాని కింద అభ్యర్థి పేరు, ఫొటో తీసిన తేదీని కూడా రాయాలి. చివరగా మీ పూర్తి- పొడుగు సంతకాన్ని బ్లాక్‌ ఇంకు పెన్నుతో రాసి దాన్ని కూడా జేపీఈజీ ఫార్మాట్‌ 30 కేబీ పరిమాణంలో 3.5 సెం.మీ అడ్డం, 1.5 సెం.మీ నిలువు సైజులో అప్‌లోడ్‌ చేయాలి. దీంతో ఓటీఆర్‌ వివరాలన్నింటినీ పొందుపరచినట్లే!

ఆ ర‌త్వాత నోటిపికేష‌న్ అలెర్ట్ కింద టిక్ మార్కు చేర్చితే ఏవైనా ఉద్యోగ ప్రక‌ట‌న‌లు వెలువ‌డిన‌ప్పుడు ఆ స‌మాచారం మీ మొబైల్‌, మెయిల్ ఐడీల‌కు వ‌స్తుంది. ఉద్యోగ స‌మాచారం పొందాల‌నుకున్నవాళ్లు టిక్ మార్కు గుర్తించ‌డం త‌ప్పనిస‌రి.

అనంత‌రం మీరు పొందుపరచిన వివరాలన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకుని డిక్లరేష‌న్ ఓకే చేస్తే మీరు పొందుప‌ర్చిన వివ‌రాల ప్రివ్యూ ల‌భిస్తుంది. దీని హార్డ్‌కాపీని ప్రింట్‌ తీసుకోవాలి. మరోసారి సరిచూసుకుని తర్వాత Send అని పంపాలి. ఈ హార్డుకాపీని మీ సర్టిఫికెట్లతోపాటు భద్రపరచుకోవాలి.

ఈ వివరాలన్నింటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గల సమాచారం ఆధారంగా (డేటాబేస్‌) సరిచూసుకుని ధ్రువీకరించుకున్న తరువాత ఏపీపీఎస్‌సీ అభ్యర్థుల సెల్‌ఫోన్‌, ఈ-మెయిల్‌కు పదంకెల పాస్‌వర్డ్‌/ రిజిస్టర్‌ ఐడీని పంపుతుంది. ఈ పాస్‌వర్డ్‌ సాయంతో అభ్యర్థులు సర్వీస్‌ కమిషన్‌ నుంచి వివిధ నోటిఫికేషన్ల వివరాలను సులువుగా పొందవచ్చు.

అజాగ్రత్త వద్దు
కంప్యూటర్‌లో సమాచారాన్ని ఇచ్చేటపుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పరీక్ష సన్నద్ధతకు చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ఉదాహరణకు గతంలో Do you come under creamy layer అన్నచోట Yes అని క్లిక్‌ చేసి బీసీ రిజర్వేషన్‌ సదుపాయాన్ని కోల్పోయిన వారున్నారు. అందుకే దరఖాస్తు నింపేటపుడు ఏమరుపాటు లేకుండా అన్ని జాగ్రత్తలనూ పాటించాలి. ఓటీఆర్‌ చివరన అభ్యర్థి డిక్లరేషన్‌లో ఏదైనా తప్పు సమాచారం ఉంటే ఏపీపీఎస్‌సీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మీరు అంగీకరిస్తున్నట్లు ఉంది. కాబట్టి కచ్చితమైన, నిజ సమాచారాన్ని మాత్రమే పొందుపరచాలి. ఆధారాలు లేని సమాచారాన్ని ఇవ్వకూడదు.

Posted on 15-06-2016