close

ప్రకాశం జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

ఫిబ్రవరి 2, 1970న ఒంగోలు కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పడింది. 1972, మే 2వ తేదీన ఒంగోలు జిల్లాకు ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి , స్వాతంత్రయోధుడు టంగుటూరి ప్రకాశం పేరును పెట్టారు. కర్నూలు జిల్లా నుంచి మార్కాపురం డివిజన్, గుంటూరు జిల్లా నుంచి ఒంగోలు డివిజన్, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు డివిజన్ కలిపి ఈ మూడు డివిజన్లతో ప్రకాశం జిల్లా ఏర్పాటుచేశారు. జిల్లాకు తూర్పున బంగాళాఖాతం, దక్షణాన నెల్లూరు జిల్లా, కడప జిల్లా, పడమరన కర్నూలు జిల్లా, ఉత్తరాన గుంటూరు జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. మొత్తం జిల్లా విస్తీర్ణం 17.141 చ.కి.మీ. కోస్తా జిల్లాలన్నింటిలోకి విస్తీర్ణంలో ఈ జిల్లా పెద్దది. జిల్లా పశ్చిమ ప్రాంతాన నల్లమల, వెలిగొండ కొండలు ప్రసిద్ధగాంచినవి. ఈకొండలు కడప, కర్నూలు జిల్లాల నుంచి ప్రకాశం జిల్లాను వేరు చేస్తున్నాయి.

చారిత్రక అంశాలు
జిల్లాలోని దొనకొండ మండలం చందవరంవద్ద బౌద్ధారామం వ్యాప్తిచెందింది. త్రిపురాంతకం మండలంలో వెల్లంపల్లి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరాన గుండ్లకమ్మ నది ఒడ్డున వెలసిన ఈ బౌద్ధారామం అతి పురాతనమైనది. చందవరం బౌద్ధ స్థూపం అని దీన్ని పిలుస్తుంటారు. 1965లో జరిగిన తవ్వకాల్లో ఇది బయటపడింది. ఇదే తవ్వకాల్లో ఆరు అరుదైన శిలాఫలకాలు, మూడు బంగారు పుష్పాలు దొరికాయి. వీటన్నింటినీ పురావస్తుశాఖ రాజధానికి తరలించింది. 1972 సంవత్సరంలో నాలుగు దఫాలుగా పురావస్తుశాఖ తవ్వకాలు జరపడంతో ఇక్కడ వందల చిన్నస్థూపాలు, 15 పెద్ద స్థూపాలు బయటపడ్డాయి. 710శతాబ్ధంలో ఆది శంకరుడు దక్షిణ భారత యాత్ర చేసిన సందర్భంగా బౌద్ధ దర్మం, స్థూపాలు క్షీణించడంవల్ల ఈ స్థూపాలకు చెందిన ఇటుకలు, శిలలు, శిల్పాలు చందవరానికి చెందిన మహాభళేశ్వరాలయంలో నిర్మాణానికి ఉపయోగించి ఉండవచ్చని భావిస్తున్నారు. బౌద్ధ స్థూపం ఉత్తర ద్వారంలో ద్యాన నిమగ్నులైన బుద్ధుని పాలరాతి శిల్పం ఉంది. ఈ బౌద్ధ స్థూపం ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర బుద్ధ స్థూపాలకంటే భిన్నంగా ఉంటుంది. నాగులుప్పలపాడు మండలం కనపర్తి గ్రామంలో వందల ఏళ్లనాటి అమూల్యమైన వందకుపైగా విగ్రహాలు కాలగర్భంలో కలిసిపోకుండా కాపాడుతూ వస్తున్నారు. సముద్ర తీరంలో ఉండటంవల్ల కనపర్తి బాగా ప్రాచుర్యం పొందింది. క్రీస్తు పూర్వం బౌద్ధ రామంగా ఆ తర్వాత శైవ క్షేత్రంగా కనపర్తి ప్రసిద్ధి పొందింది. కాకతీయులు, చోళరాజుల పాలనలో దినదినమ ప్రవర్థమానమయ్యింది. ఈ ప్రాంతాన్ని 17వ శతాబ్ధంలో మహ్మద్ ఘోరీ పాలించినట్లుకూడా ఆధారాలున్నాయి. ఒకప్పుడు కనకాపురిగా, కనకజంభనపురిగా ప్రసిద్ధిగాంచిన నేటి కనపర్తి గ్రామం పిలవబడుతోంది. ఈ గ్రామంమ పరిసర వ్యవసాయ భూముల్లో 14 ఏళ్లుగా కళాఖండాలు, శిల్పాలు, విగ్రహాలు బయటపడుతున్నాయి. ఈ ప్రాంతంలో బయలుపడిన శిల్పాలు అమరావతి శిల్పాలుకంటే అపురూపమైనవి.

పల్నాటి చరిత్రకు త్రిపురాంతకం మండంలంలోని మేడపి గ్రామం అద్దం పడుతోంది. నాయకురాలు నాగమ్మ కుతంత్రాలతో జరిపిన కోడి పందాల్లో ఓడిపోయిన బ్రహ్మనాయుడు పందెం ప్రకారం రాజ్యం వదిలి వచ్చినప్పుడు ఆయన నివశించిన ప్రాంతమే ఈ మేడపి గ్రామం. పందెంలో ఓడిపోయిన బ్రహ్మనాయుడు శ్రీశైలం వెళ్లి కొంతకాలం మల్లిఖార్జునుని సేవించి ఆ తర్వాత మార్కాపురం వచ్చి అక్కడ చెన్నకేశవున్ని ఆరాధించాడు. అనంతరం త్రిపురాంతకం వచ్చి అక్కడ సమీపంలో ఉన్న మేడిచెట్లను కొట్టేసి గ్రామాన్ని నిర్మించడంతో మేడపిగా పేరొచ్చింది. ఆ గ్రామంలోనే యుద్ధ శిక్షణ ఇచ్చారు. అందుకే ఈ గ్రామానికి వీర మేడపి అన్నపేరు సార్థకమయ్యింది. ఆ గ్రామంలో బ్రహ్మనాయుడు చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించాడు. బ్రహ్మనాయుడే స్వయంగా చెన్నకేశవుని విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్టించినట్లు చెబుతారు. నాగమ్మ బ్రహ్మనాయుడుల మధ్య రాయభారం విఫలం అయిన తర్వాత యుద్ధం అనివార్యమయ్యింది. యుద్ధ ప్రతిజ్ఞలు చేసి కంకణాలు కట్టుకున్న ప్రాంతం నేడు కంకణాలపల్లిగా విరాజిల్లుతోంది. ఈ గ్రామంకూడా మేడపి సమీపంలోనే ఉంది. బ్రహ్మనాయుడు యుద్ధానికి వెళ్తూ త్రిపుర సుందరీ దేవిని కొలవటంతో ఆ స్థలం త్రిపుర వరం అనే పేరుతో సార్థకమయ్యింది. అప్పట్లో బ్రహ్మనాయుడు కొడుకు బాలచంద్రుడు ఈ ప్రాంతంలో బొంగరాలు ఆడుకోవడంవల్ల బొంగరాలగడ్డనే పేరొచ్చింది. ప్రస్తుతం బొంగరాల గడ్డకు సాగర్ జలాలు పారే అవకాశం ఉన్నా మేడపి గ్రామస్థులు మాత్రం చారిత్రాత్మక చిహ్నంగా బొంగరాలగడ్డనుకాపాడుతూ వస్తున్నారు. చినగంజాం మండలంలో ఉన్న మోటుపల్లి గ్రామం ఒకనాడు రతనాలు ముత్యాలు వీధుల్లో రాశులుపోసి అమ్మకాలు చేసేవారు. అది మోటుపల్లి పూర్వవైభవం నేడు మోటుపల్లి తన పూర్వవైభవాన్ని చరిత్రలో నిక్షిప్తంచేసి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. గ్రామానికి పూర్వం ముకులపురం, పూసలపురం అనే పేర్లు ఉండేవి. హెస్టారిస్ అనే గ్రీకు నావికుడు తన రచనలో పేర్కొన్న మెసోలియా పట్టణమే నేటి మోటుపల్లి గ్రామం అయి ఉండొచ్చని పరిశోధకులువిశ్వసిస్తున్నారు. నాటి కనగిరి.. నేటి కనిగిరి. పల్లవ చోలరాజులు, కాకతీయులు, యాదవులు, రెడ్డిరాజులు గజపతులు, విజయనగరాధీశులు, నవాబులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, జమిందారుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రాత్మక ఆధారాలున్నాయి. కనిగిరిని ఆనుకుని రెండు ఎత్తయిన కొండల మధ్య అభేధ్యమైన కోటను నిర్మించుకుని ఆనాటి రాజులు పాలన సాగించారు. రాజులు నిర్మించిన కోటగోడలు, బురుజులు, దేవాలయాలు, చెరువులు, ఏనుగులు, గుర్రాలశాలలు, మందుగుండు సామాగ్రిదాచే నేళమాళిగ నేడు శిథిలావస్థలో యాత్రికులకు దర్శనమిస్తున్నాయి. పల్లవరాజు మహేంద్ర, ఆయన తర్వాత మహామళ్లు మహరాజుల పాలన 6-7 శతాబ్ధంలో కనిగిరిలో ఉంది. పల్లవ రాజుల కాలంలోనే బైరవ కోన క్షేత్రం ప్రాభవం పొందింది. భైరవకోన నుంచి కనిగిరి కోటకు అలాగే అనుమలగిరికి సొరంగ మార్గాలు ఉన్నాయి. శత్రురాజులు కోటలను ముట్టడించినప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ఈ సొరంగ మార్గాలనునిర్మించి ఉండొచ్చని భావిస్తున్నారు.

విద్య

ప్రకాశం జిల్లా విద్యారంగంలో ప్రత్యేకతను సంతరించుకుంది. జిల్లాలో విద్యాపరంగా పక్కజిల్లా గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని శర్మ కళాశాల అత్యంత ప్రాముఖ్యం కలిగింది. జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలలకు నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచి యువత వచ్చి ఇక్కడ చదువుకుంటోంది.

పాఠశాలలు..
* ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో 4,254 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సెంట్రల్ గవర్నమెంట్ పాఠశాలలు రెండు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలలు 150. మండల పరిషత్, జిల్లా పరిషత్తు పరిధిలో 3,333, ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు 252, ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు 463 ఉన్నాయి.
* అప్పర్‌ప్రైమరీ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మూడు, మండల పరిషత్, జిల్లా పరిషత్ పరిధిలో 379, ప్రైవేటు ఎయిడెడ్ 33, ప్రైవేటు అన్ఎయిడెడ్ 105 పాఠశాలలు ఉన్నాయి.
* ఉన్నత పాఠశాలలు సెంట్రల్ గవర్నమెంటు పరిధిలో ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 62, ఎంపీపీ, జిల్లా పరిషత్ పరిధిలో 299, ప్రైవేటు ఎయిడెడ్ 55, ప్రైవేటు అన్ఎయిడెడ్ 214 ఉన్నాయి.

మేనేజ్‌మెంట్ల వారీగా ప్రాథమిక పాఠశాలల ఎన్‌రోల్‌మెంట్
* ప్రాథమిక పాఠశాలల్లో 2010-11 సంవత్సరం గణాంకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 3,959 మంది విద్యార్థులు ఉన్నారు.
* జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో 1,49,954 మంది ఉన్నారు.
* మున్సిపల్ స్కూళ్లలో 2,651 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 19,808 మంది, ప్రైవేటు అన్ఎయిడెడ్‌లో 37,448 మంది చదువుతున్నారు.
* అన్నింటాకలిపి 2,13,820 మంది ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నారు.
అప్పర్‌ప్రైమరీలో
* అప్పర్‌ప్రైమరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో 368 మంది, ఎంపీపీ, జిల్లాపరిషత్‌లో 43,570 మంది, మున్సిపాలిటీల్లో 979 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 8,216 మంది, అన్ఎయిడెడ్‌లో 26,040 మొత్తం కలిపి 79,173 మంది చదువుతున్నారు.
ఉన్నత పాఠశాలలు
ఉన్నత పాఠశాలలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ పాఠశాలల్లో 330 మంది, స్టేట్ గవర్నమెంట్ పాఠశాలల్లో 19,509 మంది, మండలపరిషత్, జిల్లా పరిషత్‌లో 75,380 మంది, మున్సిపల్ పాఠశాలల్లో 6,549 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 8,082 మంది, అన్ఎయిడెడ్‌లో 50,312 మంది, మొత్తం కలిపి 1,72,815 మంది చదువుతున్నారు.

మేనేజ్‌మెంట్ల వారీగా టీచర్లు
ప్రైమరీ పాఠశాలల వివరాలు
స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని పాఠశాలల్లో 106 మంది, జిల్లా పరిషత్, మండల పరిషత్‌లో 5,462 మంది, మున్సిపల్ పరిధిలో 80 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 573 మంది, ప్రైవేటు అన్ఎయిడెడ్‌లో 1,001 మంది, మొత్తమ్మీద 7,222 మంది పనిచేస్తున్నారు.
అప్పర్‌ప్రైమరీలో
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 12 మంది, మండలపరిషత్, జిల్లా పరిషత్‌లో 2,051 మంది, మున్సిపల్ పరిధిలో 18 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 210 మంది, ప్రైవేటు అన్ఎయిడెడ్‌లో 974 మంది పనిచేస్తున్నారు.
ఉన్నత పాఠశాలల్లో
సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో 11 మంది, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో 620 మంది, జిల్లా పరిషత్ పరిధిలో 3,970 మంది, మున్సిపాలిటీ పరిధిలో 133 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 403 మంది, ప్రైవేటు అన్ఎయిడెడ్‌లో 2,146 మంది పనిచేస్తున్నారు.
విద్యా వలంటీర్ల సమాచారం
ప్రాథమిక పాఠశాలల్లో 1735 మంది, అప్పర్‌ప్రైమరీ స్కూల్స్‌లో 550 మంది, ఉన్నత పాఠశాలల్లో 191 మంది పనిచేస్తున్నారు.
కళాశాలలు
జిల్లాలో 20 ఇంజినీరింగ్ కళాశాలలు, 160 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి., 30 ఇంటర్మీడియట్ కళాశాలలు నిర్వహిస్తున్నారు.

నదులు - ప్రాజెక్టులు

జిల్లాలో గుండ్లకమ్మ, మూసినది, మన్నేరు, పాలేరు నదులు ప్రవహిస్తున్నవి. ఇవికాక గుడిసెలేరు, సగిలేరు, తమ్మిలేరు మొదలైన చిన్నతరహా నదులు, నల్లవాగు, దగురువాగులాంటి చిన్నవాగులు కూడా ప్రవహిస్తున్నాయి. ఇందులో 220 కిలోమీటర్ల పొడవున గుండ్లకమ్మ నది ప్రవహిస్తోంది. ఈనదిలోని నీరు త్రాగునీటికి, వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతోంది. పైన నాలుగు నదుల నుండి జిల్లాలో అనేక చోట్ల ఎత్తిపోతల పథకాల ద్వారా వేలాది ఎకరాలు సాగవుతోంది.

వెలుగొండ ప్రాజెక్టు
ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాల్లోని 30 మండలాల పరిధిలో ఉన్న 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రూ. 5,150 కోట్ల వ్యయంతో దీని నిర్మాణం చేపట్టారు.గొట్టిపడియ, సుంకేసుల గ్యాప్‌ల పనులు పూర్తయ్యాయి. కాకర్ల గ్యాప్ పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 53.50 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. గొట్టిపడియ కాలువ పనులు పూర్తికాక తేగలేరు కాలువ పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాకు మొదటి దశలో 1.19 లక్షల ఎకరాలకు, రెండో దశలో 3.27 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం 39,048 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటికి 20,205 ఎకరాలను సేకరించారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టు
గుండ్లకమ్మ నది నల్లమల్ల అటవీ ప్రాంతంలోని గుండ్ల బ్రహ్మేశ్వరం వద్ద పుట్టి దాదాపు 216 కి.మీ.లు ప్రయాణించి మల్లవరం వద్దకు చేరుతుంది. పైభాగాన కంభం చెరువు తరువాత ఏవిధమైన రిజర్వాయర్లు లేక ఏటా 27 శతకోటి ఘనపుటడుగుల నీరు సముద్రం పాలవుతోంది. జలయజ్ఞంలో భాగంగా 12.845 టీఎంసీల సామర్థ్యంతో మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖరీఫ్‌లో 62,368 ఎకరాలకు, రబీలో 80,060 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ. 592 కోట్లతో ప్రాజెక్టును నిర్మించారు. 2008 నవంబరులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు నుంచి కాలువలకు నీరు విడుదల చేశారు. ఇప్పటివరకు రూ. 485.98 కోట్లు ఖర్చు చేశారు. కోర్టు వివాదాల కారణంగా కాలువ నిర్మాణాలు కొంత పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాజెక్టు కారణంగా 12 గ్రామాలు ముంపుకు గురవుతుండగా నాలుగు గ్రామాలకు పునరావాసం కల్పించారు.

రాళ్లపాడు ప్రాజెక్టు
జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులో రాళ్లపాడు జలాశయం ఒకటి. కందుకూరు నియోజకవర్గంలో మధ్యతరహాప్రాజెక్టు రాళ్లపాడు కింద 16,500 ఎకరాలు అధికారికంగా, అనధికారికంగా ఎనిమిదివేల ఎకరాలు సాగవుతోంది. తాగు, సాగునీటికి మూడు మండలాలకు కల్పతరువుగా పనిచేస్తోంది. వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. కుడికాలువ 20కిలోమీటర్లు పొడవు, ఎడమకాలువ మూడు కిలోమీటర్ల పొడవున ఉంటుంది. ప్రాజెక్టులో 1.01 టీఎంసీ నీటిని నిల్వచేసే సామర్ధ్యం ఉంది.

రామతీర్థం ప్రాజెక్టు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఒంగోలు బ్రాంచి కాలువ మీద రామతీర్థం వద్ద 1.516 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రూ. 50 కోట్లు వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ఒంగోలు, కందుకూరు మున్సిపాల్టీలతో సహా 56 చెరువులకు తాగునీరు అందించడంతోపాటు సాగరు కాలువ పరిధిలోని 72,874 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలనే ఉద్దేశంతో ఈ రిజర్వాయర్‌ను నిర్మించారు.

నీటిపారుదల

జిల్లాలో నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఒంగోలు బ్రాంచి కెనాల్(ఓబీసీ), దర్శి బ్రాంచి కెనాల్(డీబీసీ), అద్దంకి బ్రాంచి కెనాల్(ఏబీసీ) ఉన్నాయి. ఈ కాలువల కింద జిల్లాలో 4.30 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించబడింది. 2010-11 సంవత్సరంలో 3,30,330 ఎకరాలకు సాగర్ కాలువల ద్వారా నీరందించారు. ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో సాగర్ కాలువల ఆధునికీకరణకు రూ. 298 కోట్లతో పరిపాలనా ఆమోదం లభించింది. ఐదు ప్యాకేజీల్లో పనుల నిర్వహణకు రూ. 153.26 కోట్లతో గుత్తేదార్లతో ఒప్పందం కుదిరింది.

మధ్యతరహా నీటిపారుదల
ఈ విభాగంలో జిల్లాలో ఒంగోలు, మార్కాపురం, రాళ్లపాడు సర్కిళ్లు ఉన్నాయి. జిల్లాలో ఐదు మధ్య తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. మోపాడు, వీఆర్‌కోట(వీరరాఘవునికోట), పాలేరు-బిట్రగుంట(పీబీ ఛానెల్), కంభం చెరువు, రాళ్లపాడు ప్రాజెక్టుల కింద 40,992 ఎకరాల ఆయకట్టు ఉంది. గతేడాది ఈ ప్రాజెక్టుల కింద 36,193 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి.

చిన్నతరహా నీటి పారుదల
ఈ విభాగంలో జిల్లాలో ఒంగోలు, మార్కాపురం కేంద్రాలుగా చిన్న తరహా నీటి వనరులైన 957 చెరువుల కింద 1.36 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. మరో 368 చెరువులు పంచాయతీరాజ్ విభాగం ఆధీనంలో ఉన్నాయి. 2010-11 సంవత్సరంలో ఈ చెరువుల కింద కేవలం 49,910 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి.

నాటి రవాణా మార్గం బకింగ్‌హామ్ కెనాల్
రోడ్డు రవాణా మార్గం విస్తరించకముందు జల రవాణానే ఆధారంగా ఉండేది. కాకినాడ నుంచి మద్రాసుకు జల రవాణా మార్గం ప్రకాశం జిల్లా నుంచి సాగేది. జిల్లాలోని కొమ్మ మూరు కాలువ అనుసంధానంగా ఉప్పుగుండూరు నుంచి బకింగ్‌హామ్ కెనాల్ చెన్నై వరకు ఉంది. అప్పట్లో నిత్యావసర వస్తువులు, ధాన్యం తదితర వస్తువులు మొత్తం ఈ కాలువ ద్వారానే పడవుల ద్వారా రవాణా జరిగేది. కొత్తపట్నం సమీపంలో రేవుగా ఏర్పాటు చేసి సరకులను ఒంగోలు పట్టణంతోపాటు మార్కాపురం వంటి దూర ప్రాంతాలకు కూడా ఎడ్లబండ్లతో సరకులను రవాణా చేసేవారు కాలక్రమేణా రోడ్డు మార్గం విస్తరించటంతో ఈ కాలువపై జల రవాణా మార్గం స్తంభించిపోయింది. ప్రస్తుతం కాలువ కూడా పూర్తిస్థాయిలో అన్యాక్రాంతం అయిపోయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మళ్లీ కాలువ అభివృద్ధి పరిచేందుకు కాలువపై సర్వే నిర్వహించటం జరిగింది. పూర్తిస్థాయిలో కాలువ అభివృద్ధి పరిస్తే రవాణాకు, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుంది.

కొమ్మమూరు కాల్వ
గుంటూరు జిల్లా నర్సాయపాలెం వద్ద ఉన్న నల్లమల లాకుల దిగువ నుంచి ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెదగంజాం వరకు కొమ్మమూరు కాలువ విస్తరించి ఉంది. దీని పొడవు సుమారు 63 కిలోమీటర్లు. కారంచేడు, చీరాల, వేటపాలెం, పర్చూరు, చినగంజాం, నాగులుప్పలపాడు మండలాల పరిధిలోని సుమారు లక్ష ఎకరాల భూములకు ఈ కాలువే సాగునీటి వనరు. దీని పరిధిలో ప్రధానంగా వరి సాగవుతోంది. ప్రశుగ్రాసం కింద పిల్లిపిసర, జనుము సాగు చేస్తారు. రెండు దశాబ్దాల క్రితం జూలై నెలలో సాగునీరు విడుదలయ్యేది. ఆగస్టు చివరికి ఖరీఫ్ సాగుపూర్తయ్యేది. ఆ రోజుల్లో రబీ పంట మచ్చుకైనా ఉండేది కాదు. ప్రస్తుతం సాగునీటి విడుదలలో తీవ్ర జాప్యం అవుతుండడంతో ఖరీఫ్ చేజార్చుకొని రబీలో సాగు చేయాల్సిన దుస్థితి అన్నదాతది. కారంచేడు వద్ద 1000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కాలువలో ఉంటే అన్ని పంట కాల్వలకు సక్రమంగా సాగునీరు అందుతోంది.

ప్రధాన పంటలు

ప్రకాశం జిల్లాలో 70 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. సాగుభూమిలో అత్యధిక శాతం వర్షంపై ఆధారపడి ఉండగా మిగిలిన భూమి నాగార్జునసాగర్, కొమ్మమూరు కాలువ, గుండ్లకమ్మ, పాలేరు, మన్నేరు నదుల ఆధారంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాల కింద సాగవుతోంది. జిల్లాలో అత్యధికంగా పొగాకు పంటను సాగు చేస్తున్నారు. తర్వాత శనగ, సామాజిక వనాలు సాగులో ఉన్నాయి. ఖరీఫ్‌లో మొత్తం 2,18,315 హెక్టార్లు పంటలు సాగవుతుండగా రబీలో 3,48,968 హెక్టార్లలో పంటలు సాగవుతున్నాయి. నైరుతీ రుతుపవనాల ద్వారా ఏటా 388.3 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదవుతుంది. కాగా, గత పదేళ్ల కాలంలో వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేక 603 మి.మీ. వర్షపాతం నమోదై పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈశాన్య రుతుపవనాల ద్వారా 393.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. ఇది కూడా సక్రమంగా ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో అత్యధిక వర్షపాతం నమోదై పంటలు దెబ్బతింటున్నాయి. జిల్లాలో ఖరీఫ్‌లో 44,656 హెక్టార్లలో వరి, 12,236 హెక్టార్లలో సజ్జ, 63,164 హెక్టార్లలో కంది, 12,672 హెక్టార్లలో మిరప, 27,443 హెక్టార్లలో పత్తి పంటలు సాగవుతున్నాయి. రబీలో 87,095 హెక్టార్లలో వరి, 97,529 హెక్టార్లలో శనగ, 69,169 హెక్టార్లలో పొగాకు పంట సాగవుతోంది.

పచ్చి కూరగాయల కేంద్రం మార్టూరు
మార్టూరులోని కూరగాయల మార్కెట్ రాష్ట్రంలోనే పేరు గాంచింది. ఈ మార్కెట్‌లో 74 కూరగాయల హోల్‌సేల్ దుకాణాలున్నాయి. జిల్లాలోని మార్టూరు, యద్దనపూడి, కొరిశపాడు, సంతమాగులూరు, బల్లికురవ, అద్దంకి మండలాల నుంచి నిత్యం రైతులు ఇక్కడకి వచ్చి తాము పండించిన కూరగాయలను అమ్ముకుంటారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి మునక్కాయలు, కర్నాటకలోని కోలార్, చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతాల నుంచి టమాటాలు ఇక్కడ మార్కెట్‌కు అమ్మకానికి వస్తాయి. ప్రతి రోజూ ఇక్కడ సుమారు రూ.5 లక్షల మేర కూరగాయల వ్యాపారం జరుగుతుంది. డిసెంబర్, జనవరి నెలల్లో అయితే మిర్చి మీద రోజువారీ రూ. 25 లక్షల నుంచి 30 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఈ మార్కెట్ నుంచి నిత్యం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలకేకాక బెంగళూరు, చైన్నై వంటి నగరాలకు కూడా కూరగాయలు ఎగుమతి అవుతుంటాయి.

కనిగిరి నిమ్మ, బత్తాయికి ప్రసిద్ధి
కనిగిరి ప్రాంతం వర్షాధారం కావడంతో ఇక్కడ బత్తాయి, నిమ్మ తోటలకు ఎక్కువగా సాగు చేశారు. కనిగిరి ప్రాంతంలో బత్తాయి, నిమ్మ 15 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఇక్కడ బత్తాయిని, నిమ్మను, కలకత్తా బెంగళూరు, చెన్నై , హైదారాబాద్, ముంబయి తదితర ప్రాంతాలకు తరలిస్తారు. మెడిసిన్, జ్యూస్. పచ్చళ్ల తయారికీ ఇక్కడ నుంచి ఎగుమతి చేసుకుంటారు. ప్రతి ఏడాది బత్తాయి, నిమ్మ మీద రూ.70 కోట్ల వరకు కనిగిరిలో మార్కెట్ టర్నోవర్ జరుగుతుంది. మెట్ట పంటల తర్వాత అధికంగా కనిగిరి ప్రాంత రైతులకు ఆదాయాన్నిచ్చే పంటలు నిమ్మ , బత్తాయి పంటలే. అయితే మార్కెట్ సౌకర్యం లేక ఇప్పటి వరకు రైతులు ఇబ్బంది పడ్డారు. ఈమధ్యనే మార్కెట్ సౌకర్యాన్ని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో రైతులు స్వయంగా నిల్వ జేసుకొని గిట్టుబాటు ధర వచ్చే వరకు ఉండ వచ్చు. జిల్లాలో అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుంచే నిమ్మకాయలు సరఫరా అవుతుంటాయి.

వూరించే ఉలవపాడు మామిడి
కందుకూరు నియోజకవర్గంలో మామిడి తోటలు పెంపకం సుమారు ఏడువేల ఎకరాల్లో సాగుచేస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం బంగినపల్లి మామిడిరకం విస్తారంగా సాగుచేశారు. ఈరకం మామిడి ప్రకాశం జిల్లాలో ఉలవపాడు ప్రాంతంలో తీయదనంగా ఉంటుందని ప్రసిద్ధి. అయితే ఈరకం మామిడిని ముంబై, చెన్నై, విజయవాడ, గుంటూరు, తదితర నగరాలకు ఎగుమతి చేస్తారు. కందుకూరు, ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. బింగినపల్లితో పాటు బెంగూళూర రకం, చెరుకు రసాలు, సువర్ణరేఖ, నీలం, పునారస, మామిడి తోటలు వీటితో కలిపి పెంచుతారు. అయితే ఎకరం తోటలో ఈరకం మామిడిచెట్లు రెండు నుంచి ఐదులోపే ఉంటాయి. బెంగుళూర రకం మామిడికి ఇటీవల కాలంలో గిరాకీ పెరిగింది. చిత్తూరు జిల్లాలోని జ్యూస్‌ఫ్యాక్టరీలు ఈమామిడిని కొనుగోలు చేస్తాయి. ఇటీవల మామిడి రైతులు ఒడిదుడుకులు ఎదుర్కొనటంతో ప్రభుత్వం మార్కెట్‌యార్డు నిర్మాణానానికి శ్రీకారం చుట్టింది. దాదాపు రూ.రెండు కోట్లు మంజూరు కాగా వాటితో ప్రస్తుతం రూ.కోటిల వ్యయంతో వీరేపల్లి గ్రామంలో దగ్గర 3.87ఎకరాలతో నిర్మాణాలు ప్రారంభ దశలో ఉన్నాయి. మార్కెట్ యార్డు నిర్మాణం పూర్తయితే ఈప్రాంతపు మామిడి పరిస్థితి మెరుగవుతుందని రైతులు ఆశిస్తున్నారు.

కృషి విజ్ఞాన కేంద్రం
దర్శిలో ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో పదేళ్ల సంవత్సరాల క్రితం కొత్త వంగడాలను కనుగొనడానికి, రైతులకు పంటల సాగుపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నెలకొల్పారు. ప్రస్తుతం నలుగురు శాస్త్రవేత్తలు వరి, ఆముదం, కంది తదితర పంటలపై పరిశోధనలు చేస్తున్నారు. ఇటీవలే కంది నూతన వంగడం తయారు చేశారు.

పర్యాటకం

పర్యాటకులను రంజిపజేసే భైరవకోన
ఎతైన కొండ శిఖరం... జలపాతాన్ని తలిపించే సెలయేరు... పైనుంచి పడుతున్న నీటితుంపర్లు పర్యాటకులను గిలిగింతలు పెడతాయి. అపరూప శిల్పకళా నైపుణ్యానికి, ప్రకృతి రమణీయతకు భైరవకోన మారుపేరు. ఒక పెద్ద కొండపై అనేక దేవాలయాలు ఉండడంవల్ల, ప్రముఖంగా భైరవుని విగ్రహం ఉన్నందున ఈ కొండకు భైరవకొండ అనేపేరు వచ్చిందని నానుడి. సీఎస్‌పురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామానికి ఆరుకిలోమీటర్లదూరంలో ప్రకాశం-నెల్లూరు జిల్లా సరిహద్దుల్లో తూర్పు కనుమల మధ్య ఒక లోయలో భైరవకోన క్షేత్రం ఉంది. కొండల నడుమ కొలువై ఉన్న అనేక దేవాలయాలు ఒక సమూహంగా ఉన్నాయి. అత్యంత ప్రాచీన పల్లవ దేవాలయానికి ఆదిముఖంగా ఎనిమిది చిన్నచిన్న దేవాలయాలున్నాయి. ఈ దేవాలయాలన్నీ మహాబలిపురంలో పల్లవులు నిర్మించిన దేవాలయాల శిల్పకళా నైపుణ్యానికి దగ్గరి పోలికలను కలిగిఉన్నాయి. అక్కడక్కడ చెక్కిన శిలలపై ఉన్న ఆధారాలను బట్టి ఇవి 7, 8 శతాబ్ధాలకు చెందినట్లు తెలుస్తోంది. పల్లవుల శిల్పకళను వివరించే ఒక్క ముఖ్య ప్రదేశం భైరవకోన. దక్షిణ భారతదేశంలో మొట్టమొదట కనుగొన్న ప్రాచీన హిందూ దేవాలయాలు ఈ భైరవకోనలోనివే ఇచ్చటి దేవాలయాలన్ని తూర్పునకు ముఖం చేసిన శివాలయాలే కొండపై మొత్తం కోటిన్నొక్క శివలింగాలు చెక్కినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేశంలో ఎన్నోక్షేత్రాలు ఉన్నప్పటికీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే క్షేత్రంలో ఉండటం అరుదైన విషయం. భైరవకోనలో ఎనిమిది హైందవ దేవాలయాలున్నాయి. వాటిలో శివలింగాలు, విగ్రహాలు ఒకేరాతితో చెక్కారు. శశినాగలింగాలయం, రుద్రలింగాలయం, విశ్వేశ్వరలింగాలయం, నగిరికేశ్వరలింగాలయం, బర్గేశ్వరలింగాలయం, రామేశ్వరలింగాలయం, మల్లికార్జునలింగాలయం, ఏక్షఘాతకలింగాలయం పేర్లతో ఎనిమిది గృహాలయాలు, బర్గేశ్వరలింగాలయంలో త్రిముఖ దుర్గాంబవిగ్రహం వెనుక రాతితో మలిచారు. దుర్గామాత ఆలయానికి ఎదురుగా ఉన్న రాతితో కాలభైరవుని విగ్రహాన్ని మలిచారు. ప్రతిగర్భగుడిలోనూ చతురస్రాకారమైన గర్భాలయంగా మాత్రమే మలచగా మిగిలిన నాలుగు గృహాలయాలకు రెండు స్తంభాలతో కూడిన ముఖ మండపం కూడా ఉంది. ప్రతి గర్భగుడిలోను చతురస్రాకార పీఠంమీద శివలింగాలను మలిచారు. పల్లవ శిల్పకారుడైన దేరుకంతి, శ్రీశైలముని మొదలైనవారు భైరవకోన క్షేత్రాన్ని నిర్మించారని చరిత్రవల్ల తెలుస్తోంది.
విశేషంగా ఆకర్షించే జలపాతం
భైరవకోనలోని మరో విశేషం అందాల జలపాతం. ఎత్త్తెన కొండలపైఉన్న లింగాల దొరువు నుంచి ప్రవహించి 200మీటర్ల ఎత్తునుంచి పడుతూ ఇక్కడకు వచ్చే యాత్రికులకు కనువిందు చేస్తోంది. జలపాతం నుంచి కిందపడిన నీరు సోనవాన పేరుతో దుర్గాంబ, భైరావాలయాల మధ్య ప్రవహిస్తుంది. కార్తీకపౌర్ణమి రోజు చంద్రుని కాంతి కిరణాలు సెలయేటి నీటి మీద పడి దుర్గాదేవి మీదకు ప్రసరిస్తాయి. ఆరోజు ఆ దృశ్యాన్ని వీక్షించడానికి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. జలపాతం నుంచి పడి ప్రవహించే నీటిలో అనేక వనమూలికలు, ఖనిజ లవణాలు కలిసి ఉంటాయని, ఆ నీరు సేవించినవారికి సర్వరోగ నివారణ అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

పశ్చిమ వరప్రసాదం.. కంభం చెరువు
మానవ నిర్మాణ కౌశలానికి తార్కాణం కంభం చెరువు. చిన్న ఆనకట్ట ఏర్పాటు చేయడం ద్వారా ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో ఇంత పెద్ద చెరువుకు అంకురార్పణ జరిగింది. శ్రీకృష్ణదేవరాయల సతీమణి వరదరాజమ్మ(చిన్న తిరుమలదేవి) ఈ తటాకాన్ని నిర్మించారు. మూడు మండలాల పరిధిలో 6944 ఎకరాలకు దీనిద్వారా సాగునీరు అందుతోంది. నల్లమల అడవిలో కురిసిన వర్షం ఆధారంగా దీనికి నీరు చేరుతుంది. 500 ఏళ్ల కాలంలో ఇప్పటివరకు 11 సార్లు మాత్రమే పూర్తిస్థాయిలో చెరువు నిండింది. అర శతాబ్ద కాలంలో ఒక్కసారి కూడా చెరువు కట్టకు మరమ్మతులు చేపట్టలేదంటే నిర్మాణ పటిష్టత ఎంత గొప్పగా ఉందో విశదమవుతుంది. చెరువు అభివృద్ధి, తూములు, కాలువల మరమ్మతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు జపాన్ నిధుల కోసం ప్రతిపాదించింది. నిధుల మంజూరు జాప్యం కారణంగా పనులు జరగడంలేదు. ఆయకట్టు పరిధిలో ఆహార, వాణిజ్య, కూరగాయ పంటలు పండుతాయి.

రామాయపట్నం తీరప్రాంత విశేషాలు
ఉలవపాడు మండలాల ప్రజానికానికి తీరప్రాంత గ్రామం రామాయపట్నం. సుమారు 2500 జనాభా కలిగి ఉండే ఈ గ్రామం పురాతన మైనది. ఈగ్రామంలో 15వ శతాబ్ధంలో నిర్మించిన శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉంది. సుమారు 1800వ సంవత్సరం నుంచి రామాయపట్నం రేవు ప్రాంతంగా పలు వ్యాపారాలకు నిలయమైంది. ఈ రేవు నుంచే ఆంగ్లేయుల కాలంలో బర్మా నుంచి టేకు మొద్దులు దిగుమతి అవుతుండేవి. సుమారు 1850 ప్రాంతం నుంచి రామాయపట్నానికి ఆంగ్లపాలకుల తరుపున చర్చినిర్వాహకులు ఎక్కువగా రావడం ప్రారంభించారు. ఇక్కడి ప్రజల నిరక్షరాస్యతను ఆసరా చేసుకుని చిన్న పాఠశాలను ఏర్పాటు చేశారు. దీనితో వారు ఇక్కడి వారిమన్ననలను పొందారు. అనంతరం 1855లో ఒక క్రైస్తవమ తబోధకుడు తన భార్యతో కలిసి ఈ ప్రాంతానికి వచ్చి మత ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో వచ్చిన వ్యాధుల వల్ల మతబోధకుని భార్య మరణించింది.ఆమె మీద ప్రేమతో మతబోధకుడు ఒక పెద్ద చర్చిని నిర్మించారు. దీనికోసం తన వద్ద ఉన్న నగదు చాలకపోతే ఇంగ్లాండ్‌లోని తన ఆస్థులను అమ్మి చర్చి నిర్మాణాన్ని పూర్తిచేసారని ప్రతీతి. చర్చితో పాటు వైద్యశాలను, ఒకపెద్ద గ్రంధాలయాన్ని నిర్వహించేరు. కాలగర్భంలో అన్నీ కలిసిపోయాయి. చర్చి మాత్రం పాత జ్ఞాపకాలను నిలుపుతూ ఠీవిగా నిలిచి ఉంది. ఇప్పటికీ ఇక్కడ చర్చిలో క్రైస్తవ పాఠశాల నడుపుతున్నారు. దీనికి అనుబంధంగా ఒక నర్సింగ్ కళాశాల నిర్వహిస్తున్నారు. రామాయపట్నానికి విహారయాత్రకు వెళ్లే ఈ ప్రాంత ప్రజలు, పాఠశాల విద్యార్థులు తప్పకుండా చూసి వచ్చేవి ఈ చర్చిని. విశాలమైన చర్చిప్రాంగణాన్ని. అలాగే సముద్రతీరంలో 1940 ప్రాంతంలో నిర్మించిన ఒక విశ్రాంత గృహం సందర్శకులను ఆకర్షిస్తోంది. ప్రస్థుతం రాష్ట్ర ప్రభుత్వం సముద్రతీర ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి నడుం బిగించింది. సుమారు రూ.3 కోట్లతో విశ్రాంతి గృహాలను , ఉద్యానవనాన్ని , ఈత కొలనును నిర్మిస్తోంది. పనులు పూర్తిఅయ్యే దశలో ఉన్నాయి. సముద్రతీరంలో ఉండే మరో అద్భుత నిర్మాణం లైట్‌హౌస్. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్య్సకారులకు రాత్రిసమయాల్లో దిక్సూచిగా ఉండటానికి ఇక్కడ లైట్‌ను వెలిగిస్తారు. ఈ దీపపు వెలుగు సుమారు సముద్రంలో పదిహేను కిలోమీటర్ల దూరం కనిపించడం విశేషం.

అందచందాల మాలకొండ
మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం జిల్లాలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. ప్రముఖ పుణ్యం క్షేత్రంతో పాటు, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి అందచందాలు చూస్తే మంత్రముగ్ధులవ్వాల్సిందే. మాలకొండ ఆలయానికి సీజన్‌లో ప్రతి శనివారం 5 వేలమంది, అన్‌సీజన్‌లో రెండువేలకు పైగా భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ప్రకృతి సిద్థమైన ఆలయం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. లక్ష్మీఅమ్మవారి వద్దకు వెళ్లేందుకు కొండపగిలి ఉంటుంది. ఎంతలావు వ్యక్తి అయినా వెళ్లే విధంగా ఉంటుంది. వలేటివారిపాలెం మండలంలోని శ్రీమాల్యాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ప్రతిశనివారం భక్తులకు దైవదర్శనం ఉంటుంది. వేలాదిమంది భక్తులు సుదూరప్రాంతాల నుంచి మాలకొండకు వస్తారు. మాలకొండపై వెలసిన శ్రీమాల్యాద్రి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని వెళ్తారు. ఆలయంపైన పెళ్లిల్లు చేసుకునేవారు, తలనీలాలు ఇచ్చేవారు అధికంగా ఉంటారు. వందల ఏళ్లుగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది.

సుందర తీరం వాడరేవు
చీరాలకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడరేవు అత్యంత సుందర తీరం. ఇక్కడ సహజసిద్ధంగా ఏర్పడిన ఒంపుతో ఈ ప్రాంతం కమనీయంగా కనిపిస్తుంది. అంతేకాక మిగిలిన తీరాలతో పోల్చుకుంటే ఇక్కడ కొంత లోపలికి వెళ్లినప్పటికీ ప్రమాదం ఉండదని మత్స్యకారులు చెబుతారు. అలలు కూడా ఆహ్లాదకరంగా వస్తుండడంతో ఇక్కడ సముద్ర స్నానం చేసే పర్యాటకులకు అనిర్వచనీయమైన అనుభూతి లభిస్తుంది. అందుకే ప్రముఖులు సైతం వాడరేవు తీరంలో సేదతీరేందుకు వస్తుంటారు. ప్రభుత్వపరంగా పెద్దగా సౌకర్యాలు లేకున్నా ఐఎల్‌టీడీ వంటి కంపెనీలు అతిథి గృహాలు ఉన్నాయి. రవాణా సదుపాయాలు విస్తృతంగా ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూరప్రాంతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ లైట్‌హౌస్ కూడా ఉంది.

కనపర్తి పురావస్తు ప్రదర్శన శాల
తీరప్రాంతం కనపర్తిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శనశాల ఆప్రాంతం విశిష్ఠతను తెలుపుతోంది. క్రీశ 11, 12, శతాబ్దాల కిందట శిలాశాసనాలు, అప్పట్లో కనకాపురి పట్టణం నేడు కనపర్తిగా పరిణామక్రమాన్ని తెలియచేస్తుంది. 32 ధారల శివలింగం, వీరత్వాన్ని సూచించే వీరగల్లు విగ్రహాలు, వేల ఏళ్ల కిందట నిర్మించిన ప్రాచీన ఆలయాలు దర్శనమిస్తాయి. ఎలేశ్వరస్వామి దేవాలయం కనపర్తిలో విశిష్టతను సంతరించుకుంది. పురావస్తు ప్రదర్శనశాలకు రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే కనపర్తి సముద్రతీరం, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు పర్యాటకులను ఆనందపరుస్తాయి.

ప్రకృతి ప్రాకారం.. పాలంక
నల్లమల కీకారణ్యంలో పాలంక క్షేత్రం కొలువై ఉంది. అయిదు గుడుల సమాహారమైన ఈ ఆలయానికి ప్రకృతే ప్రాకారంగా నిలుస్తోంది. యర్రగొండపాలెం మండలంలో దట్టమైన నల్లమల అడవి మధ్యన కృష్ణానది సమీపాన పక్కనే జలపాతం.. కొండ కింద భాగాన తొలచినట్లుండే ప్రాంతంలో ఆలయం నిర్మించారు. 15వ శతాబ్ధంలో దొంగల బెడదను నియంత్రించిన శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించారు. తొలి ఏకాదశి నాడు జరిగే ఆలయ ఉత్సవాన్ని వీక్షించేందుకు ప్రకాశం, కృష్ణా, కర్నూలు, గుంటూరు, కృష్ణా, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు తరలివస్తారు.

అసుర నిర్మితం.. త్రిపురాంతక ఆలయం
విశిష్టతల సమాహారం త్రిపురాంతకేశ్వర స్వామి, బాలా త్రిపురసుందరీ దేవి ఆలయాలు. అర్చకుల మంత్రాల్లో కచ్చితంగా త్రిపురాంతకం ఆలయ ప్రస్థావన ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన త్రిపురాసులు అనే రాక్షసులను లోక కల్యాణం కోసం శివుడు సంహరించాడు. ఈ ఆలయానికి గల మరో విశిష్టత ఏమిటంటే ప్రపంచంలో శ్రీచక్రంపై నిర్మించిన ఆలయం ఇదొక్కటే. స్వామివారి ఆలయం కొండ మీద ఉంటే, అమ్మవారి కోవెల సమీపంలోని చెరువులో ఉంది. అమ్మవారి ఆలయం పక్కన కదంబ వృక్షాలు పెరుగుతాయి. త్రిపురాంతకం, కాశీ మినహా మరెక్కడా ఈ చెట్లు లేవని లలితా సహస్రనామంలో పేర్కొన్నారు. శ్రీశైల తూర్పు ద్వారంగా పిలుచే త్రిపురాంతకం దేవస్థానాలు శ్రీశైల ఆలయ దత్తత కింద నడుస్తున్నాయి.

కరుణా సముద్రుడు చెన్నకేశవుడు
మార్కాపురంలో వెలసిన చెన్నకేశవాలయం జిల్లాకే కీర్తిప్రతీకగా నిలుస్తోంది. ధనుర్మాసంలోని ఉత్తరాయన కాలంలో సూర్యభగవానుడి కిరణాలు స్వామివారి విగ్రహంపై పడే విధంగా ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఆలయంలోని శిల్పకళ అపురూపంగా ఉంటుంది. ఆలయ ప్రాకారంలోని ఒకేరాయిని పలు ఒంపులు తిరిగినట్లుగా చెక్కారు. శిల్పులైన ఇద్దరు అన్నాదమ్ములు మధ్యరంగంలో శబ్ద గ్రహణం ద్వారా ఒకేవిధంగా రెండు స్తంభాలను చెక్కారు. శిల్పకళా వైభవానికి ఇది మచ్చుతునక. విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు పలుమార్లు స్వామివారిని దర్శించుకొని ఆలయానికి భూములను సమర్పించారు. ఆలయ గాలిగోపుర మొదటి అంతస్థును ఆయనే నిర్మించారు. ప్రపంచంలోని మొట్టమొదటి చెన్నకేశవాలయం ఇదే. ఈ కోవెలను సందర్శించిన పల్నాటి బ్రహ్మనాయుడు దీన్ని స్ఫూర్తిగా మాచర్చ చెన్నకేశవాలయానికి శ్రీకారం చుట్టారు.

మర్కస్ మస్‌జిద్
ఈ మసీదును చిన్న మసీదుగా పిలుస్తారు. ఇది ఒంగోలు పట్టణం పత్తివారి వీధిలో ఉంది. పేరుకు చిన్న మసీదు అయినా నిర్మాణం పెద్దది. జామియా తర్వాత కట్టారు. కాబట్టి చిన్నమసీదుగా పేరు వచ్చిందని చెప్తారు. ఇది విశాలమైన రెండు అంతస్తుల నిర్మాణం. కింద, పైన భాగాల్లో ప్రార్థనలు జరుగుతాయి. సౌది అరేబియా, దుబాయ్ దేశాలకు చెందిన మత పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అధ్యాపకుల వద్ద తమ మతపరమైన ధర్మ సందేహాలను తీర్చుకుంటారు. జిల్లావ్యాప్తంగా ఉన్న మసీదులు అన్నింటికి ఇది ప్రధాన కేంద్రం. ఢిల్లీ ఇమామ్ నుంచి వచ్చే సందేశాలు, హైదరాబాద్‌మత ప్రముఖుల ద్వారా వీరికి చేరతాయి. వాటిని జిల్లావ్యాప్తంగా చేరవేయడం వీరి బాధ్యత. వీరికి అనుసంధానంగా ఉన్న మదర్సా ద్వారా చిన్నారులకు, యువతకు, ఖురాన్ బోధనలో శిక్షణలు అందిస్తారు. రంజాన్ పండుగను కూడా ప్రకటించడం వీరే చేస్తారు. అధ్యయనానికి వీలుగా పలు ఖురాన్ గ్రంధాలు ఇక్కడ లభ్యమవుతాయి. పట్టణానికి చెందిన ఇతర సామాజిక వర్గాల వారు కూడా ఇక్కడ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి తమ సౌభ్రాతృత్వాన్ని చాటుకుంటారు.
ఇతర మసీదులు
నగరంలోని ఘంటాపాలెంలోని మస్-జిద్-ఎ-నిసార్, ఇస్లాంపేటలోని పెద్ద మక్కామసీదు, బైపాస్ రోడ్‌లోని చిన్న మక్కామసీదు, ఆర్.టి.సి బస్టాండ్ వద్ద గల మసీదులు.

క్రైస్తవానికి నెలవు
మతసామరస్యానికి లౌకిక తత్వానికి ప్రకాశం జిల్లా పెట్టిందిపేరు. ముఖ్యంగా బ్రిటిష్ మిషనరీల ఆగమనం జిల్లా రూపురేఖలను మార్చింది. బేకర్, మార్టిన్, క్లౌ దొర, జ్యువెట్ దొరలు ఈ ప్రాంత స్థితిగతుల్ని వీక్షించి కలత చెందారు. విద్య, వైద్యానికి ప్రాముఖ్యం ఇస్తూ మిషన్ హాస్పిటల్, ఆంధ్రా బాప్టిస్ట్ క్రిస్టియన్ హైస్కూల్ నిర్మించారు. అందులో భాగంగానే క్రీ.శ1866లో ఒంగోలులో పెద్ద చర్చిగా పిలిచే జ్యువెట్ మోమోరియల్ బాప్టిస్ట్ చర్చిని నిర్మించారు. ఇది ట్రంక్‌రోడ్‌లోని ప్రకాశం భవన్ సమీపంలో ఉంది. ఆనాడు బకింగ్ హామ్ కాలువ ద్వారా రంగూన్ టేక్ తెప్పించి నిర్మించారు. ప్రధాన హాలులో శాంతికి ప్రతిరూపమైన శిలువ ఉంటుంది. చర్చి నిర్మాణం కోసం ఇంగ్లండ్ నుంచి వచ్చిన కంచు గంట నేటికీ చెక్కు చెదరలేదు. చర్చి ఆధ్వర్యంలో 123 సండే స్కూల్స్, యూత్ క్వైర్, స్త్రీల సమాజం వంటి శాఖలు సేవలు అందిస్తున్నాయి. చర్చికి విశ్వాసులచే ఎన్నుకోబడిన పాలక వర్గాలు సేవ చేస్తాయి. ఇవి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మారతాయి. ప్రతి ఆదివారం జరిగే ప్రార్థనలలో వేల మంది క్రైస్తవ సోదరులు పాల్గొంటారు. క్రిస్మస్ నెల రోజుల పండగ వాతావరణం ఉట్టి పడుతుంది. డిసెంబర్ 24 రాత్రి 20 వేల మంది క్యాండిల్ లైట్ సర్వీస్‌లో పాల్గొని ప్రభువు ఆగమనాన్ని స్వాగతిస్తారు. ఈ చర్చి నుంచే ఆంధప్రదేశ్ బాప్టిస్ట్ ప్రతినిధుల కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతుంది. బి.సి.టి.సి ప్రధాన విభాగం ఇక్కడే వుంది.
రోమన్ క్యాధలిక్ చర్చ్ (ఆర్.సి.ఎం)
నెల్లూరు మేత్రాసనం పరిధిలో ఈ చర్చి పని చేస్తుంది. ఆర్.సి.ఎం. చర్చి పాత మార్కెట్ సెంటర్‌లో ఉంది. ఇక్కడ ప్రార్థన కార్యక్రమాలన్నీ క్యాధలిక్ పద్ధతిలో సాగుతాయి. దీనినే పునీత చిన్నతెరీసమ్మ ఆలయం అంటారు. ఇక్కడ బాల ఏసు, మేరీమాత, మదర్ థెరిస్సా విగ్రహాలను, కల్వరికొండ నమూనాను, బెల్ టవర్‌ను, వరాలమాత పుణ్యక్షేత్రాన్ని చూడవచ్చు. ఆర్.సి.ఎం. ఆధ్వర్యంలో సెయింట్ థెరిస్సా ఉన్నత, ప్రాథమిక పాఠశాలల పరిధిలో 500 మంది విద్యార్థులకు ఉచిత, స్వల్ప రుసుముతో కూడిన విద్యాబోధన అందజేస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు సింహపురి పీఠాధిపతి బిషప్ ఎం.డి.జ్ఞానప్రకాశం నేతృత్వంలో పాధర్ గోరంట్ల ఆంథోని రాజ్ చర్చి బాధ్యతలు చూస్తుంటారు. క్రిస్మస్ నెల రోజులు వారానికి ఒక పాలెం (ప్రాంతం) వారు చొప్పున ఆరాధనలు జరిపి చివరిరోజు అందరూ సమావేశమై ప్రభువును స్వాగతిస్తారు.

పరిశ్రమలు

జిల్లాలో ఐరన్ ఓర్, గ్రానైట్, ఇసుక, సిలికా, బైరటీస్, సున్నపురాయి, పలకలకు సంబంధించిన గనులు ఉన్నాయి. గ్రానైట్, బైరటీస్, పలకలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటి ఆధారంగా జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు చీమకుర్తి, ఆర్.ఎల్.పురం, బూదవాడల్లో 8.60 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంది. వివిధ రంగుల గ్రానైట్ నిక్షేపాలు జిల్లాలోని ఉప్పుమాగులూరు, ఏల్చూరు, దర్శి, కనిగిరి, అద్దంకిల్లో 13.86 మిలియన్ల క్యూబిక్ మీటర్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇవేకాక బ్లాక్ పెరల్ గ్రానైట్ నిల్వలు 0.435 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉన్నాయి. ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు 385 మందికి 2010-11 సంవత్సరంలో రూ. 836.16 లక్షలు సాయం అందించారు. జిల్లాలో భారీ, మధ్య తరహా పరిశ్రమలు 59 ఉన్నాయి. వీటిలో పొగాకు ప్రాసెసింగ్, కాటన్ జిన్నింగ్ మిల్లులు, బయోమాస్ పవర్ జనరేషన్, గ్రానైట్ పాలిషింగ్, గ్రానైట్ క్వారీలు, ఆగ్రో ప్రోడక్ట్ తదితర పరిశ్రమలను రూ. 1406.19 కోట్లతో నెలకొల్పారు. ఈ పరిశ్రమల ద్వారా 14,424 మందికి ఉపాధి కలుగుతోంది. జిల్లాలో మరో 24 భారీ, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. రూ. 4,069.15 కోట్లతో స్థాపించే ఈ పరిశ్రమ ద్వారా మొత్తం 5,817 మందికి ఉపాధి కలగనుంది. జిల్లాలో 5,812 సూక్ష్మ, చిన్న పరిశ్రమలను రూ. 6,6711.46 లక్షలతో స్థాపించారు. ఈ పరిశ్రమల ద్వారా 54,701 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 252 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను రూ. 13,623.34 కోట్లతో 2010-11లో స్థాపించి ప్రత్యక్షంగా 29,433 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. 2011-12లో 39 సూక్ష్మ, చిన్న పరిశ్రమలను రూ. 2,372.98 లక్షలతో స్థాపిస్తున్నారు. ఈ పరిశ్రమల వలన ప్రత్యక్షంగా 485 మందికి ఉపాధి కలగనుంది. జిల్లాలో 426 గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లు రూ. 22,367 లక్షలతో స్థాపించి 6,137 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మార్కాపురం ప్రాంతంలో 100కిపైగా పలకల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో పరిశ్రలమ కేంద్రంలో జనరల్ మేనేజర్‌తోపాటు ఇద్దరు ఉప సంచాలకులు, సహాయ సంచాలకులు ఇద్దరు, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారులు నలుగురితోపాటు మరో 13 మంది ఇతర సిబ్బంది పని చేస్తున్నారు.

ఓనమాలకు శ్రీకారం
మార్కాపురం పలక అంటే తెలియని వారుండరు. బడిలో చేరే ప్రతిపిల్లాడికి అవసరమైన వస్తువు పలక. అలాంటి పలకల గనులకు ప్రసిద్ధి మార్కాపురం. పట్టణంలో 20 రాత పలకల కంపెనీలు, స్థానిక పారిశ్రామికవాడలో మరో 30 వరకు పలకల ఎగుమతి కంపెనీలు ఉన్నాయి. పది వేల మంది కార్మికులు ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో భారీస్థాయిలోనే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టిన ఈ పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభం స్థితిని ఎదుర్కొంటోంది. రంగు పలకల పుణ్యమా అని కొద్దోగొప్పో పరిశ్రమ బతుకీడుస్తోంది.