close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

పదును తీరేలా... పాలిటీ తయారీ!

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే గ్రూప్‌-2లోనే కాదు, ఈ తరహా మరే పోటీపరీక్షలోనైనా భారత రాజకీయ వ్యవస్థ (ఇండియన్‌ పాలిటీ) ప్రశ్నలు తప్పనిసరి. ఈ విభాగంపై పట్టు సాధించడం వల్ల కేటాయించిన మార్కుల్లో అత్యధికం చేజిక్కించుకోవచ్చు. దీనికి ఎలాంటి కృషి చేయాలి!
ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 అభ్యర్థులు సన్నద్ధతలో నిమగ్నమయ్యారు. ఫిబ్రవరిలో జరిగే స్క్రీనింగ్‌ పరీక్షను ఆబ్జెక్టివ్‌ టైపులో 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో నెగ్గితే మేలో జరిగే మెయిన్స్‌ పరీక్షకు అర్హత లభిస్తుంది. మెయిన్స్‌లో నెగ్గితే ఉద్యోగం దక్కినట్లే. ఎటువంటి ఇంటర్వ్యూలూ ఉండవు.
గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్ష సిలబస్‌లో 3 విభాగాలున్నాయి. 1. జాతీయ అంతర్జాతీయ వర్తమాన అంశాలు 2. భారత రాజ్యాంగం - రాజకీయ వ్యవస్థపై అవగాహన 3. భారతదేశ ఆర్థికాభివృద్ధి. ఈ మూడిట్లో అభ్యర్థులు అత్యధిక మార్కులను సంపాదించుకునే అవకాశం రెండో విభాగం కల్పిస్తుంది.
దీనిలో స్క్రీనింగ్‌ పరీక్షకు ప్రకటించిన సిలబస్‌లో దాదాపు 80 శాతం మెయిన్స్‌ సిలబస్‌లో ఉండటం ఉద్యోగార్థులకు వూరటనిచ్చే విషయం. అందుకే మెయిన్స్‌ను దృష్టిలో పెట్టుకుని స్క్రీనింగ్‌ పరీక్షకు సిద్ధమవటం అభిలషణీయం.
స్క్రీనింగ్‌ సిలబస్‌ విశ్లేషణ
రాజ్యాంగం- సమాఖ్య విధానం
భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడా ప్రస్తామించకపోయినప్పటికీ, రాజ్యాంగంలో అనేక సమాఖ్య లక్షణాలు కనిపిస్తాయి. 1870లో లార్డ్‌మేయో ప్రవేశపెట్టిన ఆర్థిక వికేంద్రీకరణ విధానంతో భారత్‌లో సమాఖ్య చరిత్ర ప్రారంభమైంది. 1919 మాంటేగ్‌- చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం, 1927 నాటి సైమన్‌ కమిషన్‌ సిఫార్సులు, 1935 నాటి భారత ప్రభుత్వ చట్టంలో సమాఖ్య లక్షణాలు ప్రతిఫలిస్తున్నాయి. వీటిని అభ్యర్థులు గమనించాలి.
* సమాఖ్య ప్రభుత్వ లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, రెండు స్థాయిలలో ప్రభుత్వాల ఏర్పాటు, కేంద్ర-రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, రాజ్యాంగ ఆధిక్యం, స్వయం ప్రతిపత్తిగల న్యాయ వ్యవస్థ, కేంద్ర శాసన సభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం కల్పించడంపై దృష్టి సారించాలి. రాజ్యాంగంలోని ఏక కేంద్ర- సమాఖ్య లక్షణాలను పోలుస్తూ తయారీ సాగించాలి. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న అధికారాల విభజనను పరిశీలించాలి.
* భారత రాజ్యాంగపరిషత్‌ రాజ్యాంగ రచనకు అనుసరించిన పద్ధతులు, జరిపిన 11 సమావేశాలు, ఏర్పాటు చేసిన 22 కమిటీలు, డా॥ బి.ఆర్‌. అంబేద్కర్‌ నాయకత్వంలోని రాజ్యాంగ ముసాయిదా కమిటీ వివిధ దేశాల నుంచి సంగ్రహించిన రాజ్యాంగ సారాన్ని గ్రహించాలి. రాజ్యాంగ మౌలిక లక్షణాలు, ప్రవేశికలోని తాత్విక పునాదులను పరిశీలిస్తూ సన్నద్ధత కొనసాగించాలి.
ప్రాథమిక హక్కులు- విధులు
* రాజ్యాంగ 3వ భాగంలోని 12 నుంచి 35 వరకున్న ఆర్టికల్స్‌లో పేర్కొన్న ప్రాథమిక హక్కులు, ఇందిరాగాంధీ ప్రభుత్వం సంక్షేమ భావనను ఆచరణాత్మకం చేసేందుకు ఆర్టికల్‌ 368 ద్వారా రాజ్యాంగానికి 1971లో చేసిన 24, 25, 26 రాజ్యాంగ సవరణ చట్టాలు, ఆర్టికల్‌ 366 366(A) లను సవరించి రాజభరణాలను రద్దు చేయడం మొదలైనవి ముఖ్యం.
* ఇందిరాగాంధీ కాలంలో మినీ రాజ్యాంగంగా పేరొందిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976), జనతా ప్రభుత్వ కాలంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978) ద్వారా జరిగిన మార్పులు, ఆర్టికల్‌ 31లో పేర్కొన్న ఆస్తి హక్కును తొలగించి రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్‌, 300(A) లో ఒక సాధారణ చట్టబద్ధమైన హక్కుగా మార్చడంపై దృష్టి సారించాలి.
* వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారా ఆర్టికల్‌ 21(A) నందు పేర్కొన్న ఉచిత నిర్బంధ విద్యాహక్కు, ప్రాథమిక హక్కులకు సంబంధించిన గోలక్‌నాథ్‌ కేసు (1967), కేశవానంద భారతి కేసు (1973), మినర్వా మిల్స్‌ కేసు (1980), ఇతర కేసులలోని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల సారాంశాన్ని అధ్యయనం చేయాలి.
* రాజ్యాంగానికి ఆత్మ, హృదయంగా అభివర్ణితమైన ఆర్టికల్‌ 32లో పేర్కొన్న రాజ్యాంగ పరిహారపు హక్కు, దీని ద్వారా ప్రాథమిక హక్కుల రక్షణ కోసం న్యాయస్థానం జారీచేసే హెబియస్‌ కార్పస్‌, మాండమస్‌, ప్రొహిబిషన్‌, కోవారెంటో రిట్స్‌లోని మౌలికాంశాలు ముఖ్యం.
* రాజ్యాంగం 4వ భాగంలో 36 నుంచి 51 ఆర్టికల్స్‌ మధ్య వివరించిన సంక్షేమరాజ్య ఆదర్శాలైన ఆదేశిక సూత్రాలు, ఆదేశిక సూత్రాలు- ప్రాథమిక హక్కుల మధ్య సమన్వయం సాధించేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ జరిపిన ప్రయత్నాలు గ్రహించాలి. ఇటీవలికాలంలో ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్‌ 44లో పొందుపరచిన ‘ఉమ్మడి పౌరస్మృతి’పై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలుకు సంబంధించి సరళా ముద్గల్‌, మహర్షి అవథేష్‌, పన్నావలాల్‌ భన్సీలాల్‌ పాటిల్‌ మొదలైన కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను పరిశీలించాలి.
* రాజ్యాంగంలోని 4(A) భాగంలో ఆర్టికల్‌ 51(A)లో 42వ సవరణ చట్టం, 1976 ద్వారా చేర్చిన 10 ప్రాథమిక విధులు, 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చిన ప్రాథమిక విద్య, ప్రాథమిక విధులపై అధ్యయనం కోసం 1998లో వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో నియమితులైన J.S. వర్మ కమిషన్‌ సిఫార్సులు, జాతీయ జెండాకు సంబంధించి నవీన్‌ జిందాల్‌ కేసు, సినిమా థియేటర్లలో ‘జనగణమన’ ప్రదర్శించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యాన్ని పరిశీలించాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
* రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్‌ 52 నుంచి 78 మధ్య వివరించిన కేంద్ర కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగమైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి, భారత ప్రభుత్వ ప్రధాన న్యాయాధికారిగా పేరొందిన అటార్నీ జనరల్‌, వివిధ రాష్ట్రపతులు, ప్రధానుల కాలంలో జరిగిన కీలక పరిణామాలు, కేంద్రమంత్రి మండలి రకాలు, సమష్టి బాధ్యతా సూత్రం తెలుసుకోవాలి.
91వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ మొత్తం సభ్యుల సంఖ్యలో మంత్రిమండలి సభ్యుల సంఖ్య 15% మించరాదని వాజ్‌పేయి ప్రభుత్వం నిర్దేశించడం, 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985 ద్వారా రాజీవ్‌గాంధీ ప్రభుత్వం రూపొందించిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ముఖ్యాంశాలు, రాష్ట్రపతి, ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి అధికారాలు, విధులు, పరిమితులపై దృష్టి సారించాలి.
* రాజ్యాంగం 6వ భాగంలో ఆర్టికల్‌ 153 నుంచి 167 మధ్య వివరించిన రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగమైన గవర్నర్‌, ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి, అడ్వకేట్‌ జనరల్‌ అధికారాలు, విధులు, పరిమితులు తెలుసుకోవాలి.
గవర్నర్‌ వ్యవస్థపై వస్తున్న విమర్శలు, ఆర్టికల్‌ 356 దుర్వినియోగంపై 1994 S.R. బొమ్మై కేసు, ఇటీవల పరిణామాలపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు, కేంద్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాష్ట్రాలలో గవర్నర్లను మార్చడంపై B.P. సింఘాల్‌ Vs యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, గవర్నర్ల వ్యవస్థపై భగవాన్‌ సహాయ్‌, రంజిత్‌ సింగ్‌ సర్కారియా కమిటీల సిఫార్సులు, వాటి అమలు కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు... ఇవన్నీ అవగాహన పెంచుకోదగ్గ అంశాలే.
న్యాయ వ్యవస్థ- న్యాయసమీక్షాధికారం
* రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్‌ 124 నుంచి 147 మధ్య వివరించిన సుప్రీంకోర్టు నిర్మాణం, అధికారాలు, విధులు, 6వ భాగంలో ఆర్టికల్‌ 214 నుంచి 232 మధ్య వివరించిన హైకోర్టు నిర్మాణం, అధికారాలు, విధులు, ఆర్టికల్‌, 233 నుంచి 237 మధ్య వివరించిన దిగువ కోర్టుల నిర్మాణం, అధికారాలు, విధులు ముఖ్యం.
* మనదేశ న్యాయవ్యవస్థ నిర్మాణంలో బ్రిటన్‌నూ, పని విధానంలో అమెరికానూ పోలి ఉండడం, న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తి అధికారాలు, న్యాయ సమీక్షాధికారం, జస్టిస్‌ P.N.భగవతి కాలంలో విస్తృతపరిచిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL), రాజకీయ శూన్యాన్ని భర్తీ చేయడానికి న్యాయ వ్యవస్థ క్రియాశీలతను సంతరించుకోవడం ముఖ్యమైన అంశాలు.
* కొలీజియం ద్వారానే జడ్జిలను నియమించాలంటూ నరేంద్రమోదీ ప్రభుత్వం రూపొందించిన NJACని సుప్రీంకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పు, కొలీజియం నుంచి కొలీజియం వరకు జరిగిన పరిణామాలు, ఇటీవలి కాలంలో కార్యనిర్వాహక శాఖ- న్యాయ వ్యవస్థల మధ్య పెరుగుతున్న అంతరాలపై దృష్టి సారించాలి.
స్థానిక ప్రభుత్వాలు
చోళుల కాలం నుంచి బ్రిటిష్‌వారి కాలం వరకు జరిగిన స్థానిక ప్రభుత్వాల అభివృద్ధి క్రమం, సమాజ వికాస ప్రయోగాలు, Community Development Programme (CDP), National Extension Service Scheme (NESS), బల్వంత్‌రాయ్‌ మెహతా కమిటీ సూచించిన మూడంచెల పంచాయితీరాజ్‌ విధానం, అశోక్‌ మెహతా కమిటీ సూచించిన రెండంచెల పంచాయితీరాజ్‌ విధానంలో ముఖ్యాంశాలు ప్రధానం.
* స్థానిక ప్రభుత్వాల బలోపేతం కోసం దంత్‌వాలా కమిటీ, జి.వి.కె.రావు కమిటీ, సిహెచ్‌. హనుమంతరావు కమిటీ, రంజిత్‌సింగ్‌ సర్కారియా కమిటీ, P.K. తుంగన్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం, L.M. సింఘ్వీ కమిటీ చేసిన సిఫార్సులు- వాటి అమలు కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలపై దృష్టి సారించాలి.
* ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఆకర్షణీయ వార్డు, ఆకర్షణీయ గ్రామం, ఆకర్షణీయ నగరం, వాటి విధివిధానాలపై అవగాహన అవసరం.
కేంద్ర రాష్ట్ర సంబంధాలు
* రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్‌, 79 నుంచి 122 మధ్య వివరించిన పార్లమెంటు, 1952 ఏప్రిల్‌ 3న ఏర్పడిన రాజ్యసభ, 1952 ఏప్రిల్‌ 17న ఏర్పడిన లోక్‌సభ వాటి నిర్మాణం, అధికారాలు, విధులు, శాసన నిర్మాణ ప్రక్రియ, 1952 నుండి 2014 మధ్య జరిగిన 16 లోక్‌సభ ఎన్నికలు, వాటి విశేషాలు ప్రధానమైనవి.
* ఆర్టికల్‌ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ను పదేపదే జారీచేయడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునివ్వడంలోని ఆంతర్యంపై దృష్టిసారించాలి.
* రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్‌ 168 నుంచి 212 మధ్య వివరించిన రాష్ట్ర శాసనసభ, నిర్మాణం, అధికారాలు, విధులు, శాసన నిర్మాణ ప్రక్రియ ముఖ్యం.
షెడ్యూల్డు ప్రాంతాల-షెడ్యూల్డు తెగల పాలన
* రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌లోని షెడ్యూల్డు ప్రాంతాల పాలన, 6వ షెడ్యూల్‌లోని అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల పాలనను గురించి, 5వ పంచవర్ష ప్రణాళిక (1974-1979) కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రారంభించిన ‘ట్రైబుల్‌ సబ్‌ప్లాన్‌’, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు, ఆర్టికల్‌ 244(1)లో పేర్కొన్న షెడ్యూల్డు జాతుల పాలన, ఆర్టికల్‌ 244(2)లో పేర్కొన్న ఆటవిక జాతుల పాలనను అధ్యయనం చేయాలి.
* గిరిజనుల ప్రగతి కోసం రూపొందించిన గిరిజన భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం (1959), ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం (1989), గిరిజన సంప్రదాయ హక్కుల చట్టం (2006), గిరిజన హక్కులు వర్సెస్‌ పర్యావరణ పరిరక్షణ, రాజ్యాంగపరంగా గిరిజనులకు కల్పించిన రక్షణలపై దృష్టిసారించాలి.
పాత ప్రశ్నపత్రాలే పునాది
వివిధ పరీక్షల్లో గతంలో అడిగిన పాలిటీ ప్రశ్నల స్థాయినీ, సరళినీ పరిశీలిస్తే సన్నద్ధతపై అవగాహన వస్తుంది. ప్రామాణిక పుస్తకాలను మాత్రమే అధ్యయనం చేయడం మేలు. గ్రూప్‌-2 గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ముఖ్యమైన ఆర్టికల్స్‌, సుప్రీంకోర్టు తీర్పులపై ప్రశ్నలు అధికంగానే వచ్చాయి. ఆర్టికల్స్‌, కేసులను అభ్యసించేటప్పుడు వాటికి గల సంబంధాన్ని జోడిస్తూ చదివితే గుర్తుపెట్టుకోవడం సమస్య కాదు.
చదివిన మొత్తం సిలబస్‌ను వీలైనంతవరకు ఎక్కువసార్లు పునశ్చరణ చేయడం, మీ స్థాయిలో ఉన్న మిత్రులతో చర్చించడం చాలా ప్రయోజనకరం. ఈ మార్గం ద్వారా సులభంగా గరిష్ఠ లబ్ధి పొందవచ్చు. ఇది మీకు మెయిన్స్‌ పరీక్ష కోసం వినియోగించే సమయాన్ని ఆదా చేస్తుంది. ఇంకా మిగిలిన విభాగాల్లోని కఠినమైన విషయాలపై దృష్టి పెట్టేందుకు ఉపకరిస్తుంది.
చాలామంది అభ్యర్థులు ఇండియన్‌ పాలిటీ అనగానే చాలా సులభమనుకుంటారు. సాధారణ స్థాయిలో సిద్ధమైతే పూర్తిస్థాయిలో మార్కులు సాధించవచ్చుననే అపోహతో ఉంటారు. ఇది సరైన అవగాహన కాదు. ఎందుకంటే పరీక్ష పేపర్లను రూపొందించే నిపుణులు సాధారణ స్థాయిలో ఉండే ప్రశ్నల ద్వారా అసాధారణ, లోతైన విషయ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.

Posted on 30-01-2017