close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

పంచాయ‌తీ కొలువు.. ప్రణాళిక‌తో సులువు!

* పాఠ్యప్రణాళిక ప్రకారం సిద్ధమైతే విజయమే
ముదినేపల్లి, న్యూస్‌టుడే: రూ. వేల జీతం సంపాదించినా ప్రయివేటు రంగమంటే భద్రత లేని కొలువు కిందే లెక్క. వేతనం కాస్త తక్కువైనా భద్రత విషయంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఏవీ సాటిరావు. అందుకే నిరుద్యోగులతో పాటు చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా ప్రభుత్వోద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు.. చకాచకా దరఖాస్తు చేయటం, శిక్షణ పొందటం సర్వసాధారణం. ఏళ్లుగా ఎదురుచూస్తున్న గ్రూపు - 3 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ ఎట్టకేలకు విడుదల చేసింది. డిగ్రీ చదివిన వారంతా పంచాయతీ కార్యదర్శి (గ్రేడు -4) పోస్టుకు దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. తగినంత సమయం ఉండటంతో పరీక్షార్థులు సరైన ప్రణాళికతో శ్రమిస్తే గెలుపు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

కార్యదర్శి విధులు ఏమిటంటే..
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992లో నిర్దేశించిన విధులను పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించాలి. పంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేయడం, తీర్మానాలు తయారు చేయడం, ఆ తీర్మానాలు అమలు చేయడం కార్యదర్శి బాధ్యత. నీటి, ఇంటిపన్నులు వసూలు చేయడంతో పాటు గ్రామ ఆదాయ, వ్యయాలను అనుసరించి బడ్జెట్టు రూపొందించాలి. వాటిని పంచాయతీ పాలకవర్గం ముందుంచి ఆమోదించిన తరువాత అమలు చేస్తారు. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్తు వీధి దీపాలు నిర్వహణ, గ్రామపంచాయతీ ఆస్తుల పరిరక్షణ చేయాలి. జనన, మరణ వివరాలను నమోదు చేయాలి. పంచాయతీకి ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా వ్యవహరించాలి.

వయోపరిమితి పెంపుతో పోటీ
ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగానికి వయోపరిమితిని 42 ఏళ్లకు పెంచటం నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. ఈ తరుణంలో కార్యదర్శుల పోస్టులకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశముంది. ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్, బీటెక్ విద్యార్థులు ఇటీవల చిన్నచిన్న కొలువులకు ఇబ్బడిముబ్బడిగా దరఖాస్తులు చేస్తుండటంతో ఈ పరీక్షకు భారీఎత్తున పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.

పదోన్నతులకు అవకాశం
పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం పొందిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి పదోన్నతులు పొంది ఆయా రకాల గ్రేడ్లలో కార్యదర్శి అవుతారు. ఆ తర్వాత ఈవోపీఆర్డీ వరకు పదోన్నతులు పొందటానికి అవకాశం ఉంటుంది. సీనియర్ కార్యదర్శులు పదోన్నతి తర్వాత డివిజన్ స్థాయి పంచాయతీ అధికారిగా కూడా ఎదిగే వీలుంటుంది.. ఈ పదోన్నతులన్నీ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి జీవోలను బట్టి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఒక్కోసారి రావచ్చు, రాకపోవచ్చు.

రుణమార్కులున్నాయి
స్క్రీనింగ్ పరీక్షకు 150 మార్కులకు, ప్రధాన పరీక్ష రెండు పేపర్లు కలిపి 300 మార్కులకు నిర్వహిస్తారు. వీటిలో ప్రతి మూడు తప్పుడు సమాధానాలకు ఒక మార్కు తీసివేస్తారు.

ప్రాథమికానికి 80 రోజులు
* పంచాయతీ కార్యదర్శి పోస్టు చేజిక్కించుకోవటానికి కీలకమైన ప్రాథమిక పరీక్షకు 80 రోజులు, ప్రధాన పరీక్షకు 190 రోజులు మాత్రమే గడువు మిగిలింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రతి నిమిషాన్ని సద్వినియోగపరుచుకోవాలి. దరఖాస్తు చేసుకోవడం, పాఠ్యప్రణాళిక వారీగా చదవడం, పరీక్షల్లో పక్కా వ్యూహంతో జవాబులను గుర్తించడం వంటి అంశాలపై ఇప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయాలి.
* కార్యదర్శి పోస్టుల పరీక్షలకు సంబంధించిన పాఠ్యప్రణాళికను గమనించాలి. డిగ్రీస్థాయి సిలబస్ మీదే అత్యధికంగా ప్రశ్నలు వస్తాయి. ఏపీపీఎస్సీ వెబ్‌సైటులో పాఠ్యప్రణాళిక అందుబాటులో ఉంది.
చి రెండు పరీక్షలకు ఉమ్మడిగా ఉండే అంశాలను గుర్తించాలి. వెయిటేజీని తెలుసుకుని, ఏ ఆంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలో గుర్తించి అందుకు అనుగుణంగా సిద్ధం కావాలి.
* ప్రధానంగా కార్యదర్శుల బాధ్యతులు, విధులు, పంచాయతీరాజ్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, గ్రామీణాభివృద్ది, ప్రజారోగ్యం, వైద్యం, మహిళా సాధికారత, సామాజిక వర్గాల అభ్యున్నతి, ప్రకృతి విపత్తులు, సాంకేతిక పరిజ్ఞానం, నగదు రహితం, ఈగవర్నెస్, భారతదేశ చరిత్ర, బడ్జెట్టు, జాతీయ అంతర్జాతీయ, స్వచ్ఛభారత్, స్వచ్ఛ ఆంధ్ర అంశాలపై పట్టు సాధించాలి.
* నిత్యం వార్తాపత్రికలు చదవాలి. అందులో ప్రధానంగా వచ్చే అంశాలను రాసుకోవాలి. రోజూ వాటిని చదవటం ద్వారా సమకాలీన వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్) విభాగాన్ని ఎదుర్కోవచ్చు.

గ్రామీణాభివృద్ధి పథకాలపై అవగాహన - ఆర్.విక్టర్, డీఎల్పీవో, గుడివాడ
పంచాయతీ కార్యదర్శి అంటే గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాడు. అటువంటి పంచాయతీ కార్యదర్శి పోస్టు దక్కించుకోవటానికి కొంచెం శ్రమించాలి. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి అమలయ్యే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. అందుకు సంబంధించిన ప్రశ్నలకు అవకాశం ఉంది. తాజా పరిణామాలపై దృష్టి పెట్టి క్రమం తప్పకుండా ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలి.

ప్రత్యేక కార్యాచరణతో సాధ్యమే - జి.రమేశ్, పంచాయతీ కార్యదర్శి
పరీక్షకు ఇంకా సమయం ఉండటంతో నిత్యం కనీసం ఏడుగంటల పాటు ప్రణాళికగా చదివితే సరిపోతుంది. ఉదయమే లేచి ప్రశాంత వాతావరణంలో చదివితే మేలు. 24 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పట్టినంత మాత్రాన విజయం సాధించలేరు. గ్రామీణ వాతావరణం, పంచాయతీ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి. ఎప్పటికప్పుడు తాజా పరిణామాలపై దృష్టిపెట్టాలి. నోట్ల రద్దు, నగదు రహిత లావాదేవీలు, ఇటీవల జరిగిన సైన్సు కాంగ్రెస్ వంటి అంశాలు కూడా ప్రశ్నలుగా అడిగే వీలుంటుంది. వాటిపై దృష్టిపెట్టి శ్రమిస్తే తప్పకుండా కార్యదర్శి పోస్టు సాధించవచ్చు.

Posted on 30-01-2017