close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

కీలకాంశం వ్యాకరణమే

తెలుగు భాషా సాహిత్యాలలో సాహిత్యం ముఖ్యమైనా భాషపై పట్టులేకపోతే మార్కులు బాగా రావు. డిగ్రీ తెలుగు లెక్చరర్‌ పరీక్షకు ఇలాంటి మెలకువలను సోదాహరణంగా వివరిస్తున్నారు డా. ద్వా.నా. శాస్త్రి!
ఎం.ఎ. తెలుగులో అయినా, స్లెట్‌, నెట్‌లలో అయినా భాషా సాహిత్యాలపై ఎంత అవగాహన ఉందో అంతకంటే లోతుగా పరిజ్ఞానం ఉంటేనే అందరికంటే ముందు ఉంటారు. ఎం.ఎ.లో వ్యాసరూప ప్రశ్నలతో అధ్యయనం చేశారు. కానీ డిగ్రీ లెక్చరర్‌ పరీక్ష ‘ఆబ్జెక్టివ్‌’ పద్ధతిలో ఉంటుంది. ఈ పద్ధతిలో ‘చాయిస్‌’ ఉండదు. అన్ని అంశాల నుంచీ ప్రశ్నలుంటాయి. పైపైన చదివితే ప్రయోజనం ఉండదు. ప్రతి బిట్టూ ముఖ్యమే అనుకుంటూ అధ్యయనం చెయ్యాలి.
కొన్ని ప్రశ్నలు సూటిగా ఉంటాయి-
‘పదకవితా పితామహుడు’ అని ఎవర్ని అంటారు? (అన్నమయ్య)
మరికొన్ని ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉంటాయి-
‘నన్నయకు భారతరచనలో సహాయపడినదెవరు?’ (నారాయణభట్టు)
ఇంకొన్ని కష్టంగా ఉంటాయి-
‘నన్నయ భారత రచనపై ఎవరి ప్రభావం ఉందంటారు?’ (పంప కవి)
సాహిత్యంలోనే కాదు భాష విషయంలోనూ, వ్యాకరణంలోనూ ఇదేవిధంగా చదువుకోవాలి. ఒక అంశానికి సంబంధించిన పలు విషయాలను తెలుసుకున్నప్పుడే మార్కులు బాగా వస్తాయి.
సాహిత్యాధ్యయనం
ప్రాచీన సాహిత్యం-ఆధునిక సాహిత్యం అని వింగడించుకుంటూ చదవాలి. ప్రాచీన సాహిత్యాన్ని ప్రక్రియాపరంగా చదివితే ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం గుర్తించవచ్చు. అంటే ఇతిహాసం, కావ్యం, ప్రబంధం, శతకం, పద కవిత్వం, అచ్చ తెలుగు రచనలు అనేవిధంగా వర్గీకరించుకోవాలి. ఆధునిక సాహిత్యం అనగానే ‘ఉద్యమ కవిత్వం’పై పట్టు ఉండేలా అధ్యయనం చెయ్యాలి. ఆధునిక యుగంలోని ప్రసిద్ధ కవులు, కావ్యాలు ఉద్యమాలకి సంబంధించినవే.
సాహిత్యాధ్యయనం అనగానే... కవుల పరిచయం-అంకితాలు-పాత్రలు-విమర్శలు-ఉదాహరణలు (కొటేషన్లు) తప్పనిసరి. వీటిని ప్రత్యేకంగా రూపొందించుకొని తీరిక ఉన్నప్పుడు పునశ్చరణ చేసుకోవాలి.
భాషాశాస్త్రంలో ముఖ్యమైనవి ఆరు అంశాలు- ఆంధ్రము, తెలుగు, తెనుగు-మాండలికాలు, తెలుగు వాక్యభేదాలు-భాష ఆధునికీకరణ-ధ్వని మార్పులు, అర్థ పరిణామం. అంటే మిగిలినవాటిని వదలమని కాదు- వీటికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావం!
మార్కులు ఎక్కువగా రావాలంటే కష్టమైన రెండు భాగాలున్నాయి- సాహిత్య విమర్శ, వ్యాకరణం. వీటిని ఎంత బాగా చదివితే అంతగా ‘స్కోరింగ్‌’ చేయవచ్చు. ఇవి చదవడం, గుర్తుపెట్టుకోవడం కష్టమే అయినా ఇష్టపడి చదివితే చాలా ప్రయోజనాలున్నాయి.
సాహిత్య విమర్శలో-
కావ్య నిర్వచనాలు-కావ్య హేతువులు-కావ్య ప్రయోజనాలు-కావ్యాత్మ-రసాలు, స్థాయి భావాలు; అలంకార శాస్త్రాలు, వాటి రచయితలు తప్పక చదవాలి. సంస్కృత నిర్వచనాలను అశ్రద్ధ చేస్తారుగానీ అక్కడ శ్రద్ధ తీసుకుంటే ఒక మెట్టుపైన ఉంటారు.
మొత్తం తెలుగు డి.ఎల్‌. పరీక్షలో అత్యంత కీలకమైనది వ్యాకరణం. ఇందులో పారిభాషిక పదాలు (ఆదేశం, ఆగమం, శబ్ద పల్లవం, అవ్యయం మొ॥నవి); వ్యాకరణ సూత్రాలు, పద స్వరూపాలు (మీగడ ఎలా వచ్చింది - మీదు+ కడ) చాలా ముఖ్యం.
ఉదా: ‘మేలుకొను’ ఏ పదం? (శబ్దపల్లవం)
వ్యాకరణాలు- వారి రచయితలు తెలుసుకోవాలి.
ఉదా: ‘రమణీయం’ ఎవరిది? (దువ్వూరి వెంకటరమణ శాస్త్రి)
* వ్యాకరణంలో చిన్నయసూరి రాసిన ‘బాల వ్యాకరణం’ చదివితే సరిపోదు. బహుజనపల్లి వారి ‘ప్రౌఢ వ్యాకరణం’ కూడా ముఖ్యం. రెండిటినీ తులనాత్మకంగా పరిశీలించే సూత్రాలు ఇంకా ముఖ్యం.
ఉదా: ఈ కింది ఏ అంశంలో బాల, ప్రౌఢ వ్యాకరణకర్తలు విభేదించారు?
1. క్త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు.
2. చిట్టడవి చిట్టి
3. రెండూ
4. రెండూ కాదు (జవాబు: 3)
వ్యాకరణంలో భాగంగా ఇంతకుముందు చదివిన సంధులు, సమాసాలు, అలంకారాలు, ఛందస్సులు మళ్లీ గుర్తుండేలా చదవాలి. వీటిలో ప్రశ్నలకు ఒక ఉదాహరణ:
* జగణం ఇందులో ముఖ్యమైనది-
1) ఆటవెలది 2) తేటగీతి 3) ద్విపద 4) కందం (జవాబు: 4)
పౌఢవ్యాకర్త గురువు-
1) చిన్నయసూరి 2) వేదం వెంకటరాయ శాస్త్రి 3) సి.పి. బ్రౌన్‌ 4) వేటూరి ప్రభాకరశాస్త్రి (జవాబు: 1)
జానపద సాహిత్యంపై తక్కువ వచ్చినా నిర్లక్ష్యం చెయ్యకూడదు. జానపద గేయాల విభజన, జానపద గ్రంథ రచయితలు, కళారూపాలు, బుర్రకథ, పండగలు వంటి వాటిపై స్థూల అవగాహన ఉండాలి.
సంస్కృత విభాగం నుంచి అయిదారు ప్రశ్నలే వస్తాయి. ఇందులో మూడు రాయగలిగినా పోటీలో ముందుంటారు. సంస్కృత కావ్యాలు, నాటకాల పరిచయం- వ్యాకరణంపై కొంత అవగాహన (పదాలు, సంధులు, సమాసాలు) చాలు.
‘హితోపదేశం’ చదవటం అవసరమే. ఉదాహరణ ప్రశ్న-
కాళిదాసు దీనికి ప్రసిద్ధుడు-
1) నాటకీయత 2) ఉపమాలంకారం 3) అర్థగౌరవం 4) అన్నీ (జవాబు: 2)
ఈ విధంగా ప్రణాళికాబద్ధంగా- అధ్యాయాలు అంశాలవారీగా చదువుతూ సొంతంగా ముఖ్యమైనవాటిని పుస్తకంలో రాసుకుంటూ చదివితే డిగ్రీ లెక్చరర్‌ కావటం సాధ్యమే. పోటీ పరీక్షలకి కావలసిన పట్టుదల, ఆత్మ విశ్వాసం ఉంటే చాలు.
ఉపయోగపడే గ్రంథాలు
తెలుగు సాహిత్య సమీక్ష - జి. నాగయ్య
తెలుగు సాహిత్య చరిత్ర - ద్వా.నా. శాస్త్రి
తెలుగు భాషాచరిత్ర - వి. సిమ్మన్న
సంస్కృత వ్యాకరణ ప్రకాశిక - కె.ఎ. కృష్ణమాచార్యులు
జానపద జ్ఞానాధ్యయనం - జి.ఎస్‌. మోహన్‌.

Posted on 06-02-2017