close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

మౌలికానికి సమకాలీనం జోడిస్తే మార్కుల జోరు

ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్షలో ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఓ ముఖ్య విభాగం. ఈ సిలబస్‌ను ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేసి రాయగలిగితే మంచి స్కోరుతో మెయిన్స్‌కు అర్హత సాధించటానికి ఉపయోగపడుతుంది. తగిన అవగాహన పెంచుకోవటానికి ఏమేం చేయాలో పరిశీలిద్దాం!
గ్రూప్‌- 2 ఉద్యోగ సాధనలో భారత ఆర్థిక వ్యవస్థ కీలకమైనది. దీనికోసం అభ్యర్థి పరిమితులతో స్క్రీనింగ్‌, మెయిన్స్‌ అని కాకుండా విశ్లేషణాత్మకంగా మెయిన్స్‌ స్థాయిలోనే సన్నద్ధం కావలసి ఉంటుంది. స్క్రీనింగ్‌ ఎకానమీ సిలబస్‌ను ఏడు ప్రధాన భాగాలుగా చదువుకోవాలి.
1. మధ్యయుగ భారతదేశ ఆర్థికవ్యవస్థ
దేశ చరిత్రలో క్రీ.శ. 700-1200 సం॥ మధ్యకాలానికి మధ్యయుగంలో ప్రాధాన్యం ఉంది. ఈ యుగంలో వివిధ రాజవంశాల పరిపాలనా ఆర్థిక విధానంలో (ముఖ్యంగా వ్యవసాయం, వ్యాపారం) జరిగిన మార్పులను పరిశీలించాలి. చరిత్ర కోణంలో నాటి ఆర్థిక విధానాలను, సవాళ్ళను పరిశీలిస్తూనే మధ్యయుగ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన పన్నులను అధ్యయనం చేయాలి.
2. స్వాతంత్య్రానికి పూర్వం దేశ ఆర్థికాభివృద్ధి
లాభార్జన లక్ష్యంతో దేశంలో ఈస్టిండియా కంపెనీ ప్రారంభమైన నాటి నుంచి అధ్యయనం చేయాలి. అంటే బ్రిటిష్‌ పరిపాలనా కాలంలో భారత ఆర్థికవ్యవస్థ లక్షణాలను పరిశీలించటం. రక్షణాత్మక వాణిజ్య విధానం ద్వారా బ్రిటిష్‌ వారు తమ పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించుకొన్న విధం, తర్వాత వారు ఉపయోగించిన స్వేచ్ఛా వ్యాపార విధానంతో బాటు నాటి రెవెన్యూ సంస్కరణలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఆ విధానాల ప్రభావం, వ్యవసాయ వాణిజ్యీకరణ, వలసవాదం, ఆర్థిక దోపిడీ విధానాలు అధ్యయనాంశాలు.
జమీందారీ విధానం, రైతులపై అధిక శిస్తు, రైల్వేల విధానం ద్వారా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పు, దేశ ఆర్థిక వ్యవస్థపై సంపద తరలింపు ప్రభావం మొదలైనవి ముఖ్యం.
3. స్వాతంత్య్రానంతరం దేశంలో అభివృద్ధి ప్రణాళికలు
ఈ విభాగం నుంచి అధిక ప్రశ్నలు వచ్చే అవకాశముంది. మొదటి ప్రణాళిక నుంచి ప్రస్తుతం ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి అయోగ్‌ వరకు పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. ఇప్పటివరకు జరిగిన 12 పంచవర్ష ప్రణాళికలపై పట్టు అవసరం. ప్రణాళికా కాలం, ప్రణాళికా రూపకర్త, ప్రణాళికా ఉపాధ్యక్షుడు, ప్రణాళికా ప్రాధాన్యం వంటివి అవగాహన పెంచుకోవాల్సిన అంశాలు. ప్రతి ప్రణాళికలోనూ ప్రభుత్వం ప్రకటించిన వివిధ ప్రజా పథకాలు, దాని అమలు ఎలాఉంది వంటివీ ముఖ్యమే.
4. ఆర్థిక పారిశ్రామిక విధానాలు, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ
ఈ యూనిట్‌ మొత్తం అధికంగా పారిశ్రామిక రంగానికి చెందినదని చెప్పవచ్చు. పారిశ్రామిక తీర్మానాలపై పట్టు సాధించాలి. ఇందులో పారిశ్రామిక అభివృద్ధి దశలు- వ్యూహాలు, పారిశ్రామిక లైసెన్సింగ్‌ విధానాలు, పరిశ్రమల వర్గీకరణ, ప్రత్యేక ఆర్థిక మండళ్ళు (SEZ), ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అభివృద్ధిలోని సవాళ్ళు, చిన్న తరహా పరిశ్రమల ఖాయిలాపై పనిచేసిన వివిధ కమిటీలను సంపూర్ణంగా చదవాలి.
మిశ్రమ ఆర్థిక విధానానికి శ్రీకారం చుట్టిన 1948 పారిశ్రామిక తీర్మానం, భారీ పరిశ్రమలకు పునాది వేసిన 1956 పారిశ్రామిక విధాన తీర్మానం, వీటి ద్వారా జరిగిన గణనీయమైన మార్పులు, 1973, 1977 నాటి పారిశ్రామిక తీర్మానాల్లోని ముఖ్యంశాలపై దృష్టి సాధించాలి. పీవీ నరసింహారావు ప్రభుత్వ కాలంలో 1991లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణలలో ముఖ్యంగా సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల ద్వారా వచ్చిన మార్పులు, ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే విధానాలు, ప్రపంచీకరణ పరిణామక్రమం- లాభనష్టాలు, 2015లో నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంలోని ముఖ్యంశాలపై పట్టు సాధించాలి.
5. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలు:
జాతీయ కార్మిక సంఘాలు చేసిన సూచనలు, ఇటీవలికాలంలో కార్మిక చట్టాల్లో వచ్చిన మార్పులు, కార్మిక విధానాలు, కార్మిక సంస్కరణలు, భారత్‌లో జనాభా, వివిధ వృత్తులలో కార్మికుల స్థితిగతులను పరిశీలించాలి. దీనితో పాటు సంఘటిత, అసంఘటిత కార్మికులు, 1970 నాటికి కాంట్రాక్ట్‌ లేబర్‌ చట్టంలోని ముఖ్యాంశాలు, 1926 నాటి ట్రేడ్‌ యూనియన్‌ చట్టానికి జరిగిన సవరణలు, 1950 తర్వాత భారత్‌లో కార్మిక విధానాలు ముఖ్యమైనవి. కార్మిక సంక్షేమ విధానాలతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో బాల కార్మికుల స్థితిగతులు, ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాలపై దృష్టి సారించాలి.
6. భారత్‌లో వ్యవసాయ, హరిత విప్లవ పాత్ర
దేశ ప్రగతిలో వ్యవసాయరంగ పాత్ర, ఆహార భద్రత, ఆధునిక కాలంలో ఆరోగ్యరంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వల్ల పండ్లు, కూరగాయలకు పెరుగుతున్న గిరాకీ గమనించాలి. వ్యవసాయ భూమి, ప్రధాన పంటలు, వ్యవసాయ ఉత్పత్తి- ఉత్పాదకతపై దృష్టి సారించాలి.
దీనితోబాటు వ్యవసాయ రంగంతో సంబంధం ఉన్న విప్లవాలు, సేంద్రియ వ్యవసాయం, జాతీయ నీటిపారుదల యాజమాన్యనిధి, ఎరువులు, క్రిమి సంహారక మందులు, హరిత విప్లవానికి దారితీసిన పరిస్థితులు, దాని ఫలితాలు, జాతీయ వ్యవసాయ విధానం, జాతీయ రైతు కమిషన్‌కు సంబంధించిన అంశాలపై విస్తృత అధ్యయనం అవసరం.
7. వివిధ ప్రాంతాల జనాభాల మధ్య ఆర్థిక అసమానతలు
ఈ అధ్యాయం పూర్తిగా జనాభా ఇతివృత్తంతో కూడుకున్నది. ఇందులో ప్రాంతీయ అసమానతల కారణాలు, కొలమానాలు, ప్రాంతీయ అసమానతల సూచికలు, ప్రాంతీయ అభివృద్ధిలో వివిధ దశలు, ప్రణాళికలు, సంతులిత ప్రాంతీయాభివృద్ధి లక్ష్యాలు మొదలైనవి క్షుణ్ణంగా చదవాలి.
ఇంకా జనాభాపరమైన ఆర్థిక అసమానతలు, దేశ జనాభా పరిణామం, జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి, పేదరికాన్ని నివారించేందుకు జరుగుతున్న కృషి, ఉపాధి హామీ పథకం, షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషి, రాజ్యాంగంలో పేర్కొన్న రక్షణలను విస్తృతంగా అధ్యయనం చేయాలి.
ప్రస్తుతం బట్టీపట్టే అంశాలకు ఏపీపీఎస్‌సీ ప్రాధాన్యం తగ్గిస్తున్నది. అందుకని వాస్తవిక అంశాలను అర్థంచేసుకొని విశ్లేషణాత్మక అధ్యయనం చేయడం మంచిది.
అభ్యర్థులూ... ఇవి మరవకండి!
ఆర్థిక వ్యవస్థ తాజా సమాచారం కోసం ప్రభుత్వ ప్రచురణలు, ప్రామాణిక పుస్తకాలు, అంతర్జాలంలోని అధీకృత సమాచారంపై మాత్రమే ఆధారపడటం మంచిది.
* మొదట మౌలిక భావనలపై పట్టు సాధించాలి. తాజా పరిస్థితులను మిళితం చేసి చదవాలి. ఇందులో భాగంగానే సమ్మిళిత వృద్ధి, తాజా ఆర్థిక విధానాలైన 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు చేసిన కేటాయింపులు, జీఎస్‌టీ బిల్లు మొదలైనవాటిపై దృష్టి కేంద్రీకరించాలి.
* అభ్యర్థుల్లో ఎకానమీ అనగానే గణాంకాలే కీలకమనే భావన ఉంది. ఇది సరి అయిన అభిప్రాయం కాదు. అధిక సమయాన్ని గణాంకాలకే కేటాయించకుండా, వాటిని విశ్లేషించాలి. అందులోని మౌలికాంశాలపై దృష్టిపెట్టాలి.
* భారత ఆర్థికవ్యవస్థ మెరుగుదల కోసం వివిధ కమిటీల సూచనలనూ, నివేదికల సారాంశాన్నీ, వాటి అమలుకోసం ప్రభుత్వాలు జరిపిన ప్రయత్నాన్నీ విస్తృత భావనతో అధ్యయనం చేయాలి. ఇలా చేస్తే మంచి మార్కులు సులువుగా వస్తాయి.
* ఈ విభాగంలో అత్యధిక మార్కులు సాధించాలంటే మొదటి సోపానం సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవడమే. దానికోసం రోజూ వార్తాపత్రికలు చదవడం ఎంతో అవసరం.
* ప్రస్తుతం బట్టీపట్టే అంశాలకు ఏపీపీఎస్‌సీ ప్రాధాన్యం తగ్గిస్తున్నది. అందుకని వాస్తవిక అంశాలను అర్థంచేసుకొని విశ్లేషణాత్మక అధ్యయనం చేయడం మంచిది.
* గ్రూప్‌-2 పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంతో ఉంటుంది కదా అని బిట్‌ల రూపంలో ఉన్న మెటీరియల్‌ చదవటం సరి కాదు. సన్నద్ధత... డిస్క్రిప్టివ్‌ విధానంలోనే ఉండాలి.
* మార్కెట్‌లో లభించే ఏదో ఒక పుస్తకం తీసుకొని చదివేస్తే ఎకానమీలో అధిక మార్కులు పొందడం కష్టం. అభ్యర్థులు చేయాల్సింది... అకడమిక్‌ పుస్తకాలను చదివి వాటికి వర్తమాన అంశాలనూ, గణాంకాలనూ అనుసంధానం చేసుకోవడం.
* ఆర్థిక విధానాలపై వివిధ కమిటీల సూచనలను పూర్తిస్థాయిలో చదవాలి. ఆయా కమిటీల సిపార్సులు, నివేదికలు చదివి సొంతంగా నోట్సు తయారుచేసుకోవడం మంచిది.
* ఆంధ్రప్రదేశ్‌ విభజనానంతరం ఆర్థికవ్యవస్థపై అవగాహన కోసం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను పూర్తిగా అధ్యయనం చేయాలి. దీనిపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటాయి.

Posted on 13-02-2017