close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

గెలుద్దాం గ్రూప్‌-2

మరో అయిదురోజులు దాటితే గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్ష జరగనున్నది. దీనిలో చూపించే ప్రతిభ ఆధారంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపికవుతారు. తద్వారా ఉద్యోగ ఎంపిక ఆఖరి అంచెలో శక్తియుక్తులను ప్రదర్శించటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కొద్దిరోజుల్లో ఉండాల్సిన మానసిక స్థితీ, సన్నద్ధతలో పాటించాల్సిన మెలకువలూ పరిశీలిద్దాం!
పరీక్షల తేదీ ముంచుకొస్తున్న ఈ తరుణంలో మెయిన్స్‌కు ఎంపికవుతామా లేదా అనే సందేహాస్పదమైన ఆలోచనలు అభ్యర్థుల్లో ఒత్తిడిని పెంచటం సహజం. కానీ ఒత్తిడికి గురైతే ఫలితాలు వికటించే ప్రమాదం ఉంటుంది కదా? అందుకే వివిధ ఒత్తిడులకు దారి తీసే కారణాలనూ, వాటి నివారణ మార్గాలనూ తెలుసుకుంటే లక్ష్యసాధనపై దృష్టిపెట్టవచ్చు!
హాల్‌టికెట్లలో లోపాలు
ఏపీపీఎస్‌సీ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కి అంగీకరించినప్పటి నుంచీ 90 శాతానికి పైగా అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. 1) హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ కాకపోవటం 2) కమ్యూనిటీ, జోన్‌, పేరు, ఫీజు లాంటి అనేక విషయాల్లో తప్పులు దొర్లటం 3) హైదరాబాద్‌ను సెంటర్‌గా పెట్టినవారిలో నాన్‌ లోకల్‌ అని ఆంధ్ర అభ్యర్థులకు రావటం.
ఇలాంటి సమస్యల వల్ల సన్నద్ధతను పక్కనపెట్టి వీటిపై దృష్టి సారించాల్సిరావటంతో చాలామంది అభ్యర్థులు లక్ష్య దిశ నుంచి కొంత పక్కకి వచ్చారు. తీరా ఆ సంగతి గ్రహించి బెంబేలెత్తుతున్నారు.
* పరిష్కారం: స్క్రీనింగ్‌ స్థాయిలో 1:50 నిష్పత్తిలో జోన్‌, కమ్యూనిటీ, లింగభేదం పట్టించుకోకుండా మెయిన్స్‌కు ఎంపిక జరుగుతుంది. అందువల్ల ప్రస్తుతం హాల్‌టికెట్‌లో ఎలాంటి తప్పిదాలు దొర్లినా ఆందోళనపడనవసరం లేదు. పరీక్ష కోసం ఏకాగ్రతతో తయారవ్వాలి. ఏపీపీఎస్‌సీ అందించిన సమాచారం ప్రకారం- 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరిగిన తర్వాత ఆయా అభ్యర్థులకు మళ్ళీ తమ సమాచారాన్ని అప్‌లోడ్‌ చేసే అవకాశం ఇస్తారు. అందువల్ల హాల్‌టికెట్‌ తప్పిదాల గురించి ఇప్పుడు ఒత్తిడి తగ్గించుకుంటే సరిపోతుంది.
వదంతుల ప్రభావం
ఇప్పటికి కూడా కొందరు అభ్యర్థుల్లో పరీక్ష జరుగుతుందా? అనే సందేహం ఉంది. ఆధారం లేని వివిధ వదంతులను పట్టించుకోవటం వల్ల ఏకాగ్రతకు ముప్పు వస్తోంది. పరీక్షకు సిద్ధపడనివారిలో కొందరు సోషల్‌మీడియా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రచారం చేస్తున్నారు. ఫలితంగా సీరియస్‌ అభ్యర్థులు కూడా లక్ష్య మార్గం నుంచి పక్కకు తొలగే ఆస్కారం ఏర్పడుతోంది.
* పరిష్కారం: గత రెండు దశాబ్దాల్లో ఎప్పుడు ఏపీపీఎస్‌సీ పరీక్ష జరిగినా ఈ ప్రచారం సర్వసాధారణమైపోయింది. పైగా సోషల్‌మీడియా తోడవ్వటం వల్ల మరింత వేగంగా, విస్తృతంగా ఈ వదంతులు వ్యాపిస్తున్నాయి. అయితే ఏపీపీఎస్‌సీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం- పరీక్ష వాయిదా పడేందుకు కారణం ఒక్కటి కూడా లేదు. ఇది గమనించి ఎలాంటి అపోహలకూ, అనుమానాలకూ గురికాకుండా పరీక్ష సన్నద్ధతపై పూర్తిగా దృష్టి సారించగలిగితే మెయిన్స్‌ దశలోకి ప్రవేశించవచ్చు!
ప్రతికూల ఆలోచనలు
గ్రూప్స్‌ అభ్యర్థుల్లో సాధారణంగా పరీక్ష ఒత్తిడి కనిపిస్తుంటుంది. ఎంత చదివినా సంతృప్తి కలగకపోవటం, చదివింది మర్చిపోయినట్లుగా ఉండటం, పరీక్ష హాల్లో గుర్తుకురావేమో అనే శంక, చదవనివే ప్రశ్నలుగా వస్తాయనుకోవటం, కచ్చితంగా ఇతరులు బాగా చదువుతున్నారు కాబట్టి నేను పరీక్ష గట్టెక్కలేను... ఇలాంటి ఆలోచనలు రావటంలాంటి లక్షణాలు.
అందులోనూ నాకవుట్‌ మ్యాచ్‌ లాంటి ఈ పోటీపరీక్షల్లో మరీ ఎక్కువగా అభ్యర్థులు పరీక్షల ఫోబియాకు గురవుతూవుంటారు. అకడమిక్‌ పరీక్షల్లో మరోసారి రాసే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలకు అలాంటి అవకాశం ఉండదనే వాస్తవం కూడా ఒత్తిడికి కారణం.
* పరిష్కారం: స్వీయ కౌన్సెలింగ్‌ ద్వారా అభ్యర్థి కింది అంశాలను మనసుకు అందేలా చూసుకోవాలి.
గ్రూప్స్‌ లాంటి పరీక్షల సిలబస్‌ అనంతం. అందువల్ల ఎంత చదివినా ఇంకా ఎంతో కొంత మిగిలేవుంటుంది. మరో సంవత్సరం సమయమిచ్చి పరీక్ష రాయమన్నా ఇదే తరహా సమస్య ఉండకమానదు.
ఇక ‘చదివింది మర్చిపోయినట్లుగా ఉండటం’ కూడా సహజంగా కనిపించే లక్షణమే. అనేక మనో విజ్ఞానశాస్త్ర అధ్యయనాల ప్రకారం చివరి క్షణం వరకూ చదువుతూవుండేవాళ్ళలో ఈ ఒత్తిడి మరింత ఎక్కువ. అందుకే పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ ‘చదివే గంటల సంఖ్య’ తగ్గుతూవుండాలి. మానసిక ప్రశాంతతకు ఉపయోగపడే మెలకువలు పాటించాలి. ముఖ్యంగా చివరి 24 గంటల్లో అసలు చదవకపోవటం మంచిది. స్మృతి (జ్ఞాపకం)పై అధ్యయనం చేసిన ఎబ్బింగ్‌ హామ్‌ ఇదే విషయాన్ని వ్యక్తపరిచాడు. ఆబ్జెక్టివ్‌ పరీక్షలకు కనీసం 18 గంటల ముందు చదువు ఆపేసిన అభ్యర్థుల్లో 5-10 శాతం అనుకూల ఫలితాలు పెరిగాయని అధ్యయనాలు తేల్చిచెబుతున్నాయి.
‘పరీక్ష హాల్లో గుర్తుకు రావేమో’ అనే సందేహం ఒత్తిడికి మరో కారణం. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే చదివిన శక్తిసామర్థ్యాలను బట్టి తప్పకుండా సమాధానాలు గుర్తుకువస్తాయి. ప్రశాంతత లేకుంటే చదివిన అంశాలు కూడా మరిచిపోయే అవకాశం ఉంది.
‘చదవనివే ప్రశ్నలుగా వస్తాయి’ అనే ఆలోచన ఒత్తిడి వల్ల వచ్చే నిరాశకు పరాకాష్ఠ. అనేక గ్రూప్స్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షల్లో గరిష్ఠంగా సాధించగలిగిన మార్కులు 60-65 శాతం మాత్రమే. ఇందులో 40 శాతం సగటు స్థాయిలో ఉంటాయి. అందువల్ల ప్రమాణాల ప్రకారం చదివితే ఉత్తీర్ణత/ అర్హతకు తగిన స్థాయిలో తప్పనిసరిగా సమాధానాలు అందుతాయి. పైగా ఆబ్జెక్టివ్‌ పరీక్షలో ప్రశ్నల దగ్గరే సమాధానాలు ఉంటాయి కాబట్టి మన మెదడు గుర్తింపు అనే ప్రక్రియలో సరైన సమాధానాన్నే గుర్తిస్తుంది. అందువల్ల ఇలాంటి ఒత్తిడిని కూడా జయించవచ్చు.
‘నేను బాగా చదవలేదు’ అనే భావన కూడా సరైనది కాదు. గ్రూప్స్‌ లాంటి పరీక్షలు రాసే 90 శాతం మంది అభ్యర్థులు ఇదే భావనతో ఉంటారు. ఎందుకంటే అది సబ్జెక్టు స్వభావం. అకడమిక్‌ పరీక్షలకు నిర్దిష్ట సిలబస్‌, పుస్తకాలు ఉంటాయి కాబట్టి ‘చదివాను’ అనే సంతృప్తి ఉంటుంది. పోటీ పరీక్షల్లో అది సాధ్యం కాదు. అందువల్ల సంతృప్తి తెచ్చుకోవటం అభ్యర్థి ప్రతిభా ప్రదర్శనను పెంచుతుందనటంలో సందేహం లేదు.
అనారోగ్య భీతి
‘కీలకమైన పరీక్ష సమయానికి అనారోగ్యం బారినపడతామేమో’ అనే అనుమానం చాలామంది అభ్యర్థుల్లో ఉంటుంది. అందువల్ల సన్నద్ధతపై ఏకాగ్రత చూపించలేకపోవటం, తద్వారా లక్ష్యసాధనకు దూరం అవటం జరుగుతుంది.
* పరిష్కారం: నిద్రాహారాలు మాని చదవటం, ఆరోగ్యంపై అశ్రద్ధలాంటివి లేకపోతే సాధారణంగా జ్వరాలూ, జలుబులూ రావు. పరీక్షకు కొద్దిరోజులు ముందుగా డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి ఆయన సలహామేరకు సాధారణ మందులు వాడటం ద్వారా నలత వచ్చినా రాకపోయినా కుదురుగా ఉండవచ్చు. ముఖ్యంగా బీ కాంప్లెక్స్‌ మందులు నోటి, నరాల సంబంధిత వ్యాధులను నియంత్రిస్తాయి. పైగా మానసిక స్థిరత్వం కూడా పెరుగుతుంది.
‘గ్రూప్స్‌ లాంటి పరీక్షల సిలబస్‌ అనంతం. అందువల్ల ఎంత చదివినా ఇంకా ఎంతో కొంత మిగిలేవుంటుంది. మరో సంవత్సరం సమయమిచ్చి పరీక్ష రాయమన్నా ఇదే తరహా సమస్య ఉండకమానదు.
మనో విజ్ఞానశాస్త్ర అధ్యయనాల ప్రకారం చివరి క్షణం వరకూ చదువుతూవుండేవాళ్ళలో ఈ ఒత్తిడి మరింత ఎక్కువ. అందుకే పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ ‘చదివే గంటల సంఖ్య’ తగ్గుతూ వుండాలి.’
ఏం చేయాలి? ఏం చేయొద్దు?
స్నేహితులతో సబ్జెక్టు గురించి కాలహరణానికి దారితీసే చర్చలు చేయవద్దు.
* బిట్ల రూపంలో ప్రశ్నలు చదివి, సమాధానం చెప్పలేని ప్రశ్నలు గమనించి ఆందోళనకు గురికావొద్దు.
* ప్రామాణికత లేని నమూనా పరీక్షలు రాయవద్దు
* ప్రశ్నలు అనువర్తన, సాధారణ కోణంలో ఉంటాయి. అవి ఎలా ఉన్నా రాయగలననే మానసిక సంసిద్ధతను ముందుగానే ఏర్పరచుకోవాలి.
* కొత్త పుస్తకాలు చదవకుండా చదివిన పుస్తకాల్ని నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకుని పునశ్చరణ (రివిజన్‌) చేయాలి.
నచ్చిన విభాగంతో మొదలెట్టవచ్చు..
* గ్రూప్‌-2 మూడు విభాగాల్లో నచ్చిన విభాగంతో ప్రారంభించవచ్చు. మొదటి బిట్‌నుంచే అదే క్రమంలో సమాధానం గుర్తించటం తప్పనిసరేమీ కాదు.
* ఒక విభాగంలో చదివిన ప్రశ్నలు మరో విభాగంలో సమాధానాలుగా ఉపకరిస్తాయి. అందుకని అనుమానం ఉన్న ప్రశ్నల సమాధానం ప్రశ్నపత్రంపై గుర్తించి, వాటి బబ్లింగ్‌ను చివర్లో చేయటానికి సమయం కేటాయించుకోవాలి.
* ‘సమాధానం గురించి రెండో రౌండ్‌లో పరిశీలిద్దాంలే’ అని అనుకోకుండా మొదటి రౌండ్‌లోనే సరైన సమాధానం నిర్థరించుకోవటం మంచి అలవాటు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. తప్పదు అనుకుంటే ప్రత్యేక గుర్తు పెట్టుకుని సమయం మిగిలితే అప్పుడు మరోసారి పరిశీలించుకోవాలి. ఇటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడాలి.
* ప్రశ్నలు కఠినంగా ఉన్నా, సులభంగా ఉన్నా ఇతరుల గురించి ఆలోచించకుండా ఏకాగ్రతతో సమాధానాలు గుర్తించాలి.
* రుణాత్మక (మైనస్‌) మార్కుల విధానం కాదు కాబట్టి పరిహరణ (ఎలిమినేషన్‌) పద్ధతిలో ఏ ప్రశ్ననూ వదలకుండా జవాబులు గుర్తించాలి.
స్థాయిలేని నమూనా పరీక్షలు
ఏదో ఒక నమూనా పరీక్ష రాయటం, తద్వారా వచ్చిన ఫలితాలను పరిశీలించుకుని బెంబేలెత్తటం అభ్యర్థుల్లో తరచూ జరుగుతుంటుంది. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ పరీక్షలు, నమూనా పరీక్షలూ విరివిగా అభ్యర్థులకు అందుబాటులోకి వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే పేపర్లను కఠినంగా తయారుచేయటం, గణాంకాలు గుమ్మరించటం, మారుమూల ప్రశ్నలను అధికంగా ఇవ్వటం లాంటి తప్పిదాలు జరుగుతున్నాయి. సర్వీస్‌ కమిషన్‌ పాత ప్రశ్నపత్రాల్లో ఒక కఠినమైన బిట్‌ ఉంటే... పది ప్రశ్నలు అలాంటివే తయారుచేస్తున్నారు. దీంతో అభ్యర్థులు అనవసరమైన ఒత్తిడికి గురవుతున్నారు... ఇవి రాస్తే సహజంగానే మార్కులు తక్కువ వస్తాయి కాబట్టి!
* పరిష్కారం: పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష పత్రాల తయారీలో శాస్త్రీయతను పాటిస్తారు. తేలిక, సగటు, కఠినం, అధిక కఠినం... అనేవి తగిన మోతాదులో ఉండేలా చూస్తారు. అలా చేస్తేనే సరైన అభ్యర్థుల ఎంపికకు అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ దాదాపుగా ఈ సూత్రాన్నే అనుసరించారు. ఇటీవల జరిగిన తెలంగాణ గ్రూప్‌-2లో రకరకాల కారణాల వల్ల అభ్యర్థులు కఠినత్వాన్ని బాగా వూహించుకుని వెళ్ళారు. తీరా వారి అంచనాలు తారుమారయ్యాయి. అందువల్ల ఈ ఐదు రోజుల్లో ప్రామాణికత లేని నమూనా ప్రశ్నపత్రాలను సాధన చేయకపోవటమే మేలు.

Posted on 20-02-2017