close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

ప్రధాన పరీక్షకు పక్కాగా!

మరో 75 రోజుల్లో గ్రూపు-2 ప్రధాన (మెయిన్స్‌) పరీక్ష. పేపర్‌-Iలోని జనరల్‌స్టడీస్‌ సిలబస్‌ పెద్ద అవరోధం. స్క్రీనింగ్‌ ఫలితాలు వచ్చాక సన్నద్ధత మొదలుపెడదామంటే సమయాభావం భయాన్ని పెంచుతోంది. ఏపీ ఎకానమీకి సంబంధించి విశ్వసనీయమైన సమాచార కొరత... ఇలాంటి ఆలోచనలతో ఇంకా మెయిన్స్‌కి సిద్ధపడనివారే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో పకడ్బందీ ప్రణాళికకు ఉపయోగపడే సమగ్ర సూచనలు ఇవిగో...!

కచ్చితంగా మెయిన్స్‌కి ఎంపిక అయ్యేవారు
స్క్రీనింగ్‌ పరీక్ష సిలబస్‌లో వున్న అంశాల్ని మినహాయించి అదనపు అంశాలపై మొదటి 45 రోజులూ దృష్టి పెట్టాలి. అలాంటి అంశాలు:
పేపర్‌-I జనరల్‌ స్టడీస్‌ (వర్తమాన అంశాలు తప్ప)
పేపర్‌-II:ఏపీ సాంఘిక సాంస్కృతిక చరిత్ర, పాలిటీ (కొన్ని అంశాలు) పేపర్‌-III:భారత ఆర్థిక వ్యవస్థ (కొన్ని అంశాలు)
ఏపీ ఆర్థిక వ్యవస్థ (పూర్తిగా)

పేపర్‌-1
ఒక విధంగా అభ్యర్థుల అంతిమ ఫలితాల్ని నిర్ణయించటంలో క్రియాశీలక పాత్రని పోషించే విభాగం అని చెప్పవచ్చు. కానీ సిలబస్‌ భారం ఎక్కువగా ఉండటంతో మెజారిటీ అభ్యర్థులు ఈ విభాగాన్ని సరైన ప్రణాళిక లేకుండా చదువుతూ మంచి స్కోరు సాధించలేకపోతున్నారు. ఈ 75 రోజుల్లో జనరల్‌స్టడీస్‌పై పట్టు సాధించేందుకు ఈ మెలకువలు పాటిస్తే చాలు.
మొదటి దశ: గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టు సంబంధిత అంశాల్ని అనుసంధానం చేసుకోవడం సన్నద్ధతలో మొదటి దశగా భావించవచ్చు. సిలబస్‌లో ఉన్న 12 అంశాల్లో కనీసం రెండు మూడు అంశాలైనా అభ్యర్థి గ్రాడ్యుయేషన్‌ సబ్జెక్టులతో సంబంధం వుండివుంటుంది. అలాంటివాటిని ముందుగా చదవటం ద్వారా అభ్యర్థిలో సులభ భావన ఏర్పడుతుంది.
రెండో దశ: వర్తమాన ప్రాధాన్యాల దృష్ట్యా ఏయే విభాగాలకు ఎగ్జామినర్‌ ప్రాధాన్యం ఇస్తున్నారో గమనించాలి. ప్రస్తుత పరిపాలనా, సామాజిక అవసరాల కోణంలో కింది అంశాలపై ఎగ్జామినర్‌ దృష్టి పడుతుంది.
* గవర్నెన్స్‌, ఈ గవర్నెన్స్‌
* ప్రభుత్వ విధానాలు
* విపత్తు నిర్వహణ
* పర్యావరణ పరిరక్షణ
* సంతులిత అభివృద్ధి
* ఏపీ విభజన సమస్యలు
ఈ అంశాలు అభ్యర్థులు అందరికీ సమాన మార్కులకు అవకాశమున్నవే. ఇటీవలే సిలబస్‌లో ప్రవేశపెట్టినందున ప్రశ్నలు కూడా ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయి. అందుకని కొద్దిపాటి సమాచారంతో మార్కులు తెచ్చుకోవటం సులభం.
మూడో దశ: మొదటి రెండు దశల్లోనే సబ్జెక్టులపై పట్టు సాధించాక కింది విభాగాలపై దృష్టి సారిస్తే జీఎస్‌పై పట్టు వస్తుంది. అవి:
* రీజనింగ్‌, డాటా అనాలిసిస్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌
* భారత, ఏపీ భౌగోళిక అంశాలు
* స్వాతంత్య్ర ఉద్యమం
* జనరల్‌ సైన్స్‌, శాస్త్ర సాంకేతిక అంశాలు
సూచన: పాలిటీ, ఎకానమీ లాంటి అంశాలు పేపర్‌ 2, 3లలో చదువుతారు కాబట్టి ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు.
ఈవిధంగా 3 దశల్లో వ్యూహాత్మకంగా జనరల్‌స్టడీస్‌పై పట్టు సాధించవచ్చు. ప్రతిరోజూ కనీసం ఒక గంట అయినా తప్పనిసరిగా వర్తమాన అంశాల్ని చదవాల్సి వుంటుంది. చదివేటప్పుడే ఆర్థిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక అంశాలతో అనుసంధానం చేసుకొని చదవాలి. స్క్రీనింగ్‌లో మాదిరి పరిమాణాత్మక, విశ్లేషణాత్మక ప్రశ్నలు వచ్చినా సమాధానాలు ఇవ్వగల్గుతారు.

పేపర్‌- 2
ఈ పేపర్లో 130-140 మార్కులను ఒక మాదిరి శ్రమతో సాధించవచ్చు. అందుకనే క్రమపద్ధతిలో ముందుగా ఆంధ్రప్రదేశ్‌ సామాజిక సాంస్కృతిక చరిత్రపై అవగాహన పెంచుకోవాలి. ఏపీ చరిత్ర సిలబస్‌ అంశాలు చదివేటప్పుడు ‘రాజకీయ’ అంశాలకు పెద్ద ప్రాధాన్యం ఉండకపోవచ్చు. ప్రధానంగా సామాజిక సాంస్కృతిక అంశాలపై దృష్టి నిలపాలి. వివిధ రాజవంశాల కాలంలో సామాజిక పరిస్థితులు, పరిపాలన అంశాలు, సాంస్కృతిక అంశాలు అని విడగొట్టుకొని చదవాలి. స్క్రీనింగ్‌ పరీక్షలో పాటించిన స్పష్టమైన విధానాన్ని గమనించాలి. బ్రిటిష్‌ వారికి ముందున్న ఆర్థిక వ్యవస్థ అని సిలబస్‌లో పేర్కొని వివిధ రాజవంశాల కాలంలో సంబంధిత ఆర్థిక అంశాలపై ప్రశ్నలు అడిగిన తీరుని పరిశీలించాలి. సామాజిక - సాంస్కృతిక అంశాలపై ప్రశ్నలకు సిద్ధపడాలి. అలాంటి కోణంలో చదివితేనే ‘పరీక్ష’ ఉద్దేశానికి అనుగుణంగా సిద్ధపడినట్లు అవుతుంది. ఆంధ్ర భూభాగంలో జరిగిన అనేక మత ఉద్యమాలు, సంస్కరణలు చారిత్రకంగా విశిష్ట ప్రాధాన్యం పొందాయి. ప్రత్యేకంగా బౌద్ధ మత వ్యాప్తి, ఎదుర్కొన్న అవరోధాలపై కూడా ప్రశ్నలు అడిగే అవకాశం స్పష్టం. అమరావతి రాజధాని భూభాగంలో వున్న వివిధ చారిత్రక అంశాలపై దృష్టి పెట్టాలి. బ్రిటిష్‌ కాలం, స్వాతంత్య్రోద్యమ సంఘటనలపై ప్రశ్నలు ధారాళంగా ఆశించవచ్చు. అందువల్ల స్వాతంత్య్రోద్యమ ప్రతి దశలోనూ ఆంధ్ర భూభాగంలో వెల్లివిరిసిన స్పందన ప్రశ్నలకు ఆధారాలు అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో 1900-1956 మధ్య జరిగిన సంఘటనలపై పట్టు సాధించాలి. 1956-2014 ముధ్య జరిగిన సామాజిక- సాంస్కృతిక సంఘటనలపై ప్రశ్నలకు సిద్ధపడాలి. ప్రశ్నలు సూటిగా, వాస్తవ సమాచారం ఆధారంగా వచ్చే అవకాశాలే ఎక్కువ. అందుకని ఆ దిశగా తయారైతే సరిపోతుంది. లోతైన, మారుమూల ప్రశ్నలకు తక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
పాలిటీ: స్క్రీనింగ్‌ పరీక్షలో విస్తృతంగానే చదివారు కాబట్టి పరిమిత సమయానికి ఈ విభాగాన్ని కుదించుకుంటే సరిపోతుంది. స్క్రీనింగ్‌, మెయిన్స్‌లో ఉమ్మడిగా ఉన్న అంశాలను పునశ్చరణ (రివిజన్‌)కు పరిమితం చేసి, మిగతా అంశాలకు ఎక్కువ సమయం వెచ్చించాలి.
* న్యాయ వ్యవస్థ క్రియాశీలత
* రాజ్యాంగబద్ధ సంస్థలు
* భారత రాజకీయ వ్యవస్థ
* జాతీయ సమైక్యత సవాళ్ళు
* స్థూలంగా సంక్షేమ పాలన
* లోక్‌పాల్‌, లోకాయుక్త వ్యవస్థలు
పాలిటీ చదివేటప్పుడు 395 ఆర్టికల్స్‌ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్క్రీనింగ్‌లో అడిగిన ఆర్టికల్స్‌ అన్నీ కీలకమైనవి, వర్తమాన ప్రాధాన్యం కల్గినవి. అందువల్ల ఆర్టికల్స్‌ నంబర్లని బట్టీ పట్టే ప్రయత్నం చేయవద్దు. గతంలో పాలిటీ పేరుతో ‘జనరల్‌ నాలెడ్జ్‌’ సంబంధిత అంశాలు చదివి అదే ‘పాలిటీ’ అని భావించేవారు. స్క్రీనింగ్‌ పరీక్షలో స్పష్టంగా రాజ్యాంగ విశ్లేషణ కోణంలోనే ప్రశ్నలు అడిగారు. ఈ తేడాను గమనిస్తే రాబోయే మెయిన్స్‌లో ఎటువంటి ప్రశ్నలకు ఆస్కారముంటుందో వూహించడం కష్టం కాదు.
* బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయాన్ని మార్చిన సంవత్సరం ఏది?(బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని మార్చిన నేపథ్యంలో)
* ఒక వ్యక్తిని రాష్ట్రపతిగా ఎన్నిసార్లు ఎన్నుకోవచ్చు. (రాబోతున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యం)
* రాష్ట్ర సరిహద్దుల్ని మార్చటం, కొత్త రాష్ట్ర ఏర్పాటు అధికారం ఎవరిది? (తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో)
* అంతర్‌రాష్ట్ర మండలి నిర్ణయాలను ఏవిధంగా తీసుకుంటారు? (దశాబ్ద కాలం తరువాత 2016లో అంతర్‌రాష్ట్ర మండలి తిరిగి సమావేశమయిన నేపథ్యం)
* రాష్ట్రపతి పాలనకు సంబంధించిన మైలురాయి వంటి తీర్పు?(అరుణాచల్‌ ప్రదేశ్‌లో రద్దయిన ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పరిచిన నేపథ్యంలో)
అందువల్ల మెయిన్స్‌కి కూడా రాజ్యాంగాన్ని విశ్లేషిస్తూ, వర్తమానాన్ని అనుసంధానించుకుంటూ చదివితే మెరుగైన మార్కులు తెచ్చే సత్తా పాలిటీకి ఉందని తెలుస్తుంది.

పేపర్‌-3: ఎకానమీ
స్క్రీనింగ్‌లో చదివిన వివిధ అంశాలు మొత్తం భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నేపథ్యం, 1990 తరువాత జరిగిన పరిణామాలకు సరిపోతాయి. కానీ మెయిన్స్‌లో ఇచ్చిన ‘భారత ఆర్థిక వ్యవస్థ’ సిలబస్‌ని లోతుగా చదవాల్సిన అవసరం ఉంది.
ప్రణాళికా వ్యవస్థని రద్దు చేసినా సాధించిన విజయాలు ప్రశ్నలుగా వస్తూనే ఉంటాయి. ‘గరీబీ హటావో ఏ ప్రణాళికా కాలం?’ లాంటి ప్రశ్నలు 5-8 తగిలే అవకాశం మెయిన్స్‌లో కూడా ఉంది. కేంద్రప్రభుత్వ విధానాలు, ఆర్థిక నిర్మాణ అంశాలలో వచ్చిన మార్పులు, వర్తమానంతో అనుసంధానం చేసుకొని వచ్చే ప్రశ్నల్ని ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి.
ఆర్థిక సంస్కరణల అనంతరం విత్త, ద్రవ్య వ్యవస్థలలో వచ్చిన మార్పులు అత్యధిక సంఖ్యలో ప్రశ్నలుగా మారే అవకాశం స్పష్టంగా కన్పిస్తుంది. నోట్ల రద్దు, నల్లధనం, ద్రవ్య సరఫరాపై నియంత్రణ నేపథ్యంలో ప్రశ్నలకు సిద్ధపడాల్సి ఉంటుంది. కేంద్రప్రభుత్వ బడ్జెట్‌ 2017-18 కేటాయింపులు, ఆర్థిక సర్వే 2016-17 ప్రశ్నలకు ఆధారాలుగా మారే అవకాశం ఉంది.

ఏపీ ఆర్థిక వ్యవస్థ
స్క్రీనింగ్‌ పరీక్షతో పోల్చుకున్నప్పుడు పూర్తిగా కొత్త విభాగం ఇది. పూర్తిస్థాయిలో ప్రామాణిక మెటీరియల్‌ మరో కొరత. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి వ్యూహాల్ని అర్థం చేసుకోవటంలోనే అసలైన కిటుకు ఉంది. ప్రభుత్వం పేర్కొంటున్న 7 మిషన్‌లు, 5 గ్రిడ్‌లు, 5 ప్రచార పథకాల ఆధారంగా చదవటం ప్రారంభించాలి. అలా చేసినట్లయితే వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పాఠ్యాంశాలు అన్నీ అనుసంధానం అవుతాయి. ప్రభుత్వం 2014లో విడుదల చేసిన శ్వేత పత్రాలు, అనంతరం విడుదల చేసిన వివిధ రంగాల విధానాలు ఎగ్జామినర్‌ దృష్టిని ఆకర్షిస్తాయి. ముఖ్యంగా పారిశ్రామిక, పర్యాటక, సమాచార సాంకేతిక, జీవ సాంకేతిక విధానాలు లోతుగా చదవాల్సిన అవసరం చాలా ఉంది. వివిధ ప్రణాళికల కాలంలో ఏపీలో ఏర్పాటు చేసిన మౌలిక వనరులు, అభివృద్ధి పథకాలు కూడా కీలకం. రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఫలితంగా ఆశిస్తున్న ఆర్థిక ఫలితాలు అంచనా వేసే స్థాయిలో అభ్యర్థులు సామర్థ్యాన్ని పెంచుకోవాలి.
ఇంధన, జల వనరుల నిర్వహణలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంలో సంబంధిత నిలబస్‌ అంశాలపై పట్టు సాధించాలి. విమర్శలకు అవకాశం ఇవ్వకుండా, బ్లూప్రింట్‌ ప్రకారం అన్నిరకాల ప్రశ్నల్ని మేళవించి వెలువడిన ప్రశ్నపత్రంగా ఇటీవలి కాలంలో స్క్రీనింగ్‌ పరీక్షకు గుర్తింపు దక్కింది. మారుతున్న పరీక్షా ధోరణుల్ని ప్రదర్శిస్తూ సత్తా గల్గిన అభ్యర్థులకు న్యాయంచేసిన పరీక్ష ఇది. ఈ స్క్రీనింగ్‌ పరీక్ష ధోరణిని పసిగడితే మెయిన్స్‌కి సిద్ధపడటం సులభం అవుతుంది. 49,100 మందిని మెయిన్స్‌కి ఎంపిక చేయాలి కాబట్టి విశ్లేషణల ప్రకారం 80-85 మధ్య కటాఫ్‌ వుండే అవకాశం ఉంది. 1, 2 మార్కులు తగ్గినా తగ్గవచ్చు. అందువల్ల స్క్రీనింగ్‌ ‘అధికారిక కీ’ని పరిశీలించుకొని వ్యూహాన్ని రచించి, అమలుచేసే తరుణమిదే. స్క్రీనింగ్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు 3 రకాలుగా ఉంటారు. వారికి ఒక్కొక్కరికీ తగిన ప్రణాళిక ఎలా ఉండాలో తెలుసుకుందాం!
గత రెండున్నర సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై కనీసం 15 ప్రశ్నల వరకు అవకాశం ఉంది. 2017-18 బడ్జెట్‌, 2016-17 సర్వేలు కూడా ప్రశ్నలకు వనరులుగా మారే అవకాశం కన్పిస్తుంది.

మెయిన్స్‌కి అర్హత వస్తుందో, రాదో సందిగ్ధత ఉన్నవారు
స్క్రీనింగ్‌ ఫలితాలు రావటానికి ఇంకా 20 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. తర్వాత సన్నద్ధత ప్రారంభించినా ఫలితం ఉండదు. ఇలాంటి సందిగ్ధత ఉన్నవారు ఏ పరీక్ష కోసం అయినా ఉపకరించే సిలబస్‌ ‘జనరల్‌ స్టడీస్‌’ కాబట్టి ఈ 20 రోజుల పాటు మొత్తం సమయాన్ని జనరల్‌స్టడీస్‌ కోసం కేటాయిస్తే సరిపోతుంది. ఒకవేళ మెయిన్స్‌కి అర్హత పొందితే మిగిలిన సమయంలో పేపర్‌-II, III పై దృష్టి సారించవచ్చు. ఒకవేళ అర్హత పొందకపోతే చదివిన జనరల్‌స్టడీస్‌ని ఏదో ఒక పరీక్ష కోసం ఉపయోగించుకోవచ్చు. చిన్న ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రైవేటు ఉద్యోగాలకు సెలవులు పెట్టి తయారైనవాళ్లు కూడా వేల సంఖ్యలో ఉన్నారు. అర్హత పొందుతామా? లేదా? అనే సందేహంతో తిరిగి ఉద్యోగంలో చేరటమా? కొత్త ఉద్యోగాన్ని చూసుకోవటమా? అనే మీమాంసలో ఉన్నారు. అలాంటి వాళ్లు కూడా ఈ 20 రోజులు జనరల్‌స్టడీస్‌పై దృష్టి పెట్టి, స్క్రీనింగ్‌ ఫలితాలు రాగానే తుది నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది.

స్క్రీనింగ్‌ పరీక్షలో కచ్చితంగా వైఫల్యం చెందేవారు
సరైన మార్గదర్శకత్వం, ప్రణాళిక లేకుండా స్క్రీనింగ్‌ పరీక్షలో చాలా తక్కువ మార్కులు పొందినవారు, పోటీ పరీక్షల్లో ప్రత్యామ్నాయాలు చూసుకోవటం అవసరం. APPSC నుంచి ఇప్పటికే గ్రూపు-I,పంచాయతీ కార్యదర్శులు, డిగ్రీ లెక్చరర్లు వంటి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. అందువల్ల వారి సామర్థ్యం, అర్హతలను బట్టి ప్రత్యామ్నాయం వైపు చూడవచ్చు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... గ్రూప్‌- 2 స్క్రీనింగ్‌ ఉత్తీర్ణత కాలేనివారికి గ్రూపు-Iవస్తుందా? అనే సందిగ్ధత. ఈ ఆలోచన పోటీ పరీక్షలకు వర్తించదు. అభ్యర్థిలో దాగివున్న ‘నిపుణత’ ఏ సందర్భంలో బయటపడుతుందో చెప్పలేం.
* మూడు సార్లు ప్రిలిమ్స్‌ కూడా అర్హత పొందలేనివారు చివరిసారి నేరుగా సివిల్స్‌లో టాప్‌ ర్యాంకులు సాధించారు.
* గ్రూపు-2 పరీక్షలో అర్హత పొందలేనివారు గ్రూపు-Iలో RDO, DSPలాంటి ఉద్యోగాలు కూడా సాధించారు.
* 2014లో పంచాయతీ కార్యదర్శిగా ఎంపిక కాలేని ఒక అభ్యర్థి 2015లో IPSకి ఎంపికయ్యారు.
సివిల్స్‌, గ్రూప్స్‌ లాంటి పరీక్షల్లో ‘నేనిది సాధించగలను’ అని దృఢదీక్ష ఏర్పరచుకోవడం ఎంత అవసరమో, విఫలమైతే కుంగిపోకుండా ప్రత్యామ్నాయాల్ని ప్రయత్నించటం కూడా అంతే అవసరం. లేదా విఫలమైన పరీక్షనే సాధించేందుకు కంకణం కట్టుకోవటం కూడా ప్రత్యామ్నాయమే. అయితే గ్రూపు-2 పరీక్ష మళ్లీ క్రియాశీలనం కావటానికి ఇంకా సంవత్సర కాలం పడుతుందేమో. అంతవరకు విలువైన సమయం సద్వినియోగం చేసుకోకుండా వేచివుండటం సరైన నిర్ణయం కాదు.

నాలుగు ధోరణులు: సమయ నిర్వహణ
1) కఠినంగా వుండే పేపర్‌-IIIపై ఎక్కువ దృష్టి పెట్టి అందరికంటే ఎక్కువ మార్కులు సాధించి ఉద్యోగం పొందటం.
2) స్కోరింగ్‌ పేపర్‌ అయిన పేపర్‌-IIకి ఎక్కువ సమయం వెచ్చించి ర్యాంకును మెరుగుపర్చుకోవటం.
3) జనరల్‌ స్టడీస్‌పై పట్టు బిగించి 10-15 మార్కుల ఆధిపత్యాన్ని తెచ్చుకొని ఉద్యోగాన్ని కైవసం చేసుకోవటం.
4) మూడు పేపర్లకూ సమ ప్రాధాన్యం ఇచ్చి ఉద్యోగం సాధించటం.

పరిష్కారం: నిజానికి ఇందులో ఏ ధోరణీ 100% సరైనది అని చెప్పలేం. మూడు పేపర్లకూ ఉద్యోగ సాధనలో సమ ప్రాధాన్యమే కానీ సన్నద్ధత గాఢతలో, సమయ విభజనలో సమప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక అభ్యర్థికి ఒక రోజుకు 12 గంటల సమయం అందుబాటులో ఉందని అనుకుందాం. ఇలా సమయాన్ని వెచ్చించటం అనుసరించదగిన నమూనా. ఎందుకు అంటే జనరల్‌స్టడీస్‌ సిలబస్‌ అపరిమితం. అపరిమిత సిలబస్‌లో మార్కులు సాధించటం కష్టం. కానీ సాధించాలి. JL/DLలాంటి అనేక పరీక్షల్లో కూడా జనరల్‌స్టడీస్‌లో గరిష్ఠ మార్కులు సాధించినవారే అంతిమంగా ఉద్యోగం సాధించారు. సమీప ప్రత్యర్థుల కంటే జనరల్‌ స్టడీస్‌లో సాధించే మార్కులే ఉద్యోగాన్ని ఇస్తాయనటంలో సందేహం లేదు.

పేపర్‌-II: స్కోరింగ్‌ పేపర్‌ కాబట్టి ఎక్కువ సమయం కేటాయించాలనుకోవటం కూడా హేతుబద్ధం కాదు. స్కోరింగ్‌ పేపర్‌ అయినా ఒక దశ దాటిన తరువాత మార్కులు ఇచ్చే సామర్థ్యం బలహీనపడుతుంది. పేపర్‌-IIసిలబస్‌ దృష్ట్యా అవగాహన క్లిష్టత దృష్ట్యా తక్కువ సమయం వెచ్చించినా ఫలితం మెరుగుగానే వుంటుంది. పైగా వాటి సిలబస్‌లో అత్యధిక భాగం స్క్రీనింగ్‌లో చదివిందే. అందువల్ల లభించే 3 గంటల సమయంలో కూడా 2 గంటల సమయాన్ని ఏపీ సాంఘిక-సాంస్కృతిక చరిత్రకు వెచ్చించటం సరైన నిర్ణయం. పాలిటీని ప్రతిరోజూ కనీసం ఒక గంట అయినా చదువుతూ, వర్తమాన అంశాలతో అనుసంధానం చేసుకోవాలి. స్క్రీనింగ్‌ ధోరణి కూడా ఇదే.

పేపర్‌-III: మూసధోరణి సన్నద్ధత నుంచి అభ్యర్థులు బయటపడాలి. స్క్రీనింగ్‌ ప్రశ్నల తీరుని అనుసరించాలి. గణాంకాల బట్టీ కంటే ఆర్థిక పరిణామాలు, ప్రభావాల్ని ఆలోచించాలి. ఏదో ఒక కోచింగ్‌ నోట్స్‌, ఒక పాఠ్యపుస్తకానికి పరిమితమై తెగ బట్టీ పడితే ప్రయోజనం వుండదు. ముఖ్యంగా ఏపీ ఎకానమీ... అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే విభాగాలలో ఒకటి. విభాగం-Iకి ఎక్కువ సమయం కేటాయించి విభాగం-II (AP ఎకానమీ)ని ‘మమ’ అనిపించే ధోరణి ప్రతికూల ఫలితాలకు దారితీస్తుంది. వర్తమాన ఆర్థిక అంశాల్ని గత సంవత్సర కాలం చట్రంలో అధ్యయనం చేయాలి. ఇలాంటి క్రియలు సమగ్రంగా చేపట్టాలి. అంటే కనీసం 4 గంటల సమయమైనా వెచ్చించాలి. ఎంత చదివినా, ఒక స్థాయిని దాటి మార్కులు సాధించలేని స్వభావం ఈ సబ్జెక్టుది. అందుకని ఏ టాపిక్‌కి ఎంత సమయం వెచ్చించాలనే సమయ నిర్వహణ కూడా అవసరమే.

Posted on 08-03-2017