close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

మార్కులు సమృద్ధి...గ్రామీణాభివృద్ధి

ఎ.పి.పి.ఎస్‌.సి. నిర్వహించే పంచాయతీ సెక్రటరీ పోస్టుల రాతపరీక్షకు అభ్యర్థుల సన్నద్ధత కీలకదశకు చేరుకుంది. ఇప్పటివరకూ వడపోత పరీక్షకు జనరల్‌స్టడీస్‌ విభాగాలతో కుస్తీపట్టిన అభ్యర్థులు ఇప్పుడు గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అధ్యాయాలపై దృష్టిసారిస్తున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే ఈ అధ్యాయాల లోతుపాతులు అర్థం అవుతున్నాయి!

పంచాయతీ కార్యదర్శుల ఎంపికకు నిర్వహించే రెండు దశల పరీక్షలో వడపోత పరీక్షలో 13 అధ్యాయాలున్నాయి. వీటిలో 1 నుంచి 6 అధ్యాయాలు జనరల్‌ స్టడీస్‌ సంబంధిత అంశాలు కాగా, ఏడో అధ్యాయం ఆంధ్రప్రదేశ్‌ విభజన: పర్యవసానాలు-సమస్యలు. 8 నుంచి 13 వరకు గల ఆరు అధ్యాయాలు గ్రామీణ నేపథ్యం గలవే.
వడపోత పరీక్ష పాఠ్యాంశం తొలిభాగం జనరల్‌ స్టడీస్‌ అంశాలు ఇప్పటివరకూ అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు చదివినవే. దీంతో సన్నద్ధత నల్లేరు మీద బండి నడకలా సాగింది. ఇప్పుడు ప్రారంభించిన 8 నుంచి 13 అధ్యాయాలు కాస్త భిన్నమైనవి. ఇవి అభ్యర్థికి సవాలుగా నిలిచాయి. అయితే ఈ సవాలునే అభ్యర్థులు అవకాశంగా మలచుకోవాలి. ఎందుకంటే వడపోత పరీక్షలో 150 మార్కులకు 150 ప్రశ్నలుంటాయి.
ప్రశ్నపత్ర రూపకల్పనలో సమతూకం పాటిస్తే.. సిలబస్‌లో ఉన్నవి మొత్తం 13 అధ్యాయాలు కాబట్టి, ఒక్కో విభాగం నుంచి 12-13 ప్రశ్నలు రావొచ్చు. అంటే గ్రామీణాభివృద్ధికి అనుసంధానంగా ఉన్న అధ్యాయాల నుంచి 75 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం వడపోత పరీక్షలోని మార్కుల్లో సగభాగం ప్రశ్నలు ఇక్కడి నుంచే వస్తాయి. జనరల్‌ స్టడీస్‌లోని విభాగాల్లో సీరియస్‌గా పరీక్ష రాసే అభ్యర్థులందరూ దాదాపుగా ఒకే రకమైన ప్రతిభను కనబరుస్తారనుకుంటే ఇక విజయావకాశాలను నిర్దేశించే అధ్యాయాలు ఈ ఆరేనని (8-13) మరవరాదు.
వడపోత పరీక్ష పాఠ్యప్రణాళికలో గ్రామీణాభివృద్ధికి సంబంధించినవి ఆరు అధ్యాయాలు. అలా కన్పిస్తున్నప్పటికీ స్పష్టంగా వర్గీకరిస్తే ఆరు అధ్యాయాలకు రెండే మూలాలు బయటపడతాయి.
* మొదటిది- స్థానిక స్వపరిపాలన-పంచాయతీరాజ్‌ వ్యవస్థ. ఈ ఛత్రం కింద మూడు అధ్యాయాలున్నాయి.
* రెండోది- ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ఆర్థిక పరిస్థితి.
పంచాయతీరాజ్‌ శాఖ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక విభాగం. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి కోసం ఈ శాఖ కృషి చేస్తోంది. గ్రామీణ వికాసం కోసం రాష్ట్ర ప్రభుత్వ పథకాలతోపాటు కేంద్ర ప్రభుత్వ సౌజన్య పథకాలను సమన్వయం చేసుకుంటూ ఇది కార్యాచరణ కొనసాగిస్తుంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌:
1) ఇంజినీరింగ్‌ విభాగం
2) గ్రామీణ మంచినీటి సరఫరా
3) పారిశుద్ధ్యం, మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం
4) పేదరిక నిర్మూలనా కార్యక్రమం (సెర్ప్‌)
ఈ చట్రంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలను అనుసంధానం చేసుకుంటూ చదవాలి.

ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ఆర్థికవ్యవస్థ
వడపోత పరీక్ష సిలబస్‌లోని చివరి మూడు అధ్యాయాలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికవ్యవస్థను కేంద్రబిందువుగా చేస్తూ రూపొందినవే.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ:
1) వ్యవసాయం, చిన్నతరహా పరిశ్రమలు, చేతి వృత్తులు
2) గ్రామీణ రుణ పరిస్థితి, బ్యాంకులు, సహకార వ్యవస్థ, సూక్ష్మరుణ విధానం
3) స్వయం సహాయక బృందం ద్వారా ఆర్థికాభివృద్ధి- మహిళా సాధికారత
ఈ అధ్యయనాల్లో సమాచార సేకరణ, తాజా వివరాల లభ్యత కొంత క్లిష్టతరమైనదే. అయినా కాస్త అన్వేషణా దృక్పథంతో ముందుకెళితే ఈ సవాలును అధిగమించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వ అధికారిక పత్రాలు ఇందుకు తోడ్పడుతాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ సామాజిక, ఆర్థిక సర్వే 2016-17 ఆధారంగా కొన్ని అంశాలపై అవగాహన, తాజా వివరాలు పొందవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక బృందాల బ్యాంకింగ్‌ వ్యవస్థ అనుసంధాన కార్యక్రమాలకు రాష్ట్రప్రభుత్వం పెట్టుబడులను పెద్దఎత్తున సమకూరుస్తోంది. రాష్ట్రప్రభుత్వం - స్వయం సహాయక బృందాల సమాఖ్యలు సంయుక్తంగా నెలకొల్పిన ‘స్త్రీ నిధి’, వాటి వివరాల సర్వే ఆధారంగా తాజా గణాంకాలతో సిద్ధంగా ఉండాలి. మొత్తం మీద గ్రామీణాభివృద్ధి అధ్యాయాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధికారిక తాజా గణాంకాల లభ్యత సర్వే ద్వారా ఒనగూరుతుంది.

గ్రామీణాభి (మార్కుల) వృద్ధి
పంచాయతీ సెక్రటరీ వడపోత పరీక్షలో గ్రామీణాభివృద్ధి చాప్టర్ల ద్వారా ఎక్కువ మార్కులను సాధించవచ్చు. ఇప్పటివరకు మొదటి నుంచి ఏడో చాప్టర్‌ వరకున్న జనరల్‌స్టడీస్‌ 7 అధ్యాయాలపై దృష్టి పెట్టినవారు ఇక ఈ నెలరోజులపాటు గ్రామీణాభివృద్ధి అంశాలను అధ్యయనం చేయడం మంచిది. జీఎస్‌లో వచ్చే 75 ప్రశ్నల్లో 60 శాతం సరైన జవాబులు గుర్తించగలిగేలా ఇప్పటికే సన్నద్ధమైనవారు మిగతా గ్రామీణాభివృద్ధి చాప్టర్ల ద్వారా 80 శాతం మార్కులు సాధించే వీలుంటుంది. గ్రామీణాభివృద్ధి అధ్యాయాల్లో అందరికీ సమాన అవకాశం ఉంది.
జనరల్‌స్టడీస్‌ విభాగాల అధ్యయనం చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో పూర్వజ్ఞానం అవసరం అవుతుంది. అయితే గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అధ్యాయాల విషయంలో ఆ అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ సమాచారాన్ని తెలుసుకోవాలన్న ఉత్సుకతతో చదువుతూ వెళుతుంటే క్రమేపీ అవగాహన పెరుగుతూ వస్తుంది. ఇందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న సమయమే మంచి సాధనం!
విషయాలపై కాస్త అవగాహన ఏర్పరచుకున్న తర్వాత దానిని అక్షరబద్ధం చేసేందుకు చిత్తు నమూనాలు చేసుకోవడం కూడా లాభిస్తుంది.
ఉదాహరణకు-

ఈ తరహా చిత్తు నమూనాలవల్ల కనీసం పది అంశాలైనా ఒక చోటుకు వస్తాయి. మొత్తంగా ఎంపిక చేసుకున్న కాన్సెప్టులపై ఇలాంటివి అరడజను చిత్తు నమూనాలు చేసుకోగలితే పరీక్ష సమీపిస్తున్నపుడు పునస్సమీక్షకు ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం ఆరు అధ్యాయాల్లో భారతదేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఆవిర్భావం, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ ఒకే గొడుగు కింద వస్తాయి. మూడో అధ్యాయమైన ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ వ్యవస్థ కింద ఉన్న వివిధ పథకాలు మాత్రం కొంత భిన్నమైనవి. దీనికి ప్రత్యేక పరిశీలన అవసరం.


* ఈ వర్గీకరణను బట్టి రెండు అంశాలపై అభ్యర్థులు పట్టు సాధిస్తే ఈ ఆరు అధ్యయాల నుంచి వచ్చే 75 ప్రశ్నల్లో చాలావాటికి జవాబులు గుర్తించే అవకాశం ఉంది.
1. భారతదేశంలో అధికార వికేంద్రీకరణ
2. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ
ఈ రెండింటిలో మొదటి అంశంపై మెటీరియల్‌ లభ్యత కష్టం కాదు. కానీ మితిమీరిన, అవసరానికంటే ఎక్కువ సమాచారాన్ని పొందుపరచడమే ఇక్కడ సమస్య. దీనివల్ల అభ్యర్థి కీకారణ్యంలో చిక్కి అసలు దారి మరచిపోయినట్టు అవుతుంది. మెటీరియల్‌ అనే సముద్రం నుంచి మౌలిక ప్రశ్నలను ఏరుకుని వాటిని అవగాహన చేసుకోవడమే సవాలు. స్థానిక స్వపరిపాలన- పంచాయతీరాజ్‌ వ్యవస్థ గురించి గత సిలబస్‌లోనూ ఉంది. కాబట్టి ఏపీపీఎస్‌సీ-2014 ప్రశ్నపత్రాల ద్వారా ఏ మార్గంలో వెళ్లాలో, ఏమేం చదవాలో నిర్ణయించుకోవచ్చు.
ఉదాహరణకు-
* భారతదేశంలోని ఏ రెండు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్‌ వ్యవస్థను మొదటగా ప్రవేశపెట్టారు?
1. బిహార్‌, మధ్యప్రదేశ్‌
2. ఆంధ్రప్రదేశ్‌, కేరళ
3. కర్ణాటక, తమిళనాడు
4. రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌
జవాబు: 4
* గాంధీజీ అధికార వికేంద్రీకరణకు మద్దతు తెలపడానికి కారణం ఏమిటి?
1. వికేంద్రీకరణ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం.
2. భారత్‌లో గతంలో అధికార వికేంద్రీకరణ ఉంది.
3. వికేంద్రీకరణ పారిశ్రామిక ప్రగతికి దారితీస్తుంది.
4. వికేంద్రీకరణ మతతత్వ ధోరణులను నివారిస్తుంది.
జవాబు: 1

ఈ రెండు ప్రశ్నలను అడగడానికి సహేతుక కారణం కన్పిస్తుంది. స్వాతంత్య్రానంతరం దేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ ఆవిర్భావ నేపథ్యంపై అభ్యర్థులకు గల అవగాహనను పరీక్షించడానికి ఈ తరహా ప్రశ్నలను అడుగుతారు. మొదటి ప్రశ్నకు జవాబు బిట్ల రూపంలో మెటీరియల్‌ చదివి గుర్తుపెట్టుకొని సమాధానం చేయవచ్చు. కానీ, రెండో ప్రశ్నకు జవాబు గుర్తించాలంటే భారతదేశంలో పంచాయతీరాజ్‌ అవతరణ, నేపథ్యం, ప్రజాస్వామ్యంపై గాంధీజీ దృక్పథం తెలిసి ఉండాలి.
ప్రజాస్వామ్య పాలన, అధికార వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలన చుట్టూ పరిభ్రమించే ఈ అధ్యాయాల్లోని ప్రక్రియలను అవగాహన చేసుకునేటప్పుడు, అనవసర విషయాలను త్యజించడానికి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.

ఏమిటి?
ప్రజాస్వామ్య పాలన, అధికార వికేంద్రీకరణ, స్థానిక స్వపరిపాలన

ఎందుకు?
వీటి అవసరం ఎందుకు వచ్చింది? చారిత్రక నేపథ్యం బ్రిటిష్‌ పాలన నుంచి పరిణామక్రమం

ఎలా?
అధికార వికేంద్రీకరణను చట్టబద్ధం చేయడానికి జరిగిన రాజ్యాంగ ప్రక్రియ-నేటి అమలు తీరు.

ఈ నమూనాలో శ్రద్ధగా చదివితే సైన్స్‌, మేథమేటిక్స్‌ లాంటి ఇంజినీరింగ్‌ ప్రధాన సబ్జెక్టుల్లో కోర్సులు చేసిన అభ్యర్థులకు సైతం మంచి అవగాహన ఏర్పడుతుంది. ప్రశ్నపత్రాల్లోనూ ఈ కోణం నుంచే ప్రశ్నలు ఉంటున్నాయి.

Posted on 27-03-2017