close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

ప్రధాన పరీక్షకు పక్కాగా!

మరో నలభై రోజుల్లో ఏపీపీఎస్‌సీ గ్రూపు-2 ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) జరగబోతోంది. 74 మార్కులు స్క్రీనింగ్‌ కటాఫ్‌ మార్కులుగా ఉండటంతో ఒక మాదిరి కష్టపడిన అందరూ మెయిన్స్‌కు అర్హత సాధించారు. తర్వాతి దశ అయిన మెయిన్స్‌కు సమగ్రంగా సిద్ధం కావటమెలాగో తెలుసుకుందాం!

దాదాపు 12,000 మంది అభ్యర్థులను ఓఎంఆర్‌ షీట్‌ తప్పిదం వల్ల పరిగణనలోకి తీసుకోకపోవడం, మూడు ప్రశ్నల్ని తొలగించటం... ఈ విధంగా 74కి కటాఫ్‌ తగ్గిందని చెప్పవచ్చు. కేవలం 74.49 నుంచి 79 మార్కుల మధ్య 15,083 మంది ఉండటం గమనార్హం. గరిష్ఠ మార్కులు 129యే కానీ 120కి పైన 29 మాత్రమే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో స్క్రీనింగ్‌ మార్కులు ఆధారం చేసుకొని మెయిన్స్‌ పరీక్షలో మేళవించుకోవాల్సిన అంశాల్ని పరిశీలిద్దాం.

* జనరల్‌స్టడీస్‌పై పట్టు సాధించటం ఎలా?
మిగతా రెండు పేపర్ల కంటే జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ అభ్యర్థులపై ఒత్తిడిని పెంచుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పడున్న 40 రోజుల్లో కరెంట్‌ ఎఫైర్స్‌, డాటా ఇంటర్‌ప్రెటేషన్‌, డాటా అనాలిసిస్‌, శాస్త్ర సాంకేతికత, విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు, ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతర సమస్యలపై ప్రాథమికంగా పట్టు సాధించవచ్చు.
అవకాశం లేకుంటే మిగతా అంశాల్ని గతంలో తయారైన అనుభవానికి వదిలివేయటం మినహా మరో మార్గం లేదు. ఇండియన్‌ ఎకానమీ, పాలిటీ లాంటివాటికి స్క్రీనింగ్‌ సమయంలో గడించిన అనుభవాన్ని వినియోగించుకోవటం మేలు. సమయం ఉంటే స్వాతంత్య్ర ఉద్యమం చదవటం ద్వారా 8 ప్రశ్నల వరకు సులభంగా ఎదుర్కోవచ్చు. వర్తమాన అంశాలకు ప్రతిరోజూ కనీసం గంట సమయాన్ని అయినా వెచ్చించాలి.
* ఎకానమీ పేపర్‌పై పట్టు ఎలా?
చాలామంది అభ్యర్థులకు ఈ పేపర్‌ మింగుడుపడటం లేదు. సైద్ధాంతిక అంశాలతో పాటు, గణాంక సమాచారం కూడా ఎక్కువగా ఉండటం ఈ భావన ఏర్పడటానికి కారణమని చెప్పవచ్చు. అయితే కొత్త సిలబస్‌ని సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ 40 రోజుల్లో దృష్టి నిలపాల్సిన అంశాలు స్పష్టం అవుతాయి.
ముందస్తుగా ఏపీ ఎకానమీపై 20 రోజుల్లో పట్టు బిగించవచ్చు. గతంలో మాదిరిగా జాతీయ ఆదాయం, మానవ అభివృద్ధి సూచికల వంటి అంశాలు ఈ విభాగం నుంచి తొలగించారు. అందువల్ల పూర్తిగా అనువర్తిత ఆర్థిక అంశాల్ని తేలికగా చదవవచ్చు. ఎకనామిక్‌ సర్వే, బడ్జెట్‌ లాంటివి సిలబస్‌లో నేరుగా ప్రస్తావించకపోయినా 2015-16, 2016-17 సర్వేలు చూసుకోవటం, తులనాత్మకంగా పరిశీలించుకోవటం ద్వారా మెరుగైన అవగాహన పెరుగుతుంది. 2016-17 బడ్జెట్‌ ‘కేటాయింపులు-కారణం’ అర్థం చేసుకోవాలి.
బడ్జెట్‌ కేటాయింపులు, గణాంకాల రూపంలో మాత్రమే కాకుండా ఆశిస్తున్న ఫలితాల రూపంలో కూడా అధ్యయనం చేయాలి. ఎకనమిక్‌ సర్వేని కూడా గణాంకాల్ని అధ్యయనం చేస్తూనే అనుకూలతలు, అననుకూలతలు కూడా పరిశీలించాలి.
ప్రభుత్వ పథకాలు: గత రెండున్నరేళ్ళలో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన పథకాలపై కచ్చితంగా ప్రశ్నలు రావచ్చు. అందుకోసం ప్రభుత్వ పథకాల్ని, సంక్షేమ పథకాలు, విద్యా పథకాలు, వ్యవసాయ అభివృద్ధి పథకాలు, పరిపాలన సంస్కరణలు, గ్రామీణాభివృద్ధి పథకాలుగా వర్గీకరించుకుని చదవటం ద్వారా చక్కని ఫలితాలు రాబట్టుకోవచ్చు.
ప్రభుత్వ విధానాల్ని వివిధ రంగాలవారీగా చదవటం కూడా మిగతా సిలబస్‌ని అప్‌డేట్‌ చేసుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. అందువల్ల ఈ 40 రోజుల్లో ఏపీ ఎకానమీకి ప్రాధాన్యం ఇవ్వటం తెలివైన నిర్ణయం.
ఇండియన్‌ ఎకానమీ: ఈ స్వల్ప సమయంలో ప్రణాళికాయుత వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థల గురించి ముందుగా చదవాలి.LPG నేపథ్యంలో మారిన విధానాల గురించి అధ్యయనం చేయాలి. తర్వాత ద్రవ్యం, బ్యాంకింగ్‌, విత్త వ్యవస్థలపై శ్రద్ధ చూపాలి. ఇవి చదివిన తరువాత మిగిలిన సమయాన్నిబట్టి మిగతా అంశాలపై దృష్టి నిలపాలి. ఈ నలభై రోజుల్లో ఎకనామిక్స్‌తో ముడిపడిన సైద్ధాంతిక అంశాలను గతంలో చదివుండకపోతే సాధారణ అవగాహనకు ప్రయత్నిస్తే సరిపోతుంది. అంతకన్నా లోతుగా వెళితే వివిధ పేపర్లను చదవాల్సిన నేపథ్యంలో అనవసర ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. గతంలో ఒక మాదిరి అధ్యయనం జరిగివుంటే, సమీక్షలకు పరిమితమైతే చాలు.
భారత ఆర్థికవ్యవస్థలో గత రెండున్నరేళ్లలో వచ్చిన ఆర్థిక సంస్కరణలను గట్టిగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా నరేంద్రమోదీ ప్రభుత్వం విత్త, ద్రవ్య వ్యవస్థల్లో తెచ్చిన సంస్కరణలపై సమగ్ర అవగాహన అవసరం.
2008 కంటే 2011, దీనికంటే 2012లో సాధారణ వ్యక్తులకు ఉండే ఆర్థిక పరిజ్ఞానంపై ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. 2012 గ్రూప్‌-2లో దాదాపు 65కి పైగా ప్రశ్నలు అడగడంతో కేవలం కోచింగ్‌ నోట్సులపై ఆధారపడినవారు బెంబేలెత్తారు. మొన్నటి స్క్రీనింగ్‌లో ఎకానమీ సంబంధిత ప్రశ్నలు అదే ధోరణిలో కొనసాగాయని చెప్పవచ్చు. అందువల్ల యోజన, దినపత్రికల్లో వచ్చిన సిలబస్‌ సంబంధిత అంశాలను అధ్యయనం చేయడం వల్ల మరింత మెరుగైన జవాబులు ఇచ్చే పరిస్థితి ఉంది.
ఏపీ ఎకానమీకి కూడా ‘ఆంధ్రప్రదేశ్‌’ మాసపత్రిక బాగా ఉపయోగపడుతుంది. బట్టీ పట్టకుండా వివిధ భావనలను అర్థం చేసుకోవడం ద్వారా రాణించే అవకాశం ఎకానమీలో ఉంది.
పాలిటీలో పకడ్బందీగా...
పేపర్‌-2లో ఇది మంచి స్కోరింగ్‌ విభాగం. మొన్నటి స్క్రీనింగ్‌ పరీక్షలో అడిగిన భావనాత్మక, వర్తమాన సంబంధిత ప్రశ్నల ధోరణే మెయిన్స్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. స్క్రీనింగ్‌లో అడిగిన మొత్తం ఆర్టికల్స్‌ వర్తమాన రాజ్యాంగ అంశాలే కావడం గమనార్హం. ఈ కిటుకు తెలియనివారు జీకే ధోరణిలో పాలిటీని చదివి దెబ్బతిన్నారు.
అందువల్ల గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా జరిగిన వివిధ సంఘటనలు, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, సంక్షోభాలను దృష్టిలో పెట్టుకుని దినపత్రికలను చదవడం ద్వారా ఫలితాన్ని మెరుగుపరచుకోవచ్చు.
సంక్షేమ పాలన, వికేంద్రీకృత పాలనల్లో చదవాల్సిన పరిధి తక్కువ. కానీ ప్రశ్నలు ఎక్కువ. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రెండు విభాగాలనూ కూలంకషంగా చదవాలి.
సాధన ఎలా సాగాలి?
నమూనా ప్రశ్నల, ప్రశ్నపత్రాల సాధన సబబేనా? కాదా అనే సందేహం కొందరు అభ్యర్థుల్లో ఉంటుంది. సరైన సమయం ఉన్నప్పుడు ఒకటి, రెండు పఠనాలు పూర్తయిన తర్వాత పరీక్షలు రాసి, లోప పరిష్కార పద్ధతిలో సన్నద్ధతను కొనసాగించవచ్చు. అయితే ప్రస్తుతం సమయం తక్కువగా ఉన్నందువల్ల ఇప్పటికే రెండు, మూడు పఠనాలు చేసి పట్టు సాధించినవారు మాత్రం ఈ వారంలోనే పరీక్షలు రాసి, తర్వాతి ప్రణాళికను అనుసరించవచ్చు. కొత్తగా తయారీ ప్రారంభించినవారు ప్రతిరోజూ ఒక పరీక్ష రాస్తూ సన్నద్ధతను కొనసాగించడం మంచిది. పరీక్షల కోసం ఎక్కువ సమయం వెచ్చించడం తాజా అభ్యర్థులకు సబబు కాదు.
మెయిన్స్‌లో వాస్తవాధారిత ప్రశ్నలు, అనువర్తన సంబంధిత ప్రశ్నలు, అవగాహన సంబంధిత, విశ్లేషణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కొద్దిసమయంలో తయారవ్వటం కత్తిమీద సామే!
స్క్రీనింగ్‌ పరీక్షలో వచ్చిన మార్కుల్ని అంతిమ ఫలితానికి సూచికగా భావించవచ్చా?
చాలామంది అభ్యర్థులు ఈ డైలమాలో ఉన్నారు. 80కి తక్కువ వచ్చినవారు ‘ఆశలు’ వదులుకున్నట్లే కన్పిస్తున్నారు. యుద్ధం జరగకముందే ఆయుధాన్ని వదిలేసినట్లుంది వీరి పరిస్థితి. 100కి పైన వచ్చిన 4839 మంది గ్రూపు-2 ఉద్యోగం పొందినట్లుగా వూహించుకుంటున్నారు. ఈ రెండు వర్గాల మానసిక పరిస్థితీ పోటీ పరీక్షల తత్వానికి తగింది కాదు. అందులోనూ బహుళైచ్ఛిక ప్రశ్నల పరీక్షకు అసలే కుదరదు!
ముందుగా ఈ రెండు పరీక్షల మధ్య స్వభావ భేదాన్ని పరిశీలిస్తే మెయిన్స్‌ని ఎదుర్కొనేందుకు కావాల్సిన అడుగులు పడతాయి.

చదవాల్సిన అంశాల పరిధి పెరుగుతున్నకొద్దీ అవగాహన సామర్థ్యాలు ఎక్కువ ఉన్నవారే రాణించగల్గుతారు. ఒక మాటలో చెప్పాలంటే యూనిట్‌ పరీక్షలో మంచి మార్కులు సాధించే విద్యార్థులు అర్థవార్షిక, వార్షిక పరీక్షల్లో రాణించలేకపోవటం ఇది. మెయిన్స్‌లో ఏపీ చరిత్ర, ఏపీ ఎకానమీ, జనరల్‌ స్టడీస్‌లోని అత్యధిక అంశాలు సిలబస్‌ అంశాలుగా ఉండటం... అభ్యర్థుల్లో వివిధ సామర్థ్యాలు ఉన్నవారే రాణించటానికి అవకాశం ఇస్తాయి.
స్క్రీనింగ్‌ పరీక్షలో ఇచ్చిన సిలబస్‌ స్థూల అవగాహనకు సంబంధించి ఉంది. అందువల్ల స్థూల అవగాహన కల్గిన అభ్యర్థులు రాణించగలిగారు. అయితే మెయిన్స్‌లో అనేక సిలబస్‌ అంశాల్ని పరిగణనలోనికి తీసుకుంటారు కాబట్టి వాస్తవాధారిత ప్రశ్నలు, అనువర్తన సంబంధిత ప్రశ్నలు, అవగాహన సంబంధిత, విశ్లేషణాత్మక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా కొద్ది సమయంలో తయారవ్వటం కత్తిమీద సామే అని చెప్పవచ్చు. అందువల్ల స్క్రీనింగ్‌లో తక్కువ మార్కులు వచ్చినా, ఎక్కువ మార్కులు వచ్చినా పరిగణనలోనికి తీసుకోవాల్సిన అవసరం లేదు.

Posted on 11-04-2017