close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

సైన్స్‌ అండ్‌ టెక్‌ ఇలా చదివేద్దాం!

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి సంబంధించి ఏపీపీఎస్‌సీ సంయుక్త రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ సిలబస్‌కూ, ప్రస్తుతం నిర్వహించే పేపర్‌ సిలబస్‌కీ కొంత తేడా ఉంది. ప్రస్తుత పేపర్‌లో దాదాపు 20 శాతం సిలబస్‌ ఎక్కువ. ఇది మరింత విస్తృతంగా, లోతుగానే కాదు; స్పష్టంగా కూడా ఉందని చెప్పవచ్చు. పరీక్ష దగ్గరపడిన ఈ తరుణంలో దీనికెలా సిద్ధం కావాలో చూద్దాం!

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో నాలుగో పేపర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ. దీన్ని మెయిన్స్‌, ఇంటర్వ్యూలకు ఉపయోగపడేలా చదివితే అభ్యర్థులు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. గతంలో సన్నద్ధత సాగించినవారు సిలబస్‌ అదనపు అంశాలను ప్రత్యేకంగా రాసుకుని, వాటిని మొదటగా చదవడం ప్రారంభించాలి. ఆపైన తాము ఇదివరకు చదివినవాటిని పునశ్చరణ చేయడం మంచిది.
ఈ పేపర్‌ సిలబస్‌ 3 విభాగాలుగా ఉంటుంది. ప్రతి విభాగంలో 5 చొప్పున మొత్తం 15 యూనిట్లు. మొదటి విభాగంలో భారతదేశంలో టెక్నాలజీ అభివృద్ధి, టెక్నాలజీ పాలసీలు, టెక్నాలజీ మిషన్‌లు, అంతరిక్ష రంగం, శక్తి వనరులు, విపత్తు సంబంధ అంశాలున్నాయి. రెండో యూనిట్‌లో జీవశాస్త్ర సంబంధ అంశాలు, మొక్కలు, జంతువుల ఉపయోగాలు, వ్యాధులు, బయోటెక్నాలజీ, ఆరోగ్య సంబంధ అంశాలు, వ్యాక్సిన్‌లు. ఇక మూడో యూనిట్‌ పూర్తిగా పర్యావరణానికి సంబంధించింది. దీనిలో ఆవరణశాస్త్రం, సహజ వనరులు, బయోడైవర్సిటీ, పర్యావరణ సమస్యలు, పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు, భారతదేశంలో విపత్తు నిర్వహణకు సంబంధించిన అంశాలు ఉన్నాయి.

పరీక్ష విధానం
ఈ పేపర్‌కు 150 మార్కులను కేటాయించారు. ఒక్కో విభాగానికి 50 మార్కులు. ప్రతి విభాగం నుంచి 5 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు. అంటే- అభ్యర్థి మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రంలో ప్రతి యూనిట్‌ నుంచి 2 ప్రశ్నలుంటాయి. వీటిలో అభ్యర్థికి చాయిస్‌ ఉంటుంది. రెండింటిలో ఒకదాన్ని ఎన్నుకుని జవాబు రాయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒక ప్రశ్నను తిరిగి ఉపప్రశ్నలుగా కూడా విభజించి ఇవ్వవచ్చు. ప్రశ్నలను తెలుగు, ఆంగ్లం రెండు మాధ్యమాల్లోనూ ఇస్తారు. తెలుగు మాధ్యమ అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిషుల్లో ప్రశ్నను చదివి, ఆ తర్వాత జవాబులను రాయడం మేలు.
అభ్యర్థులు నిర్ణీత సమయంలో ఇచ్చిన ప్రశ్నలన్నింటికీ జవాబు రాసేలా సిద్ధమవ్వాలి. కొన్ని ప్రశ్నలనే రాసి, మిగిలినవాటిని వదిలేయడం సరికాదు. అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానం రాస్తేనే మంచి మార్కులు సాధించి, ర్యాంకు పొందగలుగుతారు. గతంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ రాసి, ఉద్యోగం సాధించలేకపోయినవారు ‘అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయలేకపోయాం.. అందుకే ఫలితం రాలేదు’ అని బాధపడుతుంటారు. దీనికి కారణం సరైన సాధన లేకపోవడం, విషయంపట్ల అవగాహన లేమి. వీటిని అధిగమించడానికి ఒక అంశాన్ని చదివాక దాన్ని నిర్ణీత సమయంలో చూడకుండా రాసే సాధన చేయాలి.

జనరల్‌ ఎస్సే (పేపర్‌-1) తో సంబంధం
జనరల్‌ ఎస్సే పేపర్‌లో ఉన్న ఆపత్సమయ నిర్వహణ, ఆరోగ్య సంబంధ సమస్యలు, ఆవరణ సంబంధ విజ్ఞానం, వర్తమాన అంశాలు వంటివి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలోని కింది అంశాలతో ముడిపడి ఉంటాయి. అవి: 1) సెక్షన్‌-1 లోని యూనిట్‌-3లో ఉన్న అంతరిక్ష సంబంధ అంశాలు 2) సెక్షన్‌-2లోని యూనిట్‌-3లో ఉన్న వివిధ వ్యాధులు 3) సెక్షన్‌-3లోని యూనిట్‌-1లో ఉన్న ఆవరణ సంబంధ అంశాలు
వీటిని అభ్యర్థులు లోతుగా, విశ్లేషణాత్మకంగా జనరల్‌ ఎస్సే కోణంలో చదివితే మరింత ప్రయోజనం ఉంటుంది.

వర్తమానాంశాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పేపర్‌ సన్నద్ధతలో వర్తమానాంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కొన్ని ప్రశ్నలు నేరుగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వర్తమాన అంశాలపై అడిగే అవకాశం ఉంది. ఉదాహరణకు- ఇస్రో ఇటీవలకాలంలో ప్రయోగించిన ఉపగ్రహాలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలపై నేరుగా ప్రశ్నలను అడగవచ్చు.
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో వర్తమానాంశాలతో ముడిపడిన కొన్ని అంశాలకు జవాబులు రాసేటప్పుడు ఆ అంశాలను ఉదాహరిస్తే ఎక్కువ మార్కులను పొందవచ్చు. వర్తమాన అంశాలతో ముడిపడి ఉన్న కొన్ని అంశాలను కింద గమనించవచ్చు.
1) సెక్షన్‌-1లోని యూనిట్‌-3లో ఉన్న అంతరిక్షరంగ, యూనిట్‌-5 లోని ఉన్న విపత్తు సంబంధ అంశాలు
2) సెక్షన్‌-2 యూనిట్‌- 3, 5 లలో ఉన్న వ్యాధులు, వాటికి ఇటీవల కనుగొన్న నూతన ఔషధాలు, వ్యాక్సిన్‌ల వంటివి
3) సెక్షన్‌-3లోని యూనిట్‌-5లో ఉన్న పర్యావరణ సంబంధ అంశాలు
ఒక అంశాన్ని చదివాక దాన్ని నిర్ణీత సమయంలో చూడకుండా రాసే సాధన చేయాలి.
వీటి కోసం అభ్యర్థులు ప్రతిరోజూ వార్తాపత్రికలను చదివి, వర్తమానాంశాలను నోట్‌ చేసుకోవాలి. అవసరమైతే పరీక్ష ముందురోజు జరిగిన వర్తమాన అంశాలను కూడా జవాబులో ఉదాహరించవచ్చు.
మెయిన్స్‌లోని చాలా అంశాలు ప్రిలిమినరీ పరీక్షలో కూడా భాగంగా ఉంటాయి. మెయిన్స్‌లోని అంతరిక్షరంగం, శక్తివనరులు, వాతావరణ మార్పులు, విపత్తు నిర్వహణ, వ్యాధులు-వాటి నివారణ, మొక్కలు, జంతువుల ఉపయోగాలు, బయోటెక్నాలజీ, జన్యు పరివర్తన పంటలు, వ్యాక్సిన్‌లు, పర్యావరణ సంబంధ అంశాలు ప్రిలిమ్స్‌లోని సిలబస్‌లో కింది అంశాలతో సంబంధాన్ని చూపుతాయి.
1) శాస్త్ర సాంకేతిక రంగాల్లో సమకాలీన అభివృద్ధి, నిత్య జీవితంలో సామాన్యశాస్త్రం ముఖ్యంగా బయాలజీ (జీవశాస్త్రం) ఉపయోగం. 2) పర్యావరణ క్షీణత సవాళ్ళు 3) విపత్తు నిర్వహణ అంశాలు 4) వర్తమానాంశాలు (అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం) 5) జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న అంశాలు
వీటికి సంబంధించిన ప్రాథమికాంశాలు మెయిన్స్‌లో కూడా ఉపయోగపడతాయి.

ప్రిలిమ్స్‌ అంశాలు మెయిన్స్‌లోనూ...
ప్రిలిమ్స్‌ సిలబస్‌లో ఉన్న చాలా అంశాలను నేరుగా మెయిన్స్‌లో ప్రశ్నలుగా ఇవ్వవచ్చు.ఉదాహరణకు 2016లో ఏపీపీఎస్‌సీ నిర్వహించిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పేపర్‌లో విటమిన్లు, వృక్ష హార్మోన్లు, లైకెన్‌లు, సహజీవనం, స్వయంపోషిత, పరపోషిత మొక్కలు వంటి వాటిపై అడిగిన ప్రశ్నలు పూర్తిగా ప్రిలిమ్స్‌ సంబంధిత అంశాలన్న విషయాన్ని గమనించాలి.
ఒక పద్ధతి ప్రకారం చదివిన అభ్యర్థులే ప్రిలిమ్స్‌ అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికవుతారు. దానిలో రాణించి, ఇంటర్వ్యూకు కూడా ఎంపికవుతారు.
వ్యూహాత్మకంగా చదివినవారికి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో అనే భయం ఉండదు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ సన్నద్ధత ఇంటర్వ్యూకు కూడా సరిపోతుంది.

సిలబస్‌ పరిధి దాటి ప్రశ్నలు వస్తాయా?
గతంలో గ్రూప్‌-1 మెయిన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రాసిన అభ్యర్ధులు ప్రశ్నపత్రాల్లో సిలబస్‌ పరిధి దాటి ప్రశ్నలను అడిగారనే భావనను వ్యక్తపరుస్తున్నారు. ఇది సరైన భావన కాదు. గతంలో అడిగిన ప్రశ్నలు సిలబస్‌కు సంబంధించిన అనువర్తిత అంశాలు లేదా ప్రాథమికాంశాలు (బేసిక్స్‌) అని గమనించాలి. అభ్యర్థి విషయపరిజ్ఞానాన్ని పరీక్షించడానికి, అభ్యర్ధికి ఈ పేపర్‌పై ఉన్న పట్టును గుర్తించడానికి కొన్నిసార్లు ఈవిధంగా ప్రశ్నలను అడుగుతున్నారు. అంతేకానీ ప్రశ్నలు అవుట్‌ ఆఫ్‌ ది సిలబస్‌ అని భావించకూడదు.

మొదటిసారిగా రాస్తున్నవారు...
కొత్తగా గ్రూప్‌-1 మెయిన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పేపర్‌కు సిద్ధమయ్యేవారు దీన్ని చాలా తేలికగా తీసుకొంటారు. కానీ సిలబస్‌ చాలా విస్తృతంగా ఉందని గమనించాలి. ప్రశ్నలు లోతుగా, అభ్యర్ధి జ్ఞానాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి.
మొదటిసారిగా రాస్తున్నవారికి సన్నద్ధత పట్ల అంతగా అవగాహన ఉండదు. జవాబులను డిగ్రీ, పీజీల్లో రాసినట్లుగా అకడమిక్‌ పద్ధతిలో రాయవచ్చని భావిస్తుంటారు. కానీ గ్రూప్‌, అకడమిక్‌ పరీక్షలు వేరువేరని గమనించాలి. అకడమిక్‌ పరీక్షల్లో ఒక ప్రశ్నకు జవాబును కొద్దిగా ఎక్కువ లేదా తక్కువగా రాసినా సరిపోతుంది. కానీ పోటీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని పూర్తిగా రాయాలి. అనవసర అంశాలను రాయడం వల్ల విలువైన సమయం వృథా అవడమే కాకుండా సమాధాన పత్రాన్ని దిద్దే అధ్యాపకుడికీ అభ్యర్థిపై సదభిప్రాయం ఏర్పడదు. దీంతో మంచి మార్కులు రావు. ఒక్కమాటలో చెప్పాలంటే వచ్చినదంతా రాయడం కాదు, ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నకు అడిగినంతవరకూ మాత్రమే జవాబు రాయాలి.
ఇప్పటికే మెయిన్స్‌ రాసిన అనుభవమున్నవారు గతంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పేపర్‌లో చేసిన తప్పులను గమనించి, అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇది మంచి మార్కులు స్కోరింగ్‌ చేసే పేపర్‌ అని అభ్యర్ధులు గమనించాలి.
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పేపర్‌కు సన్నద్ధమవుతున్నవారు ప్రశ్న లేదా టాపిక్‌ను బట్టీపట్టి చదువుతుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక్కో అంశానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకుంటూ విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడు మాత్రమే ప్రశ్నలు ఏ విధంగా వచ్చినా రాయగలుగుతారు. బట్టీపట్టి చదివినవారు చివరకు జవాబులను సరిగా రాయలేక పేపర్‌ కఠినంగా వచ్చిందని భావిస్తుంటారు.
మెయిన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పేపర్‌లోని 3 విభాగాల్లోని వివిధ యూనిట్‌లలోని అంశాలు రిపీటెడ్‌గా ఉన్నాయని గమనించాలి. అంటే సిలబస్‌లోని ఒక యూనిట్‌లోని సిలబస్‌ అంశాలకు మరో యూనిట్‌లోని సిలబస్‌ అంశాలకు సంబంధం ఉంది. వీటికి తొలి ప్రాధాన్యం ఇస్తే సన్నద్ధత తేలికవుతుంది.

Posted on 24-07-2017