close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

వర్తమాన అంశాలను ఓ పట్టు పడదాం!

ఏ పోటీ పరీక్షలోనైనా వర్తమాన అంశాలు (కరెంట్‌ అఫైర్స్‌) ఒక భాగం. ముఖ్యంగా సివిల్‌ సర్వీసెస్‌, గ్రూప్‌-1 పరీక్షల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలో అత్యధిక ప్రశ్నలు కరెంట్‌అఫైర్స్‌తో సంబంధమున్నవే. ఇంత ప్రాముఖ్యమున్న ఈ విభాగానికి సమగ్రంగా సన్నద్ధమయ్యేందుకు ఇవిగో... నిపుణుల సూచనలు!
క్రమం తప్పకుండా వార్తాపత్రికలను చదువుతుంటే తాజా పరిణామాలపై అవగాహన వస్తుందనేది నిజమే. అయితే పత్రికలను చదివి, వేటిని గుర్తుంచుకోవాలో పోటీ పరీక్షలకు కొత్తగా సన్నద్ధత ప్రారంభించేవారికి బోధపడదు. ప్రతి దినపత్రికలోనూ కనీసం 20-25 పేజీలు ఉంటాయి. పోటీపరీక్షల దృష్ట్యా ఏయే అంశాలను చదవాల్సి ఉంటుంది? వాటిని ఎలా గుర్తుంచుకోవాలి?
వార్తాపత్రిక ఎంపిక: రాజకీయ, సామాజిక రంగాలతో పాటు విభిన్న రకాల అంశాలను వార్తాపత్రికలు అందిస్తుంటాయి. ఆర్థికాంశాలను మాత్రమే ప్రత్యేకంగా అందించేవి కూడా ఉన్నాయి. పోటీ పరీక్షలను లక్ష్యంగా పెట్టుకున్నవారు జాతీయ వార్తాపత్రికను చదవటం ప్రారంభించాలి. ఒకవేళ రాష్ట్ర సర్వీసులకు సిద్ధమవుతున్నవారైతే ప్రాంతీయ వార్తాపత్రికను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.
పేజీల వర్గీకరణ: ప్రతి వార్తాపత్రికా ఒక్కో అంశానికి ఒక్కో నిర్దిష్ట పేజీని కేటాయిస్తుంటుంది. ఉదాహరణకు- మొదటి పేజీలో అత్యంత ప్రధానాంశాలను ప్రచురిస్తారు. దీనిలో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ సమాచారం ఉంటుంది. ఈ వర్గీకరణను అర్థం చేసుకోవాలి.
పరీక్షతో అన్వయం: సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష మాత్రమే మీ లక్ష్యమైతే ప్రాంతీయ, స్థానిక వార్తలను పక్కనపెట్టవచ్చు. జాతీయ, అంతర్జాతీయ వార్తలపై మాత్రమే దృష్టి సారించాలి. రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షలకు కూడా సన్నద్ధమవుతున్నవారు మాత్రం ప్రాంతీయ అంశాలను చదవాల్సిందే. మొత్తమ్మీద సివిల్స్‌ అభ్యర్థులు ప్రాంతీయ వార్తలతో పోలిస్తే జాతీయ, అంతర్జాతీయ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
రోజువారీ ప్రక్రియ: వార్తాపత్రిక ఆసక్తిగా చదవడాన్ని దినచర్యలో భాగంగా చేర్చుకోవాలి. ఇందుకుగానూ ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించుకోవాలి. క్రమం తప్పకుండా దీన్ని పాటిస్తుండాలి. ఒకవేళ ఏరోజైనా పత్రిక చదవడం వాయిదా వేస్తే, ఆ వాయిదా వారానికీ, ఆపై నెలకూ పెరిగే ప్రమాదం ఉంటుంది. అలా జరక్కుండా జాగ్రత్తపడాలి.
పాయింట్లుగా రాసుకోవడమెలా?
పోటీ పరీక్షార్థులు పాయింట్లను రాసుకోకుండా వార్తాపత్రికను యథాలాపంగా చదివేస్తే అది ప్రయోజనకరం కాదు. చదివిన అంశాలను నోట్సుగా రాసుకోవాలి. అప్పుడే అవి గుర్తుంటాయి.
నోట్స్‌ తయారీ, వార్త విలువను పసిగట్టడం ఎలా? తరచూ ఇటీవల వార్తల్లో నిలుస్తున్న స్మార్ట్‌ (ఆకర్షణీయ) సిటీల ఉదాహరణను చూద్దాం.
స్మార్ట్‌ సిటీలు
కేంద్రంలో ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పటినుంచీ దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో పట్టణాలూ, నగరాలను స్మార్ట్‌ సిటీలుగా మార్చబోతున్నట్లు వింటూనే ఉన్నాం. స్మార్ట్‌సిటీ మిషన్‌ ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది.
కొంతకాలంగా స్మార్ట్‌ సిటీల గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు- దినపత్రికలో ‘స్మార్ట్‌ సిటీల జాబితా విడుదల’ అనే శీర్షికతో వార్త వచ్చిందనుకుందాం. దీనికి అభ్యర్థి కింది ప్రశ్నలను వేసుకుని, వాటికి కచ్చితమైన సమాధానాలు గ్రహించడం ద్వారా పరీక్షలో ఉపయోగపడే నోట్సు తయారు చేసుకోవచ్చు.
* స్మార్ట్‌ సిటీ అంటే ఏమిటి? భారత్‌లోని స్మార్ట్‌ సిటీ మిషన్‌ ప్రకారం స్మార్ట్‌ సిటీలంటే ఏమిటి?
* మనదేశంలోని స్మార్ట్‌ సిటీల్లో ఏ సౌకర్యాలుంటాయి?
* ఈ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లనున్నారు?
* ఎదురయ్యే సవాళ్లేంటి?
* మొదటి 20 స్మార్ట్‌ సిటీలేవి?
వార్తాపత్రికలను అనుసరిస్తూ, సంబంధిత కథనాలను అంతర్జాలం (నెట్‌) నుంచి చదివితే కింది సమాచారం పొందవచ్చు.
స్మార్ట్‌ సిటీ అంటే?
* స్మార్ట్‌ సిటీ అంటే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్వచనమేమీ లేదు. దీని అర్థం ఒక్కొకరికి ఒక్కోలా ఉంది. స్మార్ట్‌ సిటీ భావన నగరాలు, దేశాలను బట్టి మారుతుంది. ఇది అభివృద్ధి స్థాయి, మార్పు, సంస్కరణలకు సంసిద్ధత, వనరులు, అక్కడ ప్రజల ఆకాంక్షలపై ఆధారపడి ఉంటుంది.
* స్మార్ట్‌ సిటీ అంటే భారత్‌లో ఒక అర్థం ఉంటే, ఐరోపాలో మరోలా ఉండవచ్చు. భారత్‌లోనూ స్మార్ట్‌ సిటీ అంటే ఇదీ అని చెప్పగల నిర్వచనమేమీ లేదు.
భారత్‌లోని స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ ఆధారంగా..
* మౌలిక సదుపాయాల కల్పన, నగరవాసులకు నాణ్యమైన జీవితాన్ని కల్పించడం, శుభ్రమైన వాతావరణం, త్వరితగతి పరిష్కారాలను చూపించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
* స్థిర, సంఘటిత అభివృద్ధిపై దృష్టిసారిస్తూ, నగర జనాభా ఎక్కువ ఉన్న ప్రదేశాలను ఎంచుకుని వాటిని ఉత్తమంగా ఇతర నగరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దడంపై ఇది దృష్టిసారిస్తోంది.
భారత్‌లోని స్మార్ట్‌ సిటీల్లో ఏ సౌకర్యాలుండవచ్చు?
ఈ మౌలిక సదుపాయాలు..
* తగిన నీటి సరఫరా
* పారిశుద్ధ్యం
* ఆరోగ్యం, విద్య
* విద్యుత్‌ సరఫరా
* గృహకల్పన... ముఖ్యంగా పేదవారికి
* రవాణా, ఐటీ సదుపాయం, డిజిటైజేషన్‌
* సుపరిపాలన ముఖ్యంగా ఈ- గవర్నెన్స్‌, నగరవాసుల భాగస్వామ్యం
* ప్రజా రక్షణ, భద్రత- ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల విషయంలో.
స్మార్ట్‌ సిటీల పథకం అమలు- వ్యూహం
1. పట్టణాభివృద్ధి (ఆధునికీకరణ): అప్పటికే నిర్మితమై ఉన్న ఒక ప్రాంతాన్ని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికను, అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు, హంగులు జతచేసి మరింత ప్రయోజనకరంగా, మనోహరంగా తీర్చిదిద్దడం.
2. పట్టణ పునరుద్ధరీకరణ (పునరాభివృద్ధి): నిర్మితమై ఉన్న ఒక ప్రాంతాన్ని ఇంకా ఎక్కువమందికి ఉపయోగకరంగా, మరిన్ని ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా మౌలిక సదుపాయాలను పెంచి, సరికొత్త నగరంగా పునఃస్థాపన చేయడం.
3. పట్టణ విస్తరణ (హరితాభివృద్ధి): ఖాళీస్థలంలో (250 ఎకరాలకుపైగా) నవీన ప్రణాళిక, వ్యూహాత్మక ఆర్థిక పెట్టుబడులు, ఆచరణాత్మక సాధనాలు (భూ సమీకరణ, భూ పునర్నిర్మాణం వంటివి) వంటి సరికొత్త ఆలోచనలను ప్రవేశపెట్టడం. తద్వారా అందరికీ అందుబాటు ధరల్లోనే, ముఖ్యంగా పేదలకు నివాసయోగ్యత కలుగుతుంది.
4. పట్టణ సర్వాభివృద్ధి: ఒక పట్టణాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి అమలు చేయదగ్గ, ఆచరణాత్మక ప్రతిపాదనలను పరికిస్తుంది. సేవల నాణ్యతను పెంచడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సమాచారం, నిర్దిష్టాంశాలు ఈ ప్రతిపాదనల్లో ఉంటాయి.
సవాళ్లు
* స్మార్ట్‌ సిటీల అభివృద్ధిలో రాష్ట్రాలు, పట్టణాలకు సంబంధించిన స్థానిక పరిపాలన సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ దశలో మంచి నాయకత్వం, ముందుచూపు చాలా ప్రధానం.
* పట్టణ అభివృద్ధి, పునరుద్ధరణ, హరితాభివృద్ధి వంటి విధానాలను అర్థం చేసుకోవడానికి విధాన నిర్ణేతలు, అధికారులు, ఇతర భాగస్వాముల్లో సామర్థ్యం, వారి నుంచి తగిన సహకారం అవసరం.
* ప్రారంభానికి ముందే, ప్రణాళిక దశలోనే సకాలంలో ప్రధాన పెట్టుబడులు, అవకాశాలు సిద్ధం చేసుకోవాలి.
* పాలనా వ్యవహారాల్లో, సంస్కరణల్లో క్రియాత్మకంగా పనిచేసే చురుకైన వ్యక్తులు అవసరం.
* ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యం చాలా ముఖ్యం.
మొదటి 20 ఆకర్షణీయ నగరాలు
భువనేశ్వర్‌, పుణె, జయపుర, కొచ్చి, అహ్మదాబాద్‌, జబల్‌పుర్‌, విశాఖపట్టణం, షోలాపుర్‌, దేవన్‌గిరి, ఎన్‌డీఎంసీ, కోయంబత్తూరు, కాకినాడ, బెలగావి, ఉదయ్‌పూర్‌, గువాహటి, చెన్నై, లుథియానా, భోపాల్‌.
పైన వివరించిన సమాచారం కొన్ని పోటీపరీక్షల ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఉపయోగపడుతుంది. విశ్లేషణాత్మక ప్రశ్నలకు (గ్రూప్‌-1, 2), అన్ని పరీక్షల్లో వ్యాసరూప సంక్షిప్త ప్రశ్నలకు ఉపయోగకరం. స్మార్ట్‌ సిటీలపై నేరుగా వ్యాసం రాయటానికి పనికివస్తుంది. లేదా పట్టణీకరణ వంటి అంశాలపై వ్యాసరూప ప్రశ్నలకు ఉపయోగపడుతుంది.
చదివే అలవాటు లేదు...ఏం చేయాలి?
టాపర్లందరూ తాము క్రమం తప్పకుండా పేపర్లను చదువుతామని చెబుతుంటారు. నేను ఒక గ్రాడ్యుయేట్‌ను. ఇప్పటివరకూ శీర్షికలను చదివి వదిలేయడం తప్ప, శ్రద్ధగా ఎప్పుడూ వార్తాపత్రికను చదవలేదు. సివిల్‌ సర్వీసెస్‌ను నేను ఎంచుకోవడం సబబేనా?
జ: పాఠశాల, కళాశాల విద్య చదివేటపుడు ఎక్కువమంది వార్తాపత్రికలను అంత శ్రద్ధగా చదవరు. ఎప్పుడు వార్తాపత్రికలు అవసరమవుతాయో అప్పుడే వాటిపై ఆసక్తి చూపడం ప్రారంభిస్తారు. నిజానికి పాఠశాల, కళాశాల స్థాయిలో ఉన్నపుడు చాలావరకూ ఏ సినిమా ఏ థియేటర్‌లో ఆడుతోందో తెలుసుకోవడానికే పత్రికలను తిరగేస్తుంటారు. నేడు చాలామంది విద్యార్థులు వారికి కావాల్సిన సమాచారం అంతర్జాలంలో అందుబాటులో ఉంది కాబట్టి, వార్తాపత్రికలపై తక్కువ ఆధారపడుతున్నారు.
ఇప్పటివరకూ వార్తాపత్రికలను శ్రద్ధగా పట్టించుకోకపోయినా ఇప్పటి నుంచైనా చదవడం ప్రారంభించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవాలని అనుకున్నప్పటినుంచే చాలామంది ర్యాంకర్లు వార్తాపత్రికలను చదవడం ప్రారంభించారని గుర్తుంచుకోవాలి.
టీవీ అయినా, వార్తాపత్రిక అయినా వార్త వార్తే. అయినా అభ్యర్థులు వార్తాపత్రికలనే చదవాలని నిపుణులు ఎందుకని సూచిస్తారు?
జ: టీవీ వార్తలు దృశ్యాత్మకంగా ఉంటాయి. దాంతో అవి అభ్యర్థుల సమయాన్ని హరిస్తాయి. సంచలనాత్మక సమాచారాన్ని వెంటవెంటనే అందిస్తూ ప్రేక్షకుల ధ్యాసను కట్టిపడేసేలా చేయటం టీవీల ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా టీవీ వార్తలు ఎప్పటికప్పుడు తాజా అంశాల జోడింపుతో రూపు మారుతుంటాయి. దినపత్రికలు వార్తలను రోజుకోసారి మాత్రమే ప్రచురిస్తాయి. దాంతో నేపథ్యం, విశ్లేషణలతో సంఘటనల సమగ్ర స్వరూపం అందించే వీలు వాటికి ఉంటుంది. అవసరంలేని సమాచారాన్ని తొలగించి, ప్రాముఖ్యమున్నంతవరకే అందించటం మరో ముఖ్యాంశం. సమాచారం వివిధ స్థాయుల్లో రిపోర్టర్‌ నుంచి ఎడిటర్‌ వరకూ వెళ్ళి మెరుగవుతుంది. పత్రిక అచ్చయ్యేటప్పటికి అది పూర్తిగా పరిష్కృతమై, పరీక్షకు అవసరమయ్యేలా సమాచారం పొందుపరిచి ఉంటుంది.
వార్తాపత్రిక కథనాల నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా?
జ: జర్నలిజం చదివే విద్యార్థులందరికీ 6 మార్గదర్శక సూత్రాలను పాటించమని బోధిస్తారు. 5 W and 1 H. అవి- ఏమిటి, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు, ఎలా. వార్తా నివేదికల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలను మొదటి పేరాలోనే అందించడాన్ని గమనించవచ్చు. ఏ అంశం తీసుకున్నప్పటికీ ఈ ప్రశ్నలను వేసుకుని సమాధానం రాస్తే, పరీక్షకు అవసరమైన సమాచారమంతా ఇచ్చినట్లవుతుంది.
చాలామంది ర్యాంకర్లు తాము వార్తాపత్రికల సంపాదకీయాలను చదివామని చెబుతుంటారు. వాటిని చదవడానికి ప్రయత్నించాను కానీ అర్థం చేసుకోలేకపోతున్నాను. వాటిని బోధపరుచుకోవడం ఎలా?
జ: సంపాదకుడు లేదా సంబంధిత అంశంలో అనుభవం, పరిజ్ఞానమున్నవారు వివిధ వర్తమాన అంశాలపై తమ అభిప్రాయాలను సంపాదకీయ పేజీల్లో ప్రకటిస్తుంటారు. పాఠకులకు ఆ అంశాలమీద అప్పటికే కొంత ప్రాథమిక అవగాహన ఉన్నపుడే ఈ కథనాలు బోధపడతాయి. ఆయా సంఘటనల నేపథ్యం తెలిసినపుడే సంపాదకీయంలో రాసినదాన్ని సంపూర్ణంగా గ్రహించగలుగుతారు. ఉదాహరణకు- డోనాల్డ్‌ ట్రంప్‌, హిల్లరీ క్లింటన్‌లపై వచ్చిన సంపాదకీయాన్ని అర్థం చేసుకోవాలంటే యూఎస్‌ ఎన్నిక విధానం, అక్కడి పరిస్థితులపై కొంత అవగాహన తప్పనిసరి.
నేను సివిల్స్‌ శిక్షణ సంస్థలో చేరాను. వారు కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన అంశాలను బోధిస్తున్నారు. అది సరిపోతుందా?
జ: ఆ శిక్షణ సరిపోదు. అక్కడ బోధించేవారు వివిధ వనరుల నుంచి సేకరించి సంగ్రహించిన సమాచారాన్ని మాత్రమే ఇస్తారు. ఏదేమైనా పరీక్షల స్వభావం మారింది. ప్రశ్నల తీరు మారింది. పైపై సమాచారం మాత్రమే తెలుసుకుంటే సమాధానం రాయలేరు. సమాచారాన్ని మీకు మీరే సంగ్రహించాలి/ వడపోసుకోవాలి. బోధించేవారు సూచనలు, సహకారాన్ని మాత్రమే అందించగలరు. కృషి చేయాల్సింది అభ్యర్థే!
కరెంట్‌ అఫైర్స్‌ గతిశీలమైనవి.. వాటిని ఎప్పటికపుడు ఆధునికీకరించుకోవడం ఎలా?
జ: నిజమే. వర్తమాన వ్యవహారాలు తాజా అంశాల చేరికతో మారుతుంటాయి. అందుకే అభ్యర్థులు ఒక ఫైలును ఏర్పాటుచేసుకుని దానిలో అవసరమైన పేపర్లను జోడించుకుంటూ వెళ్లాలి. ప్రతి విషయానికీ సంబంధించిన సమాచారాన్ని ఒక కొత్త పేజీలో రాస్తూ వెళ్లండి. ఒక అంశానికి సంబంధించి ఎప్పుడు తాజా పరిణామం చోటు చేసుకున్నా దాన్ని తేదీతో సహా మరో కొత్త పేజీలో రాసుకుని, ముందు రాసుకున్న దానితరువాత ఉంచాలి. ఇలా చేసుకుంటూ పోతే సమాచారాన్నంతా ఒకచోటు ప్రోది చేసుకున్నవారవుతారు. సమయం దొరికినపుడు ఈ సమాచారాన్ని ఉపయోగించి ఇంకో కొత్త పుస్తకంలో వ్యాసంలా రాసుకోవాలి. ఈ విధంగా చేస్తుంటే అధీకృత సమాచారంతో తాజా పరిణామాలపై పట్టు పెంచుకునే అవకాశం పెరుగుతుంది.

Posted on 05-12-2016