close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

ఉద్యోగాల భర్తీకేమైంది?

* నోటిఫికేషన్లు రావేం..
* ఒక్క శాఖా స్పందించదేం..
* నిరుద్యోగుల వయసైపోతున్నా పట్టదేం..
* వయోపరిమితి సడలింపు గడువూ ముగిసిపోయే..

ఈనాడు అమరావతి: ఏడెనిమిది నెలల కిందటి మాట.. ఉద్యోగాల భర్తీ వార్షిక కాలపట్టికను ఏపీపీఎస్సీ ఘనంగా ప్రకటించింది. ఇంకేం నిరుద్యోగులంతా సంబరపడిపోయారు.. క్రమం తప్పకుండా ఉద్యోగాలొస్తాయని, సన్నద్ధమైతే ఏదో ఒక ఉద్యోగం సంపాదించవచ్చని ఆశపడ్డారు.. కాలం గిర్రున తిరిగింది.. కానీ ఉద్యోగాల ఊసే లేదు.. ఒక్క నోటిఫికేషనూ రాలేదు. నిరుద్యోగులంతే ఉన్నారు.. అన్ని శాఖల్లో ఖాళీలూ అంతే ఉన్నాయి. మారిందల్లా కాలమే.. ఫలితంగా కొంతమంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయారు.. మిగిలినవారంతా ఎదురుచూపులతో నిట్టూరుస్తున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి...

ఏపీపీఎస్సీ ఏప్రిల్‌లో తాత్కాలికంగా విడుదల చేసిన వార్షిక కాలపట్టిక ప్రకారం 42 ఉద్యోగ ప్రకటనలను దశలవారీగా విడుదల చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను వచ్చే డిసెంబరు/జనవరి నాటికి పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది. పరీక్షల తేదీలనూ వెల్లడించింది. దీని ప్రకారం సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ వాహన ఇన్‌స్పెక్టర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, లెజిస్లేచర్ అధికారి (సచివాలయం), పట్టణ ప్రణాళిక, భవనాలు, సహాయ నిర్మాణ కౌశల ఆర్కిటెక్చర్) డ్రాఫ్ట్‌మెన్, సహాయ లైబ్రేరియన్ గ్రేడ్-2 ఉద్యోగాల ప్రకటనలు ఇప్పటికే రావాల్సి ఉంది. కానీ ఆ ఉద్యోగ వివరాలు ఏపీపీఎస్సీకి ఇప్పటివరకూ అందలేదు. రకరకాల కారణాలతో భర్తీ కాకుండా మరో 1600 పోస్టుల సమాచారం ఏపీపీఎస్సీ వద్ద ఉంది. దీనినే నమ్ముకుని గతంలో ఉద్యోగాలను దక్కించుకునే ప్రయత్నంలో కాస్త వెనుకబడినవారు, కొత్తగా నోటిఫికేషన్లు వస్తే విజయాన్ని సాధించవచ్చన్న ధీమాతో సన్నద్ధం అవుతున్నవారు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. నిరుద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపే ఉద్యోగాల భర్తీ గురించి ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నా.. ముగుస్తున్నా...
మంత్రివర్గ సమావేశం జరిగినప్పుడల్లా ఉద్యోగ ఖాళీల భర్తీకి భరోసా లభిస్తుందని నిరుద్యోగులు ఆశగా ఎదురుచూడటం సాధారణమైపోయింది. అవి జరుగుతున్నా ఖాళీల భర్తీకి మోక్షం లభించడం లేదు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు ఇటీవల సచివాలయంలో అధికారులతో సమావేశమైనప్పుడు తదుపరి మంత్రివర్గ సమావేశం దృష్టికి ఖాళీల భర్తీ విషయాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని చెప్పారని తెలిసింది. కానీ మంగళవారంనాటి సమావేశంలో దీని గురించి ప్రస్తావన కనిపించలేదు. ఖాళీల భర్తీకి గత జూన్‌లో మాదిరిగా ఆర్థికశాఖ జీవోను జారీ చేయాలి. దానిని అనుసరించి ఆయా శాఖల ద్వారా సామాజికవర్గాల వివరాలు ఏపీపీఎస్సీకి అందాలి. వీటికి అనుగుణంగా ఉద్యోగ ప్రకటనల జారీ జరగాలి. ఇదేమీ ఇప్పటివరకూ జరగలేదు.

ముగిసిన వయోపరిమితి గడువు
ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఇంతకుముందు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాలపరిమితి గత నెల 30వ తేదీతో ముగిసింది. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్దేశించిన వయస్సు 34 (జనరల్ కేటగిరీ). ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనలు సకాలంలో వెలువడనందువల్ల వయోపరిమితిని ప్రభుత్వాలు పెంచుకుంటూ వస్తున్నాయి. అనివార్యమైన ఈ వయోపరిమితి పెంపుతో ఎంపికైనవారు ఉద్యోగాల్లో పనిచేసే కాలం తక్కువైపోతోంది. దీనివల్ల ఫలితాలు ఉండటం లేదనేది ఉన్నతాధికారవర్గాల వాదన. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇతర ప్రభుత్వ రంగ నియామక సంస్థలు ఏటా క్రమం తప్పకుండా ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఈ విధానాన్ని రాష్ట్రంలో అనుసరించాలన్న ఉద్దేశంతో ఏపీపీఎస్సీ వార్షిక ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రకటనను గత ఏప్రిల్‌లోనే జారీచేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింది. అయినా ఫలితం లేకుండాపోయింది.

Posted on 10-10-2017