close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

మౌఖికంలో మెరిస్తే.. పోస్టు మీదే!

డిగ్రీ అధ్యాపకుల అభ్యర్థులకు ఏపీపీఎస్‌సీ మౌఖిక పరీక్షలు నిర్వహించబోతోంది. అవి ఏ తీరులో జరుగుతాయి? ఇంటర్వ్యూ బోర్డును మెప్పించగలిగేలా జవాబులు చెప్పాలంటేఎలా సన్నద్ధం కావాలి?

డిగ్రీ లెక్చరర్ల ఖాళీలు మొత్తం 504. ఏపీపీఎస్‌సీ 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. రోజుకు 15 మంది చొప్పున 27.11.2017 నుంచి వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. సగటున గంటకు నలుగురిని ఇంటర్వ్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే ఒక్కో అభ్యర్థికి 12-15 నిమిషాల సమయాన్ని కేటాయించే అవకాశముంది. ఈ కొద్ది సమయంలో అభ్యర్థి తాను డిగ్రీ లెక్చరర్‌ ఉద్యోగానికి సరిపోతానని రుజువు చేసుకోవాల్సి రావడం కత్తిమీద సాము వంటిదే! గ్రూప్‌-1, 2, సివిల్స్‌, బ్యాంకు ఉద్యోగాలు వంటి వాటితో పోలిస్తే అధ్యాపకుల ఇంటర్వ్యూ భిన్నంగా ఉంటుంది. లెక్చరర్‌కు ఉండాల్సిన ప్రత్యేక లక్షణాలేంటని ఆలోచిస్తే ఎలా తయారవ్వాలో అర్థమవుతుంది. ఇక్కడ ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో ఉంచుకునే అవకాశముంది.

బోధనా నైపుణ్యం
ఇంటర్వ్యూలో సబ్జెక్టు సంబంధిత అంశాలకు 60% వెయిటేజీ ఇస్తారని భావించినా బోధనా నైపుణ్యం ఆధారంగా మిగతా 40% మార్కులను నిర్ణయించవచ్చు. సబ్జెక్టుపై ఎంత పట్టున్నా, దాన్ని సరిగా విద్యార్థులకు చేర్చలేనపుడు ప్రయోజనం ఉండదు. కాబట్టి అభ్యర్థి బోధనా నిపుణతను అంచనా వేయడానికి బోర్డు వివిధ ప్రమాణాలను వినియోగించే/ పరిశీలించే అవకాశం ఉంటుంది. బోర్డు మీద పాఠం చెప్పమని అభ్యర్థిని కోరవచ్చు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి 4, 5 పాఠాలను ప్రణాళికాయుతంగా సిద్ధంగా ఉంచుకోవాలి. అనుభవజ్ఞులైనవారి ముందు బోధించి తప్పు, ఒప్పులను సమీక్షించుకోవచ్చు. పాఠం చెప్పాల్సివస్తే కనీసం 7-10 నిమిషాల బోధనకు సిద్ధపడాలి. బ్లాక్‌బోర్డును తన గదిలో ఏర్పరిచే అవకాశం ఉంది. ఒకవిధంగా అభ్యర్థి అంతిమ విజయం ఈ దశలో చేసే ప్రదర్శనపైనే ఆధారపడి ఉంటుంది.
* డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లేవారు ఎంపిక చేసుకునే పాఠాల్లో అవగాహన, నైపుణ్యం, అన్వయాలకు ఎక్కువ వకాశం ఉండేలా బోధన పథకాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆబ్జెక్టివ్‌ తరహా బోధన కంటే సబ్జెక్టివ్‌ తరహా బోధనకు అవకాశం ఉండేలా పాఠాలను ఎంచుకుంటే బోర్డును మెప్పించడం సులువు.
* బోధన ఎక్కువ ఇంటరాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. యాంత్రికంగా బోధించే కంటే విద్యార్థులను భాగస్వాములను చేసే మెలకువలను ఉపయోగిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చు.

విద్యా దృక్పథాలు- విధానాలు
అభ్యర్థులు అధ్యయనం చేయాల్సిన మరో కీలకాంశం- భారతీయ విద్యా తాత్వికత. అదేవిధంగా ఆధునిక భారతదేశంలో విద్యా ధోరణులను కూడా ప్రశ్నల రూపంలో ఎదుర్కోవాల్సి రావచ్చు. జాతీయ విద్యా విధానం, ప్రస్తుత విశ్వవిద్యాలయాల స్థితిగతులు, ఉన్నత విద్య రుగ్మతలు- పరిష్కార మార్గాలు మొదలైన అంశాలపై కూడా పట్టు ఉంటే మంచిది. కేంద్రప్రభుత్వం ప్రారంభించిన ఇంక్యుబేషన్‌ సెంటర్లు, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా మొదలైనవాటి నేపథ్యాన్నీ, విద్యా వ్యవస్థ రుగ్మతలనూ అనుసంధానం చేసి, సమాధానాలను ఇవ్వగలిగితే అభ్యర్థి చింతనపై బోర్డుకు గురి ఏర్పడుతుంది. మహిళా విద్య- సమస్యలు, ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ, ర్యాగింగ్‌, రిజర్వేషన్లు, ప్రైవేటు, విదేశీ విశ్వవిద్యాలయాలు, కార్పొరేట్‌ విద్య మొదలైన అంశాలపైనా పటిష్ఠమైన అవగాహన అవసరం. బయోడేటా ఆధారిత ప్రశ్నలతోపాటు ఈ తరహా అంశాలకూ సిద్ధమైతే విజయం సాధించడం సులువవుతుంది.

Posted on 23-11-2017