close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

గ్రూప్స్‌ ఇంటర్వ్యూలకు.. పంచసూత్ర

తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల మౌఖిక పరీక్షలు త్వరలోనే జరగ బోతున్నాయి. ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 (2011) ఉద్యోగాల కోసం 290 మందీ, టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-2 కొలువుల నియామకం కోసం 1 : 2 నిష్పత్తిలో అభ్యర్థులూ ఈ ఇంటర్వ్యూలను ఎదుర్కోబోతున్నారు. వీటికి ముందస్తుగా ఎలా సిద్ధం కావాలో ఇదిగో.. మార్గదర్శనం!

గ్రూప్‌-1, 2 ఉద్యోగాలు ప్రధానంగా క్షేత్రస్థాయి పరిపాలనలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో అభ్యర్థుల్లో ఏయే లక్షణాలపై బోర్డు దృష్టిపెట్టే అవకాశముందో గమనిస్తే ఇంటర్వ్యూలో మంచి మార్కులను సాధించవచ్చు.
1 స్థూల, సూక్ష్మ అవగాహనలు
ఏ విషయంపైన అయినా అభ్యర్థికి స్థూల, సూక్ష్మ అవగాహనలు ఎలా ఉన్నాయని పరిశీలిస్తారు. అభ్యర్థి గ్రహణ శక్తినీ, వ్యక్తీకరణ శక్తినీ అలా గమనిస్తారు.
ఉదా:
* మీ గురించి ఏమనుకుంటున్నారు? రెండు నిమిషాల్లో చెప్పండి.
* ముఖ్యమంత్రి గురించి ఒక్కమాటలో చెప్పండి.
* ‘పెద్దనోట్ల రద్దు’ ఫలితాలను వేగంగా చెప్పండి.
2 దృఢ కాంక్ష, సంసిద్ధత స్థాయి
వ్యక్తి ఒక విధిని విజయవంతంగా నిర్వహించాలంటే దానిపట్ల అంకితభావం, దాన్ని నిర్వహించడానికి సంసిద్ధత ఎలా ఉంది అని పరిశీలించడం ద్వారా ఆ వ్యక్తి ఉద్యోగానికి సరిపోతాడో లేడో నిర్ణయిస్తారు. ఫలానా కోరిక ఉంది, సంసిద్ధత ఉంది అని రుజువు చేసేందుకు అభ్యర్థిలో ఈ కింది అంశాలు ఉన్నాయో లేదో పరిశీలిస్తారు.
*రూప అలంకరణ
*బాడీ లాంగ్వేజ్‌
*ఉద్యోగాల గురించి పూర్తిస్థాయిలో తెలుసుకోవడం
*ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే వ్యూహం
*ఉద్యోగం పొందాలనే దృఢకాంక్షను వ్యక్తం చేయడం
*ఉద్యోగం ఒక ‘అవసరం’, ‘అవకాశం’ అనే భావాలను బోర్డు సభ్యులకు కలిగించడం.
3 పరిపాలనా పరిజ్ఞానం
పరిపాలనా ఉద్యోగాల్లోకి ప్రవేశించేవారికి రాష్ట్రాల్లో, కేంద్రంలో జరుగుతున్న పాలనా విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి పట్టు ఉండాలి. ‘ఉద్యోగాలు పొందాక నేర్చుకుందాం’ అంటే.. సమర్థనీయం కాదు. వివిధ విధానాలు, ప్రభుత్వ పథకాల గురించి మంచీ చెడూ చెప్పగలగాలి. అయితే వ్యక్తి భావాలు, ఇష్టాయిష్టాల కంటే స్థూలంగా గుణదోషాలు చెప్పగలగాలి.
ఆంధ్రప్రదేశ్‌:
* ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం ఏమిటి?
* రాజధాని నిర్మాణానికి ఎదురవుతున్న సవాళ్లు..
* నదుల అనుసంధానంలో ప్రతికూలతలూ, అనుకూలతలూ
* ఏపీ పారిశ్రామిక, సేవారంగాల రాణింపునకు అనుసరిస్తున్న వ్యూహాలు సమర్థనీయమేనా?
తెలంగాణ:
* తెలంగాణ ఏర్పడ్డాక సామాజిక మార్పులను ఏం గమనించావు?
* మిషన్‌ కాకతీయ సఫలం అవుతుందా?
* ఆర్థిక మిగులు రాష్ట్రం అయినా, సమస్యలు ఎందుకు తీరడం లేదు?
* నిరుద్యోగ సమస్య నుంచి తెలంగాణ ఏవిధంగా బయటపడుతుంది?
4 సానుకూల లక్షణాలు
నిగూఢత లేకపోవడం, తప్పులను సరిదిద్దుకోవడం, మొండితనం లేకపోవడం, సాంఘీకరణం, సంతోషాన్ని పంచడం, సానుభూతి, సహానుభూతి ప్రదర్శించడం మొదలైనవాటిని సానుకూల లక్షణాలుగా గుర్తిస్తారు. ఈ లక్షణాలు అభ్యర్థి ఎలా కలిగివున్నారో నిర్ణయించడం అనుభవజ్ఞులైన బోర్డు మెంబర్లకు పెద్ద కష్టమేమీకాదు. అందుకే అభ్యర్థులు తమ సమాధానాలను జాగ్రత్తగా చెప్పాలి.
* ప్రశ్నకు సమాధానం తెలియనప్పుడు ‘తెలియదు’ అని చెప్పగలగాలి.
* చెప్పిన సమాధానం తప్పు అని బోర్డు మెంబర్లు దృఢంగా చెబుతున్నప్పుడు అంగీకరించగలగడం (అయితే...ఉద్దేశపూర్వకంగా బోర్డు తప్పుదోవ పట్టిస్తోందా? అనే సూక్ష్మ పరిశీలన తప్పనిసరి)
* సామాజిక బాధితుల, విధి వంచితుల పట్ల సానుభూతి ఉండాలి. ‘ఒక దొంగను ప్రజలు కొట్టి, చంపితే నీ స్పందన ఏమిటి?’, ‘ప్రస్తుత రిజర్వేషన్ల పద్ధతిలో అగ్రవర్ణాల పేదలు నలిగిపోతున్నారా?’.. అని అడిగితే ఎలా స్పందించాలో ఆలోచిస్తే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం సులభమే.
5 రాజకీయ తటస్థత
ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా రాజకీయ తటస్థతను కలిగివుండాలి. వ్యక్తిగా రాజకీయ ఇష్టాయిష్టాలు ఉండటం తప్పేమీ కాదు. అయితే ఆ ఇష్టాలు విధి నిర్వహణలోకి ప్రవేశించే ఉన్మాదస్థితి ఉండకూడదు. రాజకీయ అంశాల అవగాహన లేని వ్యక్తులు పరిపాలన నిర్వహించలేరని గమనించి సమాధానాలు చెప్పగలగాలి.
* మెచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? (తప్పనిసరిగా చెప్పాలి)
* ఏ రాజకీయ సిద్ధాంతాలు బాగా నచ్చుతాయి? (వామపక్ష తీవ్రవాదం, ఫాసిజం లాంటివి చెప్పకూడదు)
* ఎవరికి ఓటు వేస్తావు? (రహస్యం)
* ప్రస్తుత ప్రభుత్వాలపై నీ అభిప్రాయం (సానుకూలత మేలు)
* వ్యతిరేకించే రాజకీయ నాయకులు ఎవరు? ఎందుకు? (సారీ చెప్పి తప్పుకోవటం మంచిది) ఇలా పరిపక్వంగా సమాధానాలిస్తే అభ్యర్థి ‘తటస్థత’ దానంతటదే బోర్డుకు అర్థం అవుతుంది.
సంఖ్యకు ప్రాధాన్యం లేదు
* ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు చెబితే ఎక్కువ మార్కులు వేస్తారనేది అపోహ మాత్రమే. ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారనే దానికంటే ఎలా చెప్పారనేదానికే ప్రాధాన్యం.
* ఏ సమస్యను అయినా పరిష్కరించగలమనే ఆశావహ దృక్పథం తప్పనిసరిగా అభ్యర్థుల్లో ఉండాలి. * చక్కని భాష, ఉత్సాహంగా కనిపించడం, సరైన బాడీ లాంగ్వేజ్‌... మంచి మార్కులు రావడానికి దోహదపడతాయి.
సవాళ్లూ... సంస్కరణలూ అభ్యర్థులు
సన్నద్ధమవ్వాల్సినవి: బయోడేటా అంశాలు, జిల్లా సమాచారం, దేశ రాజకీయ పరిణామాలు, రాజ్యాంగ వర్తమానాంశాలు, కేంద్రప్రభుత్వ పథకాలు, అంతర్జాతీయ అంశాలు, సామాజిక పరిణామాలు
ఏపీపీఎస్‌సీ:
* వ్యవసాయ ప్రగతికి ప్రభుత్వ చర్యలు
* రాజధాని నిర్మాణం- అనుకూల, ప్రతికూలతలు
* పోలవరం/ పట్టిసీమ
* విభజనానంతర సమస్యలు
* ఆర్థిక లోటు
* కాపుల రిజర్వేషన్లు
* ఏపీలో ఐటీ రంగం రాణిస్తున్న విధానం
టీఎస్‌పీఎస్‌సీ:
* మిషన్‌ కాకతీయ, భగీరథ
* రెవెన్యూ సంస్కరణలు
* కొత్త జిల్లాల ఏర్పాటు- సవాళ్లు
* తెలంగాణ మలి ఉద్యమ అంశాలు
* తెలంగాణ ఏర్పాటు అనంతర పరిణామాలు
* విద్యుత్‌ రంగ స్థిరీకరణ
* హైదరాబాద్‌లో నిర్వహించిన, నిర్వహిస్తున్న సదస్సులు
* తెలంగాణ ఆర్థిక చిత్రం
* జిల్లాలవారీగా జల వనరుల ప్రాజెక్టులు.

Posted on 19-12-2017