close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

ఏ పేపర్లో ఏముంది?

* ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష సిలబస్‌

సివిల్స్‌కు సరితూగేలా రూపొందిన ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 పరీక్షల కొత్త సిలబస్‌ను సూక్ష్మస్థాయిలో పరిశీలించటం అభ్యర్థుల కర్తవ్యం. కీలకమైన మెయిన్స్‌లో ఏ పేపర్లో ఏ అంశాలున్నాయో అవగాహన అవసరం. అప్పుడే తగిన ప్రిపరేషన్‌ ప్రణాళిక సాధ్యం!

గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష సిలబస్‌లో కొత్తగా చేర్చిన విభాగాలు అభ్యర్థి ఏయే విషయాలపై లోతైన అవగాహన, స్పష్టత ఉండాలో నిర్దేశిస్తున్నాయి. ప్రభుత్వ సర్వీసులో ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్ళను అధిగమించే పాలనా వ్యవస్థలో సమర్థంగా పనిచేసేందుకవసరమైన విషయాలను సిలబస్‌లో చేర్చారు.

పేపర్‌-1లో జనరల్‌ ఎస్సే ఉంది.150 మార్కులు కేటాయించిన ఈ పేపర్‌ను 150 నిమిషాల్లో రాయాలి. ఇక మిగిలిన పేపర్లను వివరంగా పరిశీలిద్దాం!

పేపర్‌-2: చరిత్ర, సంస్కృతి, భౌగోళికశాస్త్రం, భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌

విభాగం-ఎ: భారతదేశ చరిత్ర, సంస్కృతి
ఈసారి ప్రత్యేకంగా సంస్కృతి అనే అంశం చేర్చడం వల్ల సాంస్కృతిక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. ప్రాథమిక పరీక్షలో ఇచ్చిన సిలబస్‌నే దాదాపు ఇక్కడ కూడా చేర్చారు. కొత్తగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, సాంస్కృతిక ఉద్యమకారులు వంటి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదవాలి. అంతేకాకుండా స్వాతంత్య్రానంతర పునరేకీకకరణ, దేశవిభజన, విదేశాంగ విధానం, ఆర్థిక విధానం వంటివి అదనంగా జోడించారు. కాబట్టి అభ్యర్థులు ప్రాథమిక పరీక్షస్థాయి నుంచే ఈ అంశాలపై అవగాహన ఏర్పరచుకొని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండింటికీ ఒకేసారి సన్నద్ధమవ్వాలి.

విభాగం- బి: ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, సంస్కృతి కొత్తగా అంశాలేవీ చేర్చకపోయినా అంశాల మధ్య నిర్దిష్టమైన విభజన జరిగింది. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక ఆంధ్ర చరిత్ర, ఆంధ్రాలో జాతీయోద్యమం, ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశాలను దేనికదే విభజించి ఇచ్చారు. జాతీయోద్యమ అంశంలో వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్ర జాతీయోద్యమంలో పాల్గొన్నవారి వివరాలు, సంఘసంస్కర్తలు, ప్రముఖులపై అవగాహన ఏర్పర్చుకోవాలి. చివరి విభాగం ఆంధ్రప్రదేశ్‌ విభజనానంతర సమస్యలపై వివిధ అంశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రతి అంశంపై ప్రాథమిక అవగాహన ఏర్పర్చుకోవడం అవసరం, ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని తెలుసుకొని ఉండాలి.

విభాగం-సి: భారత్‌, ఆంధ్రప్రదేశ్‌భౌగోళికశాస్త్రం
ఈ విభాగాన్ని కొత్తగా చేర్చారు. దీంట్లో భారతదేశం, ఏపీ భౌతిక, ఆర్థిక, సామాజిక, జంతు-వృక్ష, పర్యావరణ భౌతికశాస్త్రాలపై ప్రశ్నలు రావొచ్చు. దేశ, రాష్ట్ర భౌగోళిక అంశాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలి. ప్రతి అంశాన్ని దేశం, రాష్ట్రంతో పోల్చి చూస్తూ చదివితే అవగాహన పెరుగుతుంది. ఈ విభాగంలోనే విపత్తుల అంశాలను చేర్చారు.

పేపర్‌ -3: పాలిటీ, రాజ్యాంగం, పాలన, న్యాయం, నైతిక విలువలు
ఈ పేపర్‌లో నాలుగు విభాగాలున్నాయి. కొత్తగా ప్రభుత్వ పారిపాలన, నైతిక విలువలు, న్యాయసంబంధ అంశాలు వంటి వాటిని చేర్చారు. ప్రభుత్వ పాలన, గవర్నెన్స్‌ విభాగాన్ని కొత్తగా చేర్చారు. దీంట్లో ముఖ్యంగా పరిపాలనాపరమైన అంశాలపై అభ్యర్థులు దృష్టిసారించాలి. ప్రభుత్వ సేవలో నైతికతను కూడా కొత్తగా చేర్చారు. ఈ విభాగంలో ప్రధానంగా చేయాల్సింది కేస్‌ స్టడీస్‌ అధ్యయనం. భారత న్యాయవ్యవస్థపై ప్రాథమిక అవగాహన కూడా కొత్తగా చేర్చిందే. వీటిని సమకాలీన పరిణామాలతో జోడించి చదవడం లాభిస్తుంది.

పేపర్‌-4: భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి
ఈ పేపర్‌లో 7 విభాగాలున్నాయి. భారతదేశ ఆర్థికవ్యవస్థను చదివేటపుడు అవే అంశాలను ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి చదవాలి. ఉదాహరణకు- ఈ పేపర్‌లో ప్రభుత్వ బడ్జెట్‌ విభాగంలో భారతదేశ బడ్జెట్‌ను విశ్లేషణాత్మకంగా చదువుతూ ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ను కూడా అదే రీతిలో చదవడం వల్ల త్వరితగతిన అర్థమవుతుంది. కొన్ని అంశాలు ప్రత్యేకంగా భారతదేశ ఆర్థికవ్యవస్థ కోణంలో చదవాల్సి ఉంటుంది. ఈ పేపర్‌లో చదవాల్సిన అంశాలు ఎక్కువగానే ఉన్నా కూడా దేశం, రాష్ట్ర సంబంధిత అంశాలను సమన్వయం చేసుకుంటూ సన్నద్ధమవడం ఉపయోగకరం.

పేపర్‌-5: సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
ఈ పేపర్‌లో 9 అంశాలున్నాయి. దీనిలో ప్రధానంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. పర్యావరణ సంబంధిత అంశాలకు కూడా తగిన ప్రాధాన్యముంది. కొత్తగా అభివృద్ధి వర్సెస్‌ పర్యావరణం అనే అంశాన్ని సుస్థిరాభివృద్ధి కోణంలో ఈ పేపర్‌లో చేర్చారు. ముఖ్యంగా పర్యావరణ సంబంధిత అంశాలు అభివృద్ధి కోణంలో చదవడం లాభిస్తుంది. అంతేకాకుండా పర్యావరణ చట్టాలు, అంతర్జాతీయ పర్యావరణ సమస్యలు వంటి వాటిని సమకాలీన అంశాలతో జోడించుకోవాలి. ఐటీ, భారత ఇంధన అవసరాలు, అంతరిక్ష, రక్షణ రంగాలు వంటి అంశాలు ప్రాథమిక పరీక్షలో ఎదురైనవే. కాబట్టి ఈ విభాగానికి సంబంధించి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌తో అనుసంధానించి చదవడం ఉపయోగపడుతుంది.
మరో విభాగంలో బయోటెక్నాలజీ, వ్యాధులు, మేధోపరమైన హక్కులకు సంబంధించి సమస్యలను చేర్చారు. వీటిపై ప్రాథమిక అవగాహన అవసరం.


Posted on 06-08-2018