close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

ఇంజినీర్లూ.. ఇవిగో కొలువులు!

* 309 ఏఈఈ పోస్టులకు ప్రకటన

వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో ఏఈఈ పోస్టులను నియమించేందుకు ఏపీపీఎస్‌సీ నుంచి నోటిఫికేషన్‌ వెలువడింది. టీఎస్‌పీఎస్‌సీ నుంచి కూడా ఈ పోస్టుల ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్‌ పట్టభద్రులు ఈ పోస్టుల రాతపరీక్షకు సమగ్రంగా సిద్ధమైతే ఉభయతారకంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో నూతన ఉత్సాహంతో ఉద్యోగ విజయం సిద్ధిస్తుంది!

ఏపీపీఎస్‌సీ 309 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి సిద్ధమైంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రకటన ఇది! జలవనరుల విభాగంలో రూరల్‌ వాటర్‌ సప్లయి అండ్‌ శానిటేషన్‌ విభాగం, రోడ్లు- భవనాల శాఖ, ప్రజారోగ్య- మున్సిపల్‌ ఇంజినీరింగ్, పంచాయతీరాజ్, భూగర్భ జలాలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ తదితర శాఖల్లో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. నిరుద్యోగ, చిరుద్యోగ ఇంజినీర్లకు ఇదో బంగారు అవకాశం!
నెలకు దాదాపు రూ.60,000 జీతభత్యాలు లభించే ఏఈఈ పోస్టులకు ఎంపికైతే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అందుకే అర్హత ఉండి, ఏఈఈ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకుని రాతపరీక్ష సిలబస్‌ను ఓ పట్టు పట్టటమే మిగులుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే నవంబరు 29, 2018 నాటికి బీఈ/ బీటెక్‌ (సివిల్‌/ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) లేదా తత్సమాన విద్య పూర్తిచేసుండాలి. వీరి వయసు 01.07.2018 నాటికి 18 నుంచి 42 ఏళ్ల వయసు మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీలవారికి వయః పరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు ప్రక్రియ
* ఏపీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో వన్‌టైం ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ (ఓటీపీఆర్‌) విధానంలో అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. తద్వారా ఏపీపీఎస్‌సీ యూజర్‌ ఐడీని పొందుతారు. ఈ ఐడీని నమోదు చేసుకున్న మొబైల్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీకి పంపుతారు.
* అర్హత గల అభ్యర్థులు 03.12.2018 నుంచి 24.12.2018లోపు దరఖాస్తులను నమోదు చేసుకోవాలి.
* ఆన్‌లైన్‌లో పరీక్ష రుసుమును డిసెంబరు 23, 2018 అర్ధరాత్రి 11.59 గంటల్లోగా చెల్లించాలి.
* ఏపీపీఎస్‌సీ Website లో ఏపీపీఎస్‌సీ ఐడీ, పుట్టినతేదీని ఉపయోగించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తిచేయాలి. చేతిరాత ద్వారానో, పోస్టులోనో పంపిన దరఖాస్తులను స్వీకరించరు.
* జాగ్రత్తగా దరఖాస్తులను నింపాల్సి ఉంటుంది. ఏవైనా తప్పులు దొర్లితే దరఖాస్తును తిరస్కరిస్తారు.
ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ కింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్, నిరుద్యోగ యువత కేటగిరీల వారికి పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది. నిరుద్యోగ కోటాలో ఫీజు మినహాయింపు కోరేవారు తగిన పత్రాలను అందజేయాల్సి ఉంటుంది.
పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌ విధానంలో నెట్‌ బ్యాంకింగ్‌/ క్రెడిట్‌ కార్డు/ డెబిట్‌ కార్డు/ ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా చెల్ల్లించాలి. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ వారికి ఫీజు మినహాయింపుతో సహా ఏ రిజర్వేషన్లూ వర్తించవు. పరీక్ష రుసుమును చెల్లించిన తరువాత పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో దరఖాస్తు పొందుతారు. దరఖాస్తులో పొందిన ఐడీ అభ్యర్థికి భవిష్యత్తులోనూ ఉపయోగపడుతుంది.
వివిధ జోన్‌లు, కేటగిరీలవారీగా పోస్టుల వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. మొదటి జోన్‌లో.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం; రెండో జోన్‌లో.. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా; మూడో జోన్‌లో.. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు; నాలుగో జోన్‌లో.. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఉన్నాయి.

రాతపరీక్ష ఏ విధంగా?
25,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే ప్రిలిమినరీ జరుగుతుంది. దీన్ని ఫిబ్రవరి 10, 2019న నిర్వహించనున్నారు. మెయిన్స్‌ పరీక్షకు షార్ట్‌లిస్ట్‌ చేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. ఈ పరీక్షలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. రుణాత్మక మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు మార్కు కోత విధిస్తారు. కాల్‌క్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించరు.

ప్రిలిమినరీ పరీక్ష
విభాగం - మార్కులు - ప్రశ్నలు వ్యవధి
పార్ట్‌-ఎ: జనరల్‌ స్టడీస్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ- 50- 50
పార్ట్‌-బి: సివిల్‌ అండ్‌ మెకానికల్‌ (కామన్‌ పేపర్‌)/ ఎలక్ట్రికల్‌ - 100 - 100
మొత్తం - 150 - 150
మొత్తం పరీక్ష వ్యవధి 150 నిమిషాలు

జనరల్‌ స్టడీస్‌ సిలబస్‌ (ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటికీ ఒకటే)
ప్రాథమిక పరీక్ష అయిన ప్రిలిమ్స్‌లో ఇచ్చే 50 ప్రశ్నల్లో ఎక్కువగా వర్తమానాంశాలు, జాగ్రఫీ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థి ప్రధానంగా వీటితోపాటు జనరల్‌ సైన్స్, హిస్టరీ, పాలిటీ మీద దృష్టిపెట్టాలి. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీలో చాలా జాగ్రత్త అవసరం. రుణాత్మక మార్కులున్నాయి కాబట్టి, అభ్యర్థి సబ్జెక్టులపై ఎక్కువ దృష్టిపెట్టి ప్రణాళికబద్ధంగా చదవాలి.
భారత్, ఏపీ జాగ్రఫీ: దీని నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్‌ల్లో ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థి దృష్టిపెట్టాలి. ఈ సబ్జెక్టుల్లో ముఖ్యంగా భారతదేశ భౌగోళిక లక్షణాలు, ఖనిజ వనరులు, రవాణా, అడవులు, జనాభా మీద ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి నదీ జలాల సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రాజెక్టుల గురించి ప్రశ్నలు వస్తాయి.
కరెంట్‌ అఫైర్స్‌: ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమ్స్‌లో జాతీయ, ప్రాంతీయ అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. మెయిన్స్‌లో అంతర్జాతీయ అంశాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. ఈ సబ్జెక్టుకు సంబంధించి అభ్యర్థి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పథకాలు, ముఖ్యమైన అవార్డులు, వ్యక్తులు, నూతన శాస్త్ర సాంకేతిక అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఇండియన్‌ పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌: ఇది వర్తమానాంశాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి, అభ్యర్థి ఎప్పటికప్పుడు వర్తమానాంశాలకు సిద్ధమవుతూ ఉండాలి. ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు, అధికరణలు, షెడ్యూల్స్, ఎలక్షన్‌ కమిషన్, నీతి ఆయోగ్, పంచాయతీరాజ్‌ వ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థ, న్యాయవ్యవస్థ, డిజిటల్‌ పరిపాలన విధానాలపై దృష్టిపెట్టాలి.
డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌: దీనిలో.. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005, విపత్తు నిర్వహణ సంస్థలు, సహజ విపత్తులు, మానవ కారక విపత్తులపై ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా భూకంపాలు, సునామీ, తుపానులు, వరదలు, కరవులు వంటి విపత్తులు, కారణాలు, ప్రభుత్వ చర్యలు, నివారణ చర్యలు, పునర్నిర్మాణ చర్యలు, ప్రమాణాలు, వల్నరబిలిటీ ప్రొఫైల్, ప్రివెన్షన్‌ అండ్‌ మిటిగేషన్‌ స్ట్రాటజీస్, రిమోట్‌ సెన్సింగ్, జీఐఎస్‌లను ఉపయోగించి విపత్తును అంచనా వేయడంపై ప్రశ్నలు వస్తాయి.
సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌: దీని నుంచి ప్రిలిమ్స్‌లో తక్కువగానూ మెయిన్స్‌లో ఎక్కువగానూ ప్రశ్నలు వస్తాయి. గ్లోబల్‌ వార్మింగ్, ఓజోన్‌ పొర క్షీణత, జల కాలుష్యం, వాయు కాలుష్యం, నేల కాలుష్యం- క్షీణత, అడవుల నాశనం, సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఎర్త్‌ సమావేశాలు, బయోడైవర్సిటీ-క్షీణత, ఎకో సిస్టమ్‌లపై దృష్టిపెట్టాలి.
జనరల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ: దీని నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. విటమిన్లు, వాటి ప్రయోజనాలు, ఖనిజ వనరులు, వ్యాధులు, శాస్త్రసాంకేతిక రంగంలో భారతదేశ ప్రగతి ముఖ్యంగా జీఎస్‌ఎల్‌వీ, పీఎస్‌ఎల్‌వీ, శాటిలైట్ల ప్రయోగం, క్రయోజెనిక్, స్క్రామ్‌ జెట్, లామ్, కావేరి ఇంజిన్స్‌ టెక్నాలజీ, డిజిటల్‌ ఇండియా, న్యూక్లియర్‌ టెక్నాలజీ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.
ఆంధ్రప్రదేశ్‌ విభజన సమస్యలు: ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొత్త రాజధాని నిర్మాణం- సవాళ్లు, నదీజలాల సమస్యలు, 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఉద్యోగుల విభజన, సమస్యలు, రైల్వే జోన్‌ వివాదం, ప్రత్యేక హోదా అంశం మీద ప్రశ్నలు వస్తాయి.
స్వాతంత్య్రం తరువాత భారత్, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి: పంచవర్ష ప్రణాళికలు, ఎగుమతులు, దిగుమతులు, బ్యాంకింగ్‌ వ్యవస్థ, జీఎస్‌టీ, ఆర్థిక సంఘం, జాతీయ, తలసరి ఆదాయాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
లాజికల్‌ రీజనింగ్, అనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లో ట్యాబ్‌లేషన్‌ డేటా, విజువల్‌ రిఫ్రంటేషన్‌ ఆఫ్‌ డేటా, బేసిక్‌ డేటా ఆఫ్‌ అనాలిసిస్‌ ప్రశ్నలుంటాయి.

టెక్నికల్‌ అంశాలు
గతంలో ఏపీపీఎస్‌సీ ఈ పరీక్షను 2016 నవంబరులో నిర్వహించింది. దానిలో పూర్తి సిలబస్‌తో కూడిన సివిల్, మెకానికల్‌ పరీక్షను నిర్వహించారు. నేడు సివిల్, మెకానికల్‌ బ్రాంచీలకు ఒకే సిలబస్, పార్ట్‌-ఎ, బిల్లో ఇచ్చారు. ఈ రెండు బ్రాంచీలకు జనరల్‌ స్టడీస్‌తోపాటు స్ట్రెంత్‌ ఆఫ్‌ మెటీరియల్, ఫ్లూయిడ్‌ మెకానిక్స్‌ అండ్‌ మెషినరీ మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ఉండే ఇతర 10 నుంచి 12 టెక్నికల్‌ సబ్జెక్టులు ప్రిలిమినరీలో లేవు. ఇవి మెయిన్స్‌లో పేపర్‌-3గా ఉంటాయి. ఎలక్ట్రికల్‌ విభాగానికి ప్రిలిమినరీలో సర్క్యూట్‌ థియరీ, మెజర్‌మెంట్స్, పవర్‌ సిస్టమ్స్, మెషిన్స్‌ ఉన్నాయి. మెయిన్స్‌లో ఇదే సిలబస్‌ రెండు పేపర్లుగా విభజించి ఉంటుంది.
ప్రశ్నల సరళి: టెక్నికల్‌ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు ఎక్కువగా ప్రాథమికాంశాలపై ఉంటున్నాయి. న్యూమరికల్‌ ప్రశ్నలు 15 నుంచి 20 శాతం మాత్రమే ఉండొచ్చు. చాలావరకు ఫార్ములా ఆధారిత, సబ్‌స్టిట్యూషన్‌ ఆధారితంగా ఉండవచ్చు. ఈ ప్రశ్నలకు కాల్‌క్యులేటర్‌ అవసరం ఉండదు. గతంలో ప్రశ్నల నిడివి 1 నుంచి 3 లైన్లు మాత్రమే ఉన్నాయి. చాలా ప్రశ్నలకు చూడగానే సమాధానం కనుక్కోవచ్చు. అయితే సిలబస్‌ నలుమూలల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది.
అర్హత మార్కులు: ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌ను అర్హత సాధించడానికి పొందాల్సిన మార్కులను కమిషన్‌ నిర్దేశిస్తుంది. గత పరీక్షలను విశ్లేషిస్తే 1:12 నుంచి 1:15 వరకు ఉండే వీలుంది.

మెయిన్స్‌ పరీక్ష
దీన్ని 2019 ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో నిర్వహించే అవకాశముంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో పొందిన మార్కుల ద్వారా 1:2 నిష్పత్తిలో సర్టిఫికేషన్‌ వెరిఫికేషన్‌ నిమిత్తం పిలుస్తారు. ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉండదు.
రుణాత్మక మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/3వ వంతు మార్కుల కోత విధిస్తారు. పరీక్షలో వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌ ద్వారా న్యూమరికల్‌ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టవచ్చు. ప్రోగ్రామబుల్‌ కాల్‌క్యులేటర్‌ను అనుమతించరు. పేపర్‌-1, 2 సిలబస్‌ ప్రిలిమినరీ పరీక్షకు సమానం.

విభాగం - మార్కులు - ప్రశ్నలు
పేపర్‌-1: జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ - 150 - 150
పేపర్‌-2: సివిల్, మెకానికల్‌ (కామన్‌), ఎలక్ట్రికల్‌ - 150 - 150
పేపర్‌-3: కేవలం సివిల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు (పోస్టు కోడ్‌ నం. 1, 2, 4, 8); కేవలం మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు (పోస్టు కోడ్‌ నం.5); సివిల్, మెకానికల్‌ (ఉమ్మడి పోస్టులు) (పోస్టు కోడ్‌ నం. 6, 7); కేవలం ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు (పోస్టుకోడ్‌ నం. 3) - 150 - 150
ఒక్కో పేపర్‌ రాసే వ్యవధి 150 నిమిషాలు.
పేపర్‌-3
* సివిల్‌ ఇంజినీరింగ్‌లో బిల్డింగ్‌ మెటీరియల్స్, స్ట్రక్చరల్‌ అనాలిసిస్, స్టీల్‌ స్ట్రక్చర్స్, కాంక్రీట్‌ అండ్‌ మ్యాసోనరీ స్ట్రక్చర్స్, కన్‌స్ట్రక్షన్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, హైడ్రాలిక్స్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్, సాయిల్‌ మెకానిక్స్‌ అండ్‌ ఫౌండేషన్, సర్వేయింగ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వంటి 10 ఇతర సబ్జెక్టులు ఉన్నాయి.
* మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో థర్మో డైనమిక్స్, హీట్‌ ట్రాన్స్‌ఫర్, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏర్‌ కండిషనింగ్, టర్బో మెషిన్స్, థియరీ ఆఫ్‌ మెషిన్స్, మెషిన్‌ డిజైన్, మెషిన్‌ డ్రాయింగ్‌ అండ్‌ సాయిల్డ్‌ మోడలింగ్, ఇంజినీరింగ్‌ మెటీరియల్స్, మ్యానుఫాక్చరింగ్‌ సైన్స్, కంప్యూటర్‌ ఇంటిగ్రేటెడ్‌ మ్యానుఫాక్చరింగ్, ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్, మోడలింగ్‌ అండ్‌ సిమ్యులేషన్‌.
* సివిల్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ పోస్టులకు (కోడ్‌ నం. 6, 7): ఇంజినీరింగ్‌ డ్రాయింగ్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ఎకో సిస్టమ్స్, బయోడైవర్సిటీ అండ్‌ ఇట్స్‌ కన్జర్వేషన్, సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, సోషల్‌ ఇష్యూస్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్‌ పాపులేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్, ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌
టెక్నికల్‌ సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమికాంశాల నుంచి కొంత లోతుగా రాగల ప్రశ్నలు ఎక్కువ. న్యూమరికల్‌ ప్రశ్నలు 15 నుంచి 20 శాతం మాత్రమే ఉండొచ్చు. చాలావరకు ఫార్ములా, అప్లికేషన్, అనాలిసిస్, సబ్‌స్టిట్యూషన్‌ ఆధారంగా ఉండొచ్చు. ఈ ప్రశ్నలకు వర్చువల్‌ కాల్‌క్యులేటర్‌ సరిపోతుంది. ప్రశ్నల నిడివి 1-3 లైన్లు ఉంటాయి. సిలబస్‌ నలుమూలల నుంచీ ప్రశ్నలు వచ్చే అవకాశముంది.

సమయపాలన చాలా ముఖ్యం
* రాతపరీక్షకు దాదాపుగా తొమ్మిది నుంచి పది వారాల వ్యవధి ఉంది. ప్రిలిమినరీ తరువాత మెయిన్స్‌కు 50 రోజుల సమయం ఉంటుంది.
* సివిల్, మెకానికల్‌ విభాగాలకు మెయిన్స్‌లో పేపర్‌-3 అదనం. దీని సిలబస్‌ విస్తృతం.
* ప్రిలిమ్స్‌ నుంచి మెయిన్స్‌కు 1:12 నుంచి 1:15 వరకు వడపోత ఉంటుంది. అంటే ప్రిలిమ్స్‌ అంత సులభం కాదు. మరి ఎలా అనే సందిగ్ధం అనేక మందిలో ఉంటుంది. కాబట్టి సన్నద్ధత మొదలుపెట్టే అభ్యర్థి పేపర్‌-1, 2 సబ్జెక్టులను ప్రణాళికబద్ధంగా ప్రాథమిక, ప్రధాన పరీక్షలకు ఒకేసారి సన్నద్ధమవ్వాలి. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తరువాత పేపర్‌-3 మీద ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. ఇప్పటికే గేట్, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ సన్నద్ధతలో ఉన్నవారికి పేపర్‌-2, 3 మీద చాలావరకు అవగాహన ఉంటుంది. వారు పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ మీద ఎక్కువ దృష్టిపెట్టాలి.
* అన్ని పరీక్షల్లో ఒక ప్రశ్నకు ఒక నిమిషం మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి, సమయపాలన ఎంతో ముఖ్యం. నమూనా ప్రశ్నపత్రాలను ఎక్కువగా సాధన చేయాలి.
* రోజూ కొంత సమయం జనరల్‌ స్టడీస్, టెక్నికల్‌ సిలబస్‌కు కేటాయించాలి.
* గత ప్రశ్నపత్రాలు, గేట్, ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రశ్నపత్రాలు సాధనకు తోడ్పడుతాయి.

Posted on 03.12.2018