close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

గ్రూపులు కొట్టండి

* ఏపీపీఎస్‌సీ నుంచి మొత్తం 3255 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) గ్రూప్‌-1, గ్రూప్‌-2 సర్వీసులు, ఇతర పోస్టులకు మొత్తం 21 ఉద్యోగ నియామక ప్రకటనలను విడుదల చేసింది. మొత్తం 3255 పోస్టులు. వీటిలో గ్రూప్‌-1లో 169, గ్రూప్‌-2లో 446 ఉన్నాయి, అర్హతలూ, ఉన్న సమయం బట్టి వీటిలో తగినవి ఎంచుకుని, అభ్యర్థులు పూర్తిసాయిలో సంసిద్ధం కావాలి. ఈ పోటీ పరీక్షలన్నిటికీ ఉన్న ఉమ్మడి సిలబస్‌ను అవగాహన చేసుకోవటం తొలి మెట్టు. అందుకు ముందడుగు ఎలా వేయాలో తెలుసుకుందాం!

గ్రూప్‌-1లో డిప్యూటీ కలెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌, డిస్ట్రిక్‌ రిజిస్ట్రార్‌ మొదలైనవీ, గ్రూప్‌-2లో అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ మొదలైన 446 పోస్టులూ, వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఇతర పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నుంచి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. చాలామంది ఒకటికి మించిన పరీక్షలు రాసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఉమ్మడి సిలబస్‌ ప్రవేశపెట్టక ముందు దాదాపు అన్ని ప్రిలిమినరీ పరీక్షల్లో ఒకే రకమైన సిలబస్‌ ఉండేది. దానితో స్క్రీనింగ్‌ వరకూ ఇబ్బందులూ లేకుండా తయారయ్యే అవకాశం ఉండేది.

అయితే ‘స్క్రీనింగ్‌, మెయిన్స్‌ మధ్య అంతరాన్ని తొలగించటం’ అనే ఏపీపీఎస్‌సీ తాజా ధోరణి వల్ల దాదాపుగా అన్ని పరీక్షల స్క్రీనింగ్‌లోనూ చాలా తేడాలొచ్చాయి. అందువల్ల ఒకేసారి ఒకటికి మించిన పరీక్షలకు సిద్ధపడేందుకు అదనపు ప్రణాళికను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ స్క్రీనింగ్‌ పరీక్షలో చూసినా జనరల్‌ స్టడీస్‌ విభాగం ఉమ్మడిగా ఉంది. అదనంగా మరికొంత సమాచారాన్ని జోడించారు. ఫలితంగా ప్రతి స్క్రీనింగ్‌ పరీక్షకూ జనరల్‌ స్టడీస్‌కి అదనంగా మరికొంత సమాచారం చదవాల్సి వస్తోందిప్పుడు. ఈ రకంగా ఒకటి లేదా రెండు పరీక్షల మీదే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి.

ప్రస్తుతం ఏపీపీఎస్‌సీ అనుసరిస్తున్న విధానాన్ని బట్టి గ్రూప్‌ 1, 2, 3 పరీక్షల్లో స్క్రీనింగ్‌, మెయిన్స్‌లకు విభిన్నమైన సిలబస్‌ ఉండదు. అందువల్ల ‘మెయిన్స్‌’లో ఉన్న సిలబస్‌నే స్క్రీనింగ్‌ సిలబస్‌లో కూడా చేర్చారు. స్క్రీనింగ్‌కీ, మెయిన్స్‌కూ ఏయే స్థాయుల్లో చదవటం అవసరమో గ్రహించటం ముఖ్యం. స్క్రీనింగ్‌కి తక్కువ మార్కులే ఉన్నాయి. కాబట్టి తక్కువ చదివితే చాలు అనే పరిధిని నిర్ణయించుకోవద్దు. మెయిన్స్‌ కోసం విస్తృతంగా చదువుదాంలే’ అనే ఆలోచన కూడా సరైనది కాదు.
సాధారణంగా సివిల్స్‌ మొదలైన పరీక్షలకు తయారవుతున్నవారికి ఆంధ్రప్రదేశ్‌ సంబంధిత అంశాలపై పెద్దగా పట్టు ఉండదు. ముఖ్యంగా ఇప్పటి సిలబస్‌ అధ్యయనం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్‌ ఎకానమీ, విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర- సంస్కృతి చాలా కీలకంగా మారనున్నాయి. కనీసం ఈ విభాగాల్లో 25 నుంచి 30 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌ సంబంధిత అంశాలపై ప్రామాణికమైన పుస్తకాలు చదవాల్సిన అవసరముంది. ఒకేసారి ఒకటికి మించిన పరీక్షలు రాయాలా వద్దా అనేది స్క్రీనింగ్‌, మెయిన్స్‌ పరీక్షల తేదీల ఆధారంగా నిర్ణయించుకోవాలి.

రెండూ రాయాలనుకుంటే?
ఇలా గ్రూప్‌-1, 2 రెండు పరీక్షలూ రాయాలనుకున్నపుడు అదనంగా ఏమున్నాయో గమనించాలి. గ్రూప్‌-1లో పరీక్షలో అదనంగా ఉన్న సమాచారం: 1. ప్రాచీన భారతదేశ చరిత్ర 2. మధ్య భారతదేశ చరిత్ర 3. గాందీ, అంబేద్క‌ర్‌ తాత్విక చింతన 4. ప్రపంచ భౌగోళిక అంశాలు 5. పాలనలో ఎథిక్స్‌- విలువలు 6. శాస్త్ర సాంకేతిక అంశాల్లో లోతైన అధ్యయనం 7. మనోవైజ్ఞానిక సంబంధిత నిర్వహణ అంశాలు 8. మానసిక సామర్థ్యాల కింద అంకగణితం, లాజికల్‌ సామర్థ్యాలతో పాటు శుద్ధ గణిత శాస్త్ర అంశాలు

మిగతా స్క్రీనింగ్‌ పరీక్షల్లో లేనివీ- గ్రూప్‌-2లో మాత్రమే ఉన్నవి: 1. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర 2. ఆంధ్రప్రదేశ్‌ ఆరిక వ్యవస్థ 3. జనరల్‌ ఎకానమీతో కలవని ప్రత్యేక ఆర్థిక అంశాలు 4. జాతీయ అంతర్జాతీయ సంఘటనలు

పంచాయతీ కార్యదర్శుల పరీక్ష స్క్రీనింగ్‌ పరీక్షకు ప్రత్యేకంగా ఉన్న అదనపు సిలబస్‌ అంశాలు: 1. పంచాయతీరాజ్‌ వ్యవస్థ నిర్మాణం 2. ఖాతాల నిర్వహణ 3. గ్రామీణాభివృద్ధి పథకాలు 4. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థలోని మానవ అభివృద్ధి అంశాలు మొదలైన 12 చాప్టర్లు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్ని స్క్రీనింగ్‌ పరీక్షల్లో ఉమ్మడి సిలబస్‌ అంశాలు చాలావరకు ఉన్నాయి. అవి-
* ఆధునిక భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం
* భారతదేశ భౌగోళిక అంశాలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
* ఇండియన్‌ పాలిటీ
* మెంటల్‌ ఎబిలిటీ
* వర్తమాన అంశాలు
* విపత్తు నిర్వహణ
* పర్యావరణ సంబంధిత అంశాలు
* డాటా ఇంటర్‌ప్రెటేషన్‌, విశ్లేషణ
* ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం, సవాళ్లు, నవ నిర్మాణం.

ఎలా చదవాలి?
అభ్యర్థులు మెయిన్స్‌కి ప్రిపేర్‌ అవుతున్న తరహాలోనే విస్తృతంగా స్క్రీనింగ్‌ పరీక్షకు కూడా సిద్ధమైతే ఇబ్బంది ఉండదు. మౌలిక అంశాలపై దాదాపుగా 30 శాతం వరకు ప్రశ్నలు వస్తాయి. అందువల్ల పాఠశాల స్థాయి పుస్తకాలపై ఆధారపడితే స్క్రీనింగ్‌లో ఎక్కువ మార్కులు స్కోర్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

ముఖ్యంగా కొత్తగా పరీక్ష రాస్తున్నవారు ప్రతి విషయాన్నీ కాన్సెప్ట్‌ ఆధారంగా నేర్చుకుంటే ఎక్కువ మార్కులు స్కోర్‌ చేయవచ్చు. జనరల్‌ సైన్స్‌, శాస్త్ర సాంకేతికత, ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలను కరెంట్‌ అఫైర్స్‌తో అనుసంధానం చేసుకుని చదివితే అధిక ప్రయోజనం ఉంటుంది. బిట్లు బిట్లు మాదిరిగా చదివితే నష్టం ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా కొత్తవారు అకడమిక్‌ ధోరణి నుంచి బయటపడటం ముఖ్యం. వీరు విస్తృత అవగాహనపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏ ఒక్క పుస్తకం నుంచో ప్రశ్నలు అడగరు. ఇది గుర్తించి సిలబస్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ వనరుల నుంచి సమాచారాన్ని సేకరించుకోవాలి. తోటివారు చెప్పారని గుడ్డిగా అనుసరిస్తే నష్టమే ఎక్కువ!

Posted on 02.01.2019