close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

మెలకువలు తెలుసుకో... గ్రూప్స్‌ గెలుచుకో!

పోటీ పరీక్షల నగారా మోగింది! ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1 పరీక్ష రాసే అవకాశం నవ యువతతోపాటు సీనియర్‌ అభ్యర్థులకు ఈ కొత్త సంవత్సరంలో వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుని, చిరకాల స్వప్నం నెరవేర్చుకునేందుకు ఉపకరించే నిపుణుల సూచనలు... ఇవిగో!
ప్రకటించిన గ్రూప్‌-1 పోస్టులు ఆశించిన సంఖ్యలో లేనందుకు అభ్యర్థులు నిరాశపడనక్కర్లేదు. ఖాళీలు ఎన్ని అనేది కాకుండా తగిన సన్నద్ధత మాత్రమే గెలుపును ఖరారు చేస్తుంది. శ్రద్ధగా సిద్ధమయ్యే అభ్యర్థులు ఏ తరుణంలోనైనా పరిమితంగానే ఉంటారని గ్రహించాలి.
మొట్టమొదటిసారి గ్రూప్‌-1 పరీక్షను ఎదుర్కోబోతున్న అభ్యర్థులు గమనించాల్సిన అంశాలు ఇవి-
సంవత్సరాల తరబడి దృఢదీక్షతో చదివితేనే గ్రూప్‌-1 పరీక్షలో నెగ్గొచ్చు అనేది అపోహ మాత్రమే. 2011 గ్రూప్‌-1 తుది ఫలితాల్లో 2012 గ్రూప్‌-1 రాత పరీక్షకు ఎంపికైనవారిలో 65% పైగా కొత్తవారే. అదే మొదటి ప్రయత్నం కూడా.
* 2011లో సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటున్న ఓ యువతి ప్రణాళికాయుతమైన 3 నెలల కృషితో గ్రూప్‌-1 రాసి ప్రస్తుతం డీఎస్‌పీగా పనిచేస్తుండటం గమనించాలి.
* మొదటిసారే తొలి పరీక్షగా గ్రూప్‌-1 రాసి 23 సంవత్సరాలకే గ్రూప్‌-1 అధికారిగా మారిన యువతి విజయగాథ చెప్పుకోవాల్సిందే.
* జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగం జీవిత లక్ష్యం అనుకొని గ్రూప్‌-1 ప్రకటన 2011 ద్వారా ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న యువకుడి విజయ బాట అనుసరించదగినది.
* ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ పిల్లలు ‘పాఠశాలలకు వెళ్తున్నారు, ఇంట్లో ఖాళీగా ఉండటం ఎందుకు?’ అని గ్రూప్‌-1 పరీక్షకు సమాయత్తమై 35 ఏళ్ళ వయసులో తొలి ప్రయత్నంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణిగా మారిన మహిళ కూడా ప్రేరణే.
* తల్లితండ్రుల వారసత్వమైన పౌరోహిత్యం నచ్చక పట్టుదలతో చదివి కేవలం 6 నెలల్లో సిద్ధమై ప్రస్తుతం వాణిజ్య పన్నుల అధికారిగా పనిచేస్తున్న యువకుని గాథ స్ఫూర్తిదాయకం.
మెజారిటీ అభ్యర్థులు మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించటం వెనుక ప్రణాళికాయుతమైన అధ్యయనం, సాధన స్పష్టంగా కన్పించే లక్షణాలు. వాటిని సంతరించుకుంటే గతంలో పోటీ పరీక్షలు రాసివుండనివారైనా విజయం సాధించవచ్చు.
ఏ దారి మేలు?
కొత్తగా గ్రూప్స్‌ పోటీపరీక్షలు రాయబోయేవారికి ‘ఎలా మొదలు పెట్టాలి?’ అనేది ప్రారంభ అవరోధంగా కనిపిస్తుంది. ఆరంభం ఎలా చేయాలంటే... దానికి ముఖ్యంగా మూడు ప్రత్యామ్నాయాలున్నాయి.
* ప్రిలిమ్స్‌ సిలబస్‌ని లోతుగా అధ్యయనం చేయటం
* ప్రిలిమ్స్‌ అధ్యయనం చేస్తూ పాక్షికంగా మెయిన్స్‌కి తయారవ్వడం.
* ప్రిలిమ్స్‌ సిలబస్‌ని అధ్యయనం చూస్తూ పూర్తిగా మెయిన్స్‌కి సిద్ధమవడం.
1. గ్రూప్‌-1 స్థాయి పరీక్షలు ఎదుర్కొనేందుకు కొంత తటపటాయించేవారు ముందుగా ప్రిలిమ్స్‌ గట్టెక్కిన తర్వాత మెయిన్స్‌ ఆలోచిద్దాం అనే ధోరణితో ఉంటారు. వారి మానసికస్థితిని బట్టి ఆ స్థితి కొంతవరకు సబబే. ప్రిలిమ్స్‌కి లోతుగా చదవటం అంటే కనీసం 30% మెయిన్స్‌ సన్నద్ధత పూర్తి చేసినట్లే. ఎందుకంటే మెయిన్స్‌లో అడిగే అనేక మౌలిక అంశాలపై ప్రశ్నలు సునాయాసంగా ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ ద్వారా రాయవచ్చు కనుక.
2. ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతూనే మెయిన్స్‌లోని కొన్ని పేపర్లపై లభ్యమయ్యే కాలాన్ని బట్టి దృష్టిపెట్టడం అనే రెండో ప్రత్యామ్నాయం ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి ఆహ్వానించదగినది.
ఈ తరహా ప్రిపరేషన్‌ వల్ల బహుముఖ ప్రయోజనాలున్నాయి. ప్రిలిమ్స్‌ అనంతరం మెయిన్స్‌ పరీక్షకు లభించే సమయం 5 పేపర్లకి సమగ్రంగా తయారయ్యేందుకు సరిపోకపోవచ్చు. అందువల్ల జనరల్‌ ఎస్సే , సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ లాంటి పేపర్లకు ప్రిలిమ్స్‌తో పాటుగా తయారవ్వటం వల్ల మంచి ప్రయోజనాన్ని సాధించవచ్చు.
ముఖ్యంగా జనరల్‌ ఎస్సే మిగతా మెయిన్స్‌ పేపర్ల మాదిరిగా అప్పటికప్పుడు మెటీరియల్‌ చదివి సిద్ధపడేది కాదు. జనరల్‌ ఎస్సేలో మార్కులు సాధించాలంటే వివిధ సబ్జెక్టుల అంశాల్ని అనుసంధానం చేసుకునే నేర్పు రావాల్సి వుంటుంది. అందువల్ల ఈ వ్యాసరచనకు ఇప్పటినుంచే సిద్ధపడటం మంచిది. అదేవిధంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మెయిన్స్‌ పేపర్‌ని కూడా వర్తమాన అంశాలతో అనుసంధానం చేసుకొని చదవటం ప్రిలిమినరీకి కూడా ఉపయుక్తం.
3. ప్రిలిమ్స్‌తోపాటు పూర్తిగా మెయిన్స్‌కి సిద్ధమవటం అనే మూడో ప్రత్యామ్నాయం కొద్దిగా క్లిష్టమైనది. ఇంత భారాన్ని భరించగలిగే శక్తి కొంతమంది అభ్యర్ధులకే ఉంటుంది. ప్రిలిమ్స్‌ ఫలితం తారుమారు కాకుండా మెయిన్స్‌ సిలబస్‌ మొత్తం లాగగలిగితే మెయిన్స్‌ సన్నద్ధత సులభతరం అవుతుంది. మొరుగైన ఫలితం సాధించవచ్చు కూడా. అయితే ఈ తరహా తయారీ అభ్యర్థి గ్రహణ సామర్థ్యాలు, కేటాయించగల్గిన సమయం లాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.
కుదింపు + విస్తరించటం
గ్రూపు-1 స్థాయి అధికారికి ఈ లక్షణం బాగా ఉండాలి. ఒక పెద్ద విషయాన్నే సూక్ష్మీకరించి చెప్పగలగాలి. అలాగే చిన్న పదం ఆధారంగానైనా ఒక పెద్ద వివరణ ఇవ్వగలగాలి. అందుకే ఇలాంటి లక్షణాన్ని పరిశీలించేందుకే 1, 2, 4, 5 మార్కుల ప్రశ్నలు అడుగుతారు. 5వ పేపర్‌లో విషయ విశ్లేషణ 50 మార్కులకు చేర్చటం వెనకున్న కారణం కూడా ఇదే.
వ్యాసరచన (పేపర్‌-1) కూడా ఇలాంటి సామర్ధ్యాల్ని పరిశీలించేదే. ఈ సామర్థ్యం అలవర్చుకుంటే తేలికగా మెయిన్స్‌ని ఎదుర్కొనవచ్చు. ఇది రావాలంటే ప్రతి విషయాన్నీ మౌలికస్థాయి నుంచి శిఖరాగ్ర స్థాయి వరకు ఆలోచించే శక్తి కలిగేలా ప్రిపరేషన్‌ వ్యూహం ఉండాలి. వివిధ విషయాల్ని చదివేటప్పుడే ఒక మార్కుకి ఎలా రాయాలీ, రెండు మార్కులకూ, 10 మార్కులకూ ఏయే రకంగా రాయాలి అని ఆలోచించాలి.
రాయటం కూడా ముఖ్యమే
మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించినవారిలో గమనించగలిగే విషయం ‘బాగా రాయగల్గటం’. బాగా రాయటం అంటే అందంగా అని కాదు. అందమైన రాత వుండాల్సిన అవసరం లేదు. స్పష్టంగా అర్థమయ్యేలా వుంటే చాలు.
మరి బాగా రాయటం అంటే? చదివి ఆర్జించిన జ్ఞానాన్ని ఎగ్జామివర్‌కి కావల్సిన విధంగా ఇవ్వగల్గడం. మెదడులో చాలా జ్ఞానం ఉండవచ్చు. కానీ దాన్ని సరిగా పేపర్‌పై పెట్టగల్గితే చాలు. ఇలా సరిగా రాయాలంటే రాత సాధన అవసరం. సరైన మార్గదర్శకత్వం ఇవ్వగలిగినవారికి సమాధానాలు చూపించి, సూటిగా అనుకున్నవిధంగా రాయగలిగానా? లేదా? అనేది నిర్ధారించుకోవాలి. చదివిన శ్రమ... విజయంలో 60% వాటా పొందితే, రాయటం అనేది 40% వాటాను పొందుతుంది. ఇది గ్రహించి ఇప్పటినుంచే ‘రాత సాధన’ జోడిస్తూ సన్నద్ధతను నిర్దేశించుకోవాలి.
పరిశోధన కాదు.... ప్రస్తుత పరిణామాలే
గ్రూపు-1 పరీక్ష అవగానే రుషుల మాదిరిగా, శాస్త్రవేత్తల మాదిరిగా జీవితాన్ని అంకితం చేసి చదవాలనే అపోహ చాలామందిలో ఉంటుంది. సిలబస్‌ అంశాల్ని పరిశోధిస్తూ, అనేక పుస్తకాలు పఠిస్తూ ఉండాలేమో అనుకుంటుంటారు. ఆ ధోరణి కచ్చితంగా తప్పు.
సాధించాల్సిన 65% మార్కులలో ప్రిలిమినరీ జ్ఞానం 30% అయితే సాధారణ పరిజ్ఞానం వాటా మరో 20%. వాటికి అదనంగా సిలబస్‌ అంశాలకు సంబంధించిన (చరిత్ర, డాటా విశ్లేషణ తప్ప) ప్రస్తుత పరిణామాల అవగాహన... అనుసంధానం వాటా మరో 15%. ఇలాంటి ఫార్మూలాతో చదివిన అభ్యర్థిని ఓటమి చేరలేదు. ఈ అవగాహన పెంచుకొని చదివిన 22, 23 సం॥ అభ్యర్థులు కూడా ఢంకా మోగించారు. ఆ విజేతల వర్గంలో చేరటం మీకు కూడా సులభమే. నవంబర్‌ 2016లో జరిగిన రీ ఎగ్జామ్‌, వ్యాసరచనల్లో 50% పైగా ప్రశ్నలు ఆ తరహావే. ఇలాంటి కిటుకులు మరిన్ని గమనిస్తే, నేర్చుకుంటే విజయం అందకుండా పోతుందా!
సీనియర్లూ... బహుపరాక్‌!
గతంలో పరీక్షలు రాసినవారు తమకు త్రుటిలో విజయం ఎందుకు తప్పిందో పరిశీలించుకోవాల్సిన తరుణమిది. ఈ నాలుగు సంవత్సరాలలో పేపర్‌-1, 2 (పాలిటీ), 3, 4లకు సంబంధించిన సిలబస్‌లో అనేక మార్పులు వచ్చాయి. కాలమే కాదు; భావజాలమే మారింది. సిలబస్‌ ప్రాధాన్యాల్లో మార్పులు వచ్చాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా విజయఫలాన్ని చేజిక్కించుకునేందుకు కొత్తవారు సిద్ధంగా ఉన్నారు. అనుభవం పెట్టుబడే కావాలి కానీ అవరోధం కాకుండా చూసుకుంటే సీనియర్లు కూడా అశించింది పొందటం సులభమే.
మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించటం వెనుక ప్రణాళికాయుతమైన అధ్యయనం, సాధన స్పష్టంగా కన్పించే లక్షణాలు. వాటిని సంతరించుకుంటే కొత్తగా రాసేవారైనా విజయం సాధించవచ్చు.

ముఖ్యమైన 3 అంశాలు
150 మార్కుల స్క్రీనింగ్‌ టెస్టులో 150 ప్రశ్నలుంటాయి.
1. ఈ ఏడాది నుంచి ఆబ్జెక్టివ్‌ టైపు పరీక్షలన్నిటిలో రుణాత్మక (నెగిటివ్‌) మార్కులను ప్రవేశపెట్టారు. అందుకని కచ్చితమైన జవాబులు తెలిస్తేనే గుర్తించాల్సివుంటుంది. ఇందుకు సబ్జెక్టులపై పూర్తి అవగాహన అవసరమవుతుంది. ఈ నెగిటివ్‌ మార్కు విధానంలో వచ్చిన మార్కుల్లో ప్రతి మూడు తప్పు సమాధానాలకూ ఒక మార్కు చొప్పున కోల్పోవాల్సిందే.
2. ప్రశ్నల సంరళిలో కూడా మార్పు ఉండబోతోంది. ప్రతి ప్రశ్నకూ నాలుగు ప్రత్యామ్నాయ సమాధానాలనిచ్చి వాటిలో సరైనది గుర్తించమని సాధారణంగా ఉంటుందని తెలిసిందే. కానీ ఇటీవల యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్‌ సర్వీసుల పరీక్షలో ఒక ప్రశ్నకు నాలుగు ప్రత్యామ్నాయాలిచ్చి వాటికి తిరిగి మరొక నాలుగు ప్రత్యామ్నాయాలు ఇచ్చారు.
1) 1 మాత్రమే లేదా 2) 1 ఇంకా 2 లేదా మూడు 3) 1 ఇంకా 3 4) 1,2,3,4
ఈ తీరులో జవాబులిచ్చి గుర్తించమని అడుగుతున్నారు. ఇదే విధానాన్ని ఏపీపీఎస్‌సీ కూడా అమలు చేస్తోంది.
3. ఈసారి స్క్రీనింగ్‌ టెస్ట్‌ సిలబస్‌ను గణనీయంగా పెంచారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన, తత్ఫలిత సమస్యలు అనే అంశాన్ని చేర్చారు.
ఈ రకంగా రుణాత్మక మార్కులు, ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల విధానంలో మార్పు, బాగా పెరిగిన సిలబస్‌... మొదలైన వాటి వల్ల స్క్రీనింగ్‌ టెస్ట్‌ క్లిష్టతరం కాబోతోంది. అందుకే దీని సన్నద్ధత పటిష్ఠంగా సాగించాల్సివుంటుంది.
స్క్రీనింగ్‌... జాగ్రత్త సుమా
రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లో గ్రూప్‌-1 పోస్టులను ఉన్నతశ్రేణి పోస్టులుగా పరిగణిస్తారు. కాబట్టి సివిల్స్‌ అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు పోటీపడతారు. గ్రూప్‌-2 పరీక్షలో ఎంపికై ప్రస్తుతం గ్రూప్‌-2 అధికారులుగా పనిచేస్తున్నవారు కూడా గ్రూప్‌-1 రాస్తారు కాబట్టి ఇది సంఖ్యాపరంగానే కాకుండా గుణాత్మక (క్వాలిటీ) పరంగా కూడా పోటీ అధికమే. అందుకే పరీక్షా పద్ధతిలో పటిష్ఠమైన ప్రణాళికతో సన్నద్ధత ఆరంభించటం తప్పనిసరి.
గ్రూప్‌-1 పరీక్ష మూడు స్థాయుల్లో (స్క్రీనింగ్‌/ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూ) జరుగుతుంది. స్క్రీనింగ్‌లో మార్కులను తుది ఎంపికలో పరిగణించరు. ఇలా అనుకునే చాలామంది అతి విశ్వాసంతో ఈ పరీక్షపై శ్రద్ధపెట్టక మెయిన్స్‌పై అత్యధిక దృష్టిపెట్టే ఆలోచన చేస్తుంటారు. కానీ చివరకు తొలిమెట్టులోనే విఫలమవుతుంటారు. అందుకే అభ్యర్థులు ప్రిలిమినరీకి ప్రాధాన్యం ఇచ్చి సబ్జెక్టుపై సమగ్రంగా పట్టు సాధించాక మెయిన్స్‌ గురించి ఆలోచించటం ఉత్తమం. అలా అని మెయిన్‌ పరీక్షను నిర్లక్ష్యం చేయాలని కాదు.
నిజానికి ప్రిలిమినరీ సిలబస్‌లో ఉన్న విషయాలే చాలావరకూ మెయిన్స్‌ సిలబస్‌లో ఉంటాయి. కాబట్టి స్క్రీనింగ్‌ పరీక్షకు తయారవటం అంటే ఏకకాంలో మెయిన్‌ పరీక్షకు కూడా సిద్ధమవుతున్నట్లే అని భావించాలి.
ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతి కదా అని పెద్దగా సిద్ధమవనక్కర్లేదంటూ కొందరు భావిస్తుంటారు. అయితే దీనిలోనే సబ్జెక్టులన్నిటినీ విస్తృతంగా, విశ్లేషణాత్మకంగా చదవాల్సివుంటుంది. ప్రశ్నలను లోతుగా, మారుమూలవి కూడా అడిగే అవకాశం ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల విధానంలో ఉంటుంది. ఈ స్క్రీనింగ్‌ పరీక్ష ప్రధాన ఉద్దేశమే అత్యంత సమర్థులైన అభ్యర్థులను ప్రధాన పరీక్షకు ఎంపిక చేయటం. కాబట్టి స్క్రీనింగ్‌ పరీక్షలో ప్రశ్నలు చాలావరకూ కఠినంగానే ఉంటాయి.
రాష్ట్ర విభజన సమస్యలు
సిలబస్‌లో మొదటిసారి ప్రవేశపెట్టిన అంశమిది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన పాలనాపరమైన, ఆర్థికపరమైన, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయపరమైన సమస్యలన్నిటినీ అభ్యర్థులు అధ్యయనం చేయాలి. ప్రధానంగా రాష్ట్ర రాజధాని సమస్య- దాని నిర్మాణంలో ఎదుర్కొంటున్న సమస్యలు- ఉమ్మడి రాష్ట్రంలోని సంస్థలను తిరిగి స్థాపించుకోవటం-ఉద్యోగుల విభజన- ఆర్థిక వనరుల పంపిణీ- అత్యంత ముఖ్యమైన నదీజలాల పంపిణీ వివాదాలను సమగ్రంగా చదవాల్సివుంటుంది.
అయితే వీటన్నిటికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లోని అంశాలూ, అందులోని షెడ్యూళ్ళపై పకడ్బందీగా సిద్ధమవ్వాలి. ఈ చట్టం నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయని గుర్తించాలి.
స్క్రీనింగ్‌ పరీక్షలోని జనరల్‌స్టడీస్‌ సబ్జెక్టుల మౌలిక అంశాలపై పట్టు సాధించాక వాటి నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకోవాలి. ఏపీపీఎస్‌సీ, యూపీఎస్‌సీ గతంలో నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సబ్జెక్టులవారీగా పరిశీలిస్తే... ప్రతి సబ్జెక్టునూ ఏ దిశలో చదవాలో తెలుసుకోవచ్చు.
ఒక్కో సబ్జెక్టును సమగ్రంగా చదివాక గత ప్రశ్నపత్రాల్లోని సబ్జెక్టును టాపిక్‌ (అధ్యాయాల) వారీగా విభజించుకుని ప్రశ్నల బ్యాంకును రూపొందించుకోవాలి. వాటి ఆధారంగా స్వయంగా మరిన్ని ప్రశ్నలను తయారుచేసుకోవచ్చు. అన్ని సబ్జెక్టులనూ ఈ విధంగా చదివితే ఏ ప్రశ్న వచ్చినా కచ్చితమైన సమాధానం గుర్తించటానికి అవకాశాలు మెరుగవుతాయి. పరీక్షలో రుణాత్మక మార్కులు ఉంటాయనేది ఎట్టి పరిస్థితిలోనూ మర్చిపోకూడదు.

Posted on 02-01-2017