close

ఏపీపీఎస్సీ > ప్రధాన కథనాలు

రెండూ రాస్తే..!

* గ్రూప్‌-1 & 2 ఉమ్మడి వ్యూహం

ఏపీపీఎస్‌సీ ద్వారా గ్రూప్‌-1, 2 సర్వీసుల నియామక పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో ఏ పరీక్షను ఎంపిక చేసుకోవాలనే విషయంలో అభ్యర్థుల్లో చాలా సందేహాలు ఏర్పడ్డాయి. రెండు పరీక్షలూ రాసి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చాలామంది ఆశిస్తున్నారు. అయితే పరీక్షల తేదీలు దగ్గర దగ్గరగా ఉండటం, సిలబస్‌లు భారంగా ఉండటంతో ఏం చేయాలనే సంఘర్షణకి గురవుతున్నారు. ఇలాంటి సందర్భంలో రెండు పరీక్షల ఉమ్మడి ప్రిపరేషన్‌ సాధ్యాసాధ్యాలూ, ఆచరణాత్మకమైన వ్యూహం గురించి తెలుసుకుందాం!

రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో కీలక నియామకాలకు సంబంధించినవి గ్రూప్‌-1, గ్రూప్‌-2. ఈ రెండు పరీక్షలకూ ఉమ్మడి ప్రిపరేషన్‌ సాధ్యమేనా? అంటే.. సాధ్యమే! కాకపోతే మెయిన్స్‌ పూర్తయ్యేంతవరకూ పూర్తిస్థాయిలో సమయాన్నీ, శక్తినీ ఉపయోగించాలి. కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మార్చి 10న గ్రూప్‌-1 స్క్రీనింగ్‌ పరీక్ష, మే 5న గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముందుగా రెండు స్క్రీనింగ్‌లను గట్టెక్కడానికి ఏం చేయాలో చూడాలి.

* గ్రూప్‌-2 సిలబస్‌ను ఆధారం చేసుకుని ఇండియన్‌ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్‌ పాలిటీని లోతుగా అధ్యయనం చేస్తే గ్రూప్‌-1 స్క్రీనింగ్‌లోని పేపర్‌-1లోని సెక్షన్‌-బి, సిలు కొన్ని చాప్టర్లు మినహా సిద్ధమైనట్లే. అవే అంశాలు గ్రూప్‌-2 స్క్రీనింగ్‌లో, మెయిన్స్‌లో కూడా ఉపయోగపడతాయి.
* గ్రూప్‌-1 స్క్రీనింగ్‌లోని వరల్డ్‌ జాగ్రఫీ, ఇండియన్‌ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ చదివినట్లయితే గ్రూప్‌-2లోని ఇండియన్‌ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీలకు పనికొస్తుంది. కొత్తగా గ్రూప్‌-2కి చదవాల్సిన అవసరం ఏమీ లేదు.
* గ్రూప్‌-1 స్క్రీనింగ్‌లోని పేపర్‌-2లోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీని బాగా చదివితే గ్రూప్‌-2లోని జనరల్‌ స్టడీస్‌కి పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రూప్‌-2లో అదనంగా ఉన్న జనరల్‌సైన్స్‌ని గ్రూప్‌-1 ప్రిలిమినరీ పూర్తైన తరువాత గ్రూప్‌-2 స్క్రీనింగ్‌ పరీక్ష తేదీ మధ్య కాలంలో చదువుకుంటే సరిపోతుంది.
* గ్రూప్‌-1 స్క్రీనింగ్‌లోని పేపర్‌-2లోని సెక్షన్‌-1లో ఉన్న సాధారణ మానసిక సామర్థ్యాలను సరిగా సాధన చేస్తే గ్రూప్‌-2కు కొత్తగా సన్నద్ధమవ్వాల్సిన అవసరమేమీ ఉండదు.
* కరెంట్‌ అఫైర్స్‌ ఏ పరీక్షకైనా ఒకే రకంగా ఉంటాయి. కాబట్టి, రెండు స్క్రీనింగ్‌లకూ ఒకే ప్రయత్నంతో సన్నద్ధమవ్వొచ్చు.
* విభజన సమస్యలు, నవ నిర్మాణం అనేది అన్ని స్క్రీనింగ్‌ల్లోనూ తప్పనిసరి అంశంగా మార్చారు. అదేవిధంగా మెయిన్స్‌లోనూ ఒక వ్యాసరూప ప్రశ్నకి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి స్క్రీనింగ్‌ పరీక్షల్లో అంతర్భాగంగా చదువుకుంటే మంచిది.

ఏక కాలంలో...
ఈ విధంగా రెండు పరీక్షల్లోని అంశాలకు పైన పేర్కొన్న రీతిలో ప్రాధాన్యమిస్తూ చదివితే గ్రూప్‌-1 సన్నద్ధత పూర్తవుతుంది. గ్రూప్‌-1 స్క్రీనింగ్‌ పూర్తయిన వెంటనే అంటే మార్చి 10 నుంచి మే 5 మధ్యకాలంలో అంతర్జాతీయ, జాతీయ సంఘటనలు, విపత్తు నిర్వహణలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తద్వారా గ్రూప్‌-2 స్క్రీనింగ్‌కి కూడా సిద్ధపడొచ్చు.
ఇదే సమయంలో ఇండియన్‌ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, ఇండియన్‌ పాలిటీలను ఆబ్జెక్టివ్‌ విధానంలో చదువుకోవాలి. అలా గ్రూప్‌-2 స్క్రీనింగ్‌కు సిద్ధమవుతూనే జూన్‌ 10న రాయబోయే మెయిన్స్‌ పరీక్షకూ డిస్క్రిప్టివ్‌ తరహాలో సన్నద్ధం కావొచ్చు. అలా చేస్తే మెయిన్స్‌ ప్రిపరేషన్‌ను కూడా కొన్ని విభాగాల్లో పూర్తి చేయవచ్చు.
ఈ ప్రణాళిక ఆచరణీయమే. కానీ అభ్యర్థులు తమ శక్తియుక్తులను 100% వినియోగించినప్పుడు మాత్రమే రెండు పరీక్షల ఉమ్మడి ప్రిపరేషన్‌కి అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న విధానం వల్ల 2 స్క్రీనింగ్‌లు గట్టెక్కవచ్చేమో కానీ తర్వాత జరిగే మెయిన్స్‌ ప్రిపరేషన్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వాటిని యుక్తితో పరిష్కరించుకోవటం అవసరం.

తాజా విషయాలతో ముడిపడి...
గత నాలుగేళ్లుగా ఏపీపీఎస్సీ జరిపిన స్క్రీనింగ్‌ పరీక్షలను పరిశీలిస్తే కింది విషయాలు స్పష్టమవుతున్నాయి.
1. సైద్ధాంతిక అంశాల ప్రాధాన్యం కంటే వర్తమాన అంశాలతో ముడిపడిన ఆచరణాత్మక కోణంలో ప్రశ్నలు ఎక్కువ అడుగుతున్నారు. 2016లో జరిగిన గ్రూప్‌-2 పరీక్షలో ఎకానమీ విభాగంలో అడిగిన 150 ప్రశ్నలకు దాదాపు 70 ప్రశ్నలు దినపత్రికల ఆధారంగా తయారు చేసినవే.
2. పాలిటీలో కూడా వర్తమాన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ప్రశ్నలు ఎక్కువ అడిగారు. ఇలాంటి సందర్భంలో కూడా దినపత్రికలపై అవగాహన ఉన్న అభ్యర్థులు పూర్తి స్థాయిలో సమాధానాలు గుర్తించి మంచి ఫలితాలు పొందారు.
3. ఎప్పటిలాగే పాఠశాల స్థాయిలోని బేసిక్స్‌ నుంచి ఎక్కువ ప్రశ్నలు జనరల్‌ స్టడీస్‌లోని కొన్ని విభాగాల్లో వచ్చాయి. ముఖ్యంగా భౌగోళిక శాస్త్రం, విపత్తు నిర్వహణ, పర్యావరణ అంశాలు, జనరల్‌ సైన్స్‌లలో ఈ కేటగిరీ ప్రశ్నలు ఎక్కువ వచ్చాయి. అందువల్ల 6-9 తరగతుల పాఠ్యపుస్తకాలపై పట్టు సాధిస్తే తప్పనిసరిగా మంచి స్కోరుకు ఆస్కారముంది.
4. యోజన, ఆంధ్రప్రదేశ్‌ మ్యాగజీన్లను చదవడం ద్వారా ప్రభుత్వ దృక్పథాలు స్పష్టంగా అర్థమవుతాయి. దానివల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆర్థిక ప్రణాళికలతో పాటు ఇతర గవర్నెన్స్‌ అంశాలపై కూడా అవగాహన ఏర్పడుతుంది. అందువల్ల గ్రూప్‌- 1, 2 పరీక్షలు ఉమ్మడిగా రాయాలనుకునే అభ్యర్థులు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సన్నద్ధతలో సౌలభ్యం సమకూరుతుంది.
5. ఆధునిక భారతదేశ చరిత్ర, పాలిటీ విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోనే తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
6. ఇండియన్‌ ఎకానమీ విభాగంలో ఒకటి రెండు చాప్టర్లు తప్ప మిగతా చాప్టర్‌లలో కరెంట్‌ ఎకానమీతో ముడిపడిన ప్రశ్నలకు ప్రాధాన్యం ఉంది.
7. ఉమ్మడి ప్రిపరేషన్లో భాగంగా గ్రూప్‌ - 1 మెయిన్స్‌ ప్రశ్నలు ఎదుర్కోవాలంటే గ్రూప్‌ 2 స్థాయిలోని ఫ్యాక్ట్స్‌ చదివేటప్పుడు 10 మార్కుల ప్రశ్నలను ఊహించుకుని సమాధానాన్ని ఆలోచించుకున్నట్లయితే మెయిన్స్‌ ప్రిపరేషన్లో కూడా సౌలభ్యం ఏర్పడుతుంది.
8. స్క్రీనింగ్‌ పరీక్షల్లో మానసిక సామర్థ్యాలు స్కోరింగ్‌ విభాగానికి చెందినవి. తక్కువ సమయంలో తెలివైన ప్రాక్టీస్‌ ద్వారా మంచి మార్కులు పొందవచ్చు. కాబట్టి అభ్యర్థులు ఈ విభాగంపై పట్టు సాధిస్తే స్క్రీనింగ్‌ పరీక్షలో ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
9. కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో పరీక్షకు 4 రోజుల ముందు చదివేవారికి పెద్ద పట్టు దొరకదు. అందువల్ల కరెంట్‌ అఫైర్స్‌ని ఇప్పటి నుంచి విభాగాల వారీగా అంటే... రాజకీయ అంశాలు, ఆర్థిక అంశాలు, శాస్త్ర సాంకేతిక అంశాలు, క్రీడాంశాలు అని స్పష్టమైన విభజన చేసుకోవాలి. ప్ర¦వేశాలు, వ్యక్తులు, ప్రాధాన్యాలు అనే ఉప అంశాల కింద విభజించుకుని ఇవన్నీ చదవాలి.
ప్రస్తుత పరీక్షల తేదీల నేపథ్యంలో ఉమ్మడి ప్రిపరేషన్‌ అయితే అసాధ్యమేం కాదు. కానీ అభ్యర్థుల సహనం, ఏకాగ్రత, సమయపాలన మాత్రమే దీనికి ఉపకరిస్తాయి. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే రెండు పరీక్షల్లోనూ చక్కగా రాణించే అవకాశం ఉంటుంది.

ఇలా చేస్తే సరి!
సమస్య: గ్రూప్‌ 1 మెయిన్స్‌ డిస్క్రిప్టివ్‌ విధానానికి చెందింది. దీనిలో రాత ప్రాక్టీస్‌ చాలా ఉండాలి. ప్రశ్న - సమయాన్ని బట్టి సమాధానాన్ని పెంచడం, తగ్గించడం చేయగలగాలి. అది రాత ప్రాక్టీసు ద్వారానే అలవడుతుంది. పరీక్షల తేదీలను బట్టి రాత ప్రాక్టీసుకి ఎక్కువ సమయం దొరికేలా కనిపించడం లేదు.
పరిష్కారం: స్క్రీనింగ్‌ పరీక్షల తర్వాత రాత ప్రాక్టీస్‌ సరి కాదు. ఇప్పటి నుంచే స్క్రీనింగ్‌ చదువుకుంటూ కనీసం రెండు గంటలు అయినా ‘ప్రశ్న - సమాధానాన్ని’ రాసుకుంటూవుండాలి. రాత నిపుణతను పెంచుకోవాలి.
సమస్య: గ్రూప్‌ 2 మెయిన్స్‌లో సిలబస్‌లోని ఏ అంశమైనా ప్రశ్నగా మారే అవకాశం ఉంది. అందువల్ల ఫ్యాక్ట్స్‌, సమాచారాన్ని గుర్తు చేసుకోవాల్సిన శ్రమ ఉంటుంది. అందువల్ల గ్రూప్‌ 1 విధానంలో రాత ప్రాక్టీసుకి ప్రాధాన్యం ఇస్తే గ్రూప్‌ 2కి ప్రాధాన్యం తగ్గే ప్రమాదముంది.
పరిష్కారం: తప్పనిసరిగా స్క్రీనింగ్‌ సమయంలోనే ఆబ్జెక్టివ్‌ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్ట్స్‌ మొదలైనవి అదనపు శ్రమతో అధ్యయనం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
సమస్య: గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలో చాయిస్‌ పద్ధతిలో మొత్తం సిలబస్‌లో 50 నుంచి 60 శాతం మాత్రమే చదువుతారు. కానీ గ్రూప్‌ 2 పరీక్షలో 100% సిలబస్‌ చదవాల్సి ఉంటుంది. అందువల్ల ఉమ్మడి ప్రిపరేషన్‌ విధానం అంత తేలికేమీ కాదు.
పరిష్కారం: గ్రూప్‌ 1 మెయిన్స్‌లో చాయిస్‌ విధానంతో చదివినప్పటికీ గ్రూప్‌ 1 స్క్రీనింగ్‌ పరీక్ష కోసం కూడా 100% సిలబస్‌ సిద్ధమవ్వాలి. ఇక గ్రూప్‌ 2 మెయిన్స్‌కి కూడా 100% చదవాల్సిందే కదా! అందువల్ల స్క్రీనింగ్‌ ప్రిపరేషన్‌ సమయంలోనే గ్రూప్‌ 2 అంశాలు మొత్తం సన్నద్ధమవ్వడం మేలు.

Posted on 07.01.2019