close

ఏపీపీఎస్సీ > గ్రూప్‌-1 గైడెన్స్‌

మెయిన్స్‌ పోటీకి దీటైన వ్యూహం!

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1లో ఆర్డీవోలాంటి ఉన్నతస్థాయి పోస్టుల సంఖ్య కొద్దిగా ఎక్కువగా ఉండటంతో ఈసారి పోటీ పెరిగింది. ముఖ్యంగా సాధారణ అభ్యర్థులు సివిల్స్‌ వారితో తలపడాల్సి ఉంది. ఇంకా పరీక్షలకు దాదాపు 150 రోజులుంది. ప్రిపరేషన్‌ లోపాలను పసిగట్టి తగిన వ్యూహాలను రూపొందించుకోడానికి ఈ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.

ప్రిలిమినరీ పరీక్షలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు ఇప్పటికే మెయిన్స్‌ సన్నద్ధత ప్రారంభించారు. దాంతోపాటు నమూనా పరీక్షలను సాధన చేస్తున్నారు. అయితే ‘ప్రిలిమినరీలో క్వాలిఫై అవుతామా? లేదా?’ అనే సందేహంతో ఉన్నవారిలో చాలామంది ఇంకా ప్రిపరేషన్‌కి సిద్ధపడలేదు. ప్రిలిమినరీ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసే నిష్పత్తిపై కొంత సందేహం ఉండటం వల్ల ఇంకొందరు అభ్యర్థులు చదవాలా లేదా అని ఇంకా తడబడుతున్నారు.

గ్రూపు-1 పరీక్షను లక్ష్యంగా నిర్దేశించుకున్నవారు ఎటువంటి సందేహం లేకుండా మెయిన్స్‌కు సిద్ధపడటం మంచిది. ఒకవేళ మెయిన్స్‌కి అర్హత పొందలేకపోయినా ఏదో ఒకరకంగా ఆ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది.

గ్రూప్స్‌ అభ్యర్థులకు ఎప్పుడూ సివిల్స్‌ వారి నుంచి పోటీ ఎదురవుతూనే ఉంటుంది. ఈసారి టాప్‌ పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోటీ మరీ పెరిగింది. గత గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో సివిల్స్‌ అభ్యర్థులు అత్యధికంగా ఎంపిక కావడంతో ఈసారి వారికి మరింత ప్రోత్సాహక వాతావరణం ఏర్పడింది. అయితే సివిల్స్‌ అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గతంలో డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ పేపర్‌ ఉండటం వల్ల స్థానిక విషయాల మీద పెద్దగా పట్టు లేకపోయినా రాణించారు. కానీ ఈసారి అటువంటి పరిస్థితి కనిపించదు. అందువల్ల సివిల్స్‌ అభ్యర్థులు గ్రూప్స్‌ సాధించాలంటే స్థానిక విషయాలైన ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళికాంశాలు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, విభజన అనంతరం సమస్యలపై గట్టి పట్టు పెంచుకోవాలి. తగినంత సమయం ఉండటం వల్ల ప్రిపరేషన్‌ను మెరుగు పరుచుకోడానికి వీలుంది.

పేపర్‌-1: వ్యాసంపై నిర్లక్ష్యం వద్దు
ఇక గ్రూప్‌-1 పరీక్షలను మాత్రమే నమ్ముకొని ఇప్పటి వరకూ ప్రయత్నాలు చేస్తున్నవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యాసరచనలో సరైన మెలకువలు పాటించాలి. అవి తెలియకపోవడంతో చాలామంది మార్కులు సాధించలేకపోతున్నారు. అభ్యర్థుల దగ్గర తగిన సమాచారం ఉంటుంది కానీ, దాన్ని వ్యాసరూపంలో ఏవిధంగా పొందుపరచాలో అవగాహన ఉండటం లేదు. ఫలితంగా మార్కులు కోల్పోతున్నారు. అందువల్ల వ్యాసరచన లాంటి అంశాన్ని చివరి మూడు నెలల్లో చదువుదామని అనుకోవద్దు. దీనిపై సమగ్రంగా తయారవ్వాలి. సరైన సాధన ఇప్పటి నుంచే చేయాలి.

పేపర్‌-2: కొత్తగా భౌగోళికాంశాలు
కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలను చేర్చారు. దాదాపుగా చాలామంది భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక విశేషాలను ఆబ్జెక్టివ్‌ కోణంలో చదువుతారు. దీంతో 10 మార్కుల ప్రశ్నలకు అవసరమైన సమాచారాన్ని రాసేందుకు తగిన నైపుణ్యాన్ని పొందలేకపోతున్నారు. అందువల్ల ఈ సమయంలో అటువంటి పరిజ్ఞాన సంబంధిత విషయాలమీద దృష్టిపెడితే మంచి ఫలితాలను పొందవచ్చు.

పేపర్‌-3: సమాచార సేకరణకు తగినంత సమయం
సివిల్స్‌ వారు మినహా గ్రూప్‌-1 మాత్రమే రాసే అభ్యర్థులకు గవర్నెన్స్‌, ఎథిక్స్‌ అనే విభాగంపై కొంత ఆందోళన కనిపిస్తోంది. సరైన సమాచారం లేకపోవడం, తెలుగులో మెటీరియల్‌ దొరక్కపోవడం, అప్లికేషన్‌ ధోరణితో సమాధానాలు రాసేందుకు సరైన మార్గదర్శకత్వం కొరవడటం అనే సమస్యలు దీనికి కారణం. ఇప్పుడు దొరికిన ఈ సమయాన్ని ఈ విభాగంలో గట్టి పట్టు సాధించేందుకు చక్కగా ఉపయోగించుకోవాలి. నిపుణుల సాయంతో సిలబస్‌ ప్రకారం సమాచారాన్ని సేకరించుకొని ప్రిపేర్‌ కావాలి.

పేపర్‌-4: డైనమిజం కావాలి
ఎకానమీలో ఉండే డైనమిజాన్ని అందుకోవటంలో అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వానికి ఒక ప్రత్యేకమైన విజన్‌, పథకాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకుని తమ సమాధానాల్లో పొందుపరచాలి. గత ప్రభుత్వపు విజన్‌నీ, పథకాలనూ, దృక్పథ పత్రాలనూ నామమాత్రంగా వినియోగించాలి. అందుకు అనుగుణంగా సమాచారాన్నీ, గణాంకాల్నీ సేకరించుకోవాలి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి దృక్కోణాలు, దృక్పథాలు మారకపోయినా గణాంకాలు మారుతున్నాయి. కాలంతోపాటు వచ్చే ఈ మార్పులను పసిగట్టి ప్రిపరేషన్లో భాగంగా అనుసంధానించటం అవసరం. కేవలం పుస్తక సమాచారానికే పరిమితమై ప్రిపేరయ్యే ధోరణి నుంచి బయటికి వచ్చి ఈ డైనమిజాన్ని అలవర్చుకోడానికి అందుబాటులో ఉన్న ఈ సమయాన్ని వినియోగించుకోవాలి.

పేపర్‌-5: అన్వయ ధోరణిపై దృష్టి
శాస్త్ర సాంకేతిక విషయాలంటే కొందరు అభ్యర్థులు ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా అన్వయ కోణాన్ని అలవర్చుకోవటంలో తడబడుతున్నారు. ఇప్పుడున్న సమయాన్ని ఉపయోగించుకుని అప్లికేషన్‌ ధోరణిలో తయారయ్యేందుకు అభ్యర్థులు వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆర్ట్స్‌ గ్రాడ్యుయేషన్‌ నేపథ్యమున్న అభ్యర్థులు ఈ పేపర్‌ని నిర్లక్ష్యం చేస్తే ఆశించిన ఫలితం దాదాపు అందదని గుర్తుంచుకోవాలి. బీటెక్‌ లాంటివి చదివిన అభ్యర్థులైతే బయోసైన్స్‌ ఆధారిత శాస్త్రసాంకేతిక విషయాలను అర్థం చేసుకోడానికి కష్ట పడుతున్నారు. ఇలాంటి చిక్కులను అధిగమించేందుకు సరైన ప్రణాళికను ఈ సందర్భంలో రూపొందించుకోవచ్చు. అందుబాటులో ఉన్న అయిదు నెలల సమయంలో మొదటి రెండు నెలలను వ్యక్తిగతంగా గమనించిన లోపాలను సరిదిద్దుకోడానికి ఉపయోగించుకోవాలి. మిగతా సమయంలో పూర్తిస్థాయి ప్రిపరేషన్‌ను సాగించాలి.

సొంత నోట్సుతో ఎన్నో లాభాలు
గ్రూప్‌-1 మెయిన్స్‌ వంటి పరీక్షలకు రాత సాధన ఎంతో ముఖ్యం. తగినంత సమయం ఉంది కాబట్టి సొంత నోట్స్‌ తయారు చేసుకోవడంపై దృష్టిపెడితే, అది రాత సాధనలాగా కూడా ఉపయోగపడుతుంది. సొంత నోట్స్‌ వల్ల సమాధానంలో తాజాదనం కనిపిస్తుంది. సహజత్వాన్ని, కొత్తదనాన్ని ఎగ్జామినర్‌ గుర్తించే అవకాశం ఉంది. నోట్సు రాసుకోవటం వల్ల వివిధ విషయాలను తేలికగా గుర్తుంచుకునే వీలు కలుగుతుంది. అందువల్ల ఈ అయిదు నెలల సమయాన్ని సమర్థంగా వినియోగించుకోవాలి. ఇప్పటికే సొంత నోట్సు తయారుచేసుకుని అన్ని రకాలుగా సిద్ధపడిన అభ్యర్థులు ఈ సమయంలో మాక్‌ పరీక్షలకు హాజరై తమ లోపాలను గ్రహించి, సవరించుకోవటంపై దృష్టి పెట్టాలి. వచ్చిన మార్కుల స్థాయి పరిశీలించుకుని మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఏం చేయాలో చూసుకోవాలి.

Posted on 09-07-2019