close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

కార్యదర్శులుగా చేసే కార్యాచరణ

గ్రూప్‌-3లో 1055 పంచాయితీ కార్యదర్శుల పోస్టులకు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దాదాపు 8 లక్షల మంది దీనికి సంబంధించిన రాతపరీక్ష రాసే అవకాశం ఉంది. ఈ రకంగా తీవ్రమైన పోటీ ఉండే పరీక్షల్లో ఇది ఒకటి. దీనికి ప్రణాళికాయుతంగా సంసిద్ధమవటం ఎలాగో చూద్దాం!
అభ్యర్థుల పోటీ భారీగా ఉంటుంది కాబట్టి స్క్రీనింగ్‌, మెయిన్స్‌ పద్ధతిలో పరీక్ష జరుగనుంది. ఒక విధంగా చెప్పాలంటే స్క్రీనింగ్‌ పరీక్షలో గట్టెక్కటమే ప్రధానమైన అవరోధం అని చెప్పవచ్చు.
150 మార్కులకు 150 ప్రశ్నలతో స్క్రీనింగ్‌ పరీక్ష జరుగుతుంది. 13 అంశాల రూపంలో విస్తృతమైన సిలబస్‌ను ఇచ్చారు. ఇంత సిలబస్‌పై పట్టు సాధించాలంటే కనీసం 4 నెలల సమయం పడుతుంది. ఆ తరువాత మెయిన్స్‌ సిలబస్‌పై అవగాహనకు మరో 3 నెలల సమయం కావాలి. అయితే సిలబస్‌ రూపురేఖలను బట్టి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ (అనుసంధాన) పద్ధతిని అనుసరిస్తే మొత్తంగా 4- 5 నెలల కాలంలోనే పట్టు సాధించవచ్చు.
స్క్రీనింగ్‌ పరీక్షలోని 13 అంశాల్లో మొదటి ఆరు అన్ని పోటీ పరీక్షల జనరల్‌స్టడీస్‌లో కన్పించేవే! ఇవే అంశాలు పంచాయతీ కార్యదర్శుల మెయిన్స్‌ పరీక్షలోని జనరల్‌ స్టడీస్‌లో ఉన్నవే.
9, 10, 11, 12, 13 పాఠ్యాంశాలు మెయిన్స్‌లోని పేపర్‌ 2లో ఉన్న అధ్యాయాలు కావటం గమనించాల్సిన విషయం.
ఇక స్క్రీనింగ్‌ పరీక్షలో మెయిన్స్‌ సిలబస్‌తో సంబంధం లేకుండా కొత్తగా కన్పిస్తున్నవి రెండు పాఠ్యాంశాలు మాత్రమే. అవి
1) ఏపీ విభజన సమస్యలు
2) భారతదేశంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పరిణామం- రాజ్యాంగ సవరణలు- వివిధ కమిటీలు
ఈ విధంగా స్క్రీనింగ్‌ సిలబస్‌ని సూక్ష్మ పరిశీలన చేస్తే స్పష్టంగా పరిగణించదగింది ఏమిటంటే- మెయిన్స్‌, ప్రిలిమ్స్‌ అనే భేదం లేకుండా ఉమ్మడి సిలబస్‌పై పట్టు సాధించటం. ఇలా ఉమ్మడి సిలబస్‌లో లేని మెయిన్స్‌ పాఠ్యాంశాలను ప్రిలిమ్స్‌ ముగిశాక చదవటం ప్రారంభించాలి. అవి
పేపర్‌-Iలో-
* విపత్తు నిర్వహణ అంశాలు
* భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక అంశాలు
* పర్యావరణ పరిరక్షణ- సుస్థిర అభివృద్ధి
పేపర్‌-IIలో-
* గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ప్రధాన పథకాలు
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అభివృద్ధి శాఖలు
* సామాజిక భాగస్వామ్యం కల్గిన గ్రామీణాభివృద్ధి సంస్థలు
* స్థానిక సంస్థల ఆదాయవ్యయ నిర్వహణ
* వివిధ పథకాల కింద వచ్చే నిధుల నిర్వహణ, ఖాతాల నిర్వహణ
ఈ విధంగా మొత్తం సిలబస్‌ని విశ్లేషించుకుంటే సన్నద్ధత ఎలా ప్రారంభించాలో అర్థమైపోతుంది. ఆ నేపథ్యంలోనే మెయిన్స్‌ సిలబస్‌ని (మినహాయించినవి కాకుండా) పరిగణించి సిలబస్‌ అధ్యయనం ప్రారంభించాలి.
సన్నద్ధతలో సమస్యలు ఏమిటంటే?
* ఇతర పరీక్షార్థుల పోటీ తక్కువే:
మధ్యతరగతి, గ్రామీణ నిరుద్యోగులు ఈ ఉద్యోగాలపై ఆశలు ఎక్కువ పెట్టుకుంటారు. కానీ గ్రూప్‌-I, II,సివిల్స్‌ అభ్యర్థులు 2014లో మాదిరిగా పోటీపడి తన్నుకుపోతారేమో అనే ఆందోళన కన్పిస్తుంటుంది. ఈసారి అటువంటి పరిస్థితి లేదు.
ముఖ్యంగా గ్రూపు-2 అభ్యర్థులు మే 2017 వరకు గ్రూప్‌-2 పరీక్షలోనే సతమతం అవుతూ వుంటారు. గ్రూప్‌-1 అభ్యర్థులు జూన్‌/జులై 2017 వరకూ డోలాయమాన స్థితిలోనే ఉంటారు. మారిన సిలబస్‌ రీత్యా సివిల్స్‌ అభ్యర్థులు దృష్టి పెట్టినా పెద్ద ప్రయోజనం ఉండదు. ఇక డిగ్రీ కళాశాలల లెక్చరర్స్‌ వంటి పోస్టుల నోటిఫికేషన్లు, ఇంజినీరింగ్‌ నోటిఫికేషన్లు కూడా విడుదలయ్యాయి కాబట్టి ఇతర అభ్యర్థుల ఒత్తిడి దాదాపుగా ఈసారికి ఉండదు. పైగా సిలబస్‌లో ప్రత్యేకత వల్ల సరైన ప్రయత్నం లేకపోతే వారికి పెద్ద ప్రయోజనం ఉండదు.
అందువల్ల పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంపై ఏకదృష్టి పెట్టినవారు ఆందోళన లేకుండా ఇప్పటి నుంచి పట్టు సాధిస్తే లక్ష్యానికి చేరువ కావొచ్చు.
* శిక్షణ తప్పనిసరి కాదు:
గ్రామీణ, పేద అభ్యర్థులు శిక్షణ తీసుకోలేరు. కోచింగ్‌ తీసుకోకపోతే ‘వెనుకబడిపోతాం’’ అనే నిరాశలో వీరు ఉండవచ్చు. గత రెండు దశాబ్దాలుగా వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే కోచింగ్‌ వల్లనే ఉద్యోగాలు వస్తాయనేది అపోహ మాత్రమే అని అర్థమవుతుంది. లక్షల మంది కోచింగ్‌ తీసుకుంటున్నారు. వందలాది మంది ఎంపికవుతున్నారు. ఎంపికైనవారిలో కనీసం 50% మంది సొంత తయారీ, ఏకలవ్య విధానంలో చదివినవారే కన్పిస్తున్నారు. కష్టపడే తత్వం, గ్రహణశక్తి, విషయ అవగాహన సామర్థ్యం ఉంటే శాస్త్రీయ, ప్రణాళికయుతంగా చదివి తప్పక విజయం సాధించవచ్చని గుర్తించాలి.
* మార్కెట్లో మెటీరియల్‌ జోరు:
నియామక ప్రకటనల తరుణంలో కుప్పలుతెప్పలుగా మార్కెట్లోకి వస్తున్న పుస్తకాలు అభ్యర్థుల్ని రకరకాల ఒత్తిడులకు గురిచేస్తున్నాయి. ‘ఏ పుట్టలో ఏ పాముందో!’ అన్న చందాన దేన్నుంచి ఏ బిట్టు వస్తుందో అని సగటు అభ్యర్థి అన్ని పుస్తకాలూ చదవాల్సిందేనా అని ఒత్తిడికి గురవుతున్నాడు.
ఇక్కడో విషయం గమనించాలి. ఇటీవల ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌, లైవ్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీపీఎస్సీ కార్యదర్శి ‘ప్రభుత్వ ప్రామాణిక ప్రచురణలే ఆధారం’ అని స్పష్టం చేశారు. ఎంత పేరున్న ప్రచురణే అయినా అది ప్రభుత్వ సమాచారంతో ఏకీభవించకపోతే ఉపయోగం ఉండదు. దీన్ని గ్రహించి కింది వనరులపై దృష్టి నిల్పండి.
* పాఠశాల స్థాయి ప్రభుత్వ ప్రచురణలు
* తెలుగు అకాడమీ ప్రభుత్వ ప్రచురణలు
* విశ్వవిద్యాలయాల ప్రభుత్వ ప్రచురణలు
* వార్తాపత్రికలు
* ప్రభుత్వ వెబ్‌సైట్‌ల సమాచారం
* ప్రభుత్వం ఇచ్చే వివరాలు
* గత ప్రశ్నపత్రాలు
* క్లిష్టతపై అపోహలు:
‘ప్రశ్నపత్రం ఎక్కువ కఠినంగా ఉంటుంది’ అనే మరో అపోహ అభ్యర్థుల్ని తప్పుదోవ పట్టిస్తుంది. తెలంగాణలో జరిగిన గ్రూపు-2 పరీక్ష అనుభవం ఇందుకు ఒక ఉదాహరణ. రకరకాలైన కారణాల వల్ల తెలంగాణ అభ్యర్థుల్లో ‘ఈసారి సివిల్స్‌ స్థాయిలో గ్రూపు-2 పరీక్ష ఉంటుంది’ అనే ప్రచారం జరిగింది. అభ్యర్థులు ‘సివిల్స్‌ స్థాయి’ ఏమిటో సరిగా గ్రహించకుండా లోతుగా, విస్తృతంగా చదివారు. తీరా వచ్చిన ప్రశ్నపత్రాలు చూసి కష్టపడిన చాలామంది కంగుతిన్నారు. ‘కష్టపడినవారికీ, పడనివారికీ తేడా ఏమీ లేదు’ అంటూ నిట్టూర్పులు విడిచారు.
కానీ వాస్తవం ఏమిటంటే... చాలా అరుదుగా తప్ప దాదాపుగా పోటీ పరీక్షల్లో ధోరణి ఇలాగే కొనసాగుతుంది. 2013-14లో జరిగిన వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శుల పరీక్షలు కూడా ఇదే ధోరణితో కొనసాగాయి. అందువల్ల ‘అతి’గా పరీక్షను వూహించకుండా.. ముందు సగటు స్థాయి ప్రమాణాలతో సిలబస్‌ అంశాలపై పట్టు సాధిస్తే... దాదాపు విజయతీరం చేరవచ్చు. కఠినత్వం ఎక్కువ వూహించుకొని, సగటు ప్రమాణాల్లో వెనుకబడినవారికి అపజయమే మిగిలింది, మిగులుతుంది.
* రెండో పేపర్‌ సిలబస్‌?
మెయిన్స్‌లోని 2వ పేపర్‌ సిలబస్‌ కొద్దిగా ఇబ్బందిగా అభ్యర్థులకు పరిణమించే అవకాశం ఉంది. అందువల్ల ఈ పేపర్‌పై ఎంత పట్టు బిగించగల్గితే అంత ఎక్కువ అనుకూల ఫలితం రావచ్చు. ఈ పేపర్‌కి సంబంధించిన కొన్ని పాఠ్యాంశాలూ, ప్రామాణిక మెటీరియల్‌ దొరక్కపోవటం కూడా సన్నద్ధత సమస్యల్లో ఒకటి. ఏపీ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన అంశాలు గ్రూపు-2 ఎకానమీ నుంచి అధ్యయనం చేయాల్సి వుంటుంది.
సిలబస్‌ రూపురేఖలను బట్టి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ (అనుసంధాన) పద్ధతిని అనుసరిస్తే మొత్తంగా 4- 5 నెలల కాలంలోనే పట్టు సాధించవచ్చు.

Posted on 02-01-2017