ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

అధ్యాపక పోటీలో నెగ్గేద్దాం!

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకుల పోటీపరీక్షకు ఇటీవల ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రస్థాయిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇవి ప్రముఖమైనవని చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయ వృత్తి, పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ పోస్టులు మంచి అవకాశం!
మొదటిసారిగా డిగ్రీ కళాశాల అధ్యాపకుల పోటీ పరీక్షను ఏపీపీఎస్‌సీ ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహిస్తోంది. దీనికి ముందు ఓఎంఆర్‌ సీటు పద్ధతిలో పరీక్ష ఉండేది. చాలామంది అభ్యర్థులు ఇతర పోటీపరీక్షలను ఓఎంఆర్‌ విధానంలో రాసి ఉంటారు.
అలా కాకుండా అభ్యర్థులు పరీక్షహాలులో నేరుగా ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ రాయడం వల్ల కొంత ఇబ్బందికి గురి కావచ్చు. కాబట్టి ఆన్‌లైన్‌ టెస్టులను అభ్యాసం చేయడం ఉత్తమం. దీనికి ఏపీపీఎస్‌సీ అవకాశం కల్పిస్తున్నది. తమ వెబ్‌సైట్‌ www.psc.ap.gov.in లో ఉచితంగా ఆన్‌లైన్‌ పరీక్షలు అభ్యాసం చేయవచ్చు. దీనివల్ల ఆన్‌లైన్‌ పరీక్షా పద్ధతిపై అవగాహన కలుగుతుంది.
అభ్యర్థులు పరీక్ష హాలులో ఇబ్బంది కలుగకుండా ఉండటానికీ, ఎక్కువ మార్కులు సంపాదించడానికీ జనరల్‌ స్టడీస్‌, సబ్జెక్టు సంబంధ పాత ప్రశ్నపత్రాలను సాధన చేయటం అవసరం.
పరీక్షా విధానం
పరీక్షలో మొత్తం 500 మార్కులకుగాను రెండు దశలుంటాయి. మొదటి దశ పరీక్ష ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. దీనిని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ దశలో రెండు పేపర్లుంటాయి.
పేపర్‌-I: ఇది జనరల్‌ స్టడీస్‌ పేపర్‌. 150 ప్రశ్నలుంటాయి. వీటికి 150 మార్కులను కేటాయించారు. అంటే ప్రతి ప్రశ్నకూ 1 మార్కు. నిర్దేశించిన సమయం 150 నిమిషాలు (2 1/2 గంటలు).
పేపర్‌-II: ఇది అభ్యర్థి నిర్ణీత సబ్జెక్టుకు సంబంధించినది. ఈ పేపర్‌లో 150 ప్రశ్నలుంటాయి. 300 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులను కేటాయించారు. నిర్దేశించిన సమయం 150 నిమిషాలు (2 1/2 గంటలు).
ఈ 2 పేపర్లలో ప్రతి ప్రశ్నకూ 1/3 వంతున రుణాత్మక మార్కులుంటాయి.
రెండో దశలో మౌఖిక పరీక్ష ఉంటుంది. మొదటి దశలో అభ్యర్థి రాసిన రెండు పేపర్లలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ప్రకారం 1:2 నిష్పత్తిలో (ఒక పోస్టుకు ఇద్దరిని) అభ్యర్థులను మౌఖిక పరీక్షకు పిలుస్తారు. దీనికి 50 మార్కులను కేటాయించారు.
పేపర్‌-1 ప్రాధాన్యం
ఈ పేపర్‌ జనరల్‌ స్టడీస్‌ (జీఎస్‌)లో అనేక అంశాలుంటాయి. దీని పరిధి కూడా చాలా ఎక్కువ. అభ్యర్థులకు తమ సబ్జెక్టుపై సాధారణంగా పట్టు ఉంటుంది. కానీ జనరల్‌ స్టడీస్‌ అంశాలపై అవగాహన ఉండదు. ఈ పరీక్షలో జనరల్‌ స్టడీస్‌ కీలకం. ప్రశ్నలు విస్తృతంగా జీఎస్‌లోని అన్ని అంశాలపై వస్తాయి.
మొదటిసారిగా ఈ పోటీ పరీక్షకు తయారవుతున్నవారికి జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ కొద్దిగా కష్టమనే చెప్పుకోవాలి. ఇటీవలే పీజీ పూర్తి చేసిస్లెట్‌/నెట్‌ అర్హత పొందినవారు లేదా ఇటీవలే పీహెచ్‌డీ చేసినవారు జనరల్‌ స్టడీస్‌ను తేలికగా తీసుకుంటారు. వీరికి వీటిలోని అంశాలపై పట్టు ఉండదు. ఇటువంటివారు జనరల్‌ స్టడీస్‌పై దృష్టి సారించాలి. వీరికి ఈ మార్కులు కీలకమవుతాయి.
సబ్జెక్టు పేపర్‌ తయారీ
సబ్జెక్టు పేపర్‌లో ఉండే సిలబస్‌- అభ్యర్థులు డిగ్రీ, పీజీల్లో చదివిన సిలబస్‌ ఎక్కువ భాగం ఒకేరకంగా ఉంటుంది. ఇది అనుకూలాంశం. అకడమిక్‌ పరీక్షలలో బాగా పట్టు ఉన్నవారు ఈ పేపర్‌లో ఎక్కువ మార్కులు సంపాదించవచ్చు. ఈ పేపర్‌లో ఇచ్చిన సిలబస్‌లోని అంశాలను ఇంటర్‌ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు విస్తృతంగా చదవాలి.
ఇటీవలే నెట్‌, స్లెట్‌లలో అర్హత పొందినవారికి ఈ పేపర్‌ సులభతరం. నెట్‌, స్లెట్‌లో ఉన్న సిలబస్‌నూ, ప్రస్తుత పేపర్‌లో సిలబస్‌నూ పోల్చుకొని వేరుగా ఉన్నవాటిని ఎక్కువగా చదవాల్సివుంటుంది.
తెలుగు మీడియం అభ్యర్థులు తెలుగు అకాడమీ వారి ఇంటర్‌, డిగ్రీ స్థాయి పుస్తకాలను, తెలుగు అకాడమీ ప్రత్యేక ప్రచురణలను తీసుకొని సన్నద్ధత సాగించవచ్చు.
అధ్యయనం ముగిశాక పాత ప్రశ్నపత్రాలను అభ్యాసం చేయడం మరవద్దు. పేపర్‌-IIలోని సబ్జెక్టు సంబంధిత అంశాలపై పట్టు సాధించడంవల్ల ఇంటర్వ్యూలో సబ్జెక్టు నిపుణులు అడిగిన ప్రశ్నలకు తేలికగా సమాధానం చెప్పగలుగుతారు. దీనివల్ల విజయం సాధించే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
పేపర్‌ -I సిలబస్‌
1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన సంఘటనలు 2. వర్తమాన అంశాలు, ప్రాంతీయం, జాతీయం, అంతర్జాతీయం 3. సామాన్య శాస్త్రం: నిత్యజీవితంలో దీని అనువర్తనాలు, శాస్త్ర సాంకేతిక రంగాలలో సమకాలీన అభివృద్ధి, సమాచార సాంకేతికత (ఐటీ) 4. భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారత దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర 5. భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన: రాజ్యాంగ అంశాలు, ప్రజా విధానాలు, పరిపాలనా సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ 6. స్వాతంత్రానంతరం నుంచి భారతదేశంలో జరిగిన ఆర్థికాభివృద్ధి 7. భారత ఉపఖండ భౌతిక భూగోళ శాస్త్రం 8. విపత్తు నిర్వహణ: విపత్తుకు గురి అయ్యే ప్రాంతాలు, విపత్తు నివారణ, ఉపశమన చర్యలు. రిమోట్‌ సెన్సింగ్‌, GIS, అనువర్తనాలతో విపత్తు అంచనా. 9. సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ. 10. తార్కిక, విశ్లేషణ సామర్థ్యం, దత్తాంశ అనువర్తన (డేటా ఇంటర్‌ప్రెటేషన్‌) 11. దత్తాంశ విశ్లేషణ (డేటా అనాలిసిస్‌) (సాంఖ్యాక శాస్త్ర కోణం) 12. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన పాలనాపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు. విభజన వల్ల ప్రజలపై కలిగిన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ప్రభావం. నదీజలాల సమస్యలు, ఉద్యోగుల విభజన, వారి స్వస్థలాలు వంటి అంశాలు. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014, రాష్ట్ర రాజధాని సమస్య, రాజధాని నిర్మించడంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సంస్థల విభజన, వాటిని తిరిగి స్థాపించుకోవడం మొదలైనవి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు చివరి తేదీ: 28-1-2017
పరీక్ష తేదీ: 6-6-2017
అర్హత: పీజీ పూర్తిచేసి పీహెచ్‌డీ పొంది ఉండాలి. లేదా పీజీతోపాటుగా స్లెట్‌/నెట్‌లో అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 42 సంవత్సరాలు.
గమనిక: దరఖాస్తు చేసిన మొత్తం అభ్యర్థులు 25000 సంఖ్య దాటితే ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది.
అభ్యర్థులకు సొంత సబ్జెక్టుపై సాధారణంగా పట్టు ఉంటుంది. కానీ పరిధి చాలా ఎక్కువుండే జనరల్‌ స్టడీస్‌ అంశాలపై అవగాహన ఉండదు. అందుకే మొదటిసారిగా డిగ్రీ లెక్చరర్‌ పోటీ పరీక్షకు తయారవుతున్నవారు జీఎస్‌పై తగినంత దృష్టి సారించాలి.
రుణాత్మక మార్కులు... జాగ్రత్త!
ఏపీపీఎస్‌సీ ప్రస్తుత ప్రకటన నుంచి ఈ పోటీ పరీక్షల్లో రుణాత్మక (నెగటివ్‌) మార్కులను ప్రవేశపెట్టింది. ప్రతి తప్పు సమాధానానికీ 1/3 వంతు నెగటివ్‌ మార్కులున్నాయి. అందువల్ల పూర్తిగా తెలియని ప్రశ్నలకు గుడ్డిగా సమాధానం గుర్తించకపోవడమే మంచిది.
ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో సంబంధం లేని రెండింటిని తొలగించి (ఎలిమినేట్‌) మిగతా రెండింటిలో ఒకదాన్ని సమాధానంగా గుర్తించగలిగితే మంచిది. ఒక ప్రశ్న జవాబు 50% పైగా సరైనది అనిపిస్తే జవాబు రాయటానికి ప్రయత్నించవచ్చు. లేకపోతే తప్పు సమాధానానికి మార్కులు రాకపోగా... వచ్చినవాటిలో కూడా కోత పడే ప్రమాదం ఉంది.
ఇతర పరీక్షల అభ్యర్థులకు...
ప్రస్తుతం అభ్యర్థులు గ్రూప్‌-1, 2, పంచాయతీ కార్యదర్శుల వంటి పోటీ పరీక్షలకు చదువుతున్నారు. వీరిలో కొంతమందికి డిగ్రీ కళాశాల అధ్యాపకుల పోటీ పరీక్ష రాయడానికి అర్హత ఉండి ఉంటుంది. వీరికి ఈ పరీక్ష అనుకూలం. ఈ అభ్యర్థులకు జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ కలసివచ్చే అంశం. ఉదాహరణకు గ్రూప్‌-2 పేపర్‌-1లో ఉన్న జనరల్‌స్టడీస్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకుల పరీక్షలోని పేపర్‌ -I దాదాపుగా ఒకే రకంగా ఉంది. వీరు ఇప్పటికే జీఎస్‌ సన్నద్ధత పూర్తిచేసివుంటే సబ్జెక్టు పేపర్‌పై దృష్టి కేంద్రీకరించాలి. వీరు చాలా సంవత్సరాల క్రితం నుంచి తమ సబ్జెక్టును చదివి ఉండరు. ఇటువంటివారికి సబ్జెక్టు పేపర్‌ కీలకంగా ఉంటుంది. వీరు ఈ పేపర్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. సబ్జెక్టు మార్కుల విషయంలో ఇటువంటివారికి నూతన అభ్యర్థులతో పోటీ ఉంటుంది.

Posted on 11-01-2017