close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

తాజా పరిణామాలపై తిరుగులేని పట్టు!

గ్రూప్స్‌తో పాటు ఏ ఉద్యోగ నియామక ప్రక్రియలోనైనా వర్తమాన అంశాలు తప్పని సరిగా ఉండే అంశం. పరీక్షల కోణంలో వీటిపై అవగాహన పెంచుకునే విషయంలో చాలామంది అభ్యర్థులు తికమక పడుతుంటారు. ఇలాంటివారు ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో, ఎలా చదవాలో గ్రహించటం ప్రధానం. అందుకు ఉపకరించే కథనమిది!
ఫిబ్రవరి 26న జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 స్క్రీనింగ్‌ టెస్ట్‌ సిలబస్‌లోని మూడు విభాగాల్లో మొదటి విభాగం సమకాలీన అంశాలు. (కరంట్‌ అఫైర్స్‌). దీనిలో జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక, కళలు, క్రీడలు, సాంస్కృతిక, పరిపాలన (గవర్నెన్స్‌) అంశాల్లోని ప్రధాన అంశాలను సిలబస్‌గా పేర్కొన్నారు. అంటే ఈ విభాగంలో అభ్యర్థులు ఈ అన్ని అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవడం తప్పనిసరి.
పోటీ పరీక్షల్లో విజేతగా నిలవాలంటే అభ్యర్థులు ముందు సిలబస్‌ను అవగాహన చేసుకోవాలి. ఆ తరువాత సిలబస్‌ అంశాల సేకరణపై దృష్టి పెట్టాలి. అనంతరం సమగ్ర అధ్యయనం చేయాలి. ఆపై ప్రశ్నల దృష్టికోణంపై అవగాహన పెంచుకోవాలి. ఇలా చేస్తే మరో 40 రోజుల్లో జరగబోయే స్క్రీనింగ్‌ పరీక్షను అవలీలగా దాటి మెయిన్స్‌ అనే అసలు యుద్ధానికి సన్నద్ధం కావచ్చు.
దీక్షగా సన్నద్ధత కొనసాగిస్తున్న అభ్యర్థులు ఇప్పటికే సిలబస్‌పై అవగాహన సాధించి సిలబస్‌లో పేర్కొన్న అంశాల సేకరణ, సమగ్ర అధ్యయనంపై నిమగ్నమై ఉంటారు. ఈ సమయంలో అభ్యర్థులను ఎన్నో ప్రశ్నలు వేధిస్తుంటాయి.
వాటిలో ముఖ్యమైనవి- ఏ పుస్తకాలు చదవాలి? ఎలా చదవాలి? సముద్రం అంత పరిధి ఉన్న సమకాలీన అంశాల నుం ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? అసలు ప్రశ్నల కాలావధి ఎంత? ప్రస్తుత ప్రిపరేషన్‌ స్థాయి మనల్ని విజేతగా నిలబెడుతుందా? పోటీలో మనం ఎక్కడున్నాం? మొదలైనవి. వీటికి సమాధానం దొరికితే గెలుపుదారిలో ఉన్నట్లే.
ప్రపంచంలో ప్రతి సమస్యకూ పరిష్కారం ఉన్నట్లుగానే పోటీ పరీక్షల్లో విజేతగా నిలవటానికీ మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనది అభ్యర్థులు ముందుగా ఆశావహ దృక్పథాన్ని అలవర్చుకోవటం. సిలబస్‌లోని అంశాల సేకరణ నుంచి... ప్రశ్నల స్థాయి వరకూ మనల్ని వేధిస్తున్న ప్రశ్నలు మనకు మాత్రమే కాక పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అందరికీ ఉంటాయని గుర్తించాలి.
పరిధి ఎక్కువ
వర్తమాన అంశాలకు సిలబస్‌ ఉన్నప్పటికీ దాని పరిధి ఎక్కువ కావటంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతుంటారు. మార్కెట్‌లో విస్తృతంగా పుస్తకాలు లభ్యమవుతున్నప్పటికీ పుస్తకాల ఎంపికలో సందిగ్ధంలో పడతారు. దానికి కారణం ఒక్కో పుస్తకం ఒక్కో తీరుగా ఉంటుంది. అన్ని అంశాలనూ అన్ని పుస్తకాలు కవర్‌ చేయలేకపోవటం, అక్షర, దోషాలు, సమాచారాన్ని తప్పుగా పేర్కొనటం, కాలావధి లాంటి సమస్యలు ప్రధానంగా ఈ పుస్తకాల్లో కనిపిస్తాయి.
మరి ఈ సమస్యకు పరిష్కారం? అభ్యర్థులు సొంతంగా నోట్స్‌ తయారుచేసుకోవటమే. ఇది అభ్యర్థికి అన్నివిధాలా ఉపకరిస్తుంది. నోట్సు తయారుచేసుకోవడం వల్ల అక్షరదోషాలు, సమాచారం తప్పుగా రాసుకోవటం, అనవసరపు విషయాలను చదవటం లాంటి సమస్యల నుంచి బయటపడొచ్చు.
ఇవే కాకుండా మనం నోట్సు తయారు చేసుకొనేటప్పుడు ఎన్నో విషయాలను ఆసక్తిగా గమనించటం వల్ల సబ్జెక్టుపై ఆసక్తి కలిగి పట్టు పెరుగుతుంది. అన్ని విషయాలపై సమగ్ర అవగాహన లభిస్తుంది. నోట్సు తయారుచేసుకోవటంలో ఆయా అంశాలకు సంబంధించిన ప్రశ్నలు పరీక్షలో ఎన్ని విధాలుగా అడగొచ్చో ముందుగానే అవగాహనకు రావొచ్చు.
మరీ ముఖ్యంగా సొంత నోట్సు అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాస స్థాయిని పెంచుతుంది. మెయిన్స్‌ తయారీలో కూడా ఈ నోట్సు ఎంతో ఉపకరిస్తుంది. ‘ఒకసారి మనం రాసిన విషయం ఎన్నోసార్లు చదివిన దానికి సమానం’ అనే నానుడి గుర్తుండే ఉంటుంది. ఇది పోటీ పరీక్షల్లో మరింత నిరూపితమయ్యే విషయం.
‘సొంత నోట్సు అంటే సమయం వృథా’ అనే భావన కొంతమందిలో ఉంటుంది. ఇది పొరపాటు అవగాహనే అన్న విషయం ఇప్పటికే సొంత నోట్సు సిద్ధం చేసుకుంటున్నవారికి అవగతమై ఉంటుంది.
ఎలాంటి ప్రశ్నలు?
ప్రశ్నల తీరుపై కూడా చాలామంది గందరగోళానికి గురి అవుతుంటారు. పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్న భావన అభ్యర్థుల్లో ఉంటుంది. సమకాలీనంగా ఏదైనా ఒక ఘటన చోటు చేసుకున్నప్పుడు దానికి సంబంధించి ప్రధానంగా గమనించాల్సింది ‘ఇది పరీక్షలో ఎంతవరకు ప్రశ్నగా మారే అవకాశం ఉంది?’ అన్నది. దానికి సమాధానం తేలికగానే దొరుకుతుంది.
ఏదైనా ఘటనకు సంబంధించిన అంశాలు పదేపదే వార్తల్లో వస్తుంటే ఆ ఘటనకు ప్రాధాన్యం ఉన్నట్లే! ఎందుకంటే ఆ ఘటన మనతోపాటు ఎగ్జామినర్‌ దృష్టిని కూడా ఆకర్షిస్తుంది కదా! ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు. ఈ ఘటనకు సంబంధించిన అంశాలు వార్తల్లో రాని రోజు లేదు అంటే అతిశయోక్తి కాదేమో. నవంబర్‌ 8 రాత్రి పెద్దనోట్ల రద్దు ప్రకటన నుంచి ఇప్పటివరకూ ఈ పరిణామంపై మాట్లాడుకోని భారతీయుడు లేడు. మరి ఇలాంటి అంశాలు పరీక్షలో చోటు చేసుకుంటాయి కదా!
పరిణామాలు... ప్రాచుర్యం
అమెరికా అధ్యక్ష ఎన్నికలు, రియో ఒలింపిక్స్‌, బ్రెగ్జిట్‌ పోల్‌, పనామా పత్రాలు, పఠాన్‌ కోట్‌, ఉరీ ఉగ్రదాడులు, జయలలిత మరణం లాంటి అంశాలపై అభ్యర్థులు దృష్టి సాధించాలి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏంటంటే- ఏదైనా ముఖ్యమైన పరిణామం చోటుచేసుకున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు, తేదీ, ప్రదేశం మొదలైన అంశాలను బాగా గుర్తుంచుకోవాలి. సాధారణంగా సమకాలీన అంశాలు వార్తల్లో వ్యక్తులపై కేంద్రీకృతమై ఉంటాయి కాబట్టి ఈ అంశాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ సన్నద్ధత కొనసాగించాలి.
ఇటీవలి ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే సుమారు 10 శాతం ప్రశ్నలు బాగా లోతుగా అడగటం గమనించవచ్చు. వీటి గురించి అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభ్యర్థులను వడపోత పోసే ఉద్దేశంతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు. విస్తృత పఠనం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. సబ్జెక్టుపై పట్టు ఉన్నప్పుడు సంబంధం లేని జవాబుల తొలగింపు (ఎలిమినేషన్‌) పద్ధతి ద్వారా కూడా ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కోవచ్చు.
తేలిక అని నిర్లక్ష్యం వద్దు
తేలిక ప్రశ్నలనూ, తప్పకుండా వచ్చే ప్రశ్నలనూ నిర్లక్ష్యం చేయకూడదు. తేలిక ప్రశ్న కదా అనుకుంటే తికమకకు గురయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పార్టీల గుర్తులను అడిగే అవకాశం ఉంది. రెండు ప్రముఖ పార్టీల్లో ఒకటైన రిపబ్లికన్‌ పార్టీ గుర్తు ఏనుగు; డెమొక్రటిక్‌ పార్టీ గుర్తు గాడిద. దీన్ని గుర్తుపెట్టుకోవడం ఎలా? ఏదో ఒక కొండ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు డెమొక్రటిక్‌ పార్టీ పేరు ‘డి’తో ప్రారంభం అవుతుంది. దాని గుర్తు గాడిద (డాంకీ) పేరు కూడా ‘డి’తో ప్రారంభం అవుతుంది అని గుర్తుంచుకుంటే తికమకకు ఆస్కారం ఉండదు.
కఠినమైన ప్రశ్నలకు జవాబు గుర్తించకపోయినా పర్లేదు కానీ బాగా చదివి, తెలిసిన ప్రశ్నలకు తప్పు సమాధానాలు గుర్తిస్తే అనవసరంగా విజయం దూరమవుతుంది. మీరు ఎలా చదివినా సరైన జవాబు గుర్తించటమే ముఖ్యం! చదవటం ఒక ఎత్తు, పరీక్షలో సరైన సమాధానాలు గుర్తించటం ఒక ఎత్తు. రెండింటి సమన్వయమే విజేతల లక్షణం.
ఎంత కాలం వెనక్కి?
సమకాలీన అంశాల అధ్యయనంలో కాలావధికి బాగా ప్రాముఖ్యం ఉంది. సాధారణంగా సమకాలీన అంశాలు అంటే పరీక్షకు ముందు గడచిన 8 నెలల నుంచి సంవత్సర కాలంలో జరిగిన సంఘటనల సమాహారం. కానీ ఈ కాలావధి ఒక్కోసారి ఒక్కోరకంగా మారడం... తాజా పరీక్షల్లో చోటుచేసుకున్న పరిణామంగా చెప్పవచ్చు.
ఈ నేపథ్యంలో చేయాల్సింది...
* శాస్త్ర సాంకేతిక రంగాలు, ముఖ్యమైన అవార్డులకు సంబంధించి గత సంవత్సర కాలంలో చోటుచేసుకొన్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వటం
* ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన సంఘటనలకు సంబంధించి గడిచిన 6 నెలలకు ప్రాధాన్యం ఇవ్వటం
* ప్రపంచ దృష్టిని బాగా ఆకర్షించిన సంఘటనలకు గడిచిన మూడు నెలల కాలానికి సంబంధించి ప్రాధాన్యం ఇవ్వటం
ఒక సంఘటన జరిగి చాలాకాలం అయినా దాని ప్రభావం ఇంకా ఉండటం, ఒకే అంశం తరచు వార్తల్లో ఉండటం లాంటి అంశాలకు కాలావధితో సంబంధం ఉండదని గమనించాలి. ఉదాహరణకు ప్రపంచంలో సంచలన ఉగ్రదాడులకు ప్రారంభ ఘటన అయిన 9/11 అమెరికాపై దాడులు, ముంబయి 26/11 దాడులు, జీఎస్‌టీ బిల్లు, స్వచ్ఛభారత్‌, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక అంశాలు మొదలైనవి.
విస్తృత అధ్యయనం, అవగాహన కలిగి ఉన్నప్పుడే ఇలాంటి ప్రశ్నలకు సరైన జవాబులు గుర్తించగలుగుతారు. ఇలాంటి ప్రశ్నలు తక్కువ సంఖ్యలో పరీక్షల్లో వస్తున్నప్పటికీ వాటికి సరైన సమాధానం గుర్తిస్తే ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అనడంలో సందేహం లేదు.
ప్రశ్నపత్రాల సరళి
గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయడం ద్వారా కూడా అభ్యర్థులు ప్రశ్నల సరళిని బాగా ఆకళింపు చేసుకోవచ్చు. పరీక్షకు ముందు పాత ప్రశ్నపత్రాలు, మాదిరి ప్రశ్నపత్రాల అభ్యాసం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకోవచ్చు. మన సన్నద్ధత స్థాయి ఎలా ఉంది? పోటీలో మనం ఎక్కడున్నాం? అనే ప్రశ్నలకు ప్రశ్నపత్రాల అధ్యయనమే సరైన సమాధానం.
గ్రూప్‌-2లో విజేతగా నిలవాలంటే ముందు స్క్రీనింగ్‌ టెస్ట్‌ అనే అడ్డంకి దాటాలి. కాబట్టి అభ్యర్థులు సర్వశక్తులా ఒడ్డి చదవల్సిన సమయం ఆసన్నమైంది. పరీక్షలో కీలకాంశాల్లో ఒకటైన సమకాలీన అంశాలపై పట్టు సాధించడం ద్వారా ఈ పరీక్షలో విజయానికి మార్గం సుగమం చేసుకోవచ్చు. ఆరు నెలల నుంచి సంవత్సర కాలం పాటు పక్కా ప్రణాళికలు రూపొందిచుకొని సన్నద్ధతను యజ్ఞంలా భావించి దీక్షతో ముందుకుసాగాలి. ఇంకెందుకు ఆలస్యం? తాజా పరిణామాలపై తిరుగులేని పట్టుకోసం బాగా అధ్యయనం చేయండి... విజయీభవ!

Posted on 17-01-2017