close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

భావి కార్యదర్శీ.... ఇదీ మార్గదర్శి

ఏపీపీఎస్‌సీ ప్రకటించిన పంచాయతీ కార్యదర్శి పోస్టుల వడపోత రాతపరీక్షకు తయారవ్వటానికి తగిన సమయం ఉంది. వ్యవధి సరిపోదనే ఒత్తిడి లేని ఈ పరీక్షార్థులకు ఇప్పుడు కావల్సింది-తెలివైన సన్నద్ధత... దానికి తగ్గ ప్రణాళిక!
పోటీ పరీక్షల్లో విజయానికి విశాలదృష్టి ఎంత అవసరమో... కొన్ని సందర్భాల్లో నిర్దిష్ట/పాక్షిక దృష్టి అంతే అవసరం. సబ్జెక్టును ఆసాంతం తెలుసుకోవడం, విషయ అవగాహన, ప్రభుత్వ సర్వీసుకు ఎంపిక ద్వారా ప్రజాసేవ చేయాలన్న లక్ష్యం, దీర్ఘకాల దృష్టితో ఎంత అవసరమో తెలిసిందే. దీంతో పాటు స్వల్పకాల దృష్టితో పరీక్షకు ఉన్న గడువు, నిర్ణీత వ్యవధిలో పరిమిత సన్నద్ధతతో అందరికంటే ఎక్కువ మార్కులతో ఎలా బయటపడాలన్నదీ ముఖ్యమే. పోటీపరీక్షల అవకాశాలు ఎదురొచ్చినపుడు ఈ స్పష్టత తెచ్చుకోకపోతే ఆశించిన ఫలితం రాదు.
* ఈ కోణంలో చూస్తే ప్రస్తుత సమీప లక్ష్యం ఏపీపీఎస్‌సీ- పంచాయతీ సెక్రటరీ వడపోత (స్క్రీనింగ్‌) పరీక్షలో విజయం సాధించడం .. మెయిన్స్‌ దశకు చేరుకోవడం.
* అందుబాటులో ఉన్న సమయం, స్క్రీనింగ్‌ టెస్ట్‌ జరిగే ఏప్రిల్‌ 23వ తేదీకి మిగిలున్నది సుమారుగా 100 రోజులు.
* ఈ వంద రోజుల వ్యవధిలో చదవాల్సిన విభాగాలు 13. అయితే వీటిలో ఒకదానితో మరొకటి సంబంధం గల గ్రామీణాభివృద్ధి-పంచాయతీ రాజ్‌ వ్యవస్థపై గల మూడు విభాగాలను ఒక యూనిట్‌గా- ఒకే ప్రిపరేషన్‌తో చదివేవిగా పరిగణనలోకి తీసుకుంటే లెక్కకు వచ్చేవి 10 విభాగాలు.
* సూక్ష్మంగా చెప్పాలంటే... 10 విభాగాలకు గానూ మన చేతిలో ఉన్నవి 100 రోజులు. అంటే ఒక్కో విభాగానికి కేటాయించగల సమయం 10 రోజులు. మరో వ్యాపకం వైపు చూడకుండా రోజుకు 15 గంటల చొప్పున సమయం కేటాయిస్తే ఒక్కో విభాగానికి మన చేతిలో ఉంటున్నవి 150 గంటల సన్నద్ధత సమయం.
ఇటీవలి కాలంలో ఇంత సమయం ఒక పోటీపరీక్షకు లభ్యం కావడం ఇదే. అందుకే వ్యవధి తక్కువ అన్న ఒత్తిడి అవసరం లేదు. ఇప్పుడు కావల్సిందల్లా తెలివైన సన్నద్ధత (స్మార్ట్‌ ప్రిపరేషన్‌).
సిలబస్‌ వీక్షణం
సన్నద్ధత ప్రారంభించేముందు పంచాయతీ కార్యదర్శుల వడపోత పరీక్ష సిలబస్‌ను తార్కికంగా పరిశీలన చేయడం మంచిది. దీనివల్ల చదవాల్సిన పంథాను నిర్ణయించుకోవచ్చు.
* సిలబస్‌లో సాదారణ అంశాలేమిటి? క్లిష్టమైన విభాగాలేమిటి?
* స్వల్ప సమయంలో పూర్తిచేయగలవేమిటి? కాల విభజన రీత్యా అధిక సమయం తీసుకునేవేమిటి?
* అభ్యర్థి విద్యానేపథ్యం రీత్యా సునాయాసకరమైన విభాగాలేమిటి? కష్టసాధ్యమైన అంశాలేమిటి?
* స్వీయ అధ్యయన అనుకూల అంశాలేమిటి? నిపుణుల పర్యవేక్షణ అవసరమైన విషయాలేమిటి?
* స్థిరమైన మెటీరియల్‌తో సన్నద్ధత పూర్తిచేయగలిగే అధ్యాయాలేమిటి? పరీక్ష ముందురోజు వరకూ నిరంతరం మెరుగుపరచుకోవల్సిన అంశాలేమిటి?
ఈ ఐదు కోణాల్లో ఏపీపీఎస్‌సీ పంచాయతీ కార్యదర్శుల వడపోత పాఠ్యాంశాలను సునిశిత పరిశీలన చేస్తే...
సాధారణ... క్లిష్ట విభాగాలు
13 విభాగాల్లో సగం యూనిట్లు సాధారణమైనవే . అంటే గ్రూప్స్‌ పరీక్షలు రాసే అభ్యర్థులు ఇప్పటివరకూ ఏదో ఒక పరీక్ష కోసం చదివివున్నవే. కరంట్‌ అఫైర్స్‌, జనరల్‌ సైన్స్‌, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆర్థికాభివృద్ధి, భారత రాజ్యాంగం సబ్జెక్టులు గతంలో గ్రూప్స్‌ రాసినవారు కానీ, ఇటీవల ఏఈఈ లాంటి పరీక్షలు రాసినవారు కానీ చదివివుంటారు. అందువల్ల ఈ విభాగాల్లో ఒకసారి సన్నద్ధత పూర్తయినట్టే పరిగణించాలి. అయితే ఈ సబ్జెక్టుల్లో కష్టమైన అంశాలేమిటి? ఏ విభాగంలోని ప్రశ్నలను పరీక్షలో ఆన్సర్‌ చేయలేకపోయామన్న పరిశీలన చేసుకోవాల్సివుంటుంది.
ఉదాహరణకు... ఇటీవల జరిగిన ఏపీపీఎస్‌సీ ఏఈఈ పరీక్షలో-
* జీఎస్‌టీ అమలుకు లక్ష్యంగా నిర్దేశించిన తేదీ? జవాబు: 1 ఏప్రిల్‌ 2017
* అమెరికాలోని డెమొక్రటిక్‌ పార్టీ ఎన్నికల చిహ్నం? జవాబు: గాడిద
* ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం-2014 పదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థలు ఎన్ని? జవాబు: 107
ఈ ప్రశ్నకు జవాబు గుర్తించడంలో అభ్యర్థులు కాస్త ఇబ్బంది పడ్డారు.
ఇక ఈ కేటగిరిలోనే కష్టమైన విభాగాలను గుర్తించాలి. ఇక్కడ కష్టమైన విభాగాలు అనడం కంటే పరిచయం లేని విభాగాలు అనడం మంచిది. ఈ కోణం నుంచి చూసినప్పుడు పంచాయతీ కార్యదర్శుల సిలబస్‌లో 7 విభాగాలు కొత్తవిగా చెప్పాలి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతర పరిణామాలు అన్న విభాగం కూడా ఇటీవలికాలంలో జరిగిన ఏ పరీక్షలోనైనా స్పృశించేవుంటారు.
మిగిలిన 6 యూనిట్లు పూర్తిగా పంచాయతీ సెక్రటరీ విధులకు సంబంధించిన గ్రామీణాభివృద్ధి విభాగాలు. 2014లో పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈ అధ్యాయాలతో కొంత పరిచయం ఉండివుంటుంది.
మొత్తమ్మీద పంచాయతీ కార్యదర్శుల సిలబస్‌లోని 13 విభాగాల్లో 6 యూనిట్లు పాతవి కాగా, 7 యూనిట్లు కొత్తవిగా పరిగణించి ప్రిపరేషన్‌కు సిద్ధం కావొచ్చు.
స్వల్ప సమయం- అధిక కాలవ్యవధి
సిలబస్‌లోని అంశాలను ఈ కోణం నుంచి కూడా చూడాల్సివుంటుంది. కొన్ని అంశాలు త్వరగా పూర్తిచేయగలిగేవయితే మరికొన్ని వ్యవధి ఎక్కువ తీసుకునేవిగా ఉంటాయి. స్థిరంగా ఉండే చరిత్ర, జనరల్‌ సైన్స్‌ (స్టాక్‌ సైన్స్‌), అనలిటికల్‌ ఎబిలిటీ, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్‌ వ్యవస్థ పరిణామ క్రమం, పంచాయతీరాజ్‌ విభాగం ఆధ్వర్యంలోని ముఖ్య పథకాలు, విభాగాల్లో స్థిర సమాచారం ఉంటుంది. కాబట్టి ప్రిపరేషన్‌ నిర్దిష్ట సమయంలో ముగించవచ్చు.
అదే కరంట్‌ అఫైర్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, భారత రాజ్యాంగం, ఆర్థికవృద్ధి, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, స్వయం సహాయక బృందాలు- మహిళా సాధికారికత, గ్రామీణ రుణవ్యవస్థ విభాగాల్లో తాజా సమాచారం ఎప్పటికప్పుడు వచ్చి చేరుతుంటుంది కాబట్టి సన్నద్ధత కాస్త సుదీర్ఘంగా సాగాలి.
ఈ విభాగాల్లో స్థిరమైన సబ్జెక్టును పూర్తిచేయడం ఒక దశగా భావిస్తే తాజా అంశాలను మెరుగుపరుచుకోవడం పరీక్ష ముందువరకూ సాగాలి. అందుకే ఇలాంటి సబ్జెక్టులను సన్నద్ధతలో నిరంతరం ఉండేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
విద్యానేపథ్యం రీత్యా సన్నద్ధత దృష్టి
పోటీ పరీక్షల సన్నద్ధతలో కీలక పాత్ర వహించేది అభ్యర్థి విద్యానేపథ్యం. ఇంజినీరింగ్‌, సైన్స్‌, మేథమేటిక్స్‌ ప్రత్యేక సబ్జెక్టులుగా చదివిన అభ్యర్థికి పంచాయతీ కార్యదర్శి సిలబస్‌లోని కొన్ని విభాగాలు చరిత్ర, ఎకానమీ, పాలిటీ సబ్జెక్టులు క్లిష్టంగా ఉండవచ్చు. ఇదే హ్యుమానిటీస్‌లో డిగ్రీలు చేసినవారికి రీజనింగ్‌, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌, జనరల్‌ సైన్స్‌ లాంటి విభాగాలు కష్టంగా ఉంటాయి. ఇది కాదనలేని సత్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రిపరేషన్‌ ప్రణాళికను రూపొందించుకోవాలి.
ఇప్పటినుంచి పరీక్ష వరకు ఉన్న వ్యవధి రీత్యా సగటున ఒక్కో సబ్జెక్టుకు 150 గంటల సన్నద్ధత సమయం వచ్చిందనుకుందాం. విద్యానేపథ్యం రీత్యా సులువుగా చదవగలిగే సబ్జెక్టులకు సగటు కంటే తక్కువ సమయం, క్లిష్టమైన విభాగాలకు సగటు కంటే ఎక్కువ సమయం కేటాయించేలా ప్రణాళికను తయారుచేసుకోవాలి.
ఈ పరీక్షకు నిపుణుల శిక్షణ అవసరమా? అన్న విషయం నిర్థారించుకోవడానికి సిలబస్‌ను ఆసాంతం పరిశీలించాలి; రెండు విషయాలపై స్పష్టత తెచ్చుకోవాలి. స్వయంగా చదువుకోవడానికి అవకాశం ఇస్తున్న విభాగాలేమిటి? నిపుణుల సహకారం తీసుకోవాల్సిన అంశాలేమిటి? అన్న కోణంలో పరిశీలించినపుడు సగం కంటే ఎక్కువ విభాగాల్లో నిపుణుల సహకారం అనివార్యం అన్న నిర్థారణకు వస్తే అప్పుడు ఆ శిక్షణ గురించి ఆలోచించాలి. లేకపోతే మాత్రం స్వీయశిక్షణను ఆశ్రయించవచ్చు. పంచాయతీ కార్యదర్శి స్క్రీనింగ్‌ టెస్ట్‌ సిలబస్‌ స్వీయ శిక్షణకు అనుకూలంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు.
‘వదలని’ సబ్జెక్టులు
పంచాయతీ కార్యదర్శి సిలబస్‌ అధ్యయనం రెండు దశల్లో సాగితే ఫలవంతంగా ఉంటుంది. మొత్తం 13 విభాగాల్లో ముప్పావు భాగం అంటే 9 నుంచి 10 సబ్జెక్టులను స్థిర సబ్జెక్టులుగా వర్గీకరించుకుని తొలి దశ ప్రిపరేషన్లో పూర్తిచేసి పరీక్ష ముందు పునశ్చరణకు పక్కన పెట్టుకోగలగాలి. ఇక మిగిలిన 3 లేక 4 సబ్జెక్టులు ‘నిన్ను వదలా బొమ్మాళీ!’ తరహావి. వాటిని సన్నద్ధత తొలి రోజు నుంచి పరీక్ష ముందు రోజు వరకూ నిరంతరం చదవాలి. ఆ సబ్జెక్టులు అభ్యర్థిని వెంటాడుతూనే ఉంటాయి.
‘వర్తమాన జాతీయ, అంతర్జాతీయ అంశాలు’ అన్న తొలి విభాగం అలాంటి కోవకు చెందినదే. దీనికి రోజూ రెండు గంటల చొప్పున 100 రోజులు 200 గంటల సన్నద్ధత సమయం కేటాయించడం ద్వారా ప్రశ్నపత్రంలోని అన్ని ప్రశ్నలకూ సరైన జవాబులు గుర్తించి మిగతావారి కంటే ముందుండవచ్చు.
ఏపీపీఎస్‌సీ పంచాయతీ కార్యదర్శి సిలబస్‌లోని 13 విభాగాలనూ ఎంత సునిశితంగా పరిశీలించినా సన్నద్ధతకు సులభంగానే గోచరిస్తున్నాయి. ఆర్ట్స్‌ అభ్యర్థులకు రీజనింగ్‌ విభాగం వంటి ఒకటి రెండు సబ్జెక్టులు తప్ప ఏ తరహా అభ్యర్థి అయినా తగిన ప్రణాళికతో చదివేందుకు అనుకూలంగానే ఉన్నాయి. జనరల్‌స్టడీస్‌ కింద వచ్చే ఐదారు విభాగాల్లో గత అనుభవం ఉండటం ఒక ప్రధాన సానుకూల విషయమైతే- గ్రామీణాభివృద్ధి కింద వచ్చే ఒకటి రెండు విభాగాల్లో ప్రామాణిక మెటీరియల్‌ లభ్యత సవాలుగా పరిణమించడం తప్ప ఇతర ప్రతికూల అంశాలేమీ లేవు. కేవలం చేయాల్సిందల్లా- నిర్దిష్ట ప్రణాళిక-నియమబద్ధ సన్నద్ధత. ఈ రెండే అభ్యర్థి విజయావకాశాలను నిర్ణయిస్తాయి.
ఎలా ఆలోచిస్తాడు కాబోయే ర్యాంకర్‌?
తగిన సమయం, అందుబాటులో సిలబస్‌, గత పరీక్ష నమూనాలు ఉన్నప్పుడు ర్యాంకర్ల జాబితాలో నిలిచే అభ్యర్థి ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళతాడో చూద్దాం.
* ప్రతికూల పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తలపుల్లోకి రానివ్వడు. పోటీ ఎంత ఉంది? వంటి మానసిక ఒత్తిడిని పెంచే ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాడు.
* పంచాయతీ సెక్రటరీ సిలబస్‌లో మొత్తం 13 విభాగాల్లో పరీక్ష ఎంపిక దృష్ట్యా అత్యంత ముఖ్యమైనవి గుర్తించటం, సన్నద్ధత సమయంలో సింహభాగం దానిపైనే దృష్టిని కేంద్రీకరించటం చేస్తాడు. వడపోత పరీక్షల్లోని 13 విభాగాల్లో చివరి 6 విభాగాలు గ్రామీణాభివృద్ధి- ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినవి. వాటిపై ఎక్కువ సమయం వెచ్చించేలా సమయ ప్రణాళిక రూపొందించుకుంటాడు.
* తొలి ఏడు విభాగాల్లో తన విద్యా నేపథ్యం రీత్యా క్లిష్టమైన విభాగంపై కూడా సమదృష్టిపెట్టి రిస్కును తగ్గించుకుంటాడు.
సమయ విభజన ముఖ్యం
విజయసాధనకు చేరాల్సిన గమ్యం స్పష్టంగా కన్పిస్తుంటుంది. కానీ, మార్గం సవ్యంగా కన్పించదు. అందుకు దారి వేసుకోగలగడంలోనే విజయ రహస్యం దాగివుంటుంది. పంచాయతీ కార్యదర్శి పరీక్షకు ఉన్న వ్యవధి రీత్యా అభ్యర్థికి అందుబాటులోకి వచ్చే 100 రోజులు. రోజుకు 15 గంటల చొప్పున 1500 గంటలు. వాటిని 13 విభాగాలకు విభజిస్తే సుమారుగా ఒక్కో సబ్జెక్టుకు 115 గంటల వ్యవధి లభ్యమవుతుంది. వీటిలో 15 గంటలను క్లిష్టమైన సబ్జెక్టులకు బదలాయిస్తేనో, వృథాగా పోతాయని భావిస్తేనో ఒక్కో విభాగానికి మిగిలేవి 100 గంటలు.
ఈ పరిమిత సమయాన్ని సిలబస్‌ అంశాలకు అనుసంధానం చేసి ‘అవసరమైన సబ్జెక్టులకు అవసరమైనంత సమయమే’ అన్న సూత్రం వర్తింపజేయాలి. సగటున ఒక్కో సబ్జెక్టుకు కేటాయించాల్సిన సమయం, నిరంతరం చదవాల్సిన సబ్జెక్టులకు కేటాయించాల్సిన అదనపు సమయం, పునశ్చరణ, స్వీయ పరీక్షకు ఇవ్వాల్సిన సమయ విభజన చేసుకోవాలి. పరీక్ష రోజు వరకూ నిబద్ధతతో పాటించగలిగితే పంచాయతీ కార్యదర్శి పోస్టులో మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు!
అభ్యర్థులు తమ విద్యానేపథ్యం ఆధారంగా సులువుగా చదవగలిగే సబ్జెక్టులకు సగటు కంటే తక్కువ సమయం, క్లిష్టమైన విభాగాలకు సగటు కంటే ఎక్కువ సమయం కేటాయించేలా ప్రణాళికను తయారుచేసుకోవాలి.

Posted on 17-01-2017