close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

మెరిపించే మెలకువలు!

రాతపరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపినవారే మౌఖిక పరీక్ష స్థాయికి వస్తారు. అయితే నిజమైన పోటీ ఈ అంచెలోనే ఉంటుంది. ఇంటర్వ్యూలో సాధించే మార్కులు మంచి పోస్టు ఎంపికకు వీలు కల్పిస్తాయి. అంతే కాదు; ముందు ర్యాంకుల్లో ఉండటం వల్ల సత్వర పదోన్నతి అవకాశం కూడా ఏర్పరుస్తాయి. అందుకనే ఇంటర్వ్యూలో ప్రతి మార్కూ విలువైనదిగా గుర్తించి, పొందినప్పుడే అంతిమ ఫలితం ఆనందాన్నిస్తుంది!
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించి రాతపరీక్షలను రాసినవారు మరో కీలక ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఏపీపీఎస్‌సీ ఇటీవలే గ్రూప్‌-1 (రీ ఎగ్జామ్‌) రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసి మౌఖిక పరీక్షకు అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇంటర్వ్యూ ప్రధాన పాత్ర పోషించే గ్రూప్‌-1, 2 రాతపరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్‌సీ కూడా త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.
నిర్దేశించిన పోస్టుకు తగిన అభ్యర్థిని ఎంపిక చేయటమే ఇంటర్వ్యూ లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగి అంటేనే అటు ప్రభుత్వానికీ ఇటు ప్రజలకూ ముఖ్య అనుసంధానం లాంటివాడు. అలాంటి స్వభావమూ, ప్రభుత్వాన్ని ప్రజల ముందు సానుకూలస్థితిలో ఉంచగలిగే పరిస్థితీ అభ్యర్థిలో ఉన్నాయో లేవో అధ్యయన చేయటమే మౌఖిక పరీక్ష లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగికి కొన్ని లక్షణాలున్నపుడే ప్రభుత్వానికి మంచి పేరు ప్రజల్లో ఏర్పడుతుంది. అటువంటి అభ్యర్థులను ఎంపిక చేసుకునే లక్ష్యంతోనే ఈ ముఖాముఖీని నిర్వహిస్తారు.
ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగిలో ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఏమిటి?
* ప్రజాసేవ ప్రాథమిక విధిగా ఉండటం * నిజాయతీ * సమాజాన్ని సానుకూలంగా చూడటం * సమాజానికి ఆదర్శనీయంగా ఉండటం * రాజకీయ తటస్థత * నియమ నిబంధనలకు నిబద్ధులుగా ఉండటం * సమస్యా పరిష్కార దృక్కోణాన్ని కలిగివుండటం * బలహీనతల్ని నియంత్రించుకోవడం * సంయమనం, సమన్వయం * ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉండటం
ఇలాంటివి అభ్యర్థిలో ఉన్నాయా లేవా అని పరిశీలించేందుకు ఇంటర్వ్యూ గదిలోకి ప్రవేశించిన అభ్యర్థిని ప్రశ్నల రూపంలో, రూపురేఖల హావభావాల పరిశీలన రూపంలో పరీక్షిస్తారు.
8-15 నిమిషాల్లో జరిగే మౌఖిక పరీక్షలో నిజంగా ఇటువంటి పరిశీలన జరుగుతుందా? అనే సందేహం ఉండొచ్చు. వయసు రీత్యా, పదవుల రీత్యా, అనుభవం రీత్యా సీనియర్లు అయినవారే ఇంటర్వ్యూ బోర్డు సభ్యులుగా ఉంటారు. కాబట్టి కొన్ని నిమిషాలే పరిశీలించినా వారు అభ్యర్థి లక్షణాలను పసిగట్టగలుగుతారు. అందుకు అనుగుణంగా మార్కులు/గ్రేడ్‌ని కేటాయిస్తారు. అందువల్ల అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకున్నపుడే బోర్డు ముందు తమను సరిగా ఆవిష్కరించుకోగలుగుతారు.
బాహ్యరూపం... ప్రభావం
బోర్డు ముందుకు వచ్చిన అభ్యర్థి రూపురేఖలు సభ్యుల్లో కలిగించే భావన ముఖ్యమైనది. అందువల్ల పొందిక, శుభ్రత ప్రస్ఫుటమయ్యేలా కనపడటం ముఖ్యం. దుస్తులు, శిరోజాలంకరణ, చివరికి జేబులో పెట్టుకునే కలం, హ్యాండ్‌బ్యాగ్‌, ధరించే కాటుక, పోగులు, కనుబొమలు, చెప్పులు/ షూ, వాచీ, ఉంగరాలు లాంటివన్నీ ప్రభావాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. ‘రెమో’లాగా ఉండే అభ్యర్థిని ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగిగా చూడగలమా? అని ఆలోచించండి. హుందాగా, బాహ్యరూపం సిద్ధపరుచుకోవటంలోని ఆవశ్యకత అర్థం అయిపోతుంది.
సంభాషణ విధానమే సగం బలం
‘నోరు మంచిదైతే వూరు మంచిదవుతుంది’ అనే నానుడి తెలుసుగా? బోర్డు సభ్యులతోటి ‘సరిగా’ సంభాషించగలిగితే సగం ఇంటర్వ్యూ లక్ష్యాన్ని చేరినట్లే! అంటే మృదు మధురంగా సంభాషించడం అని కాదు.
* బోర్డు సభ్యులు అందరికీ వినిపించే స్థాయిలో ‘ధ్వని’ ఉండాలి. స్వర స్థాయి హెచ్చుతగ్గులతో ఉండకూడదు. * నర్మగర్భంగా మాట్లాడకూడదు. * సమాధానాలు సూటిగా ఉండాలి. * చెప్పే మాటలు మరీ వేగంగానూ, బాగా నెమ్మదిగానూ ఉండకూడదు. * గణాంకాల డాంబికాలు వద్దు.* సుదీర్ఘ వాక్యాలు ఉండకూడదు. చిన్నచిన్న వాక్యాలే మేలు.* మొత్తం ఆంగ్లంలోనో, మొత్తం తెలుగులోనో మాట్లాడటం మంచిది. * తెలుగులో సంభాషిస్తున్నట్లయితే వీలైనంతవరకూ తెలుగునే వాడటం మంచిది. తక్కువ సందర్భాల్లోనే ఆంగ్ల పదాలు/వాక్యాలు బాగుంటాయి. * ఉదాహరణలు చెప్పదలిస్తే... అందరికీ తెలిసినవి చెప్పటం మంచిది. * సంభాషించేటపుడు ఆహ్లాదకరమైన ముఖ కవళికలు ఉండాలి.
కేవలం సంభాషణల ద్వారానే బోర్డు సభ్యులు అభ్యర్థి నిజాయతీ, సహనం, సంయమనం, అవకాశవాదం లాంటి గుణగణాలను తేలిగ్గా పసిగట్టగలుగుతారు. ముఖ్యంగా సమాధానాలు చెప్పేందుకు వ్యవధి ఎక్కువ లేకుండా, సమయం వృథా కాకుండా చూసుకుంటే అనుకూల, ఆహ్లాద వాతావరణం ఏర్పడుతుంది.
ప్రశ్న... జవాబు లక్ష్యం కాదు
‘ఎన్ని ప్రశ్నలు వేశారు? ఎన్నింటికి సరైన సమాధానాలు ఇచ్చాం?’ అనే అంశం ఆధారంగా మౌఖిక పరీక్ష ఫలితాలను అంచనా వేయటం సరైనది కాదు. 2011 గ్రూప్‌-1 ఇంటర్వ్యూలో ఒక అభ్యర్థిని పది ప్రశ్నలు అడిగారు. అందులో 8 ప్రశ్నలకు నిజాయతీగా తనకు ‘తెలియదు’ అని బోర్డు ముందు అంగీకరించాడు. రెండు ప్రశ్నలకే సరైన సమాధానం చెప్పినా మూర్తిమత్వ లక్షణాల ఆధారంగా గరిష్ఠ మార్కులు పొందగలిగాడు.
అందుకే ఈ విషయాలు పాటించండి:
* మౌఖిక పరీక్ష అనేది వ్యక్తి లక్షణాల అధ్యయనం కోసమే కానీ పరిజ్ఞానం అంచనా వేయటానికి కాదు. * అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పాలని ఒత్తిడికి గురి కావొద్దు. * ‘స్పందించాలి’ అనే తాపత్రయంతో తప్పులు చెపితే భారీ మూల్యం తప్పదు. * మౌనంగా ఉండటం సమాధానం అవ్వదు. * గడిచిన ప్రశ్నలకు సమాధానాలు తప్పు అని గ్రహిస్తే ఒత్తిడికి గురికావొద్దు. తర్వాతి ప్రశ్నల సమాధానాలను చెడగొట్టుకోవద్దు. అవకాశం చూసుకుని తప్పు ఎక్కడ చెప్పారో తెలియజేయవచ్చు. బోర్డు కూడా ఇలాంటి చర్యల్ని సానుకూలంగానే తీసుకుంటుంది. * బోర్డు ఏదైనా సలహాలు ఇస్తే... సరైనవి అని భావిస్తే మీ సమాధానాలు దిద్దుకుని సమాధానం చెప్పటం సరైన చర్య.
బలాల ప్రదర్శన... బలహీనతల పరిహరణ
ఇంటర్వ్యూలో గరిష్ఠ ఫలితం పొందాలంటే సందర్భోచితంగా తమ బలాలూ విజయాలను బోర్డుకు చెప్పుకోగలగాలి. ఉద్దేశపూర్వకంగా బలహీనతల్ని ప్రదర్శించవద్దు.
* బయోడేటా ఆధారంగానో, సంభాషణల ఆధారంగానో మీ బలహీనతలు/వైఫల్యాల్ని బోర్డు గమనించి అడిగితే డీలా పడిపోకూడదు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియజేయడం ద్వారా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అయితే ఆ వైఫల్యం/బలహీనతలను గుడ్డిగా సమర్థించుకోవద్దు.
* ఒకసారి ‘డిగ్రీ పూర్తయి ఆరేళ్ళు అయింది. పైగా పేద కుటుంబం. ఖాళీగా ఎందుకు ఉన్నారు?’ అని అభ్యర్థిని ప్రశ్నించారు.
- ‘అకడమిక్‌ కెరియరే అంతా బొటాబొటీ మార్కులతో సరిపెట్టారు. ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతారు?’ అని మరో అభ్యర్థిని ప్రశ్నించారు.
- ‘ఇప్పటికే నాలుగు సార్లు ఇంటర్వ్యూలకు హాజరయ్యాను అంటున్నారు. అయినా ఫలితం రాలేదు అంటే ఈ ఇంటర్వ్యూలో మాత్రం ఎలా నెగ్గుతారు?’ అని మరో ప్రశ్న.
- ‘పీహెచ్‌డీ చేసి కూడా సరైన ఉద్యోగం పొందలేకపోయారు అంటే మీరు చదివిన చదువులో ఏదో లోపం ఉంది’
... తికమక పెట్టే ఇలాంటి ప్రశ్నలకు తెలివైన సమాధానం ఇచ్చే నైపుణ్యం పెంచుకోవాలి.
వీటిపై దృష్టి పెట్టాలి...
ఇంటర్వ్యూలో మూర్తిమత్వ లక్షణాలే పరిశీలించినా వాటిని ప్రదర్శించేందుకు కనీసం కొన్ని జ్ఞానాంశాలపై అభ్యర్థికి పట్టు ఉండాలి. అప్పుడే సంభాషణను నిర్వహించటానికి అవకాశం ఉంటుంది.
బయోడేటా అంశాలు: అభ్యర్థిని సమాయత్తపరిచేందుకు బయోడేటా అంశాలపై ప్రశ్నలు అడగటం ఆనవాయితీ. ఈ అంశాలపై ఒక నిర్దిష్ట ప్రణాళికతో సిద్ధపడాలి. అప్పుడు ఆత్మవిశ్వాసంతో సమాధానాలు ఇవ్వడమే కాక తర్వాతి అంకానికి కావాల్సిన పునాదులు ఏర్పడుతాయి. అందువల్ల వ్యక్తిగత విషయాలు, కుటుంబ, విద్యా, ఉద్యోగ విషయాలను ఎలా వివరించొచ్చో స్పష్టత ఏర్పరచుకోవటం ద్వారా కనీసం రెండు నిమిషాల ఇంటర్వ్యూను అదుపులోకి తీసుకోవచ్చు.
సిలబస్‌ అంశాలు: పరీక్ష కోసం నిర్దేశించిన అంశాలపై తప్పనిసరిగా పట్టు ఉండాలి. సిలబస్‌లోని వివాదాస్పద అంశాలపై ఒక నిర్థారణకు రావాలి. సిలబస్‌ అంశాల్లోని వర్తమాన విషయాలు కూడా ప్రశ్నలుగా మారే అవకాశం కన్పిస్తుంది. ముఖ్యమైన అంశాలను గుర్తించి బహుముఖ కోణాల్లో సిద్ధపడాలి.
సామాజిక నిర్మాణ అంశాలు: ప్రతి ఇంటర్వ్యూలోనూ సామాజిక నిర్మాణాంశాలపై ప్రశ్నలు రావటం ఆనవాయితీ. కులం, మతం, ప్రాంతం, కుటుంబం, వివాహం, బాలలు, మహిళలు మొదలైన అనేక సామాజిక అంశాలు ప్రశ్నలుగా వస్తుంటాయి. అందుకే ఇలాంటి అంశాలను మూలాల నుంచి అధ్యయనం చేయడం అవసరం.
వర్తమాన అంశాలు: బోర్డుకూ, అభ్యర్థికీ మధ్య ఉమ్మడి అనుసంధానం కలిగించగలిగినవి వర్తమాన అంశాలు. అందువల్ల వివాదాస్పదమైన జాతీయ అంతర్జాతీయ అంశాలను గుర్తించి తయారయితే మంచి ఫలితాలు సాధించవచ్చు. బిట్స్‌ మాదిరిగా చదవకుండా సమగ్ర అవగాహనతో చదవటం వల్ల ఏ రూపంలోనైనా సమాధానాలు ఇవ్వవచ్చు.
న్యాయవ్యవస్థ క్రియాశీలత, ఉమ్మడి పౌర స్మృతి, ఎన్నికల సంస్కరణలు, పెద్దనోట్ల రద్దు, ప్రణాళికా సంఘం- నీతి అయోగ్‌, జిల్లా ప్రణాళికలు, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, రాబోయే భారత రాష్ట్రపతి ఎన్నిక, తెలుగు రాష్ట్రాల్లో విభజనానంతర సమస్యలు, నదీ జలాల వివాదాలు, ఎస్‌సీ, ఎస్‌టీ చట్టాలు, దేశవ్యాప్త రిజర్వేషన్‌ ఉద్యమాలు లాంటివాటిని అధ్యయనం చేయాలి.

Posted on 23-01-2017