close

ఏపీపీఎస్సీ > స్ట‌డీప్లాన్‌

పదింటిపై పట్టు... పక్కా స్కోరుకు మెట్టు

పోటీపరీక్షల అభ్యర్థులు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై అవగాహన పెంచుకోవడం అవసరం. ఏపీపీఎస్‌సీ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-1, గ్రూప్‌-2, పంచాయతీ కార్యదర్శి లాంటి వివిధ ప్రకటనల్లో జనరల్‌స్టడీస్‌ పేపర్‌లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలను ప్రవేశపెట్టింది. వీటి సన్నద్ధతపై అవగాహన పెంచుకోవాలి!
పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారిలో కొందరు సైన్సు- సాంకేతిక అంశాలను ప్రశ్న- జవాబు పద్ధతిలో చదువుతుంటారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ విషయాలను కూలంకషంగా చదివి అవగాహన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రశ్న ఏ పద్ధతిలో వచ్చినా తేలికగా సమాధానం గుర్తించగలుగుతారు.
ఉదాహరణకు భారత ప్రభుత్వం ఇటీవల సూది ద్వారా ఇవ్వగలిగే పోలియో వ్యాక్సిన్‌ ప్రవేశపెట్టింది. దీనికి ముందు నోటిద్వారా ఇస్తున్న పోలియావ్యాక్సిన్‌ ఉంది. ఇటీవల కొత్త వ్యాక్సిన్‌ ప్రవేశపెట్టడానికి కారణాలు, దీనివల్ల కలిగే ఉపయోగాల వంటివి అర్థం చేసుకొంటూ చదవాలి. ఇలా సమగ్రంగా గ్రహించినప్పుడు మాత్రమే పరీక్షలో ప్రతిభ చూపటానికి వీలుగా ఉంటుంది.
టెక్నాలజీలో ఇటీవలి అంశాలు
ఏపీపీఎస్‌సీ పోటీపరీక్షలకు చదువుతున్నవారు మొత్తం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలు సిలబస్‌లో ఉన్నాయని అనుకుంటుంటారు. గత 50 సంవత్సరాల కాలంనుంచి జరిగిన ఆవిష్కరణలు, వాటి ప్రాథమిక అంశాల (బేసిక్స్‌) నుంచి చదవాలని భావిస్తుంటారు. ఇది పొరపాటు ఆలోచన. కేవలం ఇటీవల అభివృద్ధి చెందిన సాంకేతిక అంశాలను (కాంటెంపరరీ డెవలప్‌మెంట్స్‌) మాత్రమే సిలబస్‌లో ఇచ్చారు. అందుకే పరీక్షకు పనికిరాని అన్ని అంశాలనూ కష్టపడి చదువుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకోకూడదని అభ్యర్థులు గ్రహించాలి.
వార్తాపత్రికల్లో..
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఇటీవలి అంశాల అవగాహన కోసం కోసం రోజువారీ వార్తాపత్రికలకు మించినది మరోటి లేదు. అభ్యర్థులు రోజూ కనీసం 10 నిమిషాలు వార్తాపత్రికల్లోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలకు కేటాయిస్తూ వేరువేరుగా నోట్సు రాసుకోవాలి. దీనివల్ల ఈ రంగంలో జరుగుతున్న అభివృద్ధి పాటు సాంకేతిక సంబంధిత వర్తమాన అంశాలు, జాతీయ అంతర్జాతీయ అంశాలు కవర్‌ అవుతాయి. గత ఏడాది సాంకేతిక ప్రగతి తెలిపే ఇయర్‌ బుక్స్‌, కరెంట్‌అఫైర్స్‌ పుస్తకాలు ఉపయోగపడతాయి.
వర్తమాన కోణం
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలను ఎక్కువగా కరెంట్‌ అఫైర్స్‌ కోణంలో చదివితే మరింత ప్రయోజనంగా ఉంటుంది. ఏపీపీఎస్‌సీ సిలబస్‌ కరెంట్‌ అఫైర్స్‌లో టెక్నాలజీ విభాగాలను కూడా ఇచ్చారు. కాబట్టి ఈ కోణంలో చదివితే రెండు విధాలుగా లాభం ఉంటుంది; ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశమూ లభిస్తుంది.
ఉదాహరణకు జన్యుపరివర్తన మొక్క అయిన గోల్డెన్‌రైస్‌ను చదివేటప్పుడు ఇది ఏ విధంగా పోషకాహార అంధత్వాన్ని నిర్మూలిస్తుంది, దీనిలో ఉండే పోషకపదార్థం వంటివి చదవాలి. అలాగే భారతదేశంలో న్యూక్లియర్‌ రియాక్టర్ల రకాలు- అభివృద్ధి అనేది చదివేటప్పుడు రియాక్టర్ల రకాలు, అవి పనిచేసే సూత్రం వంటివి చదవాలి. ఇవన్నీ జనరల్‌ సైన్స్‌లో అదనపు మార్కులు సంపాదించడానికి దోహదపడతాయి.
ప్రత్యేకించి రక్షణ, అంతరిక్ష, అణురంగాలను జాతీయ, అంతర్జాతీయ కోణంలో కూడా చదవటం వల్ల అవగాహన పెరగటంతో పాటు అధిక ప్రయోజనం సిద్ధిస్తుంది.
మొత్తం మీద సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ చదివేటప్పుడు వర్తమాన అంశాలు, ప్రాథమిక అంశాలు, ఇటీవలి సాంకేతికత అంశాలు, జాతీయ అంతర్జాతీయ అంశాలు మొదలైనవి దృష్టిలో ఉంచుకొని సంసిద్ధం అవ్వాలి? అప్పుడే తయారీ సమగ్రమూ, ఫలవంతమూ అవుతుంది.
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాలను చదువుతున్నప్పుడు వాటి ప్రాథమికాంశాలను (బేసిక్స్‌)ను కూడా తెలుసుకోగలిగితే సాంకేతిక సంబంధిత అంశం తేలికగా అర్థమవుతుంది. ఆయా అంశాలు జనరల్‌ సైన్స్‌లో భాగం కాబట్టి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
అధిక ప్రాధాన్యం వేటి
పోటీపరీక్షల్లో ప్రాధాన్యం ఉండి, ఎక్కువ మార్కులు స్కోరు చేయడానికి అవకాశమున్నవి పది అంశాలు. 1) అంతరిక్ష రంగం 2) రక్షణ రంగం 3) అణు రంగం 4) బయోటెక్నాలజీ 5) కంప్యూటర్‌ టెక్నాలజీ 6) ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ 7) ఆరోగ్య రంగం (హెల్త్‌ టెక్నాలజీ) 8) రోబోటిక్స్‌ 9) క్లోనింగ్‌ 10) మూలకణ టెక్నాలజీ. ఈ పది రంగాలను విస్తృతంగా చదవడం ద్వారా 10 మార్కులు సంపాదించే అవకాశం ఉంది.
అంతరిక్ష రంగం: ఈ రంగంలో గత రెండు సంవత్సరాల కాలంలో మనదేశం ప్రయోగించిన ఉపగ్రహాలు, వీటిని తీసుకొనివెళ్ళిన వాహకనౌకలు (రాకెట్‌లు), వాటి ప్రత్యేకలు, ఉపగ్రహాల ప్రయోజనాలు, ప్రత్యేకతలు, విదేశీ రాకెట్‌ల ద్వారా ప్రయోగించిన భారత ఉపగ్రహాలు, కారణాలు, పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీల ప్రత్యేకతలు గణనీయమైనవి.
ఇంకా... క్రయోజెనిక్‌ టెక్నాలజీ, రిమోట్‌సెన్సింగ్‌- ఇన్‌శాట్‌ ఉపగ్రహాలు, చంద్రయాన్‌-1, మంగళ్‌యాన్‌ (మార్స్‌ మిషన్‌) ప్రత్యేకతలు, వీటిద్వారా సాధించిన విజయాలు ముఖ్యమైనవి. ఇస్రో భవిషత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, ఇస్రో ఇతర దేశాలతో కలిసి ప్రయోగించిన ఉపగ్రహాలు, ప్రత్యేకతలు... ఉదాహరణకు మెఘాట్రాపిక్స్‌, ఇండియన్‌ రీజినల్‌ నావిగేషన్‌ శాటిలైట్‌ సిస్టం, గగన్‌, భువన్‌ల గురించి తెలుసుకోవాలి.
రక్షణ రంగం: ఈ విభాగంలో భారతదేశంలోని వివిధ రక్షణరంగ పరిశోధన సంస్థలు సాధించిన అభివృద్ధి, మేక్‌ఇన్‌ ఇండియాలో భాగంగా దేశంలో తయారవుతున్న రక్షణ సామగ్రి, తేజస్‌ వంటి స్వదేశీ యుద్ధవిమానాలు, విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న యుద్ధవిమానాలు, వీటి ప్రత్యేకతలు, యుద్ధహెలికాప్టర్లు ముఖ్యమైనవి.
క్షిపణుల రకాలు, ప్రత్యేకతలు, బాలిస్టిక్‌ క్షిపణులు, సూపర్‌సోనిక్‌ క్షిపణులు, హైపర్‌ సోనిక్‌ క్షిపణుల అభివృద్ధి, క్రూయిజ్‌ క్షిపణులు, స్టెల్త్‌ టెక్నాలజీ, స్క్రామ్‌జెట్‌ టెక్నాలజీ వంటి వాటిపై దృష్టి సారించాలి. క్షిపణుల్లో అవి వెళ్లగలిగే దూరం (రేంజ్‌), అవి మోసుకొని వెళ్ళగలిగే బరువు ముఖ్యం.
వీటితోపాటు విమానవాహక నౌకలు, సాధారణ యుద్ధనౌకలు, అణు జలాంతర్గాములు, సాధారణ జలాంతర్గాములు, ఎలక్ట్రానిక్స్‌ యుద్ధవ్యవస్థ, టార్పిడోలు, మల్టీబారెల్‌ రాకెట్‌ లాంచర్‌లు, యుద్ధట్యాంకులు, అవాక్స్‌ రాడార్‌లు, భారతదేశం ఇతరదేశాలకు ఎగుమతి చేస్తున్న రక్షణరంగ ఉత్పత్తులు, స్వదేశంలో ప్రైవేటురంగ సంస్థల సహకారంతో ఉత్పత్తిచేస్తున్న రక్షణరంగ సామగ్రి, విదేశాలనుంచి దిగుమతి చేసుకొంటున్న ఆయుధాలు, ఇండియన్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ ప్రోగ్రాం వంటివి ప్రధానమైనవి.
అణు రంగం: భారతదేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న అణు రియాక్టర్లు, అవి ఉన్న ప్రదేశాలు, అత్యధిక అణువిద్యుత్తును ఉత్పత్తి చేస్తున్న రియాక్టర్లు, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ సహా ఇతర రాష్ట్రాల్లో నిర్మాణమయ్యే అణువిద్యుత్‌ రియాక్టర్లు... చదవాలి.
అణు రియాక్టర్ల నిర్మాణానికి ఇతర దేశాలతో కలిసి చేసుకొన్న ఒప్పందాలు, భారతదేశం న్యూక్లియర్‌ సప్లయర్‌ గ్రూప్‌లో చేరడానికి చేస్తున్న ప్రయత్నాలు, యురేనియం దిగుమతి చేసుకొంటున్న దేశాలు, కారణాలు, దేశంలో అణువిద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న సంస్థలు, దేశంలో యురేనియం, ధోరియం నిక్షేపాలు, ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్లు ప్రధానం.
బయో టెక్నాలజీ: జన్యుపరివర్తన మొక్కలైన బీటీ పత్తి, బీటీ వంకాయ, గోల్డెన్‌ రైస్‌, ఢిల్లీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించిన జన్యుపరివర్తన ఆవాలు, వీటి ప్రత్యేకతలు, జన్యుపరివర్తన సూక్ష్మజీవులు, కణజాల వర్థనం, జన్యు ఇంజినీరింగ్‌ ముఖ్యమైనవి.
ఆరోగ్య రంగం:ఇటీవల మనదేశం ప్రవేశపెట్టిన నూతన వ్యాక్సిన్లు, వీటి ప్రత్యేకతలు, మిషన్‌ ఇంద్రధనుష్‌, వివిధ వ్యాధులకు ఇటీవల అభివృద్ధి చేసిన ఔషధాలు, వ్యాధి నిర్థారణ పరీక్షలు, దేశంలో నిర్మూలించిన వ్యాధులు... వీటి సమాచారం పరీక్షల్లో ఉపయోగపడుతుంది.
ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ: నిత్యజీవితంలో సమాచార సాంకేతికత ఉపయోగాలు, అనువర్తనాలు, డిజిటల్‌ ఇండియా, ఈ-గవర్నెన్స్‌, ఫైబర్‌ ఆప్టికల్‌ టెక్నాలజీ, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో ప్రస్తుతం అమలవుతూ మంచి ఫలితాలను ఇస్తున్న సమాచార సాంకేతికత, మొబైల్‌ టెక్నాలజీ మొదలైనవాటిపై తగిన అవగాహన పెంచుకోవాలి.
కంప్యూటర్లు, రోబోటిక్స్‌: వీటిలో సూపర్‌ కంప్యూటర్లు, భారతదేశంలో సూపర్‌ కంప్యూటర్ల అభివృద్ధి, అత్యంత వేగవంతమైన సూపర్‌ కంప్యూటర్లు, సూపర్‌ కంప్యూటర్‌ గ్రిడ్‌ వంటివి ముఖ్యమైనవి. రోబోటిక్స్‌లో ఇటీవల అభివృద్ధి చెందిన రోబోలు, హ్యూమనాయిడ్‌, ఆండ్రాయిడ్‌ రోబోలు, దేశంలో, ప్రపంచంలో ప్రస్తుతం రూపొందించిన రోబోలు- ప్రత్యేకతలు, దేశంలో రోబోటిక్స్‌ అభివృద్ధి వంటివి చదవాలి.
క్లోనింగ్‌, మూలకణ టెక్నాలజీ: ఈ విభాగాల్లో క్లోనింగ్‌లో ఉండే టెక్నాలజీ, మొదటి క్లోనింగ్‌ ప్రయోగాలు, తొలి క్లోనింగ్‌ క్షీరదం, భారతదేశంలో క్లోనింగ్‌ ద్వారా సృష్టించిన జీవులు, వీటిని ఉత్పత్తి చేసిన పరిశోధనా సంస్థలు వంటివి ప్రధానంగా చూసుకోవాలి. మూలకణ టెక్నాలజీలో మూలకణాల రకాలు, ఉపయోగాలు, మన శరీరంలో మూలకణాలు ఉండే ప్రదేశాలు వంటివాటిని చదవాలి.

Posted on 23-01-2017