close

విశాఖపట్నం జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

నాడు బెస్త గ్రామం... నేడు మెగాసిటీ
1933... అక్కడక్కడా విసిరేసినట్లుండే ఇళ్లు... మిణుకుమిణుకుమనే దీపాలు... చీకటి పడితే గాఢాంధకారం... చిన్న జ్వరంవచ్చినా ప్రాణాలను నిలుపుకోలేని దుస్థితి... అంతా కలిపి 60 వేల జనాభా... వైజాగపట్నమంటే అంతే. 1999... కిక్కిరిసిపోయిన ఆకాశ హర్మ్యాలు... విద్యుద్దీపాల ధగధగలు... సువిశాల రోడ్లు... ప్రాణాలను నిలిపే మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు... నగరమంటే ఇలా ఉండాలనిపించే ఆహ్లాదం... ఒక మిలియన్ పైచిలుకు జనాభా... ఇదీ ఇప్పటి విశాఖపట్నం. వర్తకం అభివృద్ధి చెందడం, పోర్టు, షిప్‌యార్డుల ఆవిర్భావం వంటి పలు కారణాలు నగరాభివృద్ధికి సోపానాలయ్యాయి. గత శతాబ్దంలో ఆవిర్భవించిన పురాతన మున్సిపాల్టీలో 'వైజాగపట్నం' కూడా ఒకటి. మత్య్సకారులు ఎక్కువగా నివాసం ఉండే అప్పటి విశాఖ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 1858లో కొంతమంది పెద్దలే పూనుకుని స్వచ్ఛందంగా 'మున్సిపల్ అసోసియేషన్'ను ప్రారంభించారు. ఆ తర్వాత 1866లో 'మున్సిపాల్టీ ఆఫ్ వైజాగపట్నం' ఆవిర్భవించింది. భారీ స్థాయి విద్యుదుత్పాదన కేంద్రాలకు ఆవాసం కాబోతున్న విశాఖ నగరి ఓ వందేళ్ల క్రితం కేవలం కిరోసిన్ దీపాలతో పొద్దుపుచ్చుకునేది. విజయనగరం మహారాణి అందించిన ఆర్థిక సాయంతో అభివృద్ధి చెందిన ప్రాంతమే ఇప్పటి మహారాణి పేట. ఈ శతాబ్ది ప్రారంభంలో పోర్టు నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు మాత్రమే విశాఖ ఉండేది.

1888లో అప్పటి మున్సిపల్ కమిషన్ కిరోసిన్‌తో వెలిగే విద్యుద్దీపాలను నిర్వహించేది. 1933లో ప్రైవేటు యాజమాన్యం ద్వారా విద్యుత్తును తీసుకుని వీధి దీపాలు ఏర్పాటు చేసేవారు. 1968లో మాత్రమే విశాఖలో ఫ్లోరెసెంట్ దీపాలు అడుగుపెట్టాయి. కుగ్రామంగా ఉన్న విశాఖను అంచెలంచెలుగా అభివృద్ధిచెందించేందుకు ఆనాటి పెద్దలు, ఈ ప్రాంత మహరాజులు ఇతోధికంగా కృషి చేశారు. ప్రస్తుతం ఉన్న బీచ్‌రోడ్డును, అక్కణ్నుంచి సర్క్యూట్ హౌస్ వరకు ఉన్న రోడ్డును విజయనగరం మహరాజా ఆర్థిక సాయంతోనిర్మించారు. విజయనగరం మహారాణి అందించిన ఆర్థిక సాయంతో అభివృద్ధి చెందిన ప్రాంతమే ఇప్పటి మహారాణి పేట. ఈ శతాబ్ది ప్రారంభంలో పోర్టు నుంచి ఫిషింగ్ హార్బర్ వరకు మాత్రమే విశాఖ ఉండేది. గంజిపేట, కొబ్బరితోట వంటి ప్రాంతాల్లో నెలకు రూ.3.50 అద్దెకు ప్రభుత్వమే ఇళ్లు సమకూర్చేది. ఇప్పుడు అత్యంత విలువైన కమర్షియల్ ప్రాంతంగా ఉన్న జిల్లా కోర్టు నుంచి టర్నర్ చౌల్ట్రీ రోడ్డు అప్పట్లో ఉప్పుటేరు మాత్రమే. బస్సులతో సహా అన్నీ ఫెర్రీ సర్వీసు ద్వారానే ఈ ఏరును దాటి వెళ్లేవి. ఇప్పుడు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఉన్న ప్రాంతం ఊరుకు చిట్టచివరి కింద లెక్క. జాతీయ రహదారికి ఇటువైపు గజం పావలా లెక్కన అమ్మినా ఎవరూ స్థలాన్ని కొనడానికి సాహసించేవారు కాదు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అవతల రాణీ చంద్రమణీదేవి, దసపల్లా, కురుపాం, చెముడురాణి వంటి సంస్థానాధీశుల వేసవి విడిదులు తప్ప మరేమీ ఉండేవి కావు. అప్పట్లో విశాఖకు, వాల్తేరుకు మధ్య అంతగా రాకపోకలే లేవు. కలెక్టరుకు, జిల్లా జడ్జికి ఉత్తరాలు అందించేందుకు దివిటీల వెలుగును ఆసరాగా చేసుకుని, ఆత్మరక్షణార్థం ఈటెలు చేత పుచ్చుకుని వెళ్లాల్సి వచ్చేది. వినోదానికి, ఆట విడుపునకు అప్పట్లో విశాఖలో ఉన్నవి మూడే మూడు థియేటర్లు. వాటిలో ఒక్క పూర్ణా థియేటర్ మాత్రమే ఇప్పటికీ మిగిలి ఉంది. మిగిలిన రెండింటి పేర్లు లైట్‌హౌస్, సెలెక్ట్ టాకీస్. ఆంగ్లేయుల రాకపోకల కారణంగా వీటిలో ప్రధానంగా ఆంగ్ల చిత్రాలు మాత్రమే ఆడేవి.

పేరు ఎలా వచ్చిందంటే ?...
విశాఖపట్నానికి ఈ పేరు రావడం వెనుక భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ద్రాక్షారామం భీమేశ్వరాలయంలో లభ్యమైన క్రీ.శ. 1068 నాటి శిలాశాసనంలోనే విశాఖపట్నం అనే పేరు ఉన్నట్లు తెలుస్తోంది. వైశాఖేశ్వరుని ఆలయం చుట్టూ నగరం విస్తరించినందువల్లే విశాఖపట్నంగా పేరు వచ్చిందనేది ఒక కథనం. ఇషహక్ మదీనా అనే దర్గా పేరు మీదుగా విశాఖపట్నం పేరు స్థిరపడిందని మరో కథనం. ఎన్ని వందల ఏళ్ల కిత్రం విశాఖపట్నం ఏర్పాటయిందనే విషయమై వేర్వేరు వాదనలున్నా, ఈ శతాబ్దంలోనే గణనీయంగా పురోగతి చెందింది. ఈ శతాబ్ది ప్రథమార్థంలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ 1947-72 మధ్య చాలావరకు అభివృద్ధి చోటుచేసుకుంది. 1962లో టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ (టి.పి.టి.), 1979లో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) ఏర్పాటు కావడంతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. కె.జి.హెచ్. (1923), యూనివర్శిటీ, విమానాశ్రయం (1930), షిప్‌యార్డు (1941), తూర్పు నౌకాదళం (1942) వంటివి వచ్చాక నగరం ఎల్లలు విస్తరిస్తూ వచ్చాయి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఆవిర్భావం నగర రూపురేఖలను చాలావరకు మార్చివేయగలిగింది. 1955 వరకు ప్రస్తుత వాల్తేరు ప్రాంతం కేవలం పోష్‌లొకాలిటీగా పరిమిత నివాసాలతో ఉండేది. ఆ తర్వాత నగరం వాల్తేరు వైపు విస్తరించింది. 1979లో విశాఖ నగరపాలకసంస్థ ఆవిర్భవించడం- నగరాభివృద్ధిని కీలకమైన మలుపు తిప్పింది. ఆదిలో రెండేళ్ల పాటు స్పెషలాఫీసరు పాలన కొనసాగినా 1981 నుంచి పాలకవర్గం ఎన్నికవుతూ వస్తోంది. కార్పొరేషన్ స్థాయికి ఎదగడం, నిధుల లభ్యత పెరగడం వంటి కారణాల వల్ల నగరాభివృద్ధి ఊపందుకుంది. రోడ్లు, డ్రెయిన్లు, వీధి దీపాలు, తాగునీరు వంటి కనీస సదుపాయాలే కాకుండా నగరానికి ఉండాల్సిన అన్ని హంగులూ కార్పొరేషన్ దశలవారీగా కల్పించగలిగింది.2005లో మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)గా ఏర్పడింది.
కళింగాంధ్ర ప్రాంత ముఖద్వారంగా ఉన్న చిన్న పల్లె వైజాగపటంగా... ఆ తర్వాత విశాఖపట్నంగా నేడు 'మహా' విశాఖగా మారిన సుదీర్ఘ ప్రస్థానంలో విశాఖ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. వాస్తవానికి ఇక్కడ 1858లోనే స్వచ్ఛంద మున్సిపల్ కౌన్సెల్ ఏర్పాటు ద్వారా మున్సిపల్ తరహా పరిపాలన అమల్లోకి వచ్చింది. 1875లో మొదటి కౌన్సెల్‌లో మొత్తం ఆంగ్లేయ అధికారులే సభ్యులు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తూ పరిపాలనను చక్కబెట్టేవాళ్లు. అప్పట్లో ఐదుగురు సభ్యుల కౌన్సెల్‌కు సి.ఎ.క్రేమ్ అధ్యక్షుడుగా, వి.పి.ముర్రే ఉపాధ్యక్షుడుగా వ్యవహరిస్తే, ఐ.ఎన్.ట్రేడర్, అచ్రమేప, ఎం.బి.ఎ.అదెపలు సభ్యులుగా ఉన్నారు.కానీ మున్సిపల్ రాజకీయ ముఖచిత్రం మాత్రం 1885 తర్వాతనే ఆవిష్కృతమైందని చరిత్ర తెలుపుతోంది.

జనాభా విస్ఫోటనం...
1872లో కేవలం 6 చదరపు మైళ్లలో విస్తరించిన విశాఖ జనాభా సుమారు 32,250. 1955లో విస్తీర్ణం దాదాపు రెట్టింపు కాగా, జనాభా సంఖ్య 1.20 లక్షలకు పెరిగింది. ఆ తర్వాత పారిశ్రామికీకరణతో నగర విస్తీర్ణంతో పాటు జనాభా కూడా గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం 152 చదరపు కిలోమీటర్లకు విస్తరించిన నగరంలో జనాభా సంఖ్య 18 లక్షల పైమాటే. కేవలం పారిశ్రామికంగానే కాకుండా విద్య, వైద్యం, వాణిజ్యం, సాహిత్య-సాంస్కృతిక రంగాలన్నిటిలోనూ ముందుకు దూసుకుపోతున్న విశాఖను రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా అభివర్ణిస్తుంటారు. హైదరాబాద్, చెన్నై తర్వాత పెద్దస్థాయిలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఉండే నగరంగా ఎదుగుతున్న విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు అన్నివిధాలా పెద్దదిక్కులా నిలుస్తోంది. ప్రకృతి రమణీయతకే పట్టుగొమ్మలా భాసిల్లుతున్న విశాఖ అటు పర్యాటక రంగంలోనూ తనదైన ముద్రను సొంతం చేసుకుంటోంది... కొత్త సహస్రాబ్ది దిశగా ముందుకు దూసుకుపోతోంది.

నాడు ఐదుగురు సభ్యులే...!
1875లో కేవలం ఐదుగురు సభ్యులతో కూడిన మున్సిపల్ కౌన్సెల్ ఉండేది! ఆ తర్వాత 1882లో ఈ సంఖ్యాబలం 7కు పెరిగింది. 1884లో మద్రాస్ డిస్ట్రిక్ట్ మున్సిపాల్టీస్ యాక్ట్ 1884 ప్రకారం- వైజాగ్ నిజమైన మున్సిపల్ కౌన్సెల్ ఆవిర్భావం జరిగింది. అప్పటి నుంచే ఇక్కడ అసలైన మున్సిపల్ రాజకీయ వాతావరణం కనిపించటం ప్రారంభమైంది. అప్పటి వరకూ ఈ మున్సిపల్ కౌన్సెల్‌లో బ్రిటిష్ ఇండియా అధికారులు, నామినేటెడ్ ప్రతినిధులు అధికారం చలాయించేవారు. 1884-85లో మున్సిపల్ కౌన్సెల్‌గా మారాక పట్టణాన్ని మొత్తం 6 వార్డులుగా విభజించి, ఐదుగురు ఎన్నికైన సభ్యులు, ఇద్దరు ఎక్స్-అఫీషియో సభ్యులు, మరో 11 మంది నామినేటెడ్ సభ్యులతో కౌన్సెల్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికైన సభ్యులు ఛైర్మన్‌ను ఎన్నుకునే వారు. ఏడాదికి ఒకసారి ఎన్నికలు జరిపేవారు. 1888లో కౌన్సెల్‌కు ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిలో ఛైర్మన్, వైస్- ఛైర్మన్‌లను ఎన్నుకునే అవకాశం కల్పించారు. 1920లో మద్రాస్ డిస్ట్రిక్ట్ మున్సిపల్ యాక్ట్ వచ్చాక కౌన్సిల్ స్థానాలను 28కి పెంచారు. 1933 మున్సిపల్ చట్టం ద్వారా మున్సిపల్ పరిపాలనలో మరిన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత వరుసగా 1965, 1971లలో వచ్చిన మున్సిపల్ చట్టాలు, సవరణలు విశాఖ మున్సిపల్ కౌన్సెల్ పరిధిని మరింత విస్తృత పరిచాయి. విశాఖ మున్సిపల్ కౌన్సెల్ ఛైర్మన్లుగా ఎందరో ప్రముఖులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ప్రత్యేకంగా అంకితం భానోజీరావ్, తెన్నేటి విశ్వనాధం, మద్ది పట్టాభిరామ్‌రెడ్డిల హయాంలో నగరాభివృద్ధికి జరిగిన కృషి నేడు నగరం మహానగరంగా అభివృద్ధి చెందేందుకు గట్టి పునాదులు వేసిందని చెప్పొచ్చు.

కార్పొరేషన్‌గా అవతరణ
విశాఖ మున్సిపాల్టీ పరిధిని మరింత విస్తరించి 1979లో మున్సిపల్ కార్పొరేషన్ స్థాయికి పెంచి, వార్డులను 50కి పెంచారు. విశాఖపట్నం నగరపాలక సంస్థగా మారిన తర్వాత జరిగిన ఆ తొలి ఎన్నికల్లో ఎన్.ఎస్.ఎన్.రెడ్డి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా విజయభేరి మోగించింది. మేయర్ పదవికి పరోక్ష పద్ధతిన జరిగిన ఎన్నికల్లో ఎన్.ఎస్.ఎన్.రెడ్డి గెలుపొందారు. ఏడాది పదవీకాలం ఉండే మేయర్ పదవిలో ఎన్.ఎస్.ఎన్.రెడ్డి వరసగా ఐదేళ్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత కార్పొరేషన్‌కు రెండో సారి 1987లో ఎన్నికలు జరగ్గా తెలుగుదేశం 23 స్థానాల్లో విజయం సాధించింది. ఐదేళ్ల పదవీ కాలం ఉండేలా మేయర్ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరగ్గా, తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ న్యాయవాది డి.వి.సుబ్బారావు కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు సత్యనారాయణపై గెలుపొందారు. ఆ తర్వాత 1995లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి సబ్బం హరి విజయం సాధించారు. అనంతరం 2000లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజాన రమణి విజయం చేజిక్కించుకుని విశాఖ నగరపాలక సంస్థకు తొలి మహిళా మేయర్‌గా చరిత్ర సృష్టించారు. గత పాలకమండలి పదవీకాలం ముగియటంతో 2005 నుంచి ఇప్పటి దాకా నగరం ప్రత్యేకాధికారి పాలనలో ఉంది. తాజాగా 2006లో నగరాన్ని గ్రేటర్ విశాఖగా మార్చి వార్డుల సంఖ్య 50 నుంచి 72కు పెంచారు.

భౌగోళిక విశేషాలు
రాష్ట్రంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో కీలకమైంది విశాఖపట్నం. ఇది భౌగోళికంగా 17.15 డీగ్రీల నుంచి 18.2 డిగ్రీల ఉత్తర అక్షాంశాలు, 18.54 డిగ్రీల నుంచి 83.30 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఉత్తరాన ఒడిశా రాష్ట్రం, విజయనగరం జిల్లాలో కొంత భాగం, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమాన ఒడిశా రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. విశాఖ జిల్లాను మూడు భాగాలుగా విభజించవచ్చు 1. పట్టణ ప్రాతం, 2. గ్రామీణ ప్రాంతం, 3. ఏజెన్సీ ప్రాంతం. ఈ మూడు ప్రాంతాల మధ్య అభివృద్ధి, ప్రజల జీవన సరళిలో కూడా అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. విశాఖ జిల్లా 11,161 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. 42.1 శాతం అడవులు ఉన్నాయి.. 36.1 శాతం మాత్రమే సేద్యానికి అనుకూలం. ఏజెన్సీ ప్రాంతం తూర్పు కనుమల్లో భాగం. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు నుంచి 1200 మీటర్లు దాటిన ఎత్తయిన కొండప్రాంతాలు అనేకం ఉన్నాయి. శంకరం అటవీప్రాంతం 1615 మీటర్ల ఎత్తున ఉంది. ఏజెన్సీలోని పాడేరు, జి.మాడుగుల, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, డుంబ్రిగూడ, అరకులోయ, అనంతగిరి, చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో విస్తారమైన అటవీ ప్రాంతం ఉంది. ఎజెన్సీ ప్రాంతంలోని మాచ్‌ఖండ్ మత్స్యగడ్డ, సీలేరు.. మైదాన ప్రాంతంలోని శారద, వరాహా, తాండవ నదులు, మేఘాద్రిగడ్డ, గంభీరంగడ్డ జలాశయాలు వంటివి జిల్లాలో ప్రధానమైన నీటివనరులు. పాలనా సౌలభ్యం కోసం మూడు రెవెన్యూ డివిజన్లు, 43 మండలాలుగా విభజించారు.

శీతోష్ణ పరిస్థితులు
జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో భిన్నమైన వాతావరణం ఉంటుంది. తీర ప్రాంతంలో తేమ ఎక్కువగా, లోపలి ప్రాంతాల్లో వెచ్చగా, ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో చల్లటి వాతావరణం కనిపిస్తుంటుంది. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. విశాఖ నగరం వెలుపల ఉన్న విమానాశ్రయంలో 2008-09 సంవత్సరంలో సేకరించిన ఉష్ణోగ్రతల ప్రకారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పుడు జనవరి నెలలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత 20.2 డిగ్రీల సెల్సియస్, మండు వేసవి ఉండే మే నెలలో సగటు గరిష్ట ఉష్టోగ్రత నమోదైంది.

వర్షపాతం
రాష్ట్రంలోనే అధిక వర్షపాతం ఉన్న జిల్లాల్లో విశాఖ రెండోది. ఏజెన్సీ జిల్లాలో ఏటా 1202 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవుతోంది. 2008-09లో నైరుతి రుతుపవనాల ద్వారా 55.9 శాతం, ఈశాన్య రుతుపవనాల ద్వారా 6.8 శాతం వర్షపాతం నమోదైంది. వేసవిలో, చలికాలంలో కురిసిన వర్షాలతో మిగతాది సమకూరింది. ఏజన్సీలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాల ద్వారా, కోస్తా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈశాన్య రుతుపవనాల ద్వారా అత్యధిక వర్షపాతం నమోదైంది.

నేలలు
జిల్లాలోని దాదాపు 69.9 శాతం గ్రామీణ ప్రాంతం ఎర్రమట్టి నేలలే. 19.2 శాతం ఇసుక నేలలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా కోస్తా తీరంలోని నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ, విశాఖపట్నం, పెదగంట్యాడ, గాజువాక, భీమునిపట్నం మండల్లాల్లో, చోడవరం, నర్సీపట్నం, కె.కోటపాడు, మాడుగుల మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, పాడేరు, హుకుంపేట మండలాల్లో నల్లరేగడి నేలలు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

భూ వినియోగం
జిల్లా భౌగోళిక విస్తీర్ణం 11.16 లక్షల హెక్టార్లు. దీనిలో 30.54 శాతం భూమి సాగుకు యోగ్యమైనది. 39.52 శాతం అటవీ ప్రాంతం. మిగతా ప్రాంతంలో 11.7 శాతం వరకు బీడు, బంజరు భూములు ఉన్నాయి. వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే మొత్తం భూ విస్తీర్ణం 9.2 శాతం. 2008-09 గణాంకాల ప్రకారం మొత్తం సాగుకు యోగ్యమైన భూమిలో 27.6 శాతం వినియోగంలో ఉంది.

వృక్ష జంతుజాలం
జిల్లాలో మూడింట ఒక వంతుకు పైగా అటవీ ప్రాంతమే. వీటిల్లో గుగ్గిలం, తంగేడు, సిరిమాను, కంబ, వేగిస, నల్లమద్ది, గండ్ర, వేప తదితర వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. వెదురు పొదలు అక్కడక్కడా విస్తరించి ఉన్నాయి. పోడు వ్యవసాయం, విచక్షణా రహితంగా పశువులను మేపటం తదితర కారణాల వల్ల 1955-56 నుంచి జిల్లా అటవీ విస్తీర్ణం క్రమంగా తగ్గుతోంది. దీన్ని నివారించటానికి ప్రభుత్వం టేకు మొక్కలు, సిల్వర్ ఓక్, కాఫీ తోటల పెంపకం తదితర కార్యక్రమాలను చేపడుతోంది. ఏజన్సీ ప్రాంతం కాఫీ పెంపకానికి అనువైనదిగా గుర్తించారు. దీంతో చింతపల్లి, గూడెంకొత్తవీధి, మినుములూరు, దేవరాపల్లి, అనంతగిరి ప్రాంతాల్లో వేర్వేరు సంస్థలు వేర్వేరు లక్ష్యాలతో దాదాపు పదివేల ఎకరాల్లో కాఫీ తోటల పెంపకాన్ని చేపట్టాయి. నేల సారాన్ని సంరక్షించటం కోసం అటవీ శాఖ, ఈ ప్రాంతానికి అనువైన కాఫీ సాగు రకాల అభివృద్ధికి కాఫీ బోర్డు, పర్యావరణానికి హానిచేసే పోడు వ్యవసాయం నుంచి గిరిజనులను దూరం చేయటానికి ఐటీడీఏ, గిరిజన్ కార్పొరేషన్ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి. రోజ్‌వుడ్, టేకు, నల్లమద్ది వంటి మేలురకాల కలపకు, వెదురుకు, కాఫీ తోటలు, పనస, సీతాఫలం, నారింజ, అనాస వంటి రుచికరమైన పంటలకు, తేనె, అడ్డాకులు, పసుపు, చింతపండు, అల్లం వంటి అటవీ ఉత్పత్తులకు, వేల రకాల ఔషధ మొక్కలకు నిలయం జిల్లాలోని మన్యం ప్రాంతం. 2007 నాటి పశుగణన ప్రకారం జిల్లాలో జంతు జాలం 17.15 లక్షలు. అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్లు, అడవిదున్నల, అడవి పందులు.. అరుదుగా పులులు, చిరుతలు కనిపిస్తుంటాయి.

ఆర్థికరంగం
వ్యవసాయం: జిల్లాలో దాదాపు 70 శాతం కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. విశాఖ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నా గ్రామీణ ప్రాంతంలో వెనుకబాటుతనం అలాగే ఉంది. ఆహారంలో బియ్యం వినియోగమే ఎక్కువ కాబట్టి ఈ ప్రాంతంలో వరి పంటే ప్రధానం. ఆ తర్వాత రాగులు, జొన్నలు, సజ్జలు ఎక్కువగా పండిస్తారు. వాణిజ్య పంటల్లో చెరకు, వేరుశెనగ, నువ్వులు, మిర్చి తదితరాలను ప్రధానంగా సాగుచేస్తారు. భారీ నీటి పారుదల ప్రాజెక్టులు ఏవీ లేకపోవటంతో జిల్లాలో 36 శాతం మేర వ్యవసాయం ఆయకట్టు, మధ్యతరహా సాగు నీటి ప్రాజెక్టులు, జలాశయాల కింద సాగవుతోంది. మిగతా వ్యవసాయ మంతా వర్షాధారమే. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉత్పాదకత తక్కువగా ఉంటుంది.
పశుపోషణ: వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా ప్రధాన జీవనాధారం. పంటలు సరిగా పండనప్పుడు పాలిచ్చే పశువులు, గొర్రెలు, మేకల పెంపకమే గ్రామీణులను ఆర్థికంగా ఆదుకుంటాయి. విశాఖ డెయిరీకి, స్థానిక మార్కెట్లో పాలను విక్రయించటం ద్వారా అనేక కుటుంబాలు గణనీయమైన ఆదాయాన్ని అర్జిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 12.02 లక్షల పశు సంపద ఉంది. వీటిల్లో పాలిచ్చే పశువులు 3.10 లక్షలు, వ్యవసాయం, ఇతరత్రా పనుల్లో ఉపయోగించే పశువులు 2.14 లక్షలు. మేకలు, గొర్రెలు కలిపి 4.06 లక్షలు. ఇవన్నీ జిల్లాలో వేలాది కుంటుంబాలకుజీవనాధారాన్ని కల్పిస్తున్నాయి.
మత్స్య సంపద: జిల్లాలో ఉన్న 132 కిలోమీటర్ల తీరప్రాంతంలో విస్తరించి ఉన్న 11 మండలాల్లో 59 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో ఉన్న దాదాపు 13 వేల మత్స్యకార కుటుంబాలు సముద్రంలో, కాలువల్లో, తాండవ, రైవాడ జలాశయాల్లో చేపల వేటతో జీవనాన్ని సాగిస్తున్నాయి. జిల్లాలో అపారమైన మత్స్య సంపద ఉంది. 2001-02లో 51 వేల మెట్రిక్ టన్నుల సముద్ర ఉత్పత్తుల సేకరణ జరిగింది.
ఖనిజ సంపద: జిల్లాలోని కొన్ని గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ (రాక్ ఫాస్పేట్), కాల్సైట్, స్ఫటిక, కోట్లాది రూపాయల విలువచేసే రంగురాళ్ల నిక్షేపాలు ఉన్నాయి. జి.కె. వీధి మండలంలోని సప్పర్ల, జెర్రిల, గూడెం ప్రాంతాల్లో ఉన్న బాక్సైట్ నిక్షేపాలు దేశంలోనే అతి పెద్దవని చెబుతున్నారు. అనంతగిరి మండలం కాశీపట్నం గ్రామంలో ఫాస్పేట్ నిక్షేపాలు ఉన్నాయి. బొర్రా గుహలు, అరకులోయ పరిసర ప్రాంతాల్లో స్ఫటికరాయి, కాల్సైట్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో విరివిగా ఉపయోగించే రూబీమైకా బొర్రా ప్రాంతంలో లభ్యమవుతోంది. భీమునిపట్నం, పద్మనాభం, దేవరాపల్లి, కె.కోటపాడు, అనంతగిరి మండలాల్లో క్వార్ట్జ్ ఖనిజం లభిస్తోంది. అరకులోయ మండలం మాలివలస సమీపంలో బంకమట్టి నిక్షేపాలు ఉన్నాయి. సముద్ర గర్భంలో 31.59 మిలియన్ టన్నుల ఖనిజ నిక్షేపాలున్నట్లు అంచనా. అణు కేంద్రాలకు అవసరమైన యురేనియం, ప్లూటోనియం, ధోరియం, కోబాల్ట్ వంటివి సముద్ర గర్భంలో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. లక్ష టన్నుల ఇలిమినైట్, 5 వేల టన్నుల రోటైల్, 4 వేల టన్నుల సిలిమినైట్, 4 వేల టన్నుల జర్కోస్, 1200 టన్నుల మానటైడ్, 10 వేల టన్నులు గార్నెట్ ఇక్కడి సముద్ర గర్భంలో ఉన్నాయని అంచనా.

విద్య

ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926లో ఆవిర్భవించింది. 85 ఏళ్ల చరిత్ర గల విశ్వవిద్యాలయం విశాఖలో సుమారు 450 ఎకరాల్లో విస్తరించింది. ప్రస్తుతం విశ్వ విద్యాలయంలో ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, న్యాయ కళాశాలలతో పాటు మహిళా ఇంజినీరింగ్ కళాశాల కూడా ఉంది. ఏయూ ప్రాంగణంలో అన్ని విభాగాల్లో కలిపి సుమారు ఐదువేలకు పైగా విద్యార్థులు ఉంటున్నారు. ఈ విద్యార్థులందరికీ ఐదు కళాశాలల ఆధ్వర్యంలో వసతిగృహాలు ఉన్నాయి. అత్యున్నత సదుపాయాలు, ప్రయోగశాలలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రస్తుతం వర్సిటీలో సుమారు 400 మంది వరకు బోధన సిబ్బంది ఉన్నారు. మొట్టమొదటి వీసీగా కట్టమంచి రామలింగారెడ్డి (సర్ సి.ఆర్.రెడ్డి) వ్యవహరించగా ఇప్పటివరకు 16 మంది వీసీలు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత విద్య శాఖ ప్రధాన కార్యదర్శి ఎం.జి.గోపాల్ ఇన్‌ఛార్జి వీసీగా ఉన్నారు. ఏయూలో 60కు పైగా విభాగాలు ఉన్నాయి. 22 ఆర్ట్స్ కోర్సులు, 22 సైన్స్ కోర్సులు, 17 ఇంజినీరింగ్ కోర్సులు, 12 పరిశోధన కేంద్రాలు ఉన్నాయి.

విభాగాలు - ఫోన్ నంబర్లు:
ఆర్ట్స్ అండ్ కామర్స్ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2844666
సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2754615, 2844888
ఫార్మస్యూటికల్ సైన్స్ ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2844923, 2745647
ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2754586, 2844771
న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ 0891-2844777
ఏయూ దూరవిద్య కేంద్రం ఫోన్ నంబర్లు: 0891-2844142
ఏయూ ఎంక్వయిరీ : 2755993, 2844197
ఎక్స్ఛేంజ్: 0891-2844000
రిజిస్ట్రార్ కార్యాలయం 0891-284411, 284422
వీసీ కార్యాలయం : 0891-2844222, 2575464
రెక్టార్ కార్యాలయం : 0891-284411
డీన్ యూజీ పరీక్షలు: 0891-284488
డీన్ పీజీ కోర్సులు: 0891-284466
పరీక్షల నిర్వహణాధికారి 0891-2844177

గీతం విశ్వవిద్యాలయం
గీతం ఇంజినీరింగ్ కళాశాలను 1980లో అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి వాల్తేరు ఆర్టీసీ డిపో ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కళాశాలను రుషికొండ ప్రాంతానికి 1983లో తరలించి అంచలంచెలుగా రాష్ట్రం వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంతరించుకునే రీతిలో అభివృద్ధి చేశారు. సుమారు 145 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గీతం కళాశాల.. గీతం విశ్వవిద్యాలయంగా 2007 ఆగస్టులో అవతరించింది. తొలి ఉపకులపతిగా ఆచార్య గంగాధరరావు నియమితులయ్యారు. గంగాధరరావు అనంతరం జి.సుబ్రహ్మణ్యం ప్రస్తుత ఉపకులపతిగా విధులు నిర్వహిస్తున్నారు. యూనివర్శిటీలో ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్స్, ఫార్మసీ, ఫారిన్‌ట్రేడ్, దంత వైద్య విభాగాల్లో కళాశాలలు ఉన్నాయి. సుమారు 12 వేలమంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థులకు అత్యాధునిక సదుపాయాలతో వసతి గృహాలు నెలకొల్పారు. దీంతో పాటు రెండేళ్ల క్రితం గీతం దూర విద్య కేంద్రాన్ని దొండపర్తిలో స్థాపించారు. ఈ కేంద్రంలో సుమారు ఆరువేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఏకైక డిగ్రీ కళాశాల: భీమిలి నియోజకవర్గంలో 214 ప్రాథమిక పాఠశాలలు ఉండగా ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 36 ఉన్నాయి. భీమిలి కేంద్రంగా పురాతనమైన ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు పనిచేస్తున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల భీమిలిలో మాత్రం ఒకొక్కటి ఉన్నాయి. ప్రైవేటు, ఎయిడెడ్ సంస్థలు తగరపువలస, ఆనందపురం, పద్మనాభం, మధురవాడ ప్రాంతంలో పనిచేస్తున్నాయి. ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలల ఏర్పాటు ప్రతిపాదనల స్థాయిలోనే ఉండిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్నత పాఠశాలల్లో చదివి పదవ తరగతి ఉత్తీర్ణత చెందినవారు ఇంటర్మిడియేట్ ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవవలసి వస్తోంది. ఇంటర్ పూర్తయిన వారికి మాత్రం అవసరమైన అన్ని కళాశాలలు ఇక్కడే ఉన్నాయి.
విద్యార్థుల హాజరు: భీమిలి నియోజకవర్గంలో వివిధ ఉన్నత పాఠశాలల ద్వారా ప్రతి సంవత్సరం ఆరువేల మందికిపైగా పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు రెండువేలమంది వెళుతున్నారు. బీఈడీ కళాశాలల ద్వారా 640 మంది, ఇంజీనిరింగ్ కళాశాలల్లో వివిధ ట్రేడుల ద్వారా 3600 మంది ప్రతీ ఏడాది పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థులు విద్యాలయాలకు హాజరుకావడానికి రవాణా సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రాథమిక తరగతులకు ప్రైవేటు విద్యాసంస్థలు బస్సు సదుపాయాలను కల్పిస్తుండగా ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నవారు ప్రైవేటు వాహనాలపై ఆధారపడవలసి వస్తోంది. చాలా ప్రాంతాల్లో బస్సు షెల్టర్లు కూడా లేవు.
కార్పొరేటు విద్యాసంస్థలు: విద్యాలయాలకు కేంద్రంగా ఉన్న భీమిలిలో అనేక కార్పొరేట్ సంస్థలు తమ విద్యాలయాలను ఏర్పాటుచేస్తున్నాయి. కొన్ని బ్రాంచిలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. సంగివలస వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాసంస్థ ఏర్పటు అవుతోంది. చాలా సంస్థలు తమ భవనాలను నిర్మించుకోవడానికి స్థలాలను కూడా సేకరిస్తున్నాయి. రానున్న కాలంలో విద్యా సంస్థలకు కేంద్రంగా ఈ ప్రాంతం మరింత ప్రాధాన్యత సంతరించుకుటుందని పరిశీలకులు భావిస్తున్నారు.

నదులు - ప్రాజెక్టులు

శారదానది
శారదా నది అనంతగిరి మండలంలో పుట్టి దేవరాపల్లి మీదుగా చోడవరం మండలంలో లక్కవరం వద్ద ప్రవేశిస్తుంది. ముద్దుర్తి నుంచి అనకాపల్లి మండలంలోకి ప్రవేశిస్తుంది. లక్కవరం, సింహాద్రిపురం, జుత్తాడ, గజపతినగరం, గోవాడ, ముద్దుర్తి, భోగాపురం గ్రామాలు శారదానది చెంతన ఉన్నాయి. శారదా నది పక్కన ముద్దుర్తి వద్ద 1993-94లో రూ.8.5 లక్షలతో 326 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మించారు. చోడవరం నియోజకవర్గంలో శారదా నది, ఉపనదులైన పెద్దేరు, బొడ్డేరు, తాచేరు ప్రధాన సాగునీటి వనరులు. వీటిపై నిర్మించిన గ్రెయిన్‌ల ద్వారా సాగునీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తారు. తొమ్మిది గ్రెయిన్ల ద్వారా 13,265 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

మత్స్యగెడ్డ
మన్యంలోని అత్యధిక మండలాలకు మత్య్సగెడ్డే ప్రధాన ఆధారం. జి.మాడుగుల మండలంలోని మారుమూల గెమ్మెలి గ్రామంలో పుట్టింది. అక్కడ్నించి ఒరిస్సా సరిహద్దు వరకు ప్రవహిస్తోంది. ఈ గెడ్డ నీటిపైనే జోలాపుట్టు, మాచ్‌ఖండ్ విద్యుత్తు కేంద్రాలు ఆధారపడి ఉన్నాయి. పాడేరు, హుకుంపేట, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో ఆయకట్టు సాగవుతోంది. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో అనేక మంది మత్య్సకారులు దీనిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏజెన్సీ డివిజన్ కేంద్రం పాడేరు పట్టణంలో సుమారు 40వేల మందికి ఈ గెడ్డలో నుంచి సేకరించిన నీటినే రక్షిత పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు.

వరాహానది
కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల్లో ప్రవహిస్తోంది. ఎస్.రాయవరం మండలంలో వరాహానది నీటి ద్వారా, 60 చెరువుల్లో చేరిన నీరు వల్ల 30 వేల ఎకరాల్లో పంటలు పండుతున్నాయి.

తాండవ నది
నాతవరం మండలంలోని తాండవ నుంచి ప్రవహించి పాయకరావుపేట మండలంలోని పెంటకోటవద్ద సముద్రంలో కలుస్తుంది.

సర్పానది
మాకవరపాలెం మండలంలో తాడపాల నుంచి జంగాలపల్లి వరకూ సుమారు 11 కిలోమీటర్ల పరిధిలో సర్పానది ప్రవహిస్తుంది. దీని ద్వారా తాడపాల, బూరుగుపాలెం, పెద్దిపాలెం, లచ్చన్నపాలెం, కొండల అగ్రహారం, బయ్యవరం, మాకవరపాలెం, ఎన్.ఆర్.పేట, పి.పి.అగ్రహారం, జి.కోడూరు, జంగాలపల్లి గ్రామాలకు చెందిన 1300 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

గోస్తనీ నది
అనంతగిరి మండలంలో పుట్టిన గోస్తనీ పెదబయలు మండలంలో మత్యగెడ్డ మీదుగా ప్రవహించి ఒరిస్సాలోని జోలాపుట్టు జలాశయంలో కలుస్తోంది.

ప్రాజెక్టులు
రైవాడ జలాశయం
దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయం కుడికాలువ కింద లక్కవరం, గవరవరం, రేవళ్లు, చోడవరం గ్రామాలకు చెందిన 4,375 ఎకరాలు సాగవుతోంది.

కోనాం జలాశయం
చీడికాడ మండలం కోనాం జలాశయం మర్లగుమ్మి ఆనకట్టు ద్వారా లక్ష్మీపురం, మంగళాపురం, కుముందానుపేట, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన 1300 ఎకరాలకు సాగునీరు ప్రవహిస్తుంది.

పెద్దేరు జలాశయం
మాడుగుల మండలంలోని పెద్దేరు జలాశయం నుంచి కుడిప్రధాన కాలువ ద్వారా రావికమతం, బుచెయ్యపేట మండలాలకు చెందిన నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది.

రావణాపల్లి జలాశయం
రావణాపల్లి జలాశయం కింద 2100 ఎకరాల ఆయుకట్టు ఉంది. గొలుగొండ మండలంలో ఉన్న రావణాపల్లి జలాశయం రెండు మండలాలకు సాగునీరు అందిస్తుంది.

జాజిగెడ్డ రిజర్వాయరు
మాకవరపాలెం మండలంలో పాపయ్యపాలెం పంచాయతీలో జాజిగెడ్డ రిజర్వాయరు ఉంది. దీని ఆయకట్టులో పాపయ్యపాలెం, బుచ్చెన్నపాలెం, బూరుగుపాలెం, ముసిడిపాలెం, తదితర గ్రామాలకు చెందిన సుమారు 450 ఎకరాలకు నీరు అందుతుంది.

వూటగెడ్డ
రామన్నపాలెం పంచాయతీ చినరాచపల్లి వద్ద వూటగెడ్డ రిజర్వాయరు ఉంది. దీని కింద చినరాచపల్లి, రామన్నపాలెం, వెంకయ్యపాలెం గ్రామాలకు చెందిన సుమారు 300 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

తాండవ జలాశయం
నాతవరం మండలం నుంచి వస్తున్న తాండవ నీటిపై ఆధారపడి పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లోని సుమారు 25 వేల ఎకరాల్లో పంటభూముల్లో పంటలు పండుతున్నాయి.

నీటిపారుదల

గోదావరి నీరు విశాఖకు మళ్లింపు
పోలవరం ప్రోజెక్టు నిర్మాణం చేపడితే పాయకరావుపేట అనకాపల్లి మధ్య 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఏలేరు ఎడమకాలువ నీటిని మరో 50 వేల ఎకరాలకు వినియోగించుకోవచ్చు. ఈ కాలువను చోడవరం వరకూ పొడిగిస్తే మరో 30 వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఇరిగేషన్ పథకాలకు పూర్తి సామర్ధ్యం వినియోగించుకునే చర్యలు చేపట్టాలి. గెడ్డలు, కాలువలు, చెరువులు పూడికలు తీయించాలి. చెక్‌డ్యాములు నిర్మించడం, మైనర్ ఇరిగేషన్ ప్రోజెక్టులు చేపట్టడానికి అవకాశాలు మైదాన ప్రాంతంలో 573, ఏజెన్సీ ఏరియాలో 547 చెక్‌డ్యాంలు ఉన్నా అత్యధికం మరమ్మతులకు గురై ఉన్నాయి. మొత్తం 1120 ఉన్నాయి. వీటి ద్వారా 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు లభ్యమవుతోంది.

భూగర్భ జలాలు
గ్రామీణ ప్రాంతంలో పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నాయి. జిల్లాలో బోరుబావులు, నూతుల ద్వారా 20 వేల ఎకరాలలోపే భూమి సాగవుతున్నది. భూగర్భ జలాలు అడుగంటిన అనంతపురం లాంటి జిల్లాలో 300 అడుగుల పైబడి లోతు బోర్లు రైతులు వేయటానికి సిద్ధపడిన అక్కడ నీరు అభ్యత లేదు. విశాఖ జిల్లాలో మాత్రం భూగర్భ జలాలు సాగుకి ఉపయోగించుకోలేని దయనీయ పరిస్థితిలో రైతాంగం ఉంది. అత్యధిక మంది చిన్న, సన్నకారు రైతాంగం కావటంతో వేల రూపాయలు పెట్టుబడి పెట్టి బోర్లు వేయించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయము లేదా ప్రోత్సాహము లేదు. పలితంగా అత్యధిక వ్యవసాయం కేవలం వర్షాధారం మీదే ఆధారపడింది.

గ్రామీణ ప్రాంతం
సాగునీరు: అవసరాలకు మించి వర్షపాతం జిల్లాలో నమోదవుతున్నా వ్యవసాయానికి సరిపడా నీరులేదు. తాగునీటికి కూడా ప్రజలు కటకటలాడుతున్నారు. జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కటీలేదు. ఒకటి మీడియం, మిగిలినవి మైనర్ ఇరిగేషన్ పథకాలు మాత్రమే. పెద్దగా చెరువులు లేవు. ఉన్నవాటికి మరమ్మతులు చేయకపోవడం వల్ల వర్షపాతంలో పై స్థానంలో ఉన్నప్పటికీ జిల్లాలోని అత్యధిక గ్రామీణ ప్రాంతం నిత్యం కరువువాత పడుతోంది. జిల్లాలో కురుస్తోన్న 1088 మి.మీ. వర్షానికి గాను కేవలం సగము మాత్రమే నిల్వ చేసుకోగలుగుతున్నాయి. జిల్లాలో మైదాన ప్రాంతంలో సాగుకు అవకాశం ఉన్న వ్యవసాయ భూమి సుమారు 33 శాతం మాత్రమే. సాగుకు అనుకూలమైన 10.31 లక్షల ఎకరాల భూమిలో 9,49,257 ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఇందులో కేవలం 2.15 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. అంటే వ్యవసాయోగ్య భూమిలో కేవలం 23% భూమికి మాత్రమే సాగునీరు అందుతోంది. ఇందులో కూడా శారద, తాండవ, వరహ, శబరి, మేఘాద్రిగెడ్డ, రైవాడ, కోణాం, గంభీరం ప్రాజెక్టుల కింద 2.80 లక్షల ఎకరాలు ఆయకట్టు భూములకు సాగునీరు అందుతోంది. ఈ కింద పేర్కొన్న ప్రాజెక్టులను చేపడితే మరింత ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశముంది.

ప్రధాన పంటలు

జిల్లాలో సగానికి పైగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లాలోని 38 లక్షల జనాభాలో 23 లక్షలు గ్రామీణ జనాభా ప్రభుత్వం నీటికల్పన నిర్లక్ష్యం వల్ల జిల్లాలో వ్యవసాయ రంగం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఫలితంగా గ్రామ సీమలలో పేదరికం, అవిద్య, అనారోగ్యం విలయ తాండవం చేస్తున్నాయి. వ్యవసాయదార్లు సంఖ్య 4,51,368. ఒక ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నవారు 2,28,322. ఎకరాల లోపు భూమి గల చిన్న సన్నకారు రైతులు రైతాంగంలో 97 శాతం ఉన్నారు. వీరిలో అత్యధికులు కౌలు రైతులు. వీరి చేతిలో 3,47,465. సాగునీటి లభ్యత లేకపోవడంతో పంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గత 10 ఏళ్ల కాలంలో పంటల ఉత్పత్తి పరిశీలిస్తే వరిపంట విస్తీర్ణంలో మార్పులేదు. మొత్తం జిల్లాలో 2,87,000 ఎకరాల వద్ద స్థిరంగా ఉంది. దిగుబడి మాత్రం తగ్గింది. 1991లో వరి దిగుబడి 1.83 లక్షల టన్నులు ఉండగా, 2004 నాటికి 1.46 లక్షల టన్నులకు పడిపోయింది. అదే భూమిలో సాగుచేసినా 20 శాతంపైగా దిగుబడి తగ్గిపోయింది. ఎకరానికి దిగుబడి 6.5 క్వింటాళ్లు మాత్రమే ఉంది. ఇది పశ్చిమ గోదావరి (13.8 క్వింటాళ్లు) గుంటూరు (13 క్వింటాళ్లు) జిల్లాల దిగుబడిలో సగం కంటే కూడా తక్కువ. సాగునీటి లభ్యత తగ్గిపోవటం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించకపోవడం వర్షాధారం భూమిలో అకాల వర్షాలు లేదా వర్షాభావం వలన దిగుబడి తగ్గింది. అయినా ఇప్పటికీ జిల్లాలో ప్రధాన పంట వరే. మొత్తం సాగుభూమిలో 34.4 శాతం భూమిలో వరి పండుతోంది. మెట్ట పంటల్లో జొన్న సాగు విస్తీర్ణం, దిగుబడి సగానికి సగం పడిపోయింది. జొన్న 1991 నుంచి 2001 నాటికి సాగు విస్తీర్ణం 1,12,000 ఎకరాల నుండి 49,200కు పడిపోయింది. వేరుశనగదీ అదే పరిస్థితి. ఈ పదేళ్ల కాలంలోను వాణిజ్య పంటల సాగు విస్తీర్ణం ఉత్పాదకత పెరిగింది. 1991లో జిల్లాలో చెరకు 78 వేల ఎకరాలలో పండించగా 2004 నాటికి 1 లక్షా 10 వేల ఎకరాలకు పెరిగింది. అంటే చెరకు సాగు 40 శాతం పైగా పెరిగింది. ఈ కాలంలోనే చెరకు పంటల 1991లో 18.08 లక్షలు టన్నులు నుండి 2004లో 36 లక్షల టన్నులకు చేరుకుంది. దిగుబడి కూడా ఎకరానికి 23.2 టన్నుల నుండి 32.4 టన్నులకు పెరిగింది. అయినా మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ దిగుబడి తక్కువే. కృష్ణాజిల్లాలో 43 టన్నులు, చిత్తూరు 38 టన్నుల దిగుబడి ఉంది.

మెట్ట భూముల్లో జీడి విస్తీర్ణం ఉత్పత్తి పెరిగింది. అంటే వ్యవసాయం జీడికి మారిందని అర్ధమవుతుంది. అలాగే మెట్ట ప్రాంతాల్లో సరుగుడు తోటల పెంపకం కూడా పెరిగింది. ఈ రెండూ వ్యాపార పంటలు. కూలి పనులు అతి తక్కువగా ఉంటాయి. గత 20 ఏళ్లలో సముద్ర తీరంలో పంట భూములన్నీ చేపలు, రొయ్యల చెరువులుగా మార్చారు. నేడు ఆ భూములన్నీ నాశనమయ్యాయి. జిల్లాలో పంటల ద్వారా వందల కోట్ల రూపయాల సంపదను రైతులు సృష్టిస్తున్నారు. చెరకు పంట ద్వారా 400 కోట్లు, వరి ద్వారా 100 కోట్లు ఆదాయం వస్తోంది. ఇతర పంటలను కూడా కలిపితే గణనీయమైన ఆదాయం వ్యవసాయం ద్వారా లభిస్తోంది. సరైన సాగునీటి సౌకర్యాలు లేకుండానే ఇన్ని వందల కోట్ల రూపాయలు సంపద రైతులు సృష్టిస్తున్నారు. అదే సాగునీటి సదుపాయాలు కనుక కల్పిస్తే ఎన్నివేల కోట్లు సృష్టిస్తారో అర్ధం చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా ఇప్పటికీ జిల్లాలో హెచ్చు వ్యవసాయం వర్షాధారం గానే సాగుతోంది. వ్యవసాయంలో వచ్చిన ఈ మార్పు గ్రామీణ ప్రాంతంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. వ్యవసాయ కార్మికులు, పేద రైతులు విశాఖ నగరానికి, ఇతర పట్టణ ప్రాంతాలకు ఉపాధి కోసం వలసపోతున్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో ప్రత్యామ్నాయంగా రైతులు, పాడి పశువుల పెంపకం చేస్తూ పాడిపై ఆధారపడి జీవిస్తున్నారు. దీనితో డైరీ పరిశ్రమ జిల్లాలో అభివృద్ధి అయ్యింది.

కౌలుదార్లు: జిల్లాలో కౌలు రైతులు గణనీయ సంఖ్యలో ఉన్నా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్షాలు సక్రమంగా లేక పంటలు దిగుబడి రాకపోవడం పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, అధిక కౌలు చెల్లించలేక తీవ్ర నష్టానికి గురవుతున్నారు. అనేక సంవత్సరాల నుండి కౌలు రైతులుగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి వీరికి ఎలాంటి రక్షణ చర్యలు లేవు. పైపెచ్చు ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాలు కౌలు రైతులకు రుణాలు ఇవ్వక నిరాకరిస్తున్నారు. అఖరికి ప్రభుత్వం సబ్సిడీపై అందించే విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వడంలేదు.

మార్కెట్ సౌకర్యం: వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతాంగం తీవ్ర నష్టపోతున్నారు. ఆరు కాలం కష్టపడి పండించిన పంటలు కారు చౌకగా దళారుల పాలవుతున్నాయి. చెరకు వంటి పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించడం లేదు. చెరకు మిగులు ఉత్పత్తి పేర కొన్ని సందర్భాలలో కొనటానికి నిరాకరిస్తున్నారు. ఇక వరి, జొన్న, వేరుశనగ, జీడి లాంటి పంటల ధరలకు ప్రభుత్వం నుండి గ్యారంటీ కరువయ్యింది. రైతులు తమ పంటలను కాస్తా భూస్వాములు, పెద్ద పెద్ద వ్యాపార వేత్తలకే పరిమితమయ్యాయి.

రైతులకు వూతం పాడి: పాల ఉత్పత్తి ఈ కాలంలో బాగా అభివృద్ధి అయ్యింది. వ్యవసాయం గిట్టుబాటు కాని రైతాంగం దీని ద్వారా కొంత వూరట పొందుతున్నారు. వర్షాభావం వల్ల గేదెలకు గడ్డి దొరకటంలేదు. దాణా కొని మేపటం వల్ల పాడి కూడా ఏమాత్రం గిట్టుబాటు లేదు. అయినా గత్యంతరం లేక పేద రైతులు ఎక్కువ భాగం పాడిపై ఆధారపడుతున్నారు.

గ్రామీణ పరపతి: గ్రామీణ ప్రజలు పరపతిపై తీవ్ర కష్టాలనెదుర్కొంటున్నారు. జిల్లాలో మొత్తం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కేంద్రాలు 111 ఉన్నాయి. ఇందులో మండలానికి ఒకేఒక్క సహకార పరపతి కేంద్రం కలిగినవి 15 మండలాలు ఉన్నాయి. ఏజెన్సీ 11 మండలాలకు గాను 11 సహకార పరపతి కేంద్రాలు ఉన్నాయి. ప్రభుత్వం నుండి వ్యవసాయదారులకు అందేపరపతి ప్రధానంగా సహకార రంగం నుండే. ఇటీవలకాలంలో సహకార రంగం నుండి అందే పరపతి సౌకర్యం తగ్గి సహకార రంగం నుండే. ఇటీవలకాలంలో సహకారరంగం నుండి అందే పరపతి సౌకర్యం తగ్గి పోతున్నది. తాగునీరు జిల్లాలో మొత్తం 5807 ఆవాస ప్రాంతాలకు గాను పూర్తి తాగునీటి సౌకర్యం 1563 ఆవాస ప్రాంతాలకు మాత్రమే ఉంది. పాక్షిక తాగునీటి సౌకర్యం 2285 ఆవాస ప్రాంతాలకు మాత్రమే ఉంది. 1516 గ్రామాలకు ఎటువంటి తాగునీటి సౌకర్యం లేదు. అంటే 73% గ్రామాలకు రక్షిత నీటి పథకం లేదు.
జిల్లాలో రక్షిత నీటి సరఫరా పథకాలు - 1418
సమగ్ర రక్షిత నీటి సరఫరా పథకాలు - 23
బోర్లు - 13,306
బావులు - 785
కనీసం బోర్లు కూడా లేని గ్రామాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఈ వివరాలన్నీ జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇచ్చినవే. ఈ పథకాలు కూడా రిపేర్లలో ఉండి పనిచేయనివి అనేకం ఉన్నాయి.

పర్యాటకం

కైలాసగిరి
కైలాసగిరి కొండ దాదాపు 350 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రకృతి అందాలకు నెలవు. దీనిపై సుందర ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. కొండపై నుంచి సాగర తీరం, విశాఖ నగర సౌందర్యాన్ని కనులారా వీక్షించాల్సిందే గాని మాటల్లో వర్ణించలేం. దీనిపై అందమైన నీటి ఫౌంటేన్లు, మైక్రోవేవ్ రిపీటర్ స్టేషన్, పూల గడియారం, టైటానిక్ వ్యూపాయింట్ వంటివి పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. కొండపై భారీ శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. విద్యుద్దీప కాంతులతో మెరిసిపోయే శ్రీవెంకటేశ్వరుడి నామాలు, శంఖుచక్రాలు కైలాసగిరికి ప్రత్యేక ఆకర్షణ. కైలాసగిరి నుంచి సింహాచలం వరకు నిర్మిస్తున్న రోడ్డు భక్తులకు మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. కైలాసగిరిపై సర్క్యులర్ ట్రెయిన్, రోప్ వే పర్యాటకులకు కొత్త అనుభూతిని మిగులుస్తాయనటంలో సందేహం లేదు.

రామకృష్ణ బీచ్
ప్రకృతి అందాలను, సాగర తీరంలో అలల సౌందర్యాన్ని వీక్షిస్తూ సేదతీరటానికి రామకృష్ణ బీచ్ ఎంతో అనువైనది. సమీపంలో ఉన్న కాళీమాత ఆలయం, మత్స్యదర్శిని వంటివి దీనికి మరింత వన్నె తెచ్చాయి.

కురుపాం టూంబ్
కురుపాం రాణి సృత్యర్థం వందేళ్ల క్రితం దీన్ని నిర్మించారు. ఆకట్టుకునే గుమ్మటం, గోడలపై లతలు, పుష్పాలతో తీర్చిదిద్దిన ఈ నిర్మాణానికి విశాఖ తాజ్‌గా ప్రసిద్ధిచెందింది. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది.

సబ్‌మెరైన్ మ్యూజియం
ఆసియాలోనే మొట్టమొదటిది, ప్రపంచంలో రెండోది కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం. సాగర తీరంలోని ఆర్కే బీచ్ ఇసుకతిన్నెల్లో దీన్ని ఏర్పాటు చేశారు. నావికాదళంలో దీర్ఘకాలం సేవలు అందించిన కురుసుర జలంతర్గామిని అతికష్టమ్మీద ఒడ్డుకు చేర్చి రూ.2.55 కోట్ల వ్యయంతో దీన్ని ప్రజల సందర్శనకు అనువుగా దీన్ని తీర్చిదిద్దారు.

రుషికొండ బీచ్
విశాఖ పట్నానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ అందమైన ఇసుక తిన్నెలకు, ప్రకృతి అందాలకు నెలవు. ఈత సరదా తీర్చుకోవటానికి, పడవ పోటీలు నిర్వహించటానికి ఇది ఎంతో అనువైన ప్రాంతం. ఇక్కడ ఏపీ టూరిజం ఆధ్యర్యంలోని 12 కాటేజీలు పర్యాటకులకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఓ ఈతకొలను, జలక్రీడల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.

తొట్లకొండ
ఇది విశాఖపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో బీచ్‌రోడ్డులో సముద్రమట్టానికి 128 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ నీటిని నిల్వచేసే భారీ తొట్లెలు కనిపిస్తాయి. బౌద్ధులకు చెందిన స్థూపాలు, చైత్య గృహాలు, సమావేశ మందిరాలు వంటి వాటికి చెందిన అవశేషాలు ఇక్కడి తవ్వకాల్లో వెలుగుచూశాయి.
బావికొండ: విశాఖ పట్నం నుంచి భీమునిపట్నం బీచ్‌కు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారికి రెండు కిలోమీటర్ల లోపల తిమ్మాపురం ప్రాంతానికి ఆగ్నేయ దిశలో ఈ ప్రాంతం ఉంది

సింహాచలం
విశాఖ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుప్రసిద్ధ సింహాచలం పుణ్యక్షేత్రానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. సాక్షాత్తూ నృసింహస్వామి కొండపై కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం. నిత్యం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండపైకి వెళ్లే దారిలో ప్రకృతి అందాలు భక్తులను ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. నిర్మాణ శైలిపరంగా కూడా ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఆలయానికి ఉత్తరాన 96 నల్లరాతి స్తంభాలతో ఉన్న నాట్యమండపంలో ఏటా కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

ఈ దేవాలయానికి దాదాపు నాలుగు వేల ఎకరాల భూములు ఉండగా చాలావరకు ఆక్రమణల్లో ఉన్నాయి. ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు సందర్శించినట్టు శిలాశాసనాలు కూడా ఉన్నాయి.
1). ప్రతి ఏటా మార్చి- ఏప్రిల్‌లో నిర్వహించే వరాహ లక్ష్మీనరసింహా స్వామి కల్యాణం
2). మే నెలలో నిర్వహించే చందనయాత్ర, విశాఖ పూర్ణిమ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

కనకమహాలక్ష్మి అమ్మవారు
ఉత్తరాంధ్రా జిల్లాల ప్రజల కొంగుబంగారుగా ప్రఖ్యాతి గాంచిన కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయం సుధీర్ఘ చరిత్రనే సంతరించుకుంది. ఆలయం వెలుగుచూసి 150 ఏళ్ల పైబడి కావస్తున్నా, దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాతే అనూహ్య ప్రగతిని సాధించింది. 1980 ప్రాంతంలో ఈ ఆలయం దేవదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి కార్యనిర్వహణ అధికారిగా సేవలందిస్తున్నారు. దాదాపు 70మంది ఉద్యోగులు ఆలయంలో పని చేస్తున్నారు. అమ్మవారి ప్రీతిపాత్రమైన గురువారం రోజున వేలాది మంది దర్శించుకుంటారు. త్రికాల సమయంలో అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో అమ్మవారికి పంచామృతాభిషేక సేవలు నిర్వహిస్తారు. ఇవి కాకుండా శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. మార్గశిర మాసంలో నెల రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. ఈ సమయంలో అమ్మవారి మాలధారణతో పలువురు భక్తులు వివిధ జిల్లాల నుంచి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ప్రస్తుతం ఏడాది రూ.3కోట్ల మేర వార్షిక ఆదాయం వస్తోంది. అమ్మవారి పేరుతో విలువైన బంగారు, వెండి నగలు ఉన్నాయి. భూములు అంటూ ప్రత్యేకంగా లేవు. ఆదాయంతో ప్రగతి దిశగా అడుగులు వేస్తోంది. ప్రతి రోజూ నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అమ్మవారి ఆలయం జగదాంబ జంక్షన్‌లో ఉన్న అంబికాబాగ్‌ను దత్తత తీసుకుంది. భద్రాది తరహాలో ఆలయ నిర్మాణ పనులను ఆలయ కమిటీ చేపడుతోంది.
ఆలయ కార్యనిర్వహణ అధికారి ఫోన్: 9491000651
ల్యాండ్ లైన్ నెంబర్లు: 2566515, 2568645, 2731250

పురాతన సెయింట్ పీటర్స్ చర్చి
అలనాటి డచ్ ప్రాభవ వీచిక భీమిలి - తగరపువలస రోడ్డులోని కీటీన్‌పేటలోని సెయింట్‌పీటర్స్ చర్చి. బ్రిటిష్ పాలనలో 1859సం. లో అప్పటి విశాఖ జిల్లా కలెక్టరు రాబర్ట్‌రీడ్ ఈ చర్చికి శంకుస్థాపన చేశారు. 1864 మార్చి 17న బిషఫ్‌జెల్ సమకూర్చిన ఫర్నిచర్ ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఆనాటి కళానైపుణ్యానికి, పరిజ్ఞానానికి నిదర్శనం. 2,915 రూపాయల ఖర్చుతో దీఈ చర్చిని నిర్మించినట్లు తెలుస్తోంది. 1864 మార్చి 14న దీనికి సెయింట్ పీటర్స్ చర్చిగా నామకరణం చేశారు. ఈ చర్చి నిర్మాణానికి యూరప్ నుంచి రాళ్లను తెచ్చారు. శబ్థాన్ని ప్రతిధ్వనించే ఈ రాళ్లవల్ల ఆలర్ట్ నుంచి ఫాదర్ మాట్లాడితే మైక్ అవసరం లేకుండా బిగ్గరగా వినిపిస్తుంది. ఇక చర్చి తూర్పుభాగంలో స్టెయిన్డ్ గాజు నిర్మించిన కిటికీ ప్రధాన ప్రత్యేకత. ఈ గాజువల్ల అందులోని చిత్రాలు జీవం ఉట్టిపడేటట్లు ఉంటాయి.

పురాతన బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం
విశాఖజిల్లా నర్సీపట్నానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బలిఘట్టంలో శివాలయం 16వ శతాబ్థంలో చోళులు నిర్మించినది. ఈశ్వరుడు పశ్చిమ ముఖంగా ఉండి పక్కన ఉన్న వరాహానది ఉత్తరంగా ప్రవహించడం వల్ల దక్షిణకాశీగా ఈ క్షేత్రం గుర్తింపు పొందింది. బలిచక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఇక్కడ శివలింగం స్థాపించినట్టు, దీంతో బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినట్టు కథనం. ఆలయానికి సమీపంలో వరాహానది ఉత్తర వాహినిగా పేరుపొంది విష్ణుదేవుని ప్రసాదంగా వినుతికెక్కింది. హిరాణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహారూపంలో భూమిని చేరుకుని పయనించడం వల్ల ఆ సమయంలో బలిచక్రవర్తి తపస్సుకు వెచిచ బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తిని కోరగా వరాహా రూపంలో ఉన్న విష్ణు ఈ మార్గం గుండా నదిని ఏర్పరడంతో వరాహానదిగా పేరుగాంచినట్టు చెబుతున్నారు. త్రిశూల పర్వతంపై ఇక్కడి ఆలయం ఉంది. సమీపంలో విభూది గనులు ఉన్నాయి. ఈ ప్రాంతం కార్తీకమాసంలో, శివరాత్రి ఉత్సవాల్లో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. శివరాత్రి పర్వదినాల్లో లక్షమంది భక్తులు వస్తుంటారు.

అనకాపల్లిలో వెలసిన నూకాలమ్మ
ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా విశాఖ జిల్లా నూకాంబిక ఆలయం పేరొందింది. విశాఖపట్నం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి ఆది, మంగళ, గురువారాల్లో పెద్దఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా నూకాలమ్మను భక్తులు దర్శించుకుంటారు. ప్రతి ఏడాది కొత్త అమావాస్య జాతర ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య రోజు నుంచి నెలరోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. నూకాంబిక నెల జాతరలో ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి భక్తులు ఇక్కడికి వస్తారు. గ్రామీణ జిల్లా కేంద్రమైన అనకాపల్లి సమీప వాసులు ఏ రాష్ట్రంలో ఉన్నా నూకాంబిక నెల జాతరలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో దేవస్థాన ఈఓ, నామినేటెడ్ పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో దేవస్థానంలో నిర్వహణ కొనసాగుతోంది. ఆలయం చుట్టూ ఆహ్లాదకర వాతావరం కనిపిస్తుంది. వివాహాలకు అనువుగా ఇక్కడ కల్యాణ మండపాలు నిర్మించారు.

పరిశ్రమలు

జిల్లాలో కుటీర, చిన్నతరహా పరిశ్రమలు: సుమారు 3,600 వరకు ఉన్నాయి. 55 వరకు ఉన్నాయి. స్టీల్‌ప్లాంట్, హిందుస్థాన్ షిప్‌యార్డ్, బి.హెచ్.పి.వి, హిందుస్థాన్ జింక్, పోర్టుట్రస్ట్, హెచ్.పి.సి.ఎల్, ఎన్.టి.పి.సి.పవర్ ప్రాజెక్ట్, ఆంధ్రా పెట్రోకెమికల్స్, ఎస్సార్ స్టీల్ లిమిటెడ్, రెయిన్ కాల్ ఇండియా లిమిటెడ్, ఈస్ట్ఇండియా పెట్రోలియం లిమిటెడ్, ఫార్మా జెల్ ప్రయివేట్ లిమిటెడ్, ఎల్.జి.పాలిమర్స్, చిట్టివలస జూట్‌మిల్స్, కోరమండల్ ఫెర్టిలైజర్స్, హిందూస్ధాన్ కోకో కోలా బేవరేజస్ లిమిటెడ్, ఆంధ్రా సిమెంట్స్, శ్రీ విజయ విశాఖ మిల్క్ ప్రోడక్ట్స్ తదితర కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ రూ.18,962.98 కోట్లతో ఏర్పాటు కాబడ్డాయి. 45,085 మంది ఉపాధి పొందుతున్నారు.

హెచ్‌పీసీఎల్
విశాఖ మహానగరంలో నాటి కాల్‌టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ ఇండియా లిమిటెడ్‌కి ప్రతిరూపమే నేటి హెచ్‌పీసీఎల్ రిఫైనరీ. విశాఖ తీరాన 1957లోనే పాత మల్కాపురం గ్రామ భూముల్లో (వాల్కంపేటలో) తొలుత కాల్‌టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ ఇండియా లిమిటెడ్ సంస్థను స్థాపించారు. తొలిరోజుల్లో ఆ ప్రదేశమంతా చవుడు భూములుగా ఉండేవి. వందలాదిమంది కూలీలు, విదేశీ కార్మికులు ఎన్నో వ్యయప్రయాసలు పడి చమురు శుద్ధి కర్మాగారాన్ని తీర్చిదిద్దారు.
తొలిరోజుల్లో సామర్థ్యం ఇదీ...
నూనె శుద్ధి కర్మాగారం స్థాపన జరిగిన రోజుల్లో వార్షిక సామర్థ్యం 0.652 టీఎంటీగా ఉండేది. అంచెలంచెలుగా ఎదుగుతూనే కాల్‌టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ ఇండియా లిమిటెడ్‌ను భారత ప్రభుత్వం 1974 జులై 15న జాతీయకరణ జరిపింది. అక్కడి నుంచి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌గా మారింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాలుగా వనరులను అందిపుచ్చుకుంటూ నవశకంవైపు వడివడిగా అడుగులేస్తోంది.
రిఫైనరీ చరిత్రలో చీకటిరోజు
1997 సెప్టెంబరు 14 విశాఖ రిఫైనరీ చరిత్రలో చీకటిరోజుగా మిగిలింది. పదుల సంఖ్యలో కార్మికులు మృత్యువాతపడగా చాలామంది గాయపడ్డారు. తీరని నష్టం జరిగి మాయనిమచ్చగా నిలిచింది. అప్పటి నుంచి భద్రతకు పెద్దపీట వేయాలనే ఆలోచనకు బీజం పడింది. ప్రతి విభాగంలోనూ ఆధునిక భద్రతా పరికరాలు ఏర్పాటుకు నాంది పలికింది. ఆ దిశగా యాజమాన్యం నిత్యం భద్రతను పెంచేందుకు అవిరళ కృషి జరుపుతోంది.
పెట్రో పార్కు ఏర్పాటు
కర్మాగారం సేవలు, పరిధి, సామర్థ్యం విస్తరణ పెంచేందుకు పెట్రో పార్కుని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పెట్రోపార్కులోనే చమురు ఉత్పత్తి, టెర్మినళ్లు, గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాలను పూర్తిగా ఆధునికీకరిస్తున్నారు. రానున్న కొద్ది నెలల్లోనే పెట్రో పార్కు పూర్తిస్థాయిలో పనులు ప్రారంభించనుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని 8.33 టీఎంటీలకు పెంచే లక్ష్యంతోనే రిఫైనరీ విస్తరణ పనులు చేపడుతున్నారు. తక్కువ వ్యవధిలో ఎక్కువ రవాణా జరపడానికి రిఫైనరీలో పనిచేస్తున్న 1300 మంది కార్మికులు తమవంతు సాయాన్ని అందిస్తున్నారు.

హిందుస్థాన్ షిప్‌యార్డు
భారతదేశపు తొలినౌక తయారీకి హిందుస్థాన్ షిప్‌యార్డు కేంద్రంగా మారింది. దేశానికి స్వాతంత్య్రం రాకముందే 1940లో స్వదేశంలోనే నౌకల తయారీ చేయాలనే ఆలోచన మహారాష్ట్రకు చెందిన శేఠ్‌వాల్‌చంద్ మదిలో మెదిలింది. ఆ ఆలోచనలకు మరింత పదునుపెట్టి 1941 జూన్ 21న విశాఖ సాగరతీరాన సింధియా నావిగేషన్ లిమిటెడ్ సంస్థ పేరుతో అప్పటి భారత కాంగ్రెస్ ప్రతినిధి డాక్టర్ బాబూరాజేంద్ర ప్రసాద్ పునాదిరాయి వేశారు.
తొలినౌక జల ఉష
భారతదేశ చరిత్రలో స్వదేశీ కార్మికులతో నిర్మించిన తొలినౌక 'జలఉష'ను 1948 మార్చి 14న తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ చేతులమీదుగా బంగాళాఖాతంలో జలప్రవేశం చేయించారు. ఫ్రెంచ్ నిపుణులు 1949లో సందర్శించి నౌకల తయారీకి పూర్తి అనువైనదని ధ్రువీకరించారు. 1952 జనవరి 21న సింధియా నావిగేషన్ లిమిటెడ్ సంస్థ హిందుస్థాన్ షిప్‌యార్డుగా భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందింది. ప్రభుత్వం 2/3 వంతు వాటా, షిప్‌యార్డు 1/3 వంతు వాటాలతో ఒప్పందం కుదిరింది. ఒప్పందం కుదిరే సమయానికే 8 వెసల్స్‌ను తయారుచేసింది. తిరిగి 1961లో సంస్థలో కొన్ని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో 1962లో షిప్‌యార్డుని జాతీయకరణ చేస్తూ భారత ప్రభుత్వం రాజపత్రాన్ని విడుదలచేసింది. 2000 సంవత్సరం నాటికి సంస్థ ఆర్థిక సంక్షోభం తలెత్తి ఒకదశలో కార్మికులకు వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. సంస్థ ఆర్డర్లు లేక చతికిలపడ్డ దశలో చెన్నైకు చెందిన జీఎంఎల్ సంస్థ షిప్‌యార్డుకి భారీ ఆర్డర్లను ఇచ్చి ఆదుకుంది. అనంతరం 2010లో సంస్థను కేంద్ర రక్షణశాఖకు బదిలీచేయడంతో సంస్థ కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు.
వీఆర్ఎస్‌తో కార్మికుల కుదింపు
పదిహేనేళ్ల క్రితం సంస్థలో ఏడెనిమిది వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తుండేవారు. 1999 నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు ద్వారా సంస్థలో కార్మికుల సంఖ్య కుదించారు. ప్రస్తుతం 2500 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. వీరికి తోడుగా మరో 2 వేలమంది వరకు కాంట్రాక్టు కార్మికులు సంస్థకు సేవలు అందిస్తున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం (స్టీల్‌ప్లాంట్)
విశాఖ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది విశాఖ ఉక్కు కర్మాగారం. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసి... 32 మంది బలిదానం.. తెన్నేటి విశ్వనాథం, టి.అమృతరావు, ప్రత్తి శేషయ్య వంటి యోధుల పోరాట ఫలితంగా కర్మాగారం ఏర్పాటుకు ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. 1971 జనవరి 20న.. నాటి ప్రధాని ఇందిరాగాంధీ పనులకు శంకుస్థాపన చేశారు. 1977 నుంచి నిర్మాణం మొదలైంది. 1979లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రూ.3897.28 కోట్ల అంచనాతో 3.4 మిలియన్ టన్నుల సామర్థ్యం గల కర్మాగార నిర్మాణం ప్రారంభించారు. 1982 ఫిబ్రవరి 18న సెయిల్ నుంచి విడిపోయి విశాఖ ఉక్కు రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)గా అవతరించింది. 1987 డిసెంబర్ నాటికి కర్మాగారం నిర్మాణం పూర్తయ్యింది. 1990 సెప్టెంబర్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. అప్పటికి నిర్మాణ వ్యయం రూ.9 వేల కోట్లకు చేరుకుంది. 1994లో మొదటిసారిగా రూ.50 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అనంతర కాలంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నా అప్పటి సీఎండీ బి.ఎన్.సింగ్ ప్రణాళికాయుతమైన దూరదృష్టి.. అధికారులు, కార్మికుల సమష్టి కృషితో బీఐఎఫ్ఆర్ ప్రమాదం నుంచి బయటపడగలిగింది.
మైలురాళ్లు
ఉక్కు కర్మాగారం పలు ఒడిదుడుకులు ఎదుర్కొంది. ప్రైవేటుపరం అయిపోతుందన్న ప్రచారమూ జరిగింది. అయితే అప్పటి సీఎండీ బి.ఎన్.సింగ్ పటిష్ట ప్రణాళికతో అవరోధాలను అధిగమించి సంస్థను లాభాల బాట పట్టించారు. ఆ ప్రయాణం ఇప్పటి వరకూ సాగుతోంది. ఈ క్రమంలోనే తొలుత మినీ రత్న తరువాత నవరత్న హోదా సాధించింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. రెండుసార్లు ప్రధాన మంత్రి ట్రోఫీని చేజిక్కించుకున్న ఎకైక కర్మాగారం విశాఖ ఉక్కు కావడం విశేషం.
విస్తరణ
కర్మాగార సామర్థ్యాన్ని 3.4 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్నులకు పెంచేందుకు రూ.12,500 కోట్లతో విస్తరణకు శ్రీకారం చుట్టారు. 2006 మే 20న ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా ఈ పనులు ప్రారంభమయ్యాయి. 2011-12 నాటికి విస్తరణ పూర్తయి ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో 2020 నాటికి 20 మిలియన్ టన్నుల స్థాయికి సంస్థను విస్తరించాలన్నది లక్ష్యం. ఇటీవలే సంస్థ సీఎండీగా ఎ.పి.చౌధురి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం సంస్థలో 17,500 మంది శాశ్వత ఉద్యోగులు, 20 వేల మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. పరోక్షంగా సమారు లక్ష మంది ఉపాధి పొందుతున్నారనిఅంచనా.
ఉక్కు నగరం
విశాఖ ఉక్కు కార్మికులు, అధికారులు నివసించేందుకు ప్రత్యేక ప్రణాళికతో నిర్మించిన సౌకర్యాల సమాహారం ఉక్కునగరం. సుమారు 30 వేలకు పైగా జనాభా ఉంటున్న ఉక్కునగరంలో 126 దుకాణాలు, 24 టెలిఫోన్ కేంద్రాలు, 8 ఏటీఎం కేంద్రాలు, 12 పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాల, 12 ప్రార్థనాలయాలు, 3 పెట్రోలు బంకులు, 4 గ్రంథాలయాలు ఉన్నాయి. ఉద్యోగుల మానసికోల్లాసానికి 11 పార్కులను వివిధ సెక్టార్లలో నిర్మించింది. నీటి అవసరాల కోసం రెండు రిజర్వాయర్లు ఉన్నాయి. రోజుకు సుమారు 18 మిలియన్ లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు.

జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ
పరవాడ మండలంలో జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీ పేరిట ఔషధ ఆధారిత పరిశ్రమల నగరం అయిదేళ్ల క్రితం ఏర్పాటైంది. ఇందుకోసం ఆరు గ్రామాలకు చెందిన 2400 ఎకరాల భూమిని రైతుల నుంచి ఎపీఐఐసీ సేకరించింది. రాంకీ సంస్థ భాగస్వామ్యంతో ఆ భూముల్లో మౌలికవసతులు కల్పించి పరిశ్రమలకు కేటాయించారు. వంద యూనిట్ల లక్ష్యంగా ఏర్పాటైన ప్రాజెక్టులో ఇంతవరకు 32 యూనిట్లు ఉత్పత్తులు ప్రారంభించాయి. మరో 15 నిర్మాణ దశలో ఉన్నాయి. 600 ఎకరాల్లో ప్రత్యేకంగా ఫార్మాసెజ్ ఏర్పాటైంది. జర్మనీకి చెందిన ఫార్మా జెల్, జపాన్‌కి చెందిన ఇశాయ్ వంటి బహుళ జాతి పరిశ్రమలు నెలకొల్పారు. కేన్సర్ వంటి కీలక వ్యాధులను నియంత్రించే ఔషధాలు లారస్, ఎస్.ఎం.ఎస్. వంటి పరిశ్రమల్లో తయారవుతున్నాయి. మిగిలిన వాటిలో బల్క్‌డ్రగ్, ఇంటర్మీడియట్స్ ఔషధాలను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రత్యక్షంగా ఐదు వేలు పరోక్షంగా మరో మూడు వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.

వీఎస్ఈజెడ్
విశాఖ నగరం పారిశ్రామికంగా ఎదుగుతుండడంతో 1989లో విశాఖ ఎక్స్‌పోర్టు అండ్ ప్రాసెసింగ్ జోన్ (వీఈపీజెడ్) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన 300 ఎకరాల స్థలాన్ని దువ్వాడ సమీపంలో కేటాయించింది. ఇప్పటికి 79 పరిశ్రమలకు స్థలం కేటాయించారు. వీటిలో 44 పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాయి. మరో 35 నిర్మాణ దశలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటకు 2004లో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో వీఈపీజెడ్ కాస్తా విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ (వీఎస్ఈజెడ్)గా రూపాంతరం చెందింది.
భిన్న పరిశ్రమల నిలయం
వరల్డ్ డైమండ్, రెడ్డీస్ లేబొరేటరీస్, సినర్జీస్ కాస్టింగ్, ఫార్మా కంపెనీలతోపాటు గ్రానైట్, సిలిండర్, సిమెంట్, ట్రేడింగ్, క్రోం, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఐస్‌క్రీం, ఆహార పదార్ధాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. 2000-01లో 17 పరిశ్రమలతో రూ.219.11 కోట్ల ఎగుమతులు సాధించగా... 2009-10 ఆర్థిక సంవత్సరానికి రూ.917.85 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడ నుంచి ఎగుమతయ్యాయి.
పాధికి ఆసరా
వీఎస్ఈజెడ్ ఓ ఉపాధి కేంద్రమని చెప్పవచ్చు. డైమండ్ పాలిషింగ్, గ్రానైట్ పరిశ్రమల్లో మహళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతమున్న 44 పరిశ్రమల్లో ఆరువేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. అన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభిస్తే మరింతమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

బీహెచ్‌పీవీ
భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్ (బీహెచ్‌పీవీ) నిర్మాణానికి 25 జూన్ 1966లో అప్పటి నాతయ్యపాలెం పంచాయతీ పరిధిలో శంకుస్థాపన చేశారు. చెకొస్లావియా సహకారంతో సంస్థను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ స్థలం 240 ఎకరాలు, ప్రజల నుంచి మరో 153 ఎకరాలు సేకరించి మొత్తం 393 ఎకరాల్లో కర్మాగారం, ఉద్యోగుల కోసం టౌన్‌షిప్ నిర్మించారు. 1971లో ఉత్పత్తి ప్రారంభమైంది. రూ.19 కోట్ల పెయిడ్ అప్ కేపిటల్‌తో సంస్థను స్థాపించారు. తొలి రోజుల్లో సుమారు 5000 మంది ఉద్యోగులతో విశాఖ మణిహారంగా భాసిల్లేది. ఇది మౌలిక వసతుల పరిశ్రమ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ). ప్రజావసరాలు తీర్చే కర్మాగారాలకు అవసరమయ్యే విడి భాగాలు తయారు చేసే సంస్థ. పెట్రోలియం, ఎరువులు, టెలికమ్యూనికేషన్, ఇస్రో, యుద్ధవిమానాల తయారీ సంస్థలకు నాణ్యమైన విడిభాగాలు తయారుచేస్తుంది. 1991లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాల వల్ల సంస్థ నష్టాల బాట పట్టి బీఐఎఫ్ఆర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. 2003లో కేంద్ర పిటిషన్ కమిటీ బీహెచ్‌పీవీని సందర్శించింది. భెల్ తరహాలోనే పరికరాలు తయారుచేస్తున్నందున సంస్థను అందులో విలీనం చేయాలని సిఫారసు చేసింది. ఎన్నో పరిణామాల అనంతరం 11 మే 2008లో సంస్థను భెల్ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం బీహెచ్‌పీవీ గత ప్రాభవం కోల్పోయింది. 1300 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. ప్రస్తుతం 1992 నాటి వేతనాలే ఇక్కడి కార్మికులకు ఇస్తున్నారు. (మిగతా ప్రభుత్వ రంగ సంస్థల్లో 2007 వేతన సవరణ ప్రకారం జీతాలు ఇస్తున్నారు.) బీహెచ్‌పీవీ ఆస్తుల విలువ సుమారు రూ. 10 వేల కోట్లు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం సంస్థ ఎండీగా నాగరాజా ఉన్నారు.

విశాఖ డెయిరీ
పాలు, పాల ఉత్పత్తులు అనగానే గుర్తుకువచ్చే విశాఖ డెయిరీని 27 సెప్టెంబరు 1972లో అప్పటి అక్కిరెడ్డిపాలెం పంచాయితీ పరిధిలో ఏర్పాటుచేశారు. 50 వేల లీలర్ల సామర్థ్యంతో తొలుత దీనిని ప్రారంభించారు. 1973లో ఆంధ్రప్రదేశ్ సహకార చట్టం కింద సంస్థ నమోదు(రిజిష్టర్) అయ్యింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. 1644 పాల సహకార సంఘాలు, 1285 పాల సేకరణ కేంద్రాల నుంచి పాల సేకరణ జరుగుతోంది. ప్రస్తుతం రోజుకు ఐదు లక్షల లీటర్ల పాలను సేకరిస్తోంది. 13 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పాలపొడి కర్మాగారాన్ని 1998లో ప్రారంభించింది. రోజుకు 7.19 లక్షల పాలను నిల్వ ఉంచే కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ ఉంది. రోజుకు 9 టన్నుల నెయ్యి తయారుచేస్తుంది. పాలు, నిల్వపాలు(టెట్రాప్యాక్), పెరుగు, వెన్న, నెయ్యి, బాదంపాలు, రోజ్‌మిల్క్, ఐస్‌క్రీం, వివిధ రకాల పాలపదార్ధాలు ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 1416 మంది ఉద్యోగులు ఉన్నారు. డెయిరీ ఆధ్వర్యంలో విద్య, వైద్య ట్రస్టులు నిర్వహిస్తున్నారు. సంస్థ మేనేజింగ్ ట్రస్టీ ఆడారి తులసీరావు.
ముడుసరుకుల లభ్యత
ఫెర్రో ఎల్లాయిస్, ఒరిస్సా ఐరన్ ఓర్, బాక్సైట్, స్లాగ్(సిమెంట్ పరిశ్రమ), ఐరన్ డస్ట్, ఇంపోర్టెడ్ మాంగనీస్, ఇంపోర్టెడ్ ఫాస్పరస్, ఇంపోర్టెడ్ కోల్(బొగ్గు)
రవాణా వ్యవస్థ
వైజాగ్ షిప్‌యార్డ్, గంగవరం పోర్టు, షిప్‌యార్డ్,రైల్వే, పోర్టుట్రస్ట్ ద్వారా రైల్వే,రోడ్డు, జల మార్గాల్లో రవాణా జరుగుతుంది.
మార్కెట్ అంశాలు
జిల్లాలో మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రయిజస్ ముఖ్యంగా ఫ్రాబ్రికేషన్ యూనిట్లు తమ మార్కెట్‌ను స్టీల్‌ప్లాంట్,బి.హెచ్.పి.వి, షిప్‌యార్డ్ అవసరాలకు చేస్తూ, ఇతర ప్రాంతాల పెద్ద పెద్ద పరిశ్రమలకు కూడా భారీ ఎత్తున సరుకును సరఫరా చేస్తున్నాయి.స్టీల్‌ప్లాంట్‌లో సుమారు వంద కోట్ల రూపాయల వరకు వివిధ పనులను స్థానిక ఇండస్ట్రీస్ సరఫరా చేస్తున్నట్లుగా ఒక అంచనా రూపొందించారు. జిల్లాలో బల్క్ డ్రగ్ తయారు చేసి దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు.సుమారుగా రూ.5 వేల కోట్ల వరకు బల్క్ డ్రగ్స్ తయారై మార్కెట్‌కు సరఫరా అవుతోంది.