close

విజయనగరం జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

సాంస్కృతిక, సాహిత్య, కళారంగాలకు వేదికగా భాసిల్లిన విజయనగరం జిల్లాకు చార్రికత ప్రాధాన్యం ఉంది. పూసపాటి రాజ వంశీయులు పాలించిన విజయనగరం పూర్వం కళింగ రాజ్యంలో అంతర్భాంగా ఉండేది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో కళింగ రాజ్యం అటు కటక్ నుంచి ఇటు పిఠాపురం వరకు విస్తరించి ఉండేది. ప్రస్తుతం ఉత్తర కళింగ భాగం ఒడిశాలో, దక్షిణభాగం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. క్రీ.పూ. 467-336 కాలంలో కళింగ రాజ్యాన్ని నందరాజులు పాలించారు. తర్వాత మౌర్యులు, ఛేదీరాజులు, శాతవాహనులు ఏలారు. తదనంతరం ఈ ప్రాంతంలో పితృభక్తలు, మతారాలు, వశిష్టలు, విష్ణుకుండినులు, తూర్పు గంగరాజులు, వంగ చాళుక్యులు, రాజమహేంద్రవరం రెడ్డిరాజు, వెలనాటి చోళులు పరిపాలించారు. క్రీ.శ. 1210 నుంచి శ్రీకాకుళం సర్కారు కాకతీయుల పాలనలోకి వచ్చింది. అప్పట్లో చోళరాజు పృథ్వీశ్వరను కాకతీయ గణపతిదేవులు ఓడించి రాజ్యాన్ని వశపరచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ తూర్పు గంగరాజుల ఆధీనంలోకి వచ్చింది. క్రీ.శ. 1443లో ఒడిశా నుంచి వచ్చి గజపతిరాజులు గంగరాజుల నుంచి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. 12 శతాబ్దం నుంచి 15 శతాబ్ధం మధ్య వరకు రాజ్యంలో కొన్ని ప్రాంతాలను రాపర్తి రాజు, గంగరాజులు నారాయణపురం (బొబ్బిలి), జంతారునాడు (శృంగవరపుకోట) సంస్థానాదీశులుగా పాలించారు. నందపురం, బొబ్బిలి రాజధానులుగా కళింగ గంగరాజులు 14వ శతాబ్దం మధ్య వరకు వందేళ్ల పాటు ఏలినట్లు శాసనాలు ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత గజపతిరాజుల 140 సంవత్సరాల పాటు పరిపాలించారు. క్రీ.శ. 1574 కాలంలో కుతుబ్‌సాహీ ఈ ప్రాంతాన్ని స్వాధీన పర్చుకున్నారు. క్రీ.శ. 1687లో గొల్కొండ రాజ్యం మొగలుల పరమవడంతో శ్రీకాకుళం ప్రాంతమూ వారి ఆధీనంలోకి వెళ్లింది. డక్కన్ నిజాముల్ ముల్క్ ఆసఫ్ జా స్వతంత్రునిగా 1724లో ప్రకటించుకోవడంతో ఈ ప్రాంతం ఆయన పాలనలోకి వచ్చింది. ఆసఫ్ జా మరణాంతరం ఫ్రెంచి గవర్నర్ బుస్సీ సాయంతో సలాబత్ జంగ్ నవాబు అయ్యాడు. ఇందుకు బదులుగా 1753లో శ్రీకాకుళం సహా నాలుగు సర్కారులను ఫ్రెంచి వారికి ఇచ్చారు. ఆ కాలంలోనే 1757 జనవరిలో విజయనగరం, బొబ్బిలి రాజుల మధ్య యుద్ధం జరిగింది. చరిత్రలో గుర్తింపు పొందిన ఈ బొబ్బిలి యుద్ధంలో ఫ్రెంచి గవర్నర్ బుస్సీ సైన్యం సహకారంతో విజయరామగజపతి విజయం సాధించారు.<br>జిల్లా చరిత్రలో ప్రముఖ సంఘటన చెందుర్తి యుద్ధం. 1758లో జరిగిన ఈ యుద్ధంలో ఫ్రెంచి వారిని ఓడించిన ఆంగ్లేయులు ఆధీనంలోకి ఉత్తర సర్కారు మొగల్ నవాబు షా అలమ్ ఫర్మానా ద్వారా వచ్చింది. అప్పట్లో వైజాగపటం కౌన్సిల్‌గా ఉన్న ప్రాంతాన్ని 1794లో మూడు డివిజన్లుగా విభజించి కలెక్టర్లను నియమించారు. రెండో డివిజన్ పరిధిలో ప్రస్తుత విజయనగరం జిల్లా అంతా ఉండేది. ఆ తర్వాత మళ్లీ మూడు డివిజన్లను విలీనం చేసి 1803లో వైజాగపటం జిల్లా అంతటికి ఒకే కలెక్టరేట్ ఆధీనంలోకి తెచ్చారు.

విద్య

* జిల్లాలో 3,356 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,956 ప్రభుత్వ పాఠశాలలు, 400 ప్రైవేట్ పాఠశాలలున్నాయి.
* ఇంటర్మీడియట్ కళాశాలలు 102 ఉన్నాయి. ఇందులో 21 ప్రభుత్వం, 81 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వృత్తివిద్యా కళాశాలలు 40 ఉన్నాయి. వీటిలో 20 ప్రైవేట్, 20 ప్రభుత్వ పరిధిలోనివి.
* డిగ్రీ కళాశాలలు 65 ఉన్నాయి. వీటిలో 5 ప్రభుత్వం, 5 ఎయిడెడ్, 55 ప్రైవేట్ కళాశాలలు.
* పీజీ కళాశాలలు: 16 (ఒకటి ఎయిడెడ్, 15 ప్రైవేట్).
* బీఈడీ కళాశాలలు: 18 (ఒకటి ప్రభుత్వం)
* బీపార్మశీ కళాశాలలు: 07
* ఎంబీఏ కళాశాలలు: 09
* ఎంసీఏ కళాశాలలు: 13
* డీఈడీ కళాశాలలు: 07 (ఒకటి ప్రభుత్వం)
* ఇంజనీరింగ్ కళాశాలలు: 14 (ఒకటి ప్రభుత్వం)
* పాలిటెక్నిక్ కళాశాలలు: 11 (ఒకటి ప్రభుత్వం)
* పారిశ్రామిక శిక్షణా సంస్థలు: 15 (4 ప్రభుత్వం, 11 ప్రైవేట్)

నదులు - ప్రాజెక్టులు

నాగావళి
జిల్లాలో ప్రవహించే ప్రధాన జీవనది నాగావళి. తూర్పు కనుమల్లో ఒరిస్సా రాష్ట్రం రాయగడ జిల్లాలో పుట్టిన ఈ నది విజయనగరం జిల్లాలోకి కొమరాడ మండలంలో ప్రవేశిస్తోంది. జిల్లాలో కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలు గుండా ప్రవహించి శ్రీకాకుళంలో ప్రవేశిస్తుంది. చివరకు చిఫూజీబందర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ నది పొడవు 200 కిలోమీటర్లు కాగా విజయనగరం జిల్లాలో 112 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. మొత్తం విస్తీర్ణం 8,964 చదరపు కిలోమీటర్లు. ఈ నది గుండా ఏడాదిలో 1.21 శతకోటి ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తోంది. దీనికి వేగావతి, స్వవర్ణముఖి, జంఝావతి ఉప నదులు. నాగావళిపై తోటపల్లి వద్ద ఉన్న రెగ్యులేటర్ ద్వారా 64 వేల ఎకరాలకు సాగునీరందుతోంది.

గోస్తనీ
విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం బొర్రాగృహల్లో గోస్తనీ నది పుట్టింది. గోవు(ఆవు) పొదుగు(స్తనాలు) నుంచి నీరు వచ్చేలా అక్కడ ఉండడం వల్ల దీనికి గోస్తనీ అని పేరు వచ్చింది. ఈ నది విజయనగరం జిల్లాలో శృంగవరపుకోట, జామి మండలాల మీదుగా ప్రవహిస్తోంది. అక్కడ నుంచి విశాపట్నం జిల్లాలో ప్రవేశించి భీమిలి వద్ద బంగళాఖాతంలో కలుస్తోంది. దీనిపై తాటిపూటి జలాయం ఉంది. దీని ద్వారా 15,366 హెక్టార్ల భూములకు నీరందుతోంది. విశాఖపట్నానికి రెండు టీఎంసీల తాగునీనరు సరఫరా జరుగుతోంది. రెండు మండలాల్లో అక్కడక్కడా చిన్న అడ్డకట్టల ద్వారా మరో 1300 హెక్టార్ల భూమి తడుస్తోంది. ఈ నదిలో ఇన్‌ఫిల్ట్రేషన్ బావులు తవ్వి విజయనగరానికి 1.5 టి.ఎం.సి.ల తాగునీరు సరఫరా చేస్తున్నారు.

సువర్ణముఖి
సాలూరు మండలంలో పడమర దిక్కున గల పశ్చిమ కొండల్లో సువర్ణముఖి నది పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తోంది. సాలూరు, బొబ్బిలి, బలిజిపేట మండలాల గుండా ప్రవహించి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలంలో నాగావళి నదిలో కలుస్తోంది. ఇది ఎక్కువగా బొబ్బిలి మండలంలో ప్రవహిస్తోంది. ఈ నదిపై వెంగళరాయసాగర్ జలాశయం ఉంది. ఈ జలాశయం ద్వారా 24,700 ఎకరాలకు సాగునీరందుతోంది. చిన్న, చిన్న వనరుల ద్వారా మరో 810 హెక్టార్లకు నీరు అందుతోంది.

వేగావతి
పాచిపెంట మండలంలో గల కొండల్లో వేగావతి నది పుట్టి తూర్పు దిశగా పయనిస్తోంది. సువర్ణముఖి నదితో సమాంతరంగా ప్రవహించి నాగావళిలో కలుస్తోంది. ఈ నది విజయనగరం జిల్లాలో పాచిపెంట, సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి, బాడంగి, తెర్లాం, బలిజపేట మండలాల గుండా ప్రవహించి వంతరాం వద్ద శ్రీకాకుళంలో ప్రవేశిస్తోంది. దీనిపై నిర్మించిన పెద్దగెడ్డ జలాశయం ద్వారా 12 వేల హెక్టార్లకు, రొంపిల్లి ఆనకట్ట ద్వారా 6 వేలు, పారాది ఆనకట్ట ద్వారా 8 వేలు, కర్రివలస ఆనకట్ట ద్వారా 4 వేల హెక్టార్లకు సాగునీరందుతోంది.

గోముఖి
గోముఖినది తూర్పు కనుమల్లో పుట్టి ఉత్తర నుంచి పడమర దిశగా పయనిస్తోంది. మక్కువ మండలంలో డి.శిర్లాం వద్ద సువర్ణముఖి నదిలో కలుస్తోంది. ఈ నది ప్రవాహం సువర్ణముఖిలో చేరడం ద్వారా వెంగళరాయసాగర్ జలాశయానికి పుష్కలంగా నీరు అందుతోంది. దీనిపై అక్కడక్కడ రైతులు అడ్డకట్టలు వేసుకుని రెండువేల హెక్టార్లకు సాగునీరు పొందుతున్నారు.

చంపావతి నది
తూర్పు కనుమల్లో విశాఖ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టిన చంపావతి నది తూర్పు దిశగా ప్రవహిస్తూ సాలూరు ప్రాంతంలో విజయనగరం జిల్లాలోకి ప్రవేశిస్తోంది. మెంటాడ, గజపతినగరం, నెల్లిమర్ల, గుర్ల, పూసపాటిరేగ మండలాలు గుండా ప్రవహిస్తోంది. అనంతరం పూసపాటిరేగ మండలంలో కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. దీనిపై ఆండ్ర జలాశయం నిర్మించగా, ప్రస్తుతం తారకరామతీర్ధసాగర్ నిర్మాణంలో ఉంది. విజయనగరం పట్టణానికి తాగునీరు అందించడానికి చంపావతి నది ప్రధాన వనరు. ఆండ్ర జలాశయం ద్వారా 9,426, హెక్టార్లకు సాగునీరందుతోంది. కుమిలి ఆనకట్ట ద్వారా 8172 హెక్టార్లకు సాగునీరందుతుంది. తారకరామతీర్థసాగర్ జలాశయం పూర్తయితే మరో 16 వేల హెక్టార్లకు సాగునీరు, విజయనగరం పట్టణానికి ఒక టీఎంసీ తాగునీరు అందనుంది.

తోటపల్లి జలాశయం
జిల్లాలో అతి పెద్ద జలాయశం తోటపల్లి. పార్వతీపురం పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళినదిపై 1908లో నిర్మించిన రెగ్యులేటరుకు వందేళ్లు నిండిపోయింది. దీంతో ప్రత్యామ్నాయంగా ఎగువన కొత్తగా జలాశయం ఏర్పాటుకు రూ. 580 కోట్ల అంచనా వ్యయంతో బ్యారేజీ పనులు ప్రారంభించారు. పాత రెగ్యులేటరు ద్వారా 64 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతోంది. ఇందులో 8715 ఎకరాలు విజయనగరం జిల్లాలో ఉండగా 57,945 ఎకరాలు శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ప్రస్తుతం నిర్మిస్తున్న జలాశయం ద్వారా పాత ఆయకట్టుతో పాటు కొత్తగా 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాన్నది లక్ష్యం.

పెద్దగెడ్డ జలాశయం
జలయజ్ఞంలో పూర్తయిన తొలి ప్రాజెక్టు.. పెద్దగెడ్డ జలాశయం. విజయనగరం జిల్లా పాచిపెంట మండలం కేసలి గ్రామం వద్ద వేగావతి నదిపై రిజర్వాయరు నిర్మించారు. దీని నుంచి పాచిపెంట, సాలూరు, రామభద్రపురం మండలాల్లో 12 వేల ఎకరాలకు సాగునీరందుతోంది.
* పెదగెడ్డ జలాశయాన్ని 2004లో ప్రారంభించి 2007 నవంబరు నాటికి పూర్తి చేశారు. దీని అంచనా వ్యయం రూ.73.19 కోట్లుకాగా రూ. 80 కోట్లు ఖర్చు చేశారు. జలాశయం నిర్మాణానికి 1,116 ఎకరాల భూములు సేకరించారు. ముంపునకు గురయ్యే 10 గ్రామాల్లో నిర్వాసిత కుటుంబాల సంఖ్య 765. వీరందరికి పునరావాసం కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు కొన్ని కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఇంకా పునరావాస ప్రక్రియ కొనసాగుతున్నాయి. ఈ పెదగెడ్డ జలాశయాన్ని 2006 సెప్టెంబరు 10న అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ఆయుకట్టు 12,000 ఎకరాలు.

తారకరామతీర్థసాగర్
గుర్ల మండలంలో కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై తారకరామతీర్థసాగర్ జలాశయం ఏర్పాటు చేస్తున్నారు. కుమిలి చెరువులో నీటి నిల్వ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ తారకరామ బ్యారేజి నిర్మాణం చేపట్టారు. ఇక్కడ నుంచి కాలువ ద్వారా పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం, మండలాల్లోని 24710 ఎకరాలకు సాగునీరు అందిస్తారు. అలాగే విజయనగరం పట్టణానికి తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ నీరు అందివ్వాలన్నది లక్ష్యం. కోటగండ్రేడు వద్ద చంపావతినది పై బ్యారేజిని కడుతున్నారు. కుమిలి వద్ద రిజర్వాయరు నిర్మిస్తున్నారు. అక్కడ నీటిని నిల్వ చేస్తారు. గుర్ల మండలంలోని కెల్ల వద్ద రైల్వే క్రాసింగ్ నిర్మాణానికి రైల్వేశాఖ నుంచి అనుమతులు రావలసి ఉంది. అంతేకాకుండా ఎస్ఎస్ఆర్‌పేట వద్ద టన్నల్ తవ్వాల్సి ఉంది. ఇందుకు పురావస్తు, అటవీశాఖ అనుమతులు కూడా రావాల్సి ఉంది.

ఆండ్ర జలాశయం
మెంటాడ మండలంలో ఆండ్ర, లోతుగెడ్డ గ్రామాల మధ్య చంపావతి నదిపై ఆండ్ర జలాశయం ఉంది. ఈ ప్రాజెక్టును రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీని నీటి సామర్థ్యం 0.98 టీఎంసీలు. మెంటాడ, గజపతినగరం, బొండపల్లి మండలాల్లోని 22 గ్రామాలకు చెందిన 9800 ఎకరాలకు సాగునీరందించాలన్నది లక్ష్యం. మొదట్లో 1960లో దీని నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. 1983లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆండ్ర జలాశయం పనులకు ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేసింది. 1998 డిసెంబరు 23న జలాశయాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కుడి కాలువ పొడవు 6.8 కిలోమీటర్లు కాగా ఎడమ కాలువ పొడవు 6.1 కిలోమీటర్లు. ప్రతిపాదిత ఆయకట్టు 9800 ఎకరాలు కాగా కాలువల నిర్మాణ పనులు లోపభూయిష్టంగా చేపట్టడంతో పూర్తిస్థాయిలో నీరందడం లేదు. భూసేకరణ సమస్య కారణంగా 9 ఆర్ కాలువలో కొద్దిపాటి పనులు నిలిచిపోయాయి. కుడి కాలువ పరిధిలోని 4ఎల్ కాలువ వద్ద, కుడిప్రధాన కాలువలో పలుచోట్ల గండ్లు పడినప్పటికీ శాశ్వతప్రాతిపదికన పూడ్చక సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. పలుచోట్ల పిల్లకాలువలు ఎత్తుగాను, పంటపొలాలు మెట్టుగా ఉన్న కారణంగా సాగునీరు పారడం లేదు.

తాటిపూడి జలాశయం
గంట్యాడ మండలం తాటిపూడి గ్రామం వద్ద గోస్తనీ నదిపై జలాశయం నిర్మించారు. 1965- 1968 మధ్యకాలంలో రూ. 1.85 కోట్ల వ్యయంతో తాటిపూడి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దీని నీటి నిల్వ సామర్థ్యం 3.17 టీఎంసీలు. జలాశయం 650 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులు. దీని ద్వారా గంట్యాడ, జామి, ఎస్.కోట మండలాల్లో 15,366 ఎకరాలకు సాగునీరు, విశాఖపట్నానికి రెండు టీఎంసీల తాగునీరు అందుతోంది. జలాశయ నిర్మాణం నుంచి ఇప్పటివరకు ఆధునీకరణ పనులు చేపట్టక పోవడంతో సాగునీటి కాలువలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు వీటి ఆధునీకరణ పనులకు జపాన్ నిధులు రూ.24.92 కోట్లు మంజూరయ్యాయి. టెండర్లు ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ జలాశయం నుంచి విశాఖపట్నం నగరానికి ప్రతిరోజు 11 మిలియన్ గ్యాలన్ల నీరు అందిస్తుండగా విజయనగరం ప్రజల దాహార్తి తీర్చడానికి జలాశయం దిగువన ఏటిలో భూగర్భ జలాలను ముషిడిపిల్లి పథకం ద్వారా సరఫరా చేస్తున్నారు.

జంఝావతి జలాశయం
కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద జంఝావతి నదిపై జలాశయాన్ని నిర్మించారు. 1974 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు దీనికి శంకుస్థాపన చేశారు. జలాశయానికి సంబంధించిన మట్టికట్ట పనులు పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఒడిశాలోని 10 గ్రామాలు, 1175 ఎకరాలు ముంపునకు గురికానున్నాయి. నిర్వసితులకు పునరావసంతో పాటు పరిహారం విషయంలో ఆంధ్రా-ఒడిశా సర్కారుల మధ్య ఒప్పదం కుదరడం లేదు.

నీటిపారుదల

జిల్లాలో సాగు విస్తీర్ణం 2.74 లక్షల హెక్టార్లు. ఇందులో వర్షాధారం 1.75 లక్షల హెక్టార్లు. సాగునీటి సదుపాయం ఉన్నది 1,53,998 లక్షల హెక్టార్లు. వర్షపాతం ఎక్కువ ఉన్నా సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల వ్యవసాయ మీద ప్రభావం పడుతుంది. అందువల్లే పంట విస్తీర్ణంలోనూ, ఉత్పత్తిలోనూ వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి. జలాశయాలు, చెరువుల కాలువల ద్వారా లక్ష హెక్టార్లకు పైగా సాగునీరు లభిస్తుండగా మిగతా పంటభూముల్లో బావులు, బోర్లు, వర్షాధారంగా సాగు చేస్తున్నారు.

జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు సంబంధించిన వివరాలు:
* డెంకాడ మండల కేంద్రానికి సమీపంలో చంపావతి నదిపై గల డెంకాడ ఆనకట్టు ద్వారా 2,106 ఎకరాలకు సాగునీరందుతోంది.
* మక్కువ మండలంలో వట్టిగెడ్డపై నిర్మించిన వట్టిగెడ్డ రిజర్వాయరు ద్వారా ఆ మండలంలో 7,027 ఎకరాల విస్తీర్ణం సాగులో ఉంది.
* బొబ్బిలి మండలం పారాది వద్ద వేగావతి నదిపై నిర్మించిన పారాది ఆనకట్ట ద్వారా బొబ్బిలి, బాడంగి, పారాది మండలాల్లో పలు గ్రామాలకు చెందిన 3,179 ఎకరాలకు సాగునీరందుతోంది.
* సీతానగరం మండలం సువర్ణముఖి వద్ద నిర్మించిన సీతానగరం ఆనకట్ట ద్వారా 1,519 ఎకరాలకు నీరందుతోంది.
* మక్కువ మండలం శంబరకు సమీపంలో నిర్మించిన వెంగరాయసాగర్ ద్వారా మక్కువ, బొబ్బిలి మండలాల్లో పది వేల ఎకరాలకు సాగునీరందుతోంది.
* వేపాడ మండలం గుండా వెళ్లే రైవాడ కాలువ ద్వారా కొంతమేర సాగునీరు అందుతుంది.
* లక్కవరపుకోట మండలంలో సాగునీటిపారుదలకు సంబంధించి చెప్పుకోదగ్గది మార్లాపల్లి ఛానల్ సిస్టం. దీని కింద 800 ఎకరాలు ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ కాలువ పూర్తిగా దెబ్బతింది.

ప్రధాన పంటలు

విజయనరగం జిల్లాలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. సాగు విస్తీర్ణంలో 60 శాతం మేర ఆహారపంటలు, మిగతా భూముల్లో ఆహారేతర పంటలు పండిస్తున్నారు. వరి, జొన్న, సజ్జ, రాగులు, మినుము, పెసర, నువ్వు, మిరప, వేరుశనగ, గోగు, మొక్కజొన్న, పత్తి, చెరకు, పొగాకు తదితర పంటలతో పాటు జీడి, మామిడి వంటి ఉద్యాన పంటలు సాగువుతున్నాయి. ప్రధాన ఆహార పంటలు వరి, సజ్జ, రాగులు కాగా చెరకు, వేరుశనగ, గోగునార వాణిజ్యపంటలు. రాష్ట్రంలో మొత్తం గోగునార ఉత్పత్తిలో 70 శాతానికి పైగా ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. సకాలంలో వర్షాలు పడక నాట్లు ఆలస్యం కావడం, పూర్తిస్థాయిలో వర్షాలు పడకపోవడం వల్ల ఆహారధాన్యాల ఉత్పత్తిలో మెరుగుదల కనిపించడం లేదు. 1991 నాటికి 3.68 లక్షలు మంది రైతులుండగా 2010నాటికి 3.22 లక్షలకు తగ్గారు. వ్యవసాయ కూలీలు 1991లో 3.28 లక్షల మంది ఉండగా 2010 నాటికి 4.70 లక్షలకు పెరిగారు. మొత్తం కార్మికుల్లో వీరు 40శాతంగా ఉన్నారు. జిల్లాలో వ్యవసాయోగ్య భూములు 3.73 లక్షల హెక్టార్లు. ఇందులో 2.74 లక్షల హెక్టార్లు పంట భూములు. నీటిపారుదల సౌకర్యం ఉన్న మాగాణి 1.54 లక్షల హెక్టార్లు కాగా సాగు నీటిపారుదల లేని మెట్టభూములు 1.20 లక్షల హెక్టార్లు. ఒకటి కంటే ఎక్కువ సార్లు పంటలు సాగుచేసే భూములు 99 వేల హెక్టార్లు.
* వరి సాధారణ విస్తీర్ణం 1,17,946 హెక్టార్లు గానూ 2.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావాలి. అన్ని మండలాల్లో వరి సాగవుతుంది. ఇక్కడి నుంచి సాంబమసూరి రకం బియ్యం ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది.
* మొక్కజొన్న పంట సాధారణ విస్తీర్ణం 4,448 హెక్టార్లు. ఈ పంట ఎక్కువగా పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ, గుర్ల, గజపతినగరం, నెల్లిమర్ల, జామి మండలాల్లో రైతులు సాగుచేస్తున్నారు.
* వేరుశెనగ పంట సాధారణ విస్తీర్ణం 37,349 హెక్టార్లు కాగా మీద 26,645 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. ఈ పంటను అన్ని మండలాల్లోనూ ఎంతో కొంత సాగు చేస్తుంటారు.
* అపరాల పంటలు విస్తీర్ణం 37,095 హెక్టార్లు కాగా 46.36 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుంది. * గోగు సాధారణ విస్తీర్ణం 39,660 హెక్టార్లకు గాను 27,330 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుంది. ఈ పంట పార్వతీపురం, గజపతినగరం, కొమరాడ, దత్తిరాజేరు, బొండపల్లి, మెంటాడ, చీపురుపల్లి మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుంది. గోగు పంట ఎక్కువగా కోలకత్తాకు ఎగుమతి అవుతుంది.
* పత్తి సాధారణ విస్తీర్ణం 13,134 హెక్టార్లు కాగా 2101 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కావాలి. ఈ పంట ఎక్కువగా సాలూరు, మక్కువ, పాచిపెంట, కొమరాడ, రామభద్రపురం మండలాల్లో సాగవుతుంది. జిల్లాలో పత్తికి మార్కెట్ సౌకర్యం లేనందున కర్నూలు, గుంటూరు ప్రాంతాలకు తరలిస్తుంటారు.
* నువ్వు సాధారణ విస్తీర్ణం 18,403 హెక్టార్లకు గానూ 1336 మెట్రిక్ టన్నుల దిగుబడి రావాలి.
* చెరకు పంట జామి, బొబ్బిలి, ఎస్.కోట, సీతానగరం మండలాల్లో సాగు అవుతోంది. భీమసింగి, సీతానగరం ప్రాంతాల్లో చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. అందుకే ఆ పరిసర మండలాలకే చెరకు సాగు పరిమితమైంది.

ఖరీఫ్ సీజన్‌లో సాగు విస్తీర్ణం..
ఖరీఫ్‌లో ప్రధానంగా వరి, వేరుసెనగ, గోగు, చెరకు, మొక్కజొన్న, నువ్వులు, పత్తి పంటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి.
వరి : 1.20 లక్షల హెక్టార్లు
మొక్కజొన్న : 10,363 హెక్టార్లు
చెరకు : 17,178 హెక్టార్లు
వేరుసెనగ : 30,774 హెక్టార్లు
నువ్వులు : 15,343 హెక్టార్లు
పత్తి : 11,337 హెక్టార్లు
గోగు : 30,618 హెక్టార్లు

రబీ సీజన్‌లో సాగు విస్తీర్ణం..
జిల్లాలో రబీ పంటలు 71,996 హెక్టార్లలో మాత్రమే సాగవుతుంటాయి. వరి సాగు విస్తీర్ణం తక్కువే.
వరి : 3246 హెక్టార్లు
మొక్కజొన్న : 8617 హెక్టార్లు
మినుము : 14,876 హెక్టార్లు
పెసర : 17,325 హెక్టార్లు
ఉలవ : 15,357 హెక్టార్లు
వేరుసెనగ: 3675 హెక్టార్లు
నువ్వులు : 4634 హెక్టార్లు

ఉద్యాన పంటలు
మామిడి ఎగుమతుల్లో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ పంట సాధారణ విస్తీర్ణం 97,450 ఎకరాలు. ఇందులో 78వేల ఎకరాల తోటలు ఫలసాయం అందిస్తున్నాయి. ఎకరానికి 4 టన్నులు చొప్పున కాగా మొత్తం 3.12 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. మామిడి ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. ఏటా 1.50 టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి.
* జీడిమామిడి సాధారణ విస్తీర్ణం 35,700 ఎకరాలు. ఇందులో 28 వేల ఎకరాల్లో ఫలసాయం అందుతోంది. ఎకరానికి 4 క్వింటాళ్ల చొప్పున మొత్తం మీద 32,500 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుంది.

పర్యాటకం

విజయనగరం కోట
చారిత్రక అంశాల్లో విజయనగరం కోట ఒకటి.విజయనగర రాజవంశీయులు 1713లో నిర్మించారు. విజయనగర రాజులు ఐదు విజయాలకు చిహ్నంగా విజయదశమి, విజయనామ సంవత్సరం జయ(గరు)వారం శంకుస్థాపన చేశారు. అందుకే ఈ పట్టణానికి విజయనగరం పేరు వచ్చింది. నాలుగు పక్కలు బురుజులు, చుట్టూ ప్రహరీ గోడతోపాటు చుట్టూ కందకాలతో శత్రు దుర్బేధ్యంగా దీనిని నాగర్‌ఖాన్ నిర్మించారు. తరువాత కాలంలో ఇది ప్రముఖ చారిత్రక స్థలంగా మారింది. పర్యాటక శాఖ దీనిని గుర్తించి రూ.47 లక్షల వ్యయంతో విజయనగరం కోట చుట్టూ ఎంతో సుందరంగా పార్కు ఏర్పాటు చేశారు. సాయంత్రం సమయాల్లో ప్రజలు, పర్యటకులు సేదదీరుతుంటారు.

గంటస్తంభం
విజయనగరం గుర్తింపునకు మరో చిహ్నం గంట స్తంభం. 1885లో రూ.5400 వ్యయంతో దీనిని నిర్మించారు. 68 అడుగులు ఎత్తు గల ఈ స్తంభం విజయనగరానికి గుండెకాయ లాంటిదని అభివర్ణిస్తారు. విజయనగరం పాలకులైన రాజులు అప్పట్లో విజయనగరాన్ని సందర్శించాలని బ్రిటిష్ రాజులను కోరారు. వారి సందర్శనకు గుర్తుగా లండన్‌లో అతిపెద్ద కట్టడమైన గంటస్తంభాన్ని ఇక్కడ నిర్మించారు. పట్టణానికి మధ్యలో ఉండడం వల్ల ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉండి పర్యాటకులకు కనువిందు చేస్తుంది.

చింతపల్లి బీచ్
జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో చింతపల్లి బీచ్ ఒకటి. పర్యాటకులకు కనువిందు చేసే పర్యాటక స్థలం ఇది. ఇక్కడ గల లైట్ హౌస్, సముద్రంలో రాళ్ల గుట్టలు, పెద్ద ఇసుక తిన్నెలు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. పూసపాటిరేగకు 15 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఆ మార్గ మధ్యలో గోవిందపురం వద్ద ముక్తిధాం దేవాలయం పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందడంతో చింతపల్లిబీచ్‌కు మరింత వన్నె తెచ్చింది. 5వ నెంబరు జాతీయ రహదారి గుండా ఇటు విశాఖపట్నం అటు శ్రీకాకుళం నుంచి వచ్చి పూసపాటిరేగలో దిగి వెళ్లవచ్చు. బస్సు, ఆటోల సౌకర్యం ఉంది.

తాటిపూడి
జిల్లాలో పర్యాటక కేంద్రాల్లో ప్రముఖమైంది తాటిపూడి. గోస్తనీ నదిపై నిర్మించిన జలాశయం పర్యాటక కేంద్రంగా మారింది. చుట్టూ కొండలు, మధ్యలో జలాశయంలో తొణికిలాడుతున్న నీరు పర్యాటకులను ఆకర్షిస్తుంది. జలాశయం ఆవలవైపు అటవీశాఖ కాటేజీలు నిర్మించింది. అక్కడ కొండపై నిర్మించిన గిరి వినాయకుడు, వెదురు కర్రలతో తయారు చేసిన పలు ఆకృతులు ఆకర్షణీయంగా కనపడతాయి. జలాశయంలో బోటు షికారు పర్యాటకులకు అమితానందాన్ని కలిగిస్తుంది. జలాశయంలో బోటు షికారుకు రూ.25 నుంచి 30 వసూలు చేస్తారు. విజయనగరం పట్టణానికి 12 కిలోమీటర్ల దూరం. విశాఖపట్నం నుంచి శృంగవరపుకోట పట్టణం గుండా కూడా రావచ్చు. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కాటేజీలున్నాయి. రోజుకు ఏసీ రూ.600, నాన్ ఏసీ అయితే రూ.300 అద్దె తీసుకుంటారు.

తోటపల్లి
గరుగుబిల్లి మండలం తోటపల్లి మరో పర్యాటక కేంద్రం. ఇక్కడ వెంకటేశ్వరస్వామి దేవాలయం ఉత్తరాంధ్రలోనే ప్రసిద్ధిగాంచింది. నిత్యం భక్తులతో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. పక్కన నాగావళి నది ప్రవహిస్తుండడంతో పర్యాటక శోభ సంతరించికుంది. ఇందులో స్నానాలు చేసి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం. నాగావళి నదిపై ఇదే గ్రామం వద్ద తోటపల్లి జలాశయం నిర్మాణంలో ఉంది. పాత రెగ్యులేటరుతోపాటు కొత్త రెగ్యులేటరు వద్ద పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. పార్వతీపురం పట్టణానికి 10కిలోమీటర్లు దూరంలో పార్వతీపురం- పాలకొండ రోడ్డులో ఇది ఉంది.

పరిశ్రమలు

జిల్లాలో 2009-10 వరకు భారీ పరిశ్రమలు 31, 2011-12లో అదనంగా 27 భారీతరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. 2009-10 వరకూ 3480 కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. 2011-12లో 190 కొత్త సూక్ష్మ, మధ్య పరిశ్రమలను నెలకొల్పుతున్నారు. 2011-12లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలన్నీ గ్రౌండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో పూసపాటిరేగ మండలం జి.చోడవరం గ్రామం వద్ద ఆక్వాటీస్(రొయ్యలు) పరిశ్రమ ఉంది.
దీనికి ముడిసరకు పరిశ్రమకు ఆనుకొని ఉన్న సముద్ర తీర ప్రాంతం నుంచి లభ్యమవుతోంది. సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాలకు తరలిస్తున్నారు.
సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామంలో ఎన్సీస్, జామి మండలంలో విజయరామగజపతి పంచదార పరిశ్రమలు ఉన్నాయి. దీని ముడిసరకు జిల్లాలో అన్ని మండలాలతోపాటు విశాఖపట్నం జిల్లా పద్మనాభం, పెందుర్తి మండలాల నుంచి లభ్యమవుతోంది. లారీలు, రైలు వ్యాగన్ ద్వారా ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
జిల్లాలో జనపనార పరిశ్రమలు 12 ఉన్నాయి. వీటికి ముడిసరకు జిల్లా నుంచి అధికంగా లభిస్తోంది. విశాఖపట్నం జిల్లా నుంచి కొంత సేకరిస్తున్నారు. సరకు రైలు వ్యాగన్లు ద్వారా కోల్‌కతాకు రవాణా జరుగుతోంది.
పత్తి ద్వారా దారం ఉత్పత్తి పరిశ్రమలు విజయనగరం, బొబ్బిలిలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి మూతపడి ఉన్నాయి. కార్మికుల సమస్య ఇందుకు కారణం.
ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు ఐదు ఉన్నాయి. ముడిసరకు ఇక్కడే లభ్యమవుతోంది. వీటిని లారీల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తారు.
ఆర్టీసీ వర్కుషాపులు అయిదు ఉన్నాయి.
చర్మ పరిశ్రమ ఒకటి ఉంది. ముడిసరకు స్థానికంగా లభ్యమవుతోంది. పశ్చిమ బెంగాల్‌కు రోడ్డుమార్గం ద్వారా తరలిస్తారు.
స్టీల్ ఎల్లోయిస్ పరిశ్రమలు ఎల్.కోట మండలంలో శ్రీరాంపురం, ఆర్.జి.పేటలో ఉన్నాయి. ముడిసరకు విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో లభిస్తోంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో స్థానిక అవసరాల నిమిత్తం వినియోగిస్తున్నారు.
విద్యుత్తు ఉత్పత్తి కేంద్ర సీతానగరం అప్పయ్యపేటలో ఉంది.
కుటీర, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు 3480 కలవు. వీటికి ముడిసరకు స్థానికంగా లభ్యవుతుంది.

లక్కవరపుకోట మండలం
లక్కవరపుకోట మండలంలో చెప్పుకోదగ్గ పరిశ్రమలు స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్, ఇది స్టీల్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ సుమారు 200 మంది శాశ్వత ప్రాతిపదికన, మరో 1500 పైబడి తాత్కాలికంగా పనులు చేస్తున్నారు. సుమారు రూ.500 కోట్లు పెట్టుబడితో ఉంది. మరో కర్మాగారం మామహామాయ. ఇది కూడ స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు కర్మాగారాలలో స్టీల్ ఎక్స్చేంజ్ ఇండియా లిమిటెడ్ శ్రీరాంపురంలో ఉంది. మామహామాయ రెల్లిగైరమ్మపేటలో ఉంది. రంగారాయపురంలో సంపత్ ఫ్యూయల్స్( చెక్కను అంటించుకునే జిగురు పదార్దం తయారవుతుంది.) ఇది చిన్న తరహ పరిశ్రమ

కొత్తవలస మండలం
* జిందాల్ స్టెయిన్ లెస్: విశాఖపట్నం-అరుకు రహదారిలో కొత్తవలసలకు అయిదు కిలోమీటర్ల దూరంలో అప్పన్నపాలెం దగ్గర ఈపరిశ్రమ ఉంది. దీనిని 1985లో స్థాపించారు. రూ.38.26కోట్లు పెట్టుబడితో దీనిని నెలకోల్పారు. సంవత్సరానికి 40,000టన్నులు సామర్ధ్యంతో పనిచేస్తోంది. ఫెర్రోక్రోమ్ ఇక్కడ తయారుచేస్తారు. ఇందులో 450మంది కాంట్రాక్టు కార్మికులు, 125 మంది ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు.
* కొత్తవలసలో సీతంపేట దగ్గర 1962లో ఉమాగోగునార పరిశ్రమ, చింతదిమ్మ దగ్గర అయిదు సంవత్సరాల క్రితం ఉమా గోనె సంచుల తయారీ పరిశ్రమలున్నాయి. ఈ రెండు పరిశ్రమల్లో కలిపి వెయ్యిమంది పనిచేస్తున్నారు. రూ.29కోట్లు టర్నోవర్. పెట్టుబడి ఈరెండు పరిశ్రమల్లో ఒకదాంట్లో గోగునారతో పురిని తయారు చేస్తారు. మరో పరిశ్రమలో గోనెలు తయారుచేసి రాష్ట్రేతర ప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తారు.
* కొత్తవలస-విజయనగరం రహదారిలో కొత్తవలసకి ఆరో కిలోమీటర్లు దూరంలో కంటకాపల్లి దగ్గర మెసర్స్ శారదా ఎనర్జీ, మినరల్స్ లిమిటెడ్ పేరుతో నాలుగు పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో రూ.142కోట్లుతో 1,50,000 సామర్ధ్యంతో ఫెర్రోఅల్లాయిస్ పరిశ్రమను నెలకోల్పుతున్నారు. దీనిద్వారా 135 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రూ.8.12కోట్లు పెట్టుబడి, 12,00,000 సామర్ధ్యంతో ఐరన్ ఓర్ సీజ్డ్ పరిశ్రమను నెలకోల్పుతున్నారు. దీనిద్వారా 860మందికి ఉపాధి చేకూరనుంది. అదేవిధంగా రూ.78కోట్లు పెట్టుబడి, నాలుగు లక్షలు సామర్ధ్యంతో కోక్ ఒవెన్ ప్లాంట్ నిర్మిస్తున్నారు. దీనిద్వారా 60 మందికి ఉపాధి లభించనుంది. రూ.800కోట్లు పెట్టుబడితో 40మెగావాట్ల జనరేషన్ ట్రాన్సుమిషన్ ఆఫ్ఎటక్ట్రికల్ ఎనర్జీ పరిశ్రమను నెలకోల్పుతున్నారు. దీనిద్వారా 190 మందికి ఉపాధి లభించనుంది.

బొబ్బిలి
బొబ్బిలి పారిశ్రామికవాడ: (గ్రోత్‌సెంటర్): 9912225818
సంఘం వైర్సు, 9177002524
హెరిటేజ్ ఫుడ్స్: 9666408578
సరోజా జూట్ మిల్లు: 9440193136
అమృతశ్రీ వాటర్ ప్లాంటు: 09790019597
ఆర్.వి.ఆర్ ఫెర్రో అల్లాయిస్: 08944 201344
సింహగిరి పేపరు మిల్లు: 08944 201305
అంజని జీడి పరిశ్రమ: 08944 247123
కిరణ్ పాండే గ్లోబల్ కెమికల్స్: 9000733595
లక్ష్మీ శ్రీనివాస జూట్ మిల్లు, తారకరామకాలనీ, :08944 255352
నవ్యా జూట్‌మిల్లు, రామన్నదొరవలస, : 9247603778
జ్యోతి జూట్‌మిల్లు దిబ్బగుడ్డివలస, 08944 254203.

జామి మండలం
భీమసింగి సహాకార చక్కెర కర్మాగారం, కుమరాం గ్రామం,
శ్రీ చక్రా సిమెంట్ మెయిన్ రోడ్డు, అలమండ సంత,
శ్రీ హారిక వాటర్ ప్లాంట్, జె.డి.వలస రోడ్డు, జామి
ఎన్.సి.ఎస్. ఆధ్వర్యంలో చక్కెర కర్మాగారం, పార్వతీపురం,