close

పశ్చిమగోదావరి జిల్లా సమాచారం


జిల్లా చరిత్ర
విద్య
నదులు - ప్రాజెక్టులు
నీటిపారుదల
ప్రధాన పంటలు
పర్యాటకం
పరిశ్రమలు

జిల్లా చరిత్ర

పుణ్యగోదావరి స్పర్శతో పునీతమైన పశ్చిమగోదావరి జిల్లా పాడి పంటలతో రాష్ట్ర వ్యవసాయ రంగానికి తలమానికంగా నిలుస్తోంది. ఈ జిల్లా వాసి అడుగు పెట్టని రంగంలేదు. విద్య, వైద్య, వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక, క్రీడా, సాంస్కృతికం రంగమేదైనా గాని తన వాగ్ధాటితో, శ్రమించే తత్వంతో విజయాన్ని తన వెంట తిప్పుకోగల నేర్పు ఇక్కడి ప్రజల సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేద్యమైనా, రాజకీయ రంగపు రణతంత్రమైనా, క్రీడా, సాంస్కృతిక, కళా రంగాలపై తన ఆధిపత్యాన్ని సుస్పష్టంగా చాటుకోగల నేర్పరితనం ఇక్కడివారి ప్రత్యేకత. పల్లెటూరి అమాయకత్వాన్ని, పట్నవాసపు మాటకారితనాన్ని ఏకకాలంలో చూపగల నేర్పు, కష్టాన్నీ సుఖాన్నీ సమానంగా స్వీకరించే గుండె ధైర్యం ఈ జిల్లా వాసికి గోదావరి నీటితో అబ్బిన సుగుణాలు. ఎనిమిది దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లను, మరెన్నో ఒడిదొడుకులను అధిగమించి అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులేస్తూ ముందుకు సాగిపోతున్న ఈ జిల్లా చరిత్రపై సమగ్ర కథనం.

చరిత్ర: మౌర్యుల కాలంలో ఈ ప్రాంతం వారి సామ్రాజ్యంలో ఉండేది. అనంతరం శాతవాహనుల అధీనంలోకి వచ్చింది. క్రీస్తు పూర్వం మూడో శతాబ్ధి నుంచి సుమారు నాలుగు శతాబ్ధాల పాటు వారి పాలనలో ఉంది. క్రీస్తు శకం నాలుగో శతాబ్ధం ప్రారంభంలో వేంగి నగరం రాజధానిగా శాలంకాయనులు ఈ ప్రాంతాన్ని పాలించారు. క్రీ.శ. 350లో సముద్రగుప్తుడు ఈ ప్రాంతంపై దండెత్తి వచ్చి శాలంకాయన వంశపు రాజైన హస్తివర్మను ఓడించాడని చరిత్ర చెబుతోంది. వీరి తరువాత విష్ణుకుండినులు ఐదవ శతాబ్ధం ప్రారంభం లోనే ఈ ప్రాంతాన్ని వశపరుచుకుని ఏడో శతాబ్ధం ప్రథమార్థం వరకు పరిపాలించారు. క్రీ.శ. 530-540 ప్రాంతంలో ఈ రాజ్యాన్ని పాలించిన రెండవ విక్రమేంద్రవర్మ తన రాజధానిని అమరావతి నుంచి దెందులూరుకు మార్చాడు. క్రీ.శ. ఏడవ శతాబ్ధం మొదటి భాగంలో మూడవ మాధవవర్మ అనే విష్ణుకుండిన రాజు పాలిస్తుండగా చాళుక్య రాజు రెండవ పులకేశి దండెత్తాడు. వీరిరువురికి కొల్లేటి చెరువు దుర్గం వద్ద జరిగిన యుద్ధంలో చాళుక్యులు గెలుపొంది కొంతకాలం పరిపాలించారు. తరువాత 14వ శతాబ్ధం ప్రారంభం వరకు వెలనాటి చోడులు, 14వ శతాబ్ధంలో కాకతీయులపై గెలిచి ఢిల్లీ మహమ్మదీయ చక్రవర్తులు, తరువాత కొండవీటి రెడ్డిరాజులు, ముసునూరి నాయకులు, కోరుకొండ నాయకులు పాలించారు. కొండవీటి రెడ్డిరాజుల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా కూడా విజయనగర రాజ్యంలో కలిసిపోయింది. 1565లో తుళ్లికోట యుద్ధం తర్వాత గోల్కొండ నవాబులు, 1687 తర్వాత ఢిల్లీ మొగలాయిలు ఈ ప్రాంతాన్ని పాలించారు. 1724లో తెలంగాణతో కలిసి నైజాం పాలనలో ఉన్నా నిజాం సామ్రాజ్యం పతనమయ్యాక స్థానిక జమిందారుల ప్రాబల్యం పెరిగింది.

జిల్లా ఏర్పాటు: 1859లో పశ్చిమగోదావరి, గోదావరి జిల్లాలో ఉండేది. 1874లో భద్రాచలం తాలూకా, 1881లో గోల్కొండ ఏజెన్సీ ప్రాంతం గోదావరి జిల్లాలో కలిపినా పరిపాలనా సౌలభ్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వం గోదావరి నదికి ఉత్తరాన ఉన్న భాగాన్ని తూర్పు గోదావరి జిల్లా గాను, దక్షిణాన ఉన్న భాగాన్ని కృష్ణా జిల్లాలో కలిపింది. 1925 ఏప్రిల్ 15వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం కృష్ణా జిల్లాలోని కొన్ని తాలూకాలను కలిపి పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటైంది. 1924లో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న పోలవరం తాలూకాను విడదీసి ప.గో.జిల్లాలో విలీనం చేశారు. దాంతో జిల్లాకు సమగ్రరూపం వచ్చింది. 1979 నుంచి 14 తాలూకాలుగా విభజించారు. 1986లో తాలూకాలన్నీ రద్త్దె 46 మండలాలుగా ఏర్పడింది. జిల్లాలో 11 పట్టణాలు, 888 గ్రామ పంచాయితీలు, 1262 గ్రామాలున్నాయి.

విద్య

దేశానికే ధాన్యాగారమనిపించుకున్న పశ్చిమగోదావరి జిల్లా విద్యా విషయంలో కూడా ముందంజలోనే ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 39,34,982 జనాభాగల ఈ జిల్లాలో 26,54,267 మంది (74.32 శాతం) అక్షరాస్యులుగా నమోదయ్యారు. హైదరాబాద్, రంగారెడ్డి, కృష్ణా జిల్లాల అక్షరాస్యత వరుసలో 'పశ్చిమ' రాష్ట్రంలో నాలుగో జిల్లా. రాష్ట్రానికే ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం తాడేపల్లిగూడేనికి సమీపంలోని వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటైంది. ఏలూరులో సీఆర్ఆర్ కళాశాలలు, భీమవరంలో డీఎన్ఆర్, విష్ణు కళాశాలు బాగా పేరొందిన విద్యాసంస్థలు. ప్రయివేటు రంగంలో ఇంజినీరింగ్, ఎంబీఏ, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సుల కళాశాలలు జిల్లా నలుమూలలా అన్ని పట్టణాల్లోనూ విస్తరించి ఉన్నాయి.

తాడేపల్లిగూడెం సమీపాన వెంకట్రామన్నగూడెంలో ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని 2007లో ఏర్పాటు చేశారు. సుమారు 210 ఎకరాల స్థలంలో ఈ వర్సిటీ ఏర్పాటైంది. అనుబంధంగా వెంకట్రామన్నగూడెం, రాజేంద్రనగర్, కడప జిల్లా అనంతరాజుపేటల్లో మూడు కళాశాలలున్నాయి. రాష్ట్రంలో అయిచోట్ల ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలు దీని పరిధిలో ఉన్నాయి. హార్టికల్చర్ ఎంఎస్సీ, బీఎస్సీ, పీహెచ్‌డీ విద్యార్థులు మొత్తం 1100 మంది, పాలిటెక్నిక్ కోర్సుల్లో 258 మంది విద్యార్థులున్నారు. అనుబంధ పరిశోధనస్థానాలు, కృషివిజ్ఞాన కేంద్రాల్లో సుమారు 200 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారన్నారు. ఈ ఉద్యాన విశ్వవిద్యాయాలనికి వైఎస్సార్ యూనివర్శిటీగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లా కేంద్రం ఏలూరులోని సి.ఆర్.రెడ్డి విద్యా సంస్థను స్వాతంత్య్రానికి ముందు 1945లోనే స్థాపించారు. ఈ విద్యాసంస్థకు సంబంధించి ఎల్‌కేజీ నుంచి ఇంజీనీరింగు కళాశాల వరకు 10 అనుబంధ సంస్థలున్నాయి. దివంగత అల్లూరి బాపినీడు సి.ఆర్.ఆర్. విద్యా సంస్థలకు నిర్మాత. అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఆశ్రం) కళాశాలను 1999లో నెలకొల్పారు. గోకరాజు గంగరాజు దీని ఛైర్మన్. గోకరాజు రామరాజు డైరెక్టర్. ఎంబీబీఎస్ విద్యార్థులు 700 మంది ఇక్కడ చదువుతున్నారు. పీజీ విద్యార్థులు 150 మంది ఉన్నారు. భీమవరంలో కేవీ విష్ణురాజు తన తాతాగారు బీవీరాజు పేరిట 1997లో విద్యాసంస్థను ప్రారంభించారు. విష్ణు విద్యా సంస్థలుగా పేరొందిన ఈ కళాశాలల్లో సుమారు 8 వేల మంది డిగ్రీ, పీజీ, పాలిటెక్నికల్, ఇంజినీరింగ్, దంత వైద్యం తదితర కోర్సులను అభ్యసిస్తున్నారు. ఇక్కడ ఎఫ్ఎం రేడియో కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. భీమవరం పట్టణంలో ఇదే అతి పెద్ద కళాశాల.

భీమవరం పట్టణంలో తొలి కళాశాలగా 1945లో డీఎన్నార్ కళాశాలను ఏర్పాటైంది. ఇక్కడ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యతోపాటు లలిత కళావిభాగంలో శిక్షణ ఇస్తున్నారు. తణుకు సమీపంలోని ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో శశి పాఠశాల 1980లో 9 మంది విద్యార్థులతో ఆరంభమై దినదినాభివృద్ధి చెందింది. బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ ఛైర్మన్‌గా ఈ విద్యాసంస్థను అనేకచోట్ల శాఖలున్నాయి. ఎల్‌కేజీ నుంచి ఇంజినీరింగ్ వరకు శశి విద్యా సంస్థల్లో కోర్సులున్నాయి.

నదులు - ప్రాజెక్టులు

గోదావరి నది
'ఉప్పొంగిపోయింది గోదావరి' అంటూ ఆ నదీ తరంగాల పరవళ్లను ఎంతో రమ్యంగా వర్ణించారు ప్రముఖకవి అడవి బాపిరాజు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న అతి పెద్ద జీవనదిగా ఇది పేరొందింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకం వద్ద పుట్టి 1,465 కిలోమీటర్ల దూరం నది పయనించి ఉభయగోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతమైన అంతర్వేది పల్లిపాలెం వద్ద బంగళాఖాతంలో కలుస్తుంది. 3,12,812 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో పడే వర్షపాతం ఈ నదిలో కలుస్తుంది. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, కర్నాటక, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వెంబడి ఈ నది ప్రవహిస్తుంది. పూర్ణ, మంజీర, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, పెన్‌గంగా, వార్థా, మానేరు వంటి ముఖ్య ఉపనదులు గోదావరిలో కలుస్తాయి. గోదావరి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాలు ఆవిర్భవించాయి. బ్రిటీషు ఇంజినీరు కాటన్‌దొర పుణ్యమా అని ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో ఉభయగోదావరి జిల్లాల్లో పంట విస్తీర్ణం పెరిగి ఆంధ్రప్రదేశ్‌కే ధాన్యాగారంగా వెలుగొందుతున్నాయి.

తెల్లదిబ్బల్లోని పాపికొండలు నుంచి ప్రారంభమై..!
పోలవరం మండలంలోని తెల్లదిబ్బల్లోని పాపికొండలు నుంచి గోదావరి నది పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది. పోలవరం నుంచి ఈ నది పొడవు విస్తరించింది. పశ్చిమలో కొవ్వూరు.. తూర్పున రాజమండ్రి ప్రాంతంలో బాగా విస్తరించింది. ధవళేశ్వరం వద్ద సువిశాలంగా ఈనది అఖండ గోదావరిగా అవతరించింది. కాటన్ మహానీయుడు నిర్మించిన బ్యారేజీతో అఖండ గోదావరి దవళేశ్వరం నుంచి గౌతమి, వశిష్ట పాయలుగా చీలిపోయింది. గతంలో గౌతమి, వశిష్ట, విశ్వామిత్ర, అత్రి, కౌశిక, భరద్వాజ, అగస్త్యుడు అనే ఏడుగురు రుషుల పేర్ల మీద ఏడు పేర్లు ఉండేవని ప్రతీతి. కాని ప్రస్తుతం వశిష్ట, గౌతమిలు తప్ప మిగిలినవన్నీ గోదావరిలో అంతర్లీనమయ్యాయి. ధవళేశ్వరం వద్ద బ్యారేజీని నిర్మించిన తరువాత అక్కడ నుంచి తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టాలుగా విభజించి పంటకాల్వల వ్యవస్థను కాటన్ మహనీయుడు ఏర్పాటు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెల్లదిబ్బల్లోని పాపికొండల నుంచి ప్రారంభమైన గోదావరి నది పోలవరం, తాళ్లపూడి, కొవ్వూరు, నిడదవోలు, పెనుగొండ, ఆచంట, యలమంచిలి, నరసాపురం మండలాల మీదుగా ప్రవహిస్తుంది. అంతర్వేదిలోని అన్నాచెల్లెల నీటి గట్టు వద్ద సాగరంలో కలిసిపోతుంది.

తాడిపూడి ఎత్తిపోతల పథకం
జిల్లా తాళ్ళపూడి మండలంలోని తాళ్ళపూడి గ్రామం వద్ద తాడిపూడి ఎత్తిపోతల పథకం ఏర్పాటైంది. తొలుత ఈ పథకానికి రూ.295.80కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందిరాసాగర్ ప్రధాన కుడికాలువ ద్వారా 2,58,000 ఎకరాల్లో ఇచ్చే ఆయుకట్టులో భాగంగా 2,06,600 ఎకరాల ఆయుకట్టుకు ఈ పథకం ద్వారా నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. అంతేకాక 5,40,000 మంది జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చనుంది. ఈ పథకం అంచనాలు రూ.467.80 కోట్లకు పెరిగింది. ఈ పథకం ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం 60 వేల ఎకరాలకు మాత్రమే నీరిస్తుంది.

ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టు
జిల్లాలోని పోలవరం మండలం రామయ్యపేట గ్రామం వద్ద పోలవరం ప్రాజక్టుని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎడమ ప్రధానకాలువ ద్వారా తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో 1.62లక్షల హెక్టార్లు, కుడి కాలువ ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 1.29 లక్షల హెక్టార్లు భూమి సాగులోకి రానుంది. అంతేకాక దీనివల్ల 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా అవుతుంది. 80 టీఎంసీల నీటిని గోదావరి కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణానదికి మళ్లించడం, 23.44 టీఎంసీల నీటిని విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు తాగునీటి, పరిశ్రమల కొసం కాలువల ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది. అంతేకాక పర్యాటక, చేపల పెంపకం, జలరవాణా తదితర లాభాలు కూడా ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు రూ.16,010 కోట్లతో సీడబ్ల్యూసీ వారి సాంకేతిక సలహా కమిటీ అనుమతి ఇచ్చింది. ఈ వ్యయం ప్రస్తుతం రూ.17 వేల కోట్లు దాటి పోయింది. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

చింతలపూడి ఎత్తిపోతల పథకం
చింతలపూడి ఎత్తిపోతల పథకం గోదావరి నది కుడిగట్టుపై కట్టారు. ఈ పథకం ద్వారా జిల్లాలో అయిదు నియోజకవర్గాల్లో 13 మండలాల్లోని 1.78లక్షల ఎకరాలకు, కృష్ణా జిల్లా లోని 22 వేల ఎకరాలల్లోని ఆయుకట్టుకు సాగునీటిని అందించేందుకు ఉద్దేశించింది. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ పథకం ద్వారా దాదాపు 230 గ్రామాల్లోని 12 నుంచి 140 మీటర్ల ఎత్తులోనున్న భూములకు మూడు దఫాలుగా నీటిని ఎత్తిపోయడం ద్వారా సాగు, తాగునీటి అవసరాలు తీర్చుతారు. ఈ పథకానికి రూ.1701 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. దీనికిగాను 8659 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ పథకాన్ని రెండు భాగాలుగా విభజించి ఈపీసీ టర్న్ పద్ధతి ద్వారా టెండర్లు పిలిచారు. ఇప్పటి వరకు రూ.250 కోట్ల లోపు మాత్రమే కేటాయింపులుజరిగాయి.

నీటిపారుదల

జిల్లాలో ఏలూరు సర్కిల్ భారీనీటి పారుదల విభాగం కింద గోదావరి పశ్చిమడెల్టా, మధ్య తరహ నీటిపారుదల కింద తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయుకట్టు, చిన్ననీటిపారుదల విభాగం కింద జల్లేరు జలాశయంతో పాటుగా 1,398 సాగునీటి చెరువులున్నాయి.

ఆయుకట్టు వివరాలు
జిల్లాలో భారీనీటిపారుదల విభాగం కింద గోదావరి నదీజలాలు 5,29,962 ఎకరాలకు 11 ప్రధాన కాలువల ద్వారా సాగునీరు అందుతోంది. మధ్య తరహ నీటిపారుదల విభాగం కింద తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయుకట్టు జలాలు 43,500 ఎకరాలు సాగవుతుండగా, చిన్ననీటి పారుదల విభాగం కింద జల్లేరు జలాశయం జలాలు ద్వారా 1,19,284 ఎకరాలు సాగవుతున్నాయి. కృష్ణా డెల్టా నుంచి వచ్చే ఏలూరు కాలువ కింద కూడా జిల్లాలోని దాదాపు 50 వేల ఎకరాలు సాగవుతున్నాయి.

జిల్లాలో సేద్యం....
పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలోనే ధాన్యాగారంగా పేరుగాంచింది. జిల్లాలో 22 డెల్టా, 7 పాక్షిక డెల్టా, 17 మెట్ట మండలాలతో కలిపి మొత్తం 46 మండలాలున్నాయి. సుమారు 40లక్షల మంది జనాభా కలిగిన ఈ జిల్లాలో దాదాపు 70 శాతం మంది వరకు వ్యవసాయం మీదనే ఆధారపడింది. గోదావరి నదీ జలాలపై అధికశాతం పంటలు పండుతుంటే, కృష్ణానదీ జలాలపై ఆధారపడి సుమారు 20వేల హెక్టార్లు వరకు సాగు అవుతుంది. జిల్లాలో ముఖ్యంగా వరి అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుండగా వేరుశెనగ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, అపరాలు సాగుకూడా ఆశాజనకంగానే సాగుతుంది. జిల్లాలో ప్రతి సీజన్‌లో వరి రెండు పంటలు పండుతుంది.

ప్రధాన పంటలు

జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో సుమారు 11 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. దీంతోపాటుగా మొక్కజొన్న 40వేల హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 3వేల హెక్టార్లలో, పోగాకు 25వేల హెక్టార్లలో, మినుములు 10,970, కందులు 13, పెసలు 4089, ఉలవలు 422, వేరుశెనగలు 4221, నువ్వులు 662, మిరపకాయలు 2979 హెక్టార్లలో సాగు చేస్తుంటారు. చెరకు 28వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు.

ఉద్యాన పంటలు సాగు
పశ్చిమగోదావరి జిల్లాలో 1,27,727 హెక్టార్లల్లో అరటి, మామిడి, జామ, నిమ్మకాయలు వంటి పండ్లతోటలతో పాటుగా కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూలతోటలను రైతులు సాగు చేస్తున్నారు. లక్ష ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్, కోకో పంటల సాగుతో జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచింది.

పరిశోధన కేంద్రాలు
పశ్చిమగోదావరి జిల్లాలో వ్యవసాయాభివృద్ధికి అనేక పరిశోధనా కేంద్రాలు నెలకొల్పారు. పెదవేగిలో ఆయిల్‌ఫామ్ పరిశోధనా కేంద్రం, పెనుమంట్ర మండలం మార్టేరులో వరి పరిశోధనా కేంద్రం, కొవ్వూరులో అరటి, ఉండిలో కృషి విజ్ఞాన్ పరిశోధన కేంద్రాలున్నాయి.

కృషి విజ్ఞాన కేంద్రం
రాష్ట్రంలోని వివిధ పరిశోధన స్థానాలు సాధించిన ప్రగతిని విస్తరణ విభాగం ద్వారా రైతుల దరికి చేర్చడంలో ఉండిలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రగతిని సాధిస్తోంది. 1994లో ఎన్నార్పీ అగ్రహారంలోని 50 ఎకరాల విస్తీర్ణంలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కేవీకేను ఏర్పాటు చేశారు. మార్టేరుతో పాటు వివిధ పరిశోధన స్థానాలకు చెందిన బీడర్ సీడ్ (వరి)ని తీసుకొచ్చి ఇక్కడ సాగు చేసి నాణ్యమైన పౌండేషన్ సీడ్‌ను 1996 నుంచి రైతులకు సరఫరా చేస్తున్నారు. గత అయిదేళ్ల నుంచి హార్టీకల్చర్ సాగులో ఈ కేంద్రం ప్రగతిదిశగా అడుగులేస్తోంది. సపోటా, కొబ్బరితోటల సాగుచేస్తున్నారు. కూరగాయల సాగులో వివిధరకాల ప్రయోగాలు చేస్తున్నారు. మెట్టపంటలైన పత్తి, బీటీకాటన్, మొక్కజొన్న వంటి పంటలపై ప్రదర్శనా మడులు ఏర్పాటు చేస్తున్నారు. బ్రాకోలీ, రెడ్‌క్యాబేజీ, టమాటా, వంగ వంటి కూరగాయలతో పాటు వివిధ రకాల ఆకుకూరల సాగుచేస్తున్నారు. బిందు సేద్యంతోపాటు తక్కువ నీటితో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. గిరిరాజ, టర్కీ కోళ్ల పెంపకాన్ని ప్రొత్సహిస్తున్నారు. శ్రీవరిసాగు, వర్మీ కంపోస్టుతోపాటు వివిధరకాల ప్రశుగ్రాసాల పెంపకంపై ప్రదర్శనా మడులు ఏర్పాటు చేసి రైతులకు వివరిస్తున్నారు. అరటితో నార తయారీ, బొమ్మల తయారీ, అల్లికలు, కుట్లపై శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. మహిళా సంఘాల వద్దకు వెళ్లి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుల చెరువుల్లో చేపలు, రొయ్యల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు.

మత్స్య పరిశోధన కేంద్రం(ఉండి)
ఆక్వా రంగ ప్రగతికి ఉండిలో మత్స్య పరిశోధన స్థానం నిరంతరం ప్రయోగాలు జరుపుతూనే ఉంది. వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయానికి చెందిన మత్స్య పరిశోధన స్థానం(ఎఫ్ఆర్ఎస్) 2001లో కొవ్వలి నుంచి ఉండి తీసుకొచ్చారు. ప్రస్తుతం దీని ప్రధాన కార్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలోనే ఉంది. తెల్లజాతి చేపల పెంపకంలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ, పెంపకం చెరువుల్లో నీటి నాణ్యత, మేత వినియోగంలో హెచ్చుతగ్గులు, నాణ్యత గల మేత వినియోగం వల్ల కలిగే లాభాలు, వాతావరణ మార్పులకు అనుగుణంగా చేపలు, రొయ్యల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్య పరిశోధన స్థానం ప్రయోగాలు చేస్తూ వాటి ఫలితాలు రైతులకు అందిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న తెల్లజాతి చేపలకు ప్రత్యామ్నాయ జాతుల పెంపకంపై వివిధ ప్రయోగాలు నిర్వహిస్తోంది. బొమ్మిడాయి విత్తన తయారీలో సత్ఫలితాలు సాధించింది. కొరమేను, మార్పు వంటి ప్రత్యామ్నాయ జాతి చేపల పెంపకంలో ఈకేంద్రం మంచి ఫలితాలు పొందింది. టైగర్ రొయ్యకు ప్రత్యామ్నాయంగా నీలకంఠ రొయ్యల పిల్లల పెంపకంలో చేసిన ప్రయోగాలు ఇక్కడ ఫలించాయి. 12.5 ఎకరాల విస్తీర్ణంలో ఎఫ్ఆర్ఎస్ చేపలు, రొయ్యల పెంపకంలో ప్రయోగాలు జరుపుతోంది. చేపలు, రొయ్యల్లో వ్యాధి నిర్థారణ, నీటి నాణ్యత, హిబ్రియోసిస్ వంటి వివిధ రకాల వ్యాధినిర్ధారణ పరీక్షలు ఈకేంద్రంలోనే శాస్త్రవేత్తలు నిర్వహిస్తూ రైతులను ప్రొత్సహిస్తున్నారు.

వరి పరిశోధన స్ధానం
పెనుమంట్ర మండలం మార్టేరులో వరిపరిశోధన స్ధానం కొలువు తీరింది. నూతన వరి వంగడాల రూపకల్పన దిశగా ఇక్కడ శాస్త్రవేత్తల బృందం నిత్యం పరిశోధనలు నిర్వహిస్తుంది. మొత్తం 22 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వాతావరణంలో మార్పులకు అనుగుణంగా వరి రకాలతోపాటు అధిక దిగుబడులు, తెగుళ్లను తట్టుకునే రకాలను అందించాలనే కృషినిత్యం జరుగుతుంది. 1925లో స్ధాపించిన ఈ పరిశోధన స్ధానం ఇప్పటివరకు 47రకాలను అందించింది. వీటిలో రెండు హైబ్రీడ్ రకాలు ఉన్నాయి. 1982లో ఈ సంస్థ అందించిన స్వర్ణ రకం వరి వంగడం అంతర్జాతీయ స్ధాయిలో ప్రాముఖ్యతను సాధించింది. అలాగే 1986లో దోమపోటును తట్టుకునే వరిరకాలను రైతులకు అందించి అండగా నిలిచింది. సన్నరకాలపై రైతులకు మక్కువ పెరగడంతో ఈదిశగా పరిశోధనలు చేసి మేలైన రకాలను అందించింది. ఎమ్‌టియు 2067, 2077, 1001, 1010 రకాలను రూపొందించింది. ఎమ్‌టియు 1031, 1032, 1075, 1064, 1061 రకాలు రైతులకు పంట పండించాయి. త్వరలో పరిశోధన ముగించుకుని ఎమ్‌టియు 1112, 1120 వరిరకాలు రైతులకు చేరనున్నాయి.

కొవ్వూరు అరిటి పరిశోధన కేంద్రం
రాష్ట్రంలోనే ఏకైక అరటి పరిశోధన కేంద్రం జిల్లాలోని కొవ్వూరులో ఉంది. ఇది పరిశోధనల్లో మంచి ఫలితాలను సాధిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం (వెంకట్రామన్నగూడెం)నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. 1958లో తణుకులో ప్రారంభమైన ఈ సంస్ధ దశాబ్ద కాలం అనంతరం 1968లో కొవ్వూరు పట్టణ శివారులో సుమారు 15 ఎకరాల సువిశాలమైన స్థలంలోకి మారింది. ఈ కేంద్రంలో ఆరుగురు శాస్త్రవేత్తలు నిరంతరం తమ పరిశోధనలను కొనసాగిస్తున్నారు. వీరికి డాక్టర్ బి.వి.కృష్ణ భగవాన్ నేతృత్వం వహిస్తున్నారు. కేంద్రం తన పరిశోధనలలో భాగంగా 1985లో గజేంద్ర పేరిట కందను ఉత్తత్తి చేసింది. ఈ రకం అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. నేపాల్, దక్షిణాఫ్రికా వంటి దేశాల వారు సైతం ఈ రకం కందను పంటలు వేస్తున్నారు. 1995లో కొవ్వూరు బొంత పేరుతో కూర అరటిని కనుగొంది. ఈ రకం రైతులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం కె.బి.ఎస్-5 పేరిట కూర అరటిని పరిశోధిస్తుంది. ఇది కొవ్వూరు బొంత అరటికంటే మేలైన రకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కె.సి.ఎస్-3 పేరిట కందపై పరిశోధన జరగుతోంది. కేవలం 5.5 నెలల కాలంలో పంట చేతికొస్తుంది.

ఆయిల్‌ఫామ్ పరిశోధన కేంద్రం
జిల్లాలోని పెదవేగిలో జాతీయ ఆయిల్‌ఫామ్ పరిశోధన కేంద్రాన్ని 1995 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఉండగా ప్రస్తుతం 18 మంది శాస్త్రవేత్తలు ఉన్నారు. మరో అయిదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరితోపాటు పరిపాలన, సాంకేతిక సహాయకులు కలిపి మరో 40 మంది ఉన్నారు. ఆయిల్‌ఫామ్ తోటలకు సంబంధించి పరిశోధనలు చేయడం ప్రధాన విధి. నీరు తక్కువుగా తీసుకుంటూ ఎక్కువ దిగుబడి సాధించడానికి కొత్త వంగడాలపై కూడా పరిశోధనలు సాగిస్తున్నారు. అదేవిధంగా చీడపీడలను తట్టుకునేలా కొత్త వంగడాలను అందుబాటులోకి తెచ్చారు. అవి పాలాడు-1, పాలాడు-2 రకాలు. వీటితోపాటు పలు రకాలైన పామాయిలులో అంతర పంటలకు సంబంధించి కూడా పరిశోధనలు సాగిస్తున్నారు. వీటితోపాటు రైతులకు అవసరమైన సూచనలు ఇస్తున్నారు. జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా పామాయిలు సాగు జరుగుతుంది.

పర్యాటకం

సుందర దృశ్యం పాపికొండలు
మూడు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న పాపికొండల అందాలు చూడాలంటే నిడదవోలు, రాజమండ్రి రైల్వే స్టేషన్లలో దిగి పర్యాటకులు పట్టిసీమ చేరుకోవాలి. అక్కడి నుంచి 4 గంటల పాటు పడవలో నదిలో ప్రయాణం చేస్తే పాపికొండలు చేరుకోవచ్చు. రేవులో నుంచి బయలుదేరే బోట్లకు ఒకొక్కరికీ రూ. 400 ఛార్జి వసూలు చేస్తారు. ఉదయం అల్పాహరం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ, స్నాక్స్ బోటులోనే నిర్వాహకులు అందజేస్తారు. పాపికొండలు చూడాలనుకునే వారు ముందుగానే బోట్లకు టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా లేదా పర్యాటక కేంద్రాలు, ప్రైవేటు ఏజెన్సీల వద్ద బుక్ చేసుకోవాలి. 40 నుంచి 50 మంది పర్యాటకులు ఉంటే తప్ప బోట్లు బయలుదేరవు. సాధారణంగా పట్టిసీమ రేవు నుంచి, రాజమండ్రి నుంచి లాంచీలు బయలుదేరుతుంటాయి. వేసవిలో మాత్రం పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం రేవు నుంచి బయలుదేరతాయి.

అలనాటి బౌద్ధ విశ్వ విద్యాలయం
కామవరపుకోట మండలం గుంటుపల్లిలో బౌద్ధారామాలు ఉన్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా భారత వారసత్వ సంపదగా ఇవి పేరుపొందాయి. జిల్లా నలుమూలల నుంచి దేశ, విదేశాల నుంచి బౌద్ధ భిక్షువులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. క్రీ.శ. 326వ శతాబ్దంలో బౌద్ధమత వ్యాప్తిలో భాగంగా మహానాగుడనే బౌద్ధుడు ఈ ప్రాంతంలో బౌద్ధ విశ్వవిద్యాలయం నెలకొల్పారని చరిత్రకారులు చెబుతారు. బౌద్ధ భిక్షువులు, శిష్యులకు ధ్యానం, ధర్మబోధన వంటి వాటిలో శిక్షణ ఇచ్చారని ఆధారాలను బట్టి తెలుస్తోంది. గట్టుపైన పాలరాతి బౌద్ధ స్తూపంలో బుద్ధుని అస్థికలు ఉంచారని నమ్మకం. ఏకశిలపై చెక్కిన బౌద్ధారామాలు అలనాటి శిల్ప కళా వైభవాన్ని చాటి చెబుతున్నాయి. బౌద్ధారామాలు నేటికీ చెక్కు చెదరకుండా కనువిందు చేస్తుండడం విశేషం.

సహజసిద్ధ సరస్సు కొల్లేరు
ఆసియాలోనే అతి పెద్ద సహజ సిద్ధమైన మంచినీటి సరస్సు కొల్లేరు. సుమారు 901 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని డెల్టా ప్రాంతాల మధ్య ఈ సరస్సు ఏర్పడింది. 98 గ్రామాల మధ్య విస్తరించి ఉంది. కృష్ణా జిల్లాలోని బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు, పోలచంద్రయ్య వంటి ప్రధాన డ్రెయిన్లు, పశ్చిమగోదావరి జిల్లాలో తమ్మిలేరు, తోకలపల్లి, పందికోడు, వెంకయ్య వయ్యేరు, ఎర్రకాల్వలో కొంత భాగం ఈ సరస్సులో కలుస్తాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు 15 కాల్వలు, 15 డ్రెయిన్లలో నీరు ఈ సరస్సులోకి చేరుతుంది. సుమారు 1.10 లక్షల క్యూసెక్కుల నీరు ఇందులోకి సహజంగా వస్తుంది. ఆకివీడుకు సమీపంలోని ఉప్పుటేరు ద్వారా ఈ నీరంతా మొగల్తూరు మండల పరిధిలో బంగాళాఖాతంలో కలుస్తుంది. 1964లో అత్యధికంగా 2.24 లక్షల క్యూసెక్కుల నీరు సరస్సులోకి చేరింది. 1983, 86, 89, 96, 2006 సంవత్సరాల్లో కొల్లేరులోకి వరద నీరు పోటెత్తింది. పలుగ్రామాలు ముంపుబారిన పడ్డాయి. రెండు జిల్లాల్లో సుమారు 3 లక్షల ఎకరాల విస్తీర్ణం దీనికి ఆనుకొని సాగవుతోంది. సరస్సులో వేలాది ఎకరాల్లో చేపల పెంపకం జరుగుతోంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ సరస్సు పక్షుల సముదాయానికి నెలవుగా పేరుగాంచింది. విదేశాల నుంచి సుమారు 200 రకాల పక్షులు ఇక్కడికి తరలివస్తుంటాయి. కొల్లేరులోకి వచ్చే విహంగాల సముదాయం ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తుంటాయి. కొల్లేటిలోని పెద్దింట్లమ్మ జాతర మహోత్సవాలకు వేలాది మంది తరలివస్తుంటారు.

గోదావరి తీరం... వేసవి విహారం
గోదావరి చెంతన.. ఇసుక తిన్నెల మధ్యన విహారం చాలా బాగుంటుంది. యలమంచిలి మండలంలోని చించినాడ, యలమంచిలి లంక, ఉభయగోదావరి జిల్లాల నడుమ నిర్మించిన చించినాడ వంతెన దిగువననున్న దిండి గ్రామాల్లో అతిథి గృహాలు వేసవి విహారాలకు స్వాగతం పలుకుతుంటాయి.

పట్టిసీమ
పురాతన పంచ శివ క్షేత్రాల్లో పట్టిసీమ ఒకటి. ఈ మహక్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసం సమీపాన పవిత్ర గోదావరి నది మధ్యలో దేవకూట పర్వతంపై వెలసింది. దేవకూట పర్వతంపై పరమశివుడు వీరభద్ర అవతారంలో దక్షుడుని సంహరించిన అనంతరం ప్రళయతాండవం చేస్తుండగా చేతిలో ఉన్న పట్టిసాయుధం దేవకూట్రాదిపై జారీ పడినందున పట్టిసాచల క్షేత్రమని పేరు వచ్చింది. దేవతలు శాంతించమని ప్రార్థించడం అగస్య భగవానుడు ఆలింగనం చేసుకోవడంతో శాంతించి లింగాకారన భద్రకాళీ సమేతుడై స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయానికి వచ్చే వారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి 40 కి.మీ., నిడదవోలు నుంచి 40 కి.మీ., తాడేపల్లిగూడెం నుంచి అయితే 90 కి.మీ., దూరంలో పట్టిసీమ ఉంది. బస్సులు అంతంతమాత్రం కావడంతో చిన్నకార్లపై రావడమే సురక్షితం. రేవులో పడవ భక్తులను నది దాటించడానికి సిద్ధంగా ఉంటుంది.

ప్రధాన దేవాలయాలు
శ్రీవారి దర్శనం సర్వపాపహరణం
ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనం.. సర్వపాపహరణంగా చెబుతుంటారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రసిద్ధక్షేత్రంగా వెలుగొందుతున్న ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఎక్కడా లేనివిధంగా అంతరాలయంలో ఇద్దరు ద్విమూర్తులు కొలువుదీరి ఉండటం విశేషం. ఇక్కడి స్వయంవక్త స్వామివారికి పాదపూజ లేకపోవడంతో ద్వారకా మహర్షి తపస్సు చేయడంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి పాదపూజ లభిస్తుందని చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. అనంతరం వైఖానసాగమ శాస్త్రానుసారం మరోస్వామి వారిని ప్రతిష్ఠించారు. దీంతో ఈ క్షేత్రంలో స్వయంవ్యక్త స్వామివారికివైశాఖ మాసంలోనూ, ప్రతిష్ఠస్వామికి ఆశ్వీయుజ మాసంలోనూ తిరుకల్యాణోత్సవాలు నిర్వహిస్తారు. పెద్దతిరుపతి వెళ్లలేని భక్తులు ఇక్కడ మొక్కుబడులు సమర్పించుకొనే ఆచారం కూడా ఉంది. ఆలయానికి తూర్పువైపున యాగశాల, వాహనశాల, మహానివేదనశాల, ఉన్నాయి. అలాగే ఆళ్వారులకు వేర్వేరుగా ఆలయాలున్నాయి. ప్రాకారాల్లో నాలుగు దిక్కులా గాలిగోపురాలున్నాయి. శ్రీవారి ఆలయానికి ఉపాలయాలు, దత్తత దేవాలయాలున్నాయి. భ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయం, కుంకుళ్లమ్మ ఆలయం, జగన్నాధస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి..

ప్రసిద్ధ శైవక్షేత్రం పట్టిసాచలం
పోలవరం మండలం పట్టిసీమ సమీపాన పురాతన ప్రసిద్ధ శివకేత్రం ఉంది. ఇక్కడ భద్రకాళీసమేత వీరభద్రస్వామి వారు ప్రధాన దేవతామూర్తి. నీలసమేత భావన్నారాయణ స్వామి వారు క్షేత్ర పాలకులు. కనకదుర్గ, మహిషాసురమర్ధని అమ్మవార్లు గ్రామ దేవతలు. అనిస్త్రీ, పునిస్త్రీ అమ్మవార్లు సంతానము ప్రసాదించే దేవతలని స్థానికుల నమ్మకం. పరమశివుడు వీరభద్రస్వామిగా అవతరించి పట్టసాయుధంతో దక్షప్రజాపతి శిరస్సును ఖండించి దేవకూటాద్రిపై ప్రళయ తాండవం చేస్తుండగా, శాంతించాలని దేవతలు ప్రార్థించారు. లింగాకారంలో ఆయన ఇక్కడ స్వయంభువుగా వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని చోళ చక్రవర్తులు నిర్మించినట్లు, ప్రతాపరుద్రుడు పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. క్రీస్తు శకం 1408 - 1415 ప్రాంతంలో అన్నదేవరచోళుని ఆస్థానంలోని నిశ్శంక కొమ్మకవి ఈ ఆలయానికి స్థానాధిపతిగా ఉన్నట్లు ఎ.ఆర్.292/1920 శాసనం ద్వారా తెలుస్తోంది.

సోమేశ్వరస్వామి స్థల పురాణం
భీమవరం సమీపంలోని గునిపూడిలో పంచారామ క్షేత్రంలో ఒకటైన సోమేశ్వర జనార్థనస్వామి ఆలయం ఉంది. తూర్పు చాళుక్యరాజులలో ప్రసిద్ధుడైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్ధంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. స్థల పురాణంలో ఈ క్షేత్రాన్ని పరమ పవిత్ర క్షేత్రంగా వర్ణించారు. ఈ దేవాలయం గురించి భీమఖండం, బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావన ఉంది.
ఆలయ ప్రత్యేకతలు
ఆలయంలోని లింగభాగాన్ని చంద్రుడే స్వయంగా ప్రతిష్ఠించటం వల్ల సోమేశ్వరలింగం అమావాస్య రోజున గోధుమ, నలుపు వర్ణంలో, పౌర్ణమినాడు శ్వేతవర్ణంలో రంగు మారుతుంటుంది. ఈశ్వర లింగం పైభాగాన అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ దేవాలయానికి మరో ప్రత్యేకత. భారతదేశంలోని ఈ ఆలయంలోనే శివలింగంపై అన్నపూర్ణమ్మ వారు ఉండడం విశేషంగా చెబుతారు.

భక్తుల ఇలవేల్పు మావుళ్లమ్మ
భీమవరంలోని మావుళ్లమ్మ అమ్మవారు భక్తుల ఇలవేల్పుగా పేరుగాంచారు. 1880 నుంచి మాత్రమే చరిత్ర లభ్యమయింది. భీమవరంలో ప్రస్తుతం ఉన్న మోటుపల్లివారి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరచటానికి నిర్మించిన భవన ప్రాంతంలో వేప, రావిచెట్టు కలిసి ఉన్నచోట అమ్మవారు వెలిశారని తెలుస్తోంది. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక శుభప్రధమైన మామిడి పేరున మామిళ్లు అమ్మగా.. అనంతరం మావుళ్లమ్మగా రూపాంతరం చెందిందని చెబుతారు. 1880 వైశాఖ మాసంలో భీమవరానికి చెందిన మారెళ్ల మాచిరాజు, గ్రంధి అప్పన్నకు అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి తాను వెలసిన ప్రాంతం వివరించి, ఆలయం నిర్మించాల్సిందిగా ఆదేశించారని పెద్దలు చెబుతారు. వారు శోధించగా మావుళ్లమ్మ శిలావిగ్రహం కనిపించింది. ఆదివారం బజారు (ఐదు లాంతర్ల స్తంభం) ప్రాంతంలో ఆలయం నిర్మించారని తెలుస్తొంది. మెంటే వెంకటస్వామి పూర్వీకులు అల్లూరి భీమరాజు వంశస్థులు అమ్మవారి పుట్టింటి వారుగా, గ్రంధి అప్పన్న పూర్వీకులు అత్తింటి వారుగా అమ్మవారి ఉత్సవాల్లో సంప్రదాయంగా వస్తోంది.

పాలకొల్లు క్షీరారామం...
రాష్ట్రంలో పంచారామక్షేత్రాల్లో పాలకొల్లు క్షీరరామలింగేశ్వరస్వామి ఆలయం (క్షీరారామం) ఒకటి. కుమారస్వామి తన దివ్యశక్తి ఆయుధంతో తారకాసురుని కంఠహారంలో ఉన్న అమృతలింగాన్ని ఛేదించగా అది పంచఖండాలై దివ్యకాంతులతో ఓంకారనాదం చేస్తూ అయిదు దివ్య ఆరామ స్థలాల్లో పడి అవిర్భవించిన శివుని పంచముఖ స్వరూపాలే పంచారామక్షేత్రాలు. ఈ క్షీరారామ క్షేత్రంలోని అమృతలింగ శిరోభాగాన్ని శ్రీరాముడు తన పేరున రామలింగేశ్వరుడిగా ప్రతిష్ఠించినట్లు చెబుతారు. క్షీరామలింగేశ్వర స్వామివారి దర్శనంతో సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మిక. చాళుక్య భీముడి కాలంలో దీనిని నిర్మించినట్లు, కీ.శ.1415లో అల్లాడురెడ్డి భూపాలుడు ఈ ఆలయ రాజగోపురం నిర్మించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి. ఈ గోపురం 120 అడుగుల ఎత్తు, 9 అంతస్తుల్లో నిర్మించారు.

మన్యం ప్రజల ఆరాద్య దైవం గుబ్బల మంగమ్మ
పశ్చిమగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలోని మారుమూల దట్టమైన అటవీ ప్రదేశంలో సహజసిద్ధంగా వెలసిన గుబ్బల మంగమ్మ భక్తులకు ఆరాధ్య దైవంగా వెలుగొందుతోంది. కోర్సావారిగూడెం పంచాయతీ గోగులపూడి గ్రామ సమీపాన ఈ ఆలయం ఉంది. పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల అటవీ ప్రాంతం నడుమ ఉన్న ఈ ఆలయం పరిసరాలు ప్రకృతి అందాలతో యాత్రికులకు కనువిందు చేస్తుంటాయి. ఒక రాతికొండ మధ్యలో గుబ్బలు, గుబ్బలుగా గుడి ఉంటుంది. అందువల్లే ఈ అమ్మవారికి గుబ్బలమంగమ్మ అని పేరు ప్రసిద్ధి చెందింది. గుడిపై భాగం నుంచి ఏడాది పొడవునా నీటి ధారలు జాలువారుతూ ఉండి మరింత రమణీయత ఉట్టిపడుతుంది. పూర్వం వెదురు గుత్తేదారు కరాటం కృష్ణమూర్తి ఈ గుడిని గుర్తించి అభివృద్ధికి కృషి చేశారు. ఈ జిల్లాతో పాటూ ఇతర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని కోలుస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు.

పరిశ్రమలు

ఆంధ్రా షుగర్సు
అనుబంధ ఉత్పత్తుల్లో ముందడుగు
అనుబంధ ఉత్పత్తును ముడిపదార్థాలుగా ఉపయోగించి రాకెట్ ఇంధనాన్ని తయారు చేస్తున్న ఆంధ్రాసుగర్సు సంస్థ అనుబంధ పరిశ్రమలను రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో విస్తరించడం ద్వారా తనదైన ప్రత్యేకతను సంతరించుకుంది. 1952లో కేవలం 600 టన్నుల సామర్థ్యంతో క్రషింగ్‌ను ప్రారంభించిన సంస్థ అంచెలంచెలుగా ఎదిగి 6000 టన్నులకు పెరిగింది. పంచదార ఉత్పత్తి విధానంలో డిప్యూజర్ విధానాన్ని, సెంట్రిప్యూగల్ యంత్రాలను వినియోగిస్తన్న చక్కెరపరిశ్రమ దేశంలో ఇదొక్కటే కావడం విశేషం. ప్రాంరంభం నాటి నుంచి చక్కెర ఉత్పత్తిలో వచ్చే అదనపు ఉత్పత్తులను వినియోగించుకుని అనుబంధ పరిశ్రమలను విస్తరింపజేసింది. ఇందులో భాగంగానే ఇండస్ట్రియల్ ఆల్కహాలు, ఏస్ప్రిన్ తయారిప్లాంటు, ఎసిటిక్ యాసిడ్ ప్లాంటు, ఎసిటిక్ ఎన్‌హైడ్రేడ్‌ప్లాంటు, ఇథైల్ ఎస్టేట్ తయారీలు చేరతాయి. వీటిలో వచ్చే కార్బన్ డయాక్సైడ్ కూడా ముడిపదార్థంగా వినియోగించుకునే సామర్థ్యం సంస్థకే ఉందని చెప్పవచ్చు. వీటి స్థాపన వెనుక సంస్థ అధినేత డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ తపన, కృషి కనిపిస్తాయి. వివిధ దేశాల్లో చెక్కర పరిశ్రమలను పరిశీలించి అక్కడి సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించి స్థాపించడం విశేషం. అక్కడి విజ్ఞానంతోపాటు పరిశోధన, అభివృద్ధి కింద ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన విధానాలను కూడా జోడించి అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన తయారీ విధానాలను అనుసరించడం సంస్థ ప్రత్యేకత, ఈ కోవలోనే సంస్థకు అనుబంధంగా నెలకొల్పిన వివిధ అనుబంధ పరిశ్రమలు ముందుకు సాగడం విశేషం.

68 ఏళ్ల ప్రస్థానంలో అంబికా దర్బార్‌బత్తి
భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్‌బత్తి అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అంబికా దర్బార్‌బత్తిని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచే ఎగుమతులు చేస్తున్నారు. 1946లో దివంగత అలపాటి రామచంద్రరావు ఈ అగరబత్తీల తయారీని తొలుత ఏలూరులో మొదలుపెట్టారు. మొదట్లో చిన్నపాటి కుటీర పరిశ్రమగా ప్రారంభమైన ఈ బత్తి తయారీ ఏలూరు నగరం వరకే పరిమితమైనప్పటికీ కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులను ఆరంభించింది. అమెరికా, ఇరాక్, ఇరాన్, ఆస్ట్రేలియా, చైనా, దుబాయ్, రష్యా తదితర దేశాలకు అంబికా అగరుబత్తి ఎగుమతులు జరుగుతుంటాయి. ఏలూరుతో పాటు, శ్రీకాకుళం జిల్లా రాజాంలో అగరబత్తీలు తయారు చేస్తున్నారు. అంబికా అగరబత్తి సుమారు రూ.60 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు అంబికా గ్రూప్ వర్గాలు చెబుతున్నాయి. అంబికా దర్బార్‌బత్తి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 రకాలుకు పైగానే చెందిన రకాలు విక్రయాలు జరుగుతున్నాయి.

అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన వెంట్రుకల వ్యాపారం
ఏలూరులో అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన పరిశ్రమ తల వెంట్రుకల వ్యాపారం. ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మడుపల్లి మోహనగుప్తా 1974 సంవత్సరంలో గుప్తా హెయిర్ ప్రొడక్ట్సును స్థాపించారు. మనుషుల తల వెంట్రుకలను దేవస్థానాల ద్వారా కొనుగోలు చేసి వాటిని శుద్ధి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. వాటితో ఆకర్షణీయమైన విగ్గులను రూపొందిస్తారు. ఏటా కోట్లాది రూపాయల వ్యాపార లావాదేవీలు సాగించే ఈ వ్యాపారం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమంది లబ్ధి పొందుతున్నారు. దాదాపు రెండు వందల మంది ఈ వ్యాపారం ద్వారా ఉపాధి కల్పించారు. ఇందులో ఎక్కువ శాతం మంది మహిళలే ఉన్నారు.

పేరెన్నికన్న తివాచీ పరిశ్రమ
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు వ్యాపార పరంగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచింది. తివాచీ పరిశ్రమ ఇక్కడ ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ తయారైన తివాచీలను దేశ విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ప్రస్తుతం తివాచీలకు ప్రజల నుంచి అంతగా ఆదరణ లభించకపోవడంతో తివాచీల తయారీదారుల సంఖ్య బాగా తగ్గింది.