రాష్ట్రపాలనలోనే కీలకమైనవి గ్రూప్‌-1 ఉద్యోగాలు. 'అభ్యర్థుల్లో ఎలాంటి లక్షణాలుంటే, ఆ పోస్టుల ద్వారా ప్రభుత్వం మరింత బాగా సేవలు అందించగలదు?' అనే అంశమే ఇంటర్వ్యూ బోర్డుచేత మార్కులు వేయిస్తుంది. సాధారణంగా బోర్డు పరిశీలించే అంశాలను గమనించి, తమలో అవెలా ఉన్నాయో ఉద్యోగార్థులు విశ్లేషించుకోవాలి; అవసరమైతే సవరించుకోవాలి!
ముఖాముఖిలో మెలకువలు
1. అవగాహన / గ్రహణశక్తి
2. సమస్యా పరిష్కార శక్తి
3. సహనం
4. రాజకీయ తటస్థత
5. విమర్శించాలా!

6. సేవాతత్పరత
7. నిజాయతీ ముఖ్యం
8. బలాలు-బలహీనతలు
9. సంభాషణా సౌందర్యం
10. పైకి కన్పించాలి

హావభావాలు
1. అవగాహన / గ్రహణశక్తి
గ్రూపు-I స్థాయి ఉద్యోగి తన పరిసరాల్లో జరుగుతున్న విషయాలపై గ్రహణస్థాయి, అవగాహన స్థాయిలలో మెరుగైన ప్రమాణంతో ఉండాలి. విషయాన్ని 'వాస్తవ' కోణంలో చూస్తున్నారా? లేదా? అనే విషయానికి బోర్డు పాధాన్యం ఇస్తుంది. అలాంటివాటిని గుర్తించేందుకు వర్తమాన విషయాలపై అధికంగా ఆధారపడ్తుంది.
కొన్ని ముఖ్యమైన వర్తమాన అంశాలు:
¤ పాకిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలు
¤ భారత్‌ సరిహద్దుల వెంబడి జరుగుతున్న విషయాలకూ, పాకిస్థాన్‌ అంతర్గత విషయాలకూ సంబంధం ఉందా?
¤ ఢిల్లీ అత్యాచారం ఘటనలో ప్రజలు తీవ్రంగా ఎందుకు స్పందించారు?
¤ FDIలను ప్రధాని ఎందుకు సమర్థిస్తున్నారు?
2. సమస్యా పరిష్కార శక్తి
పాలనా నిర్ణయీకరణంలో గ్రూపు-I అధికారులు కీలక పాత్ర పోషిస్తారు. అందువల్ల అభ్యర్థుల సమస్యా పరిష్కార శక్తిని బోర్డు పరిశీలిస్తుంది. కింది ప్రశ్నలకు ఆస్కారం ఉంటుంది.
¤ మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేస్తే మొదటి నిర్ణయం ఏమిటి?
¤ మావోయిస్టులతో పరిష్కార మార్గమేమిటి?
¤ అవినీతిని నిర్మూలించటం ఎలా?
¤ రాష్ట్రంలోని అనిశ్చిత పరిస్థితులకు మీరు చూపే పరిష్కార మార్గం ఏమిటి?
¤ యాచక వృత్తిని ఆపటం ఎలా?
3. సహనం
ప్రజాసమస్యలు అనేక రూపాల్లో కన్పిస్తాయి. వాటన్నిటినీ పరిష్కరించాలంటే 'సహనం' అనే ప్రాథమిక లక్షణం అభ్యర్థుల్లో ఉండాలి. తరచూ రాజకీయ నాయకులు, ఒత్తిడి సమూహాలు ఉద్యోగ బృందంపై ఆరోపణలు, దాడులు చేస్తూనే ఉంటారు. ఉద్యోగులు బెదిరింపులకు గురవుతూనే ఉంటారు. ఇలాంటి వాటినుంచి బయటిపడాలంటేస 'సహనం' కీలకపాత్ర పోషిస్తుంది. దాన్ని పరిశీలించటానికి...
¤ బోర్డు సభ్యులు స్వరతీవ్రత పెంచి, రెట్టించి రెట్టించి ప్రశ్నలు అడగటం.
¤ అభ్యర్థి ఒత్తిడికి గురయ్యేలా ఒకే ప్రశ్నను మళ్ళీ మళ్ళీ అడగటం
¤ ఒకే ప్రశ్నను విభిన్న కోణాల్లో అడుగుతూ, తప్పు సమాధానం చెప్పానేమో అనే సంకట పరిస్థితిని అభ్యర్థుల్లో కలగచేయటం
¤ 'ఈ చిన్నప్రశ్నకు సమాధానం చెప్పలేనిదానివి గ్రూపు-I ఉద్యోగం ఇంటర్వూని ఎందుకు వచ్చావ్‌?' అని ఒక మహిళా అభ్యర్థిని బోర్డు ప్రశ్నించింది. అంతిమ ఫలితాల్లో మహిళా అభ్యర్థుల్లో 4వ ర్యాంకు ఆమెకే వచ్చింది. మౌఖికపరీక్షలో కూడా గరిష్ఠ మార్కులు ఆమెకి వచ్చాయి.
4. రాజకీయ తటస్థత
ఉద్యోగులకు ఉండాల్సిన లక్షణం... తటస్థత. గత 30 సంవత్సరాలుగా మనదేశంలో ఈ తటస్థత బాగా తగ్గుతోంది. ఫలితంగా రాజకీయనాయకులూ ఉద్యోగులూ పరస్పర మద్దతుదారులుగా మారుతున్నారు. అనేక కుంభకోణాలు పక్షపాత వ్యవస్థలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో అభ్యర్థి తమ తటస్థతను ప్రదర్శించాలి.
¤ మీ ఇంటిల్లపాదీ తరతరాలుగా ఆ పార్టీకి ఓటేస్తున్నారన్నారుగా? మరి మీ ఓటు ఏ పార్టీకి?
¤ రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలి అనుకుంటున్నారు?
¤ మీ దృష్టిలో సమర్థుడైన ముఖ్యమంత్రి/ ప్రధానమంత్రి ఎవరు?
5. విమర్శించాలా!
ప్రభుత్వ పథకాలను 'బోర్డు' ముందు విమర్శించకూడదని విని వుంటారు. ఇది సరైనదే. ప్రభుత్వ ఉద్యోగులు తామే విమర్శిస్తే ఇతరులు ఆ పథకాలను మరింతగా విమర్శించవచ్చు. ఫలితంగా ప్రజల్లో నమ్మకం బలహీనపడుతుంది. పథకాల్లోని అనుకూలతలను బహిరంగంగా వ్యక్తంచేయాలి. బోర్డే 'విమర్శించండి' అంటే తప్పకుండా ప్రతికూల అంశాల్ని వ్యక్తం చేయాలి. కొన్ని ప్రశ్నలు చూడండి-
¤ 'మన బియ్యం' పథకంలో 'మన' ఏమిట్చి?
¤ రూపాయికి కిలోబియ్యం పథకంపై వస్తున్న విమర్శలు ఏమిటి?
¤ ఈ పథకంపై వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏమిటి?
సూచన: విమర్శించమన్నారు కదా? అని ప్రతిపక్షాల మాదిరిగా విమర్శించరాదు. విమర్శ నిర్మాణాత్మకంగా వినిపించాలి.

6. సేవాతత్పరత
ప్రభుత్వ ఉద్యోగ అంతిమలక్షణం సేవని అందివ్వటం. ఆ భావనలు సమాధానాల్లో ప్రతిబింబించాలి. గతంలో సమాజానికీ, ఇతరులకూ మీరు అందించిన సేవలుంటే సందర్భోచితంగా ప్రస్తావించాలి. హోదా కోసమో, జీతం కోసమో, సామాజిక గుర్తింపు కోసమో మాత్రమే ఈ పోస్టులకు వస్తున్నట్లుగా కన్పించరాదు. మీకు తెలిసిన వ్యక్తులు ఏ విధంగా సేవ అందిస్తున్నారో బోర్డుకు తెలియజేస్తూ ఆరాధనా భావాన్ని వ్యక్తం చేయటం మీ 'సేవ'కోణాన్ని వ్యక్తంచేసే ఒక మెలకువ.
7. నిజాయతీ ముఖ్యం
గ్రూపు-I స్థాయి ఉద్యోగులలో నిజాయతీ ఉంటే క్షేత్రస్థాయి ఉద్యోగుల్ని కూడా ఆ దిశగా పయనింపచేస్తుంది. జవాబుదారీతనాన్ని పెంచుతుంది. 'నిజాయతీ' వుందా? లేదా? అనే పరిశీలన కిందివిధంగా జరుగుతుంది.
¤ అభ్యర్థి తన వాదన తప్పయినా, సరైనదే అని వాదిస్తున్నారా?
¤ తన తప్పులను గ్రహించుకొని సరిదిద్దుకుంటున్నారా?
¤ తెచ్చిపెట్టుకున్న భావాలతో సంభాషిస్తున్నారా?

8. బలాలు-బలహీనతలు
తమ బలాల ప్రదర్శనకు అభ్యర్థులు ఉవ్విళ్ళూరుతుంటారు. అది సరే, బలహీనతల మాట ఏంటి? అభ్యర్థి తనంతట తాను బలహీనతలు బోర్డుముందు చెప్పుకోకూడదు. 'మీకున్న బలహీనత ఏమిటి?' అని అంటే చెప్పకుండా ఉండకూడదు. అయితే చెప్పబోయే బలహీనత పాలన/సమాజంపై ప్రభావం చూపించేస్థాయిలో వుండరాదు. (మీకు వున్నాసరే) ఆ బలహీనత వ్యక్తిగత నష్టం/ లాభం వరకు పరిమితమైతే మంచిది. ఇవి చూడండి..
¤ కొత్త సినిమా వస్తే చూడకుండా వుండలేను.
¤ స్వీట్లు బాగా ఇష్టం.
¤ పొద్దునే నిద్రలేవటం ఇబ్బంది.
9. సంభాషణా సౌందర్యం
బోర్డు పట్ల భయంతోనో, ఇతర కారణాల వల్లనో బోర్డు ఎంత ప్రోత్సహిస్తున్నా కొందరు చక్కగా మాట్లాడరు. ఫలితంగా తక్కువ మార్కులు రావచ్చు. బోర్డుపట్ల వినయం ప్రదర్శించటం, స్నేహపూర్వకంగా వ్యవహరించటం, సంభాషణలో గౌరవభావాలు ప్రదర్శితమయ్యే పదాలను అక్కడక్కడా వాడటం మంచిది. బోర్డు సభ్యులు పొడిపొడిగా మాట్లాడుతున్నా కలుపుకుంటూ మాట్లాడటం, ఏ భాషలోనైనా చక్కని పదాలు వాడటం, నవ్వుతూ సమాధానాలు ఇవ్వటం లాంటివి పాటించాలి.
10. పైకి కన్పించాలి
అభ్యర్థిలో మంచి లక్షణాలు అంతర్గతంగా వుంటేనే చాలదు. అవి పైకి కూడా కన్పించాలి. చక్కని దుస్తులు, శిరోజాలంకరణ లాంటి జాగ్రత్తలు ఆ కన్పించడంలో భాగమే. మీరు సాధించిన అవార్డులు/ రివార్డులు లాంటివి కూడా సందర్భోచితంగా ప్రదర్శించే మెలకువ ఉండాలి.
హావభావాలు
ఇంటర్వ్యూబోర్డులో బాడీ లాంగ్వేజ్‌ స్పెషలిస్టులు ఉండే అవకాశం లేదు. కానీ 'కొందర్ని చూస్తే మొట్టబుద్ధి వేస్తుంది. కొందర్ని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది' అనే సామెత ఉంది కదా? దానికి కారణం వారి స్వరూపం (అప్పియరెన్స్‌)తో పాటు, వారి శారీరక కదలికలే అని చెప్పవచ్చు.
మౌఖిక పరీక్ష జరుగుతున్నప్పుడు శారీరక కదలికలు జరుగుతూ ఉంటాయి. మాట్లాడే మాటలకు అనుగుణంగా కొన్నిసార్లు శరీరం కదలికలు లేకుండా వుంటే బాగుంటుంది. కొన్నిసార్లు కదలికలు వుంటే బాగుంటుంది. కొన్ని కదలికలు వృథా/ రుణాత్మకం; కొన్ని ధనాత్మకం. ఇలాంటి కదలికలు పెంచుకోవడం ద్వారా సానుకూల అభిప్రాయాన్ని బోర్డులో కలుగజేయవచ్చు.
¤ శరీరాన్ని నిటారుగా వుంచటం (బోర్డు ముందుకు నడుచుకుంటూ వచ్చేటప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు, వెళ్ళేటప్పుడు లాంటి సందర్భాల్లో)
¤ కాళ్ళు ముందుకు చాచకూడదు.
¤ 'X' ఆకారంలో కాళ్ళను పెట్టకూడదు.
¤ కాళ్ళను పైకీ, కిందకూ కదల్చకుండా ఉంచాలి.
¤ కూర్చున్న తరువాత కుర్చీలో ముందుకూ, వెనక్కీ జరగకుండా ఉండాలి.
¤ చేతులను పొందికగా తెచ్చుకున్న ఫైలు మీద ఉంచాలి.
¤ చిరునవ్వుతో ఇంటర్వ్యూ చివరి వరకూ కనిపించాలి.
¤ సభ్యులు అందర్నీ వీలైనప్పుడల్లా చూస్తుండాలి. ప్రశ్న అడిగిన సభ్యునివైపు ఎక్కువ చూస్తూ సమాధానం చెప్పాలి.
¤ నేలపైన, పక్క గోడలవైపు, ఆకారంవైపు చూడరాదు.
¤ Chest స్థాయిలో చేతుల్ని పైకి లేపి సందర్భోచితంగా కదుపుతూ ఉండాలి.

మౌఖికపరీక్షకు ధీమాగా

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ దశలు దాటి వచ్చినవారికి మౌఖిక పరీక్ష చాలా కీలకం. దీన్ని ఎలా ఎదుర్కోవాలో, సన్నద్ధం కావాలో వివరిస్తున్నారు మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల ఆర్డీవో సి. నారాయణరెడ్డి. (ఈయన 2009 గ్రూప్‌-1లో రాష్ట్రస్థాయి 2వ ర్యాంకు సాధించారు.)

READ MORE >>>

Top