Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home
RJC CETS - 2019 Notification

పైసా ఖర్చు లేకుండా ప్రామాణిక విద్య!

* తెలంగాణ/ఏపీ ఆర్‌జేసీ సెట్‌లు
పదోతరగతి పూర్తయింది.. మంచి మార్కులు వచ్చినా పైచదువులకు ఆర్థిక పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. భారీ ఫీజు, వసతి, ఇతర ఖర్చులు.. భరించడం కష్టం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థుల ఇబ్బందులు ఇవి. ఇందుకు ఒక పరిష్కారం ఉంది. ప్రభుత్వాలు ఇంటర్మీడియట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేసి కార్పొరేట్‌ తరహా విద్యను అందిస్తున్నాయి. వీటిలోని సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి. ఇందులో మెరిట్‌ సాధిస్తే పైసా ఖర్చు లేకుండా అత్యుత్తమ బోధన, వసతి, భోజనం, ఇంటర్‌ తర్వాత ఎంట్రన్స్‌లకు శిక్షణ అందిస్తారు. ఆర్‌జేసీ సెట్‌ల వివరాలు, సంసిద్ధమయ్యేందుకు సాయపడే మెలకువలు... ఇవిగో!

విద్యార్థుల్లో సహజ నైపుణ్యాలకు పదునుపెడుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి గురుకులాలు. ప్రతిభ ఉన్న విద్యార్థులను ప్రోత్సహించి, వారికి నాణ్యమైన విద్యను ఉచితంగా అందించి, తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా చేయడానికే ఈ కళాశాలలు ఏర్పడ్డాయి. ఇక్కడ ప్రతి ఒక్కరిపైనా ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. తరగతిలో పరిమిత సంఖ్యలో చేర్చుకోవడంతో ఈ తరహా పర్యవేక్షణకు వీలవుతుంది.

ఇంటర్‌ విద్యతో సమాంతరంగా ఐఐటీ ఎంట్రన్స్‌ జేఈఈ, ఎంసెట్‌, నీట్‌లకు శిక్షణ అందిస్తున్నారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే వీరి దినచర్య రాత్రి పది గంటలకు ముగుస్తుంది. అలాగని ఎలాంటి ఒత్తిడీ ఉండదు. ఎందుకంటే చదువుతోపాటు ఆటపాటలకూ ప్రాధాన్యమిస్తున్నారు. ప్రతిరోజూ వ్యాయామం తప్పనిసరి. విద్యార్థిని ఆల్‌ రౌండర్‌ నైపుణ్యంతో తీర్చిదిద్దడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. ప్రవేశపరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా సీట్లు కేటాయిస్తారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో ఇంటర్‌ విద్యను అందిస్తున్నారు. చదువుతోపాటు వసతి, భోజనం అన్నీ ఉచితమే. ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. నాణ్యతలో రాజీ లేకుండా కార్పొరేట్‌కు దీటుగా బోధన, సదుపాయాలు అందిస్తున్నారు.

పర్యవేక్షణ, ప్రత్యేక శ్రద్ధ
విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకోవడానికి లోకో పేరెంట్‌ విధానం ఉంటుంది. అంటే ప్రతి 15-20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తారు. వీరు మెంటర్‌గా వ్యవహరిస్తారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. అలాగే మెరిట్‌ విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం మరింత మెరుగైన తర్ఫీదునిస్తారు. ఈ రెండు కారణాలతో గురుకులాల్లో దాదాపు 98 శాతం ఇంటర్‌ ఉత్తీర్ణత నమోదవుతోంది. ఇక్కడి విద్యార్థులు టాప్‌-10లోపు ఆయా గ్రూపుల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారు. జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ల్లో సైతం పలువురు విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటున్నారు.

ఎవరు అర్హులు?
2019లో పదో తరగతి పరీక్షలు మొదటి ప్రయత్నంలో రాస్తున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో చదువుతోన్న విద్యార్థులు మాత్రమే అర్హులు. జనరల్‌ విద్యార్థులు 6 జీపీఏ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 5 జీపీఏ సాధించాలి.

ఏయే గ్రూప్‌లు?
* ఎంపీసీ
* బైపీసీ
* ఎంఈసీ
* సీఈసీ
* ఈఈసీ
* సీజీడీటీ

ప్రవేశ పరీక్ష ఇలా...
ఎంపీసీ గ్రూప్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. బైపీసీ గ్రూప్‌ దరఖాస్తులకు ఇంగ్లిష్‌, బయలాజికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. ఎంఈసీ గ్రూప్‌ కోరుకున్నవారికి ఇంగ్లిష్‌, సోషల్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో ప్రతి సబ్జెక్టుకూ 50 మార్కులు కేటాయించారు. ఆ సబ్జెక్టుల్లో ఆ రాష్ట్రానికి చెందిన పదో తరగతి సిలబస్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ విభాగం ప్రశ్నలు జనరల్‌ ఇంగ్లిష్‌కే చెందినవి ఉంటాయి.

సబ్జెక్టులవారీగా ...
ఇంగ్లిష్‌: ఈ విభాగంలోని ప్రశ్నలు పదో తరగతి స్థాయి నుంచే వస్తాయి. అయితే పాఠాల నుంచి ఎలాంటి ప్రశ్నలూ అడగరు. ఏదైనా పదానికి అర్థం గుర్తించమనడం, ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్షంలోకి అలాగే పరోక్షం నుంచి ప్రత్యక్షంలోకి మార్చమనడం, వాక్యంలోని ఖాళీను పూరించడం, రెండు వాక్యాలు ఇచ్చి వాటిని కలిపి రాయమనడం, ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యాన్ని గుర్తించమనడం, వాక్యానికి అర్థాన్ని గుర్తించడం, ఇచ్చిన పదాల్లో సరైన పదాన్ని గుర్తించడం, ప్యాసేజ్‌ ప్రశ్నలు...మొదలైనవి ఉంటాయి.
అభ్యర్థి ఆంగ్ల భాషను ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారో పరిశీలిస్తారు. వ్యాకరణంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించాలి. ఆర్టికల్స్‌, లెటర్‌ రైటింగ్‌ తదితరాలు తెలుసుకోవాలి. భాషాభాగాలను ప్రత్యేక శ్రద్ధతో చదవాలి. గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ప్రశ్నల తీరు, ఏయే విభాగాల నుంచి వస్తున్నాయో తెలుసుకుని సన్నద్ధం కావచ్చు. తెలుగు మీడియం విద్యార్థులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఆంగ్ల విభాగంలో ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.
భౌతిక రసాయన శాస్త్రాలు: ముందుగా భావనలపై పట్టు సాధించాలి. అనువర్తన, పరిశీలనాత్మక ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రయోగాంశాలకూ ప్రాధాన్యం ఉంటుంది. పదోతరగతిలోని అన్ని పాఠ్యాంశాల నుంచీ ప్రశ్నలు వస్తున్నాయి. భౌతిక, రసాయన శాస్త్రాల్ల్రోని అన్ని పాఠ్యాంశాలనూ సమ ప్రాధాన్యంతో చదువుకోవాలి. ముఖ్యమైన కాన్సెప్టులను రాసుకోవాలి. సమస్యలపైనా ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల సూత్రాలను గుర్తుంచుకుని, వాటిని ఉపయోగించే విధానం తెలుసుకోవాలి.
గణితం: అన్ని అధ్యాయాల నుంచీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి. ముఖ్యమైన సూత్రాలను రాసుకోవాలి. ఇచ్చిన ప్రశ్నకు ఏ సూత్రం అనువర్తించాలో తెలుసుకోవడానికి ముందస్తు సాధన అనివార్యం. గత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే...అన్ని అధ్యాయాల నుంచీ ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల సమ ప్రాధాన్యంతో చదువుకోవాలి. ఇచ్చిన సమయంలో ప్రశ్నలు సాధించడానికి పరీక్షకు ముందు మాదిరి ప్రశ్నల సాధనే కీలకం.
జీవశాస్త్రం: పటాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. పాఠ్యాంశాలను శ్రద్ధగా చదువుకుంటే సరిపోతుంది. ముఖ్యాంశాలు నోట్సు రాసుకోవాలి. గత టీఎస్‌ ఆర్‌జేసీ ప్రశ్నపత్రాన్ని పరిశీలిస్తే ట్రిప్సిన్‌ను విడుదల చేసే అవయవం, మానవునిలో లాలాజల గ్రంథుల సంఖ్య, రక్తం గడ్డకట్టడంలో తోడ్పడే విటమిన్‌...ఇలా ప్రాథమికాంశాల నుంచే నేరుగా ప్రశ్నలు వచ్చాయి. అందువల్ల ప్రతి వాక్యాన్నీ శ్రద్ధతో మననం చేస్తే జీవశాస్త్రంలో వీలైనన్ని ఎక్కువ మార్కులు సొంతమైనట్లే.
సాంఘిక శాస్త్రం: ప్రశ్నలన్నీ పదో తరగతి పుస్తకంలోనివే వస్తాయి. భూగోళశాస్త్రం, చరిత్ర, పౌర, అర్థశాస్త్రాలకు పరీక్షలో సమ ప్రాధాన్యం కల్పిస్తున్నారు. అందువల్ల ఈ నాలుగు విభాగాలనూ క్షుణ్ణంగా చదవాల్సిందే. గత పరీక్షలను పరిశీలిస్తే...రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించిన ఆర్టికల్‌, తలసరి ఆదాయం కనుక్కోవడానికి ఉపయోగించే సూత్రం, చిప్కో ఉద్యమంతో సంబంధం ఉన్న రాష్ట్రం, మహానది జన్మస్థలం...ఇలా ప్రశ్నలు నేరుగా అడిగారు. అయితే వీటిని గుర్తుంచుకోవడమే కీలకం. అందువల్ల కంఠతా పట్టకుండా ప్రతి పాఠ్యాంశాన్నీ వీలైనన్ని ఎక్కువసార్లు చదువుకోవాలి. ప్రతి ప్రశ్నకూ ఒక నిమిషం సమయం ఉంటుంది. ఎంపీసీ విభాగంలో పరీక్ష రాస్తున్నవారికి గణితంలో కొంచెం సమయం అవసరం కావచ్చు. వీరు మిగిలిన రెండు విభాగాలూ తక్కువ వ్యవధిలో ముగించి, గణితానికి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి.

* ఏపీఆర్‌జేసీ సెట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ గురుకుల జూనియర్‌ కళాశాలల్లోని 1080 సీట్లతోపాటు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్‌ బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లోని (మొత్తం 13) 2,000 సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. రెండు విభాగాలకు ఒకే పరీక్ష జరుగుతుంది. అధికారిక ప్రకటన మార్చి 13న వెలువడుతుంది.
* ఒకేషనల్‌ కోర్సులైన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌ - ఈఈటీ (30 సీట్లు), కమర్షియల్‌ గార్మెట్‌ డిజైన్‌ టెక్నీషియన్‌ - సీజీడీటీ (30 సీట్లు) గ్రూప్‌లను ఏపీలోని నిమ్మకూరు కళాశాలలో మాత్రమే అందిస్తున్నారు.
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈసీ, సీజీడీటీ గ్రూపుల్లో ఇంటర్‌ విద్యను అందిస్తున్నారు. చదువుతోపాటు వసతి, భోజనం అన్నీ ఉచితమే. ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇంటర్‌ విద్యతో సమాంతరంగా ఐఐటీ ఎంట్రన్స్‌ జేఈఈ, ఎంసెట్‌, నీట్‌లకు శిక్షణ అందిస్తున్నారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే వీరి దినచర్య రాత్రి పది గంటలకు ముగుస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలు - 07
బాలురు - 04
బాలికలు - 02
కో-ఎడ్యుకేషన్‌ - 01
మొత్తం సీట్లు - 1,080

తెలంగాణలో కళాశాలలు - 35
బాలురు - 15
బాలికలు - 20
మొత్తం సీట్లు - 3,000

Posted on 12-03-2019


APRJC - 2019 Info.
TSRJC - 2019 Info.
Study Material
  • Mathematics               E.M       T.M
  • Physical Science          E.M       T.M
  • Biology                         E.M       T.M
  • English
  • Social Studies               E.M       T.M