తాజా స‌మాచారం

టెట్‌ మార్కులపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు ‌

* సహాయ కేంద్రాన్ని ఎత్తివేసిన పాఠశాల విద్యాశాఖ
* పరిష్కార వేదికకు అభ్యర్థుల ఫోన్లు

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) తుది ‘కీ’ ప్రకారం తమకు ఎక్కువ మార్కులు రావాల్సి ఉండగా.. తక్కువ వచ్చాయంటూ అభ్యర్థుల నుంచి పాఠశాల విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు గతంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సైతం ఎత్తివేయడంతో ప్రభుత్వ పరిష్కార వేదిక (1100)కు ఫోన్‌లు చేస్తున్నారు. ఈ ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై అధికారులు ఇంతవరకు నిర్ణయాన్ని వెల్లడించలేదు. పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తమ సమస్యలను పరిష్కరించాలని అభ్యర్థులు కోరుతున్నారు. విశాఖపట్నం జిల్లా మునగపాక మండలంలోని ఒకే కోచింగ్‌ కేంద్రానికి చెందిన 26మంది ఇదే సమస్యపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తుది ‘కీ’లో పేర్కొన్న జవాబుల ప్రకారం మార్కులు ఇస్తే తమకు ఎక్కువ రావాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. త్వరలోనే ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించనున్నందున టెట్‌ మార్కులు కీలకంగా మారాయి.
రెండు పర్యాయాలు గాలికి..
టెట్‌ను ఏటా రెండు పర్యాయాలు నిర్వహించాలని జాతీయ ఉపాధ్యాయ విద్య సంస్థ (ఎన్‌సీటీఈ) ఆదేశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నవ్యాంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లల్లో ఒక్కసారి మాత్రమే టెట్‌ను నిర్వహించారు. 2014లో టెట్‌, ఉపాధ్యాయ నియామక పరీక్షను కలిపి నిర్వహించారు. ఆ సమయంలో పరీక్ష రాసిన వారికి ఏడాది పాటు మాత్రమే టెట్‌ చెల్లుబాటు ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఒకసారి టెట్‌ అర్హత సాధిస్తే ఏడేళ్లపాటు చెల్లుబాటు అవుతుంది. ఉపాధ్యాయ నియామకం సమయంలోనే టెట్‌ నిర్వహించడంతో అభ్యర్థులు ఒకేసారి రెండు పరీక్షలకు సన్నద్ధం కావాల్సి వస్తోంది. టెట్‌లో అర్హత సాధించలేని అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.


Posting on 22.03.2018