తాజా స‌మాచారం

టెట్‌ అభ్యర్థుల్లో గందరగోళం

ముసునూరు, న్యూస్‌టుడే: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఈ పరీక్షను తొలుత ఫిబ్రవరి 7 నుంచి నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. ఇటీవల పలు మార్పుచేర్పులు చేయడంతో షెడ్యూల్‌ ప్రకారం పరీక్ష జరుగుతుందా? లేదా? అనే సందేహం నెలకొంది. పండిట్లకు నిర్వహించే పరీక్ష పేపరును మారుస్తున్నట్లు పేపరు-3ని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టారు. దీనికి పాఠ్యప్రణాళిక పూర్తిగా ప్రకటించలేదు. గతంలో పేపరు-2కు దరఖాస్తు చేసిన వారు ఇప్పుడు పేపరు-3కి మార్చుకోవాలా? లేదా దానంతట అదే మారుతుందా? అనే సందేహం అభ్యర్థుల్లో ఉంది. మరోవైపు కొందరికి పేపరు మార్చుకోవాలంటూ చరవాణులకు సంక్షిప్త సందేశాలు వస్తున్నాయి. మారిన విధానం ప్రకారం పండిట్లకు (ముఖ్యంగా తెలుగు, హిందీ భాషలకు) టెట్‌ 150 మార్కుల్లో పరీక్ష ఉంటుంది. మనస్తత్వ శాస్త్రం (సైకాలజీ), ఆంగ్లానికి 60మార్కులు పోను 90మార్కులకు భాషాసబ్జెక్టే ఉంటుందా? లేదా 30మార్కులకు సోషల్‌ ఉంటుందా? అనే అయోమయానికి గురవుతున్నారు. తెలుగుకు మొదటి ప్రాధాన్యమిచ్చి రెండో సబ్జెక్టుగా డీఎస్సీలో సోషల్‌ అసిస్టెంట్‌ కూడా రాయాలనుకునే వారు మరోమారు దరఖాస్తు చేయాలా? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ విద్యా సంవత్సరంలో బీఈడీ, డీఎడ్‌ విద్యార్థులకు టెట్‌ రాయడానికి అవకాశం ఇచ్చింది. సమయం సరిపోతుందా? పెంచే సూచనలున్నాయా? పరీక్ష ఆన్‌లైన్‌లోనా? ఆఫ్‌లైన్‌లోనా? అనే ప్రశ్నలు సైతం ఉదయిస్తున్నాయి. వీటిపై వెబ్‌సైట్లలో వస్తున్న విభిన్న ప్రచారాలతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. విద్యాశాఖ అధికారులు వీటిపై స్పష్టతనివ్వాల్సి ఉంది.

Posting on 17.01.2018