close

తాజా స‌మాచారం

టెట్‌లో పొరపాట్లపై ఫిర్యాదులు

ఈనాడు - అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)లో పరీక్షా కేంద్రాలు, సమయం, సబ్జెక్టుల మార్పుల్లో అధికారులు చేస్తున్న తప్పిదాలు అభ్యర్థులను నానా ఇబ్బందులకూ గురిచేస్తున్నాయి. అభ్యర్థులు ఒక పేపర్‌కు దరఖాస్తు చేస్తే హాల్‌టిక్కెట్‌లో మరొక పేపర్‌ను పేర్కొనడంతో ఫిర్యాదు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు తరలివస్తున్నారు.
* విశాఖ జిల్లాకు చెందిన వెంకటలక్ష్మి, పరమేశ్వరరావు పేపర్‌-2కు దరఖాస్తు చేయగా హాల్‌టిక్కెట్‌లో పేపర్‌-3 తెలుగుభాషగా పేర్కొన్నారు. పేపర్లను మార్చుకోకపోయినా తప్పుగా ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సరిచేస్తామని హామీ ఇచ్చారు.
* కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన మయూరి అనే నిండు గర్భిణికి కృష్ణాజిల్లాలో కేంద్రం ఇచ్చారని, దాన్ని మార్చాలంటూ ఆమె భర్త అధికారులకు విన్నవించారు.
* అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రెండు పేపర్లు రాస్తున్నట్లు పేర్కొంటేనే గుర్తించేలా ప్రైవేటు సంస్థ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. అభ్యర్థులు ఏ పేపర్‌కు ఆ పేపర్‌ వేర్వేరుగా దరఖాస్తు చేస్తే అది అభ్యర్థులు 2పేపర్లు రాస్తున్నట్లు గుర్తించడం లేదు. దీంతో ఒక అభ్యర్థి పేపర్‌-1, పేపర్‌-2 రాస్తుంటే ఒకే సమయంలో పరీక్ష నిర్వహణ.. లేదంటే ఒకే రోజు ఒక పేపర్‌కు రాయలసీమలో.. మరో పేపర్‌కు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కేంద్రం కేటాయిస్తున్నారు. ఫలితంగా అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. కొందరు అభ్యర్థులు పేపర్‌-2 సాంఘిక, గణిత, సామాన్య శాస్త్రాలకు దరఖాస్తు చేయగా.. హాల్‌టిక్కెట్లలో భాషాపండితుల పరీక్షకు దరఖాస్తు చేసినట్లు వస్తోంది. హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్‌లో ఒకరోజు జాప్యం, అభ్యర్థుల అనుమతి లేకుండా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లో పరీక్షాకేంద్రాల కేటాయింపు, రాష్ట్రంలోనే ఒక మూల నుంచి మరో మూలకు, పరీక్ష రాయాల్సిన సబ్జెక్టులు మారిపోవడం ఇలా టెట్‌ పరీక్ష.. అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఫిబ్రవ‌రి 21 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇప్పటికీ సమస్యలు తీరలేదు.

Posting on 20.02.2018