close

కథనాలు

టెట్... పోటీ పెరుగుతోంది!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (ఏపీ టెట్-2017) ప్రకటనను విడుదల చేసింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ)లో 20 శాతం వెయిటేజీ ఇస్తున్న నేపథ్యంలో టెట్ స్కోరుకు ప్రాధాన్యం పెరిగింది. ఈ పరీక్షకు పోటీ పెరగటం, ఆన్‌లైన్‌లో నిర్వహించబోవటం...తాజా మార్పులు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయ కొలువుకు మార్గం సుగమం చేసే టెట్‌లో మెరిసేందుకు... ఇవిగో- విలువైన సూచనలు!
ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ స్కోరును 7 సంవత్సరాల పాటు పరిగణనలోకి తీసుకుంటారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరగా 2014 మార్చిలో టెట్ నిర్వహించారు. పాత, ప్రస్తుత డీఈడీ, బీఈడీ అభ్యర్థులు చేరడంతో తాజా టెట్‌కు పోటీ అధికంగా ఉండబోతోంది. నవ్యాంధ్రప్రదేశ్‌లో మొదటి ఉపాధ్యాయ నియామక పరీక్షను టెట్‌తో కలిపి నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ విడిగా నిర్వహించనుంది. అలాగే ఈసారి పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయించారు.
1-5 తరగతుల బోధనకు పేపర్-1; 6-8 తరగతుల బోధనకు పేపర్-2లో అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఎలా సన్నద్ధం కావాలి?
సిలబస్ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. పేపర్ 1 రాసే అభ్యర్థులు శిశువికాసం, పెడగాజీ కోసం డీఎడ్ తెలుగు అకాడమీ పుస్తకాలతోపాటు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. ఇంటర్నెట్, ప్రామాణిక మెటీరియల్‌ను అనుసరిస్తే పోటీలో ముందుంటాం. చదివేటప్పుడు బిట్ల రూపంలో కాకుండా పాఠ్యాంశం మొత్తాన్ని విశ్లేషించుకుంటూ సాగాలి.
* గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేయాలి. ఒక్కో చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో పరిశీలించాలి. అందుకు అనుగుణంగా మనం చదవబోయే సిలబస్ అంశాలను విభజించుకోవాలి. ఆయా అంశాల ప్రాధాన్యాల ప్రకారం సమయం కేటాయించుకోవాలి.
వాస్తవానికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఆర్‌టీ)లో కంటే టెట్‌లోనే కొంచెం క్లిష్టమైన ప్రశ్నలను అడుగుతున్నారు. జ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలే కాకుండా అవగాహన, అనుప్రయుక్తం, తరగతి గది అన్వయం, నైపుణ్యాలను పరీక్షించే విధంగా ప్రశ్నలను సంధిస్తున్నారు.
* శిశువికాసంలో ప్రధానంగా శిశు వికాసం, వైయక్తిక భేదాలు, వైఖరులు, అభిరుచులు, ప్రజ్ఞ, మూర్తిమత్వ వికాసం, రక్షక తంత్రాలు... అలాగే అభ్యసనం అధ్యాయంలో అభ్యసన సిద్ధాంతాలు, ప్రేరణ, స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక పెడగాజీ విభాగంలో ప్రత్యేక అవసరాల పిల్లలు- సహిత విద్య, వైయక్తిక- సామూహిక అభ్యసనం- స్వయం అభ్యసన, బోధనలోని దశలు- అభ్యసన వనరులు- మార్గదర్శకత్వం- మంత్రణం, సీసీఈ, ఎన్‌సీఎఫ్-2005, ఆర్‌టీఈ-2009 అంశాలను చేర్చారు.
* తెలుగు సబ్జెక్టులో పఠనావగాహన, తెలుగు సాహిత్యం, సంస్కృతి, భాషాంశాలు అధ్యయనం చేయాలి. బోధనా పద్ధతుల్లో తెలుగు అకాడమీ పుస్తకాలను అనుసరించడం ఉత్తమం.
* ఇంగ్లిష్‌కు సంబంధించి 10వ తరగతి స్థాయిలోని వ్యాకరణంపై పూర్తి అవగాహన అవసరం. ఎక్కువగా మాదిరి ప్రశ్నపత్రాలు సాధన చేసి, విషయంపై సమగ్ర అవగాహన పొందాలి.
* గణితంలో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు (ఇంటరులో బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ చదివినవారు) ఆందోళన చెందాల్సిన పనిలేదు. 10వ తరగతి వరకు వారు గతంలో చదివినవే కాబట్టి ప్రాథమికాంశాలను పునశ్చరణ చేసినట్లు భావిస్తే, మంచి మార్కులు సాధించవచ్చు.
* పరిసరాల విజ్ఞానానికి సంబంధించిన అంశాల కోసం ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేయాలి. తరగతి గది పరిస్థితులకూ, నిత్యజీవిత అంశాలకూ అన్వయించుకుని తయారవ్వాలి.
* మెథడాలజీ అంశాల విషయంలో గణితం, పరిసరాల విజ్ఞానాల మధ్య సారూప్యం ఉంటుంది. ఆయా సబ్జెక్టుల్లోని ఉమ్మడి అంశాలను గమనించి సన్నద్ధత కొనసాగిస్తే సమయం ఆదా అవుతుంది.
పునశ్చరణకు పనికొచ్చే నోట్సు
* ప్రాథమికాంశాలపై పూర్తి పట్టు సాధించాలి.
* గత ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రధానాంశాలపై దృష్టి సారించాలి. కచ్చితంగా వస్తుందన్న అంశాన్ని స్పష్టంగా, విశ్లేషణాత్మకంగా నేర్చుకోవాలి.
* సబ్జెక్టుపై ఆసక్తితో.. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సన్నద్ధతను విరమించకుండా ప్రేరణతో కొనసాగించాలి.
* తెలిసిన విషయాలతో తెలియని అంశాలను సమన్వయం చేసుకుంటూ అధ్యయనం చేయడం మంచిది.
* అభ్యసన సమయంలోనే నోట్సు రాసుకోవడం ఉత్తమం. పునశ్చరణకు ఇది ఉపకరిస్తుంది.
* మాదిరి ప్రశ్నలు సాధన చేసిన తర్వాత సవరణాత్మక అభ్యసనం కొనసాగించాలి.

- డాక్ట‌ర్ వి. బ్ర‌హ్మం

Posting on 18.12.2017