close

కథనాలు

టెట్‌లో మెరిసేదెట్లా?

ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్‌) ప్రకటన విడుదలయింది. ఆగస్టులో డీఎస్‌సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాల నియామక పరీక్ష నిర్వహిస్తారనే సమాచారం మూలంగా సహజంగానే ఈ టెట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల డీఈడీ, బీఈడీ పండిట్‌, పీఈటీ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించినవారికీ, త్వరలో కోర్సు పూర్తిచేసేవారికీ ఇదో సువర్ణావకాశం. ఏపీ టెట్‌ సర్టిఫికెట్‌.. పరీక్ష జరిగిన తేదీ నుంచి 7 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుంది. ఇప్పటికే టెట్‌ ఉత్తీర్ణత సాధించినవారు తమ స్కోరును మెరుగుపరచుకోవడానికి ఇదో అవకాశం!
కంటెంట్‌పై పూర్తిస్థాయి పట్టు అవసరం. మేథమేటిక్స్‌ను కళాశాల స్థాయిలో అధ్యయనం చేసినవారు బయాలజీకీ; బయాలజీని కళాశాల స్థాయిలో చదివినవారు మ్యాథ్స్‌కూ తగినంత సమయాన్ని కేటాయించి, సబ్జెక్టుపై పట్టు సాధించాలి. విషయ సామర్థ్యాన్ని, గ్రహణశక్తిని పెంచుకుని, ప్రాథమిక భావనలపై వివిధ కోణాల్లో సన్నద్ధత సాగించాలి. అకాడమీ పుస్తకాల్లోని అంశాలను విశ్లేషణాత్మకంగా అభ్యసించి సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలి.
అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులో తమ బలాలు, బలహీనతలు అంచనా వేసుకొని తదనుగుణంగా సన్నద్ధత సాగించాలి. కంటెంట్‌కు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌- పెడగాజీ, ఆయా మెథడాలజీ సబ్జెక్టుల అధ్యయనానికి తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి. అదనపు సమాచారానికి రిఫరెన్స్‌ పుస్తకాలు అనుసరించాలి.
ఆన్‌లైన్‌ పరీక్షల సాధన
* కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కాబట్టి కొత్తగా రాసేవారు ఆన్‌లైన్‌ పరీక్షలను సాధన చేయడం తప్పనిసరి. ‌
* ఆన్‌లైన్‌ పరీక్షకు సంబంధించి అన్ని రకాల సూచనలను పరీక్ష హాలులో పర్యవేక్షకులు అందిస్తారు. ఒత్తిడి లేకుండా, కష్టతరమైన ప్రశ్నలకు ఎలిమినేషన్‌ పద్ధతి ఉపయోగించి అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయొచ్చు (మైనస్‌ మార్కులు లేవు కాబట్టి). మంచి స్కోరు సాధించి, విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.
* తక్కువ సమయంలో పూర్తి చేయగల చాప్టర్లకు అధిక ప్రాధాన్యమిస్తే, ఎక్కువ మార్కులు పొందవచ్చు. ఉదాహరణకు- శిశువికాసం- అభివృద్ధి విభాగంలో పెరుగుదల- వికాసం, వైయక్తిక భేదాలు- ప్రజ్ఞ, మూర్తిమత్వ వికాసం, అభ్యసనం. వీటిలో ప్రతి విభాగం నుంచి సగటున 5 ప్రశ్నల చొప్పున 20 నుంచి 22 ప్రశ్నలు అడుగుతుండటాన్ని గత పరీక్షల్లో గమనించవచ్చు. మిగిలిన అధ్యాయాల నుంచి 1 లేదా 2 ప్రశ్నల చొప్పున సగటున ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ప్రశ్నల వెయిటేజీకి అనుగుణంగా సమయం కేటాయించడమే విజయానికి దారి. ‌
* ఎంతసేపు చదివారన్నదానికంటే ఎన్ని ప్రధానాంశాలను నేర్చుకున్నారన్నదే పరీక్షలో ఉత్తమ ఫలితాల సాధనకు కీలకం.
* ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి గ్రామీణ ప్రాంత అభ్యర్థులు, తెలుగు మీడియంలో విద్యను అభ్యసించినవారు ప్రత్యేక శ్రద్ధవహించాలి. తగిన సమయాన్ని కేటాయించి, మెరుగైన స్కోరు సాధించే దిశగా ప్రయత్నాలు చేయాలి.
* గణితేతర అభ్యర్థులు మేథమేటిక్స్‌లో మంచి మార్కులు సాధించడానికి షార్ట్‌నోట్స్‌, సూత్రాలు, టెక్నిక్స్‌ నేర్చుకోవాలి.
మౌలిక అంశాలే ముఖ్యం
* ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన సిలబస్‌ను పరిశీలించి, అవగాహన చేసుకోవాలి.
* మౌలిక అంశాలకూ, ప్రాథమిక భావనలకూ ప్రాధాన్యమిస్తూ అభ్యసించాలి.
* గత ప్రశ్నపత్రాలను విశ్లేషణ చేసుకొని, ఏ అంశాలకు ప్రాధాన్యముందో స్పష్టత ఏర్పరచుకోవాలి.
* నిర్ణీత కాలంలో సిలబస్‌ పూర్తి అధ్యయనానికి చక్కని ప్రణాళిక సిద్ధం చేసుకొని, సన్నద్ధత ప్రారంభించాలి.
* తెలుగు అకాడమీ డీఈడీ, బీఈడీ పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని, టెట్‌లో నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం అంశాలు, భావనలను అవగాహనతో అభ్యసించాలి. పరీక్షకు తక్కువ సమయం ఉన్నందున ప్రధాన అంశాలను మాత్రమే సాధన చేయవలసి ఉంటుంది.
* పునశ్చరణ చాలా అవసరం. చదివిన అంశాలను పునశ్చరణ చేస్తే మంచి స్కోరుకు అవకాశం వుంది.
* సమయం తక్కువ ఉన్నందున పరీక్ష దృష్ట్యా ముఖ్య అంశాలనే అభ్యసించి, అభ్యాసం చేస్తూ స్కోరును మెరుగు పరచుకోవచ్చు.

- డాక్ట‌ర్ వి.బ్ర‌హ్మం

Posting on 14.05.2018