నోటిఫికేషన్

అప్పిచ్చి.. చదివించి.. కొలువిచ్చి!

* బీవోబీ నుంచి 600 పీవోలు
పీజీ సర్టిఫికెట్‌ కోర్సుకి ఎంపిక చేసుకొని... దాన్ని పూర్తిచేయడానికి రుణం ఇచ్చి... ఆ తర్వాత ఉన్నత ఉద్యోగంలోకి తీసుకుంటాం అంటోంది బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా. ఆరొందల పీవో పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో అభ్యర్థులను మొదట కోర్సులోకి తీసుకుంటుంది. విజయవంతంగా ఉద్యోగంలో చేరి రుణం తిరిగి చెల్లించినవారికి అయిదేళ్ల తర్వాత ఆ మొత్తాన్ని లాయల్టీ బోనస్‌గా వెనక్కి ఇచ్చేస్తుంది.

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 600 పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వీటికి ఎంపికైనవారు ముందుగా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌లో పీజీ సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేయాలి. ఆ తర్వాత స్కేల్‌ ఆఫీసర్‌ హోదాతో ఉద్యోగం లభిస్తుంది. ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌ పరీక్షలు, సైకోమెట్రిక్‌ అసెస్‌మెంట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సిలబస్‌ అంతా ఐబీపీఎస్‌ పీవో పరీక్షల మాదిరిగానే ఉంటుంది. పరీక్షలో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌లకు ప్రాధాన్యం కల్పించారు. తర్వాతి స్థానం క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌దే. ఈ రెండు విభాగాల్లో ఎక్కువ స్కోర్‌ సాధించినవాళ్లు లక్ష్యాన్ని అందుకోవడం తేలికవుతుంది. తాజా గ్రాడ్యుయేట్లు ఈ పోస్టుల కోసం ప్రయత్నించవచ్చు.
ఆన్‌లైన్‌ పరీక్ష
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో 75 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి. జనరల్‌ ఎకానమీ, బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలు వస్తాయి. వీటికి 40 మార్కులు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 50 మార్కులకు 40 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలకు 35 మార్కులు. మొత్తం 165 ప్రశ్నలతో 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. దీంతోపాటు మరో యాభై మార్కులకు ఇంగ్లిష్‌లో డిస్క్రిప్టివ్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షకు 30 నిమిషాలు కేటాయించారు. లెటర్‌ రైటింగ్‌, ఎస్సేల నుంచి ఒక్కో ప్రశ్న చొప్పున వస్తాయి. అభ్యర్థులు ఆంగ్లంలో ఏ మేరకు రాయగలుగుతున్నారో పరిశీలిస్తారు. ఆబ్జెక్టివ్‌ పరీక్షలో అర్హత సాధిస్తేనే డిస్క్రిప్టివ్‌ ప్రశ్నపత్రం మూల్యాంకనం చేస్తారు.
అర్హత సాధించాలంటే
ప్రతి విభాగంలోనూ సెక్షనల్‌ కటాఫ్‌ కంటే ఎక్కువ మార్కులు రావాలి. పరీక్ష రాసిన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ కటాఫ్‌ మార్కులను బరోడా బ్యాంకు నిర్ణయిస్తుంది. అలాగే మొత్తం అన్ని విభాగాల్లోనూ కలిపి నిర్ణయించిన కటాఫ్‌ మార్కులనూ సాధించాలి. ఇలా సాధించినవారి డిస్క్రిప్టివ్‌ పేపర్‌ను మూల్యాంకనం చేస్తారు. ఇందులోనూ అర్హత సాధించడం తప్పనిసరి. ఇలా అర్హత సాధించినవారి జాబితా నుంచి ప్రతి కేటగిరీలోనూ ఉన్న ఖాళీలకు నాలుగు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను తర్వాతి దశ అయిన గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, సైకో మెట్రిక్‌ టెస్టుకు ఎంపికచేస్తారు. గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లోనూ కనీస అర్హత మార్కులు పొందితేనే తుది నియామకాలకు పరిగణనలోకి తీసుకుంటారు.
తుది నియామకం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష (ఆబ్జెక్టివ్‌+డిస్క్రిప్టివ్‌), బృందచర్చ, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. సైకోమెట్రిక్‌ పరీక్షలో అర్హత సాధిస్తే సరిపోతుంది.
పీజీ సర్టిఫికెట్‌ కోర్సు
కోర్సుకు ఎంపికైనవాళ్లు బోధన, భోజనం, వసతి అన్నింటికీ కలిపి రూ.3.45 లక్షలు ఫీజుగా చెల్లించాలి. ఈ ఫీజును 8 శాతం వడ్డీకి అందించేలా బరోడా బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తుంది. పీవోగా విధుల్లో చేరిన తర్వాత 84 నెలల్లో (ఈఎంఐ విధానం) రుణాన్ని చెల్లించవచ్చు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో అయిదేళ్లు పూర్తిచేసుకున్న వారికి లాయల్టీ బోనస్‌గా ఈ ఫీజు మొత్తం (రూ.3.45 లక్షలు) తిరిగి చెల్లిస్తారు. కోర్సు వ్యవధి 9 నెలలు. మణిపాల్‌ క్యాంపస్‌ బెంగళూరులో తరగతులు నిర్వహిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న వారికి మణిపాల్‌ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేట్‌ సర్టిఫికెట్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ డిగ్రీని ప్రదానం చేస్తుంది. అవసరం అనుకుంటే ల్యాప్‌టాప్‌ కోసం అదనంగా రూ.35,000 వరకు లోన్‌ సౌకర్యం కల్పిస్తారు.
ఖాళీలు, అర్హతలు
మొత్తం ఖాళీలు: 600
వర్గాలవారీ ఖాళీల వివరాలు: ఎస్సీ 90, ఎస్టీ 45, ఓబీసీ 162, జనరల్‌ 303. ప్రతి విభాగంలోనూ 4 శాతం ఖాళీలను దివ్యాంగులకు కేటాయించారు.
విద్యార్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు) జులై 2, 2018 నాటికి డిగ్రీ పూర్తిచేసినవాళ్లే అర్హులు.
వయసు: జులై 2, 2018 నాటికి 20-28 ఏళ్లలోపు ఉండాలి. జులై 3, 1990 కంటే ముందు; జులై 2, 1998 తర్వాత జన్మించినవాళ్లు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు ఉన్నాయి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు: జులై 2
హాల్‌ టికెట్ల లభ్యం: జులై 18 నుంచి
ఆన్‌లైన్‌ పరీక్ష: జులై 28
పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100; మిగిలిన అందరు అభ్యర్థులకు రూ.600
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌.
ఏ విభాగానికి ఎంత ప్రాధాన్యం?
రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒకటిన్నర మార్కు కేటాయించారు కాబట్టి ఈ విభాగంపై ఎక్కువ దృష్టి సారించాలి. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ ప్రశ్నలకు సూత్రాలు, ఎలాంటి గణన ప్రక్రియ అవసరం లేదు. జవాబు తెలిస్తే వెంటనే గుర్తించడం సాధ్యమవుతుంది. వీటిని వీలైనంత తక్కువ సమయంలో ముగించుకుని మిగిలిన సమయాన్ని రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లకు కేటాయించాలి. క్యూఏలో ప్రతి ప్రశ్నకు ఒకటింపావు మార్కు ఉంటుంది. అయితే ఈ విభాగంలో జవాబు గుర్తించడానికి ఎక్కువ సమయం పట్టే కొన్ని ప్రశ్నలను చివర్లో సాధించాలి. రుణాత్మక మార్కులు ఉన్నాయి కాబట్టి తెలియని ప్రశ్నలను పూర్తిగా వదిలేయాలి. తర్వాత దశకు చేరుకోవాలంటే ప్రతి సెక్షన్‌లోనూ యాభై శాతం ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగేలా ఉండాలి. మొత్తం మీద అరవై శాతం మార్కులు సాధించినవారు విజేతలు కావడానికి అవకాశాలు ఉంటాయి. వీలైనంత వరకు అన్ని అంశాలనూ క్షుణ్ణంగా చదవాలి. రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు ఎక్కువ సాధన చేయడం ద్వారా వేగం పెరుగుతుంది. పరీక్షకు పదిహేను రోజుల ముందు నుంచి రోజుకు కనీసం ఒక మాక్‌ టెస్టు రాయాలి. ఐబీపీఎస్‌ పీవో పాత ప్రశ్నపత్రాలు పరిశీలిస్తే ప్రశ్నల సరళిపై కొంత అవగాహన పెరుగుతుంది.
విధుల్లో చేరిన తర్వాత!
విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్న అభ్యర్థులు మూడు నెలలపాటు ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌లో కొనసాగుతారు. అనంతరం జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ (స్కేల్‌-1 ఆఫీసర్‌) హోదా కేటాయిస్తారు. ఈ సమయంలో రూ.23,700 మూలవేతనంగా చెల్లిస్తారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏతోపాటు పలు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అన్ని రకాల ప్రోత్సాహకాలు కలిపి ముంబై లాంటి నగరాల్లో రూ.8 లక్షల వార్షిక వేతనాన్ని అందుకోవచ్చు. ఉద్యోగంలోకి చేరిన తర్వాత కనీసం మూడేళ్లపాటు విధుల్లో కొనసాగడం తప్పనిసరి. గడువులోగా వైదొలిగితే వడ్డీతోసహా చెల్లించాల్సిన ఫీజు బకాయి, శిక్షణ ఖర్చుల నిమిత్తం మరో లక్ష వసూలు చేస్తారు. మూడేళ్ల అనంతరం వైదొలిగితే ఫీజు బకాయి చెల్లిస్తే సరిపోతుంది. స్కేల్‌ -1 ఆఫీసర్‌గా విధుల్లో చేరినవాళ్లు ప్రతిభ, సీనియారిటీ ప్రాతిపదికన మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, చీఫ్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, జనరల్‌ మేనేజర్‌, ఆపై హోదాలకు చేరుకుంటారు.

Posted on 19-06-2018

Bank of Baroda POs Info.

 • Notification
 • Apply Online
 • Website • Online Exams

 • Grand Test - 3
 • Grand Test - 2
 • Grand Test - 1

 • Model Papers

 • Model Paper - 3
 • Model Paper - 2
 • Model Paper - 1


 • Previous Papers

 • BOB PO (PGDBF) Question Paper - 2017
 • BOB PO (Scale - 1) Question Paper - 2015