BITSAT

బిట్స్‌లో పాగా!

* బిట్‌శాట్‌-2019

ఇంజినీరింగ్‌ విద్యకు పేరొందిన బిర్లా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘బిట్‌శాట్‌’ ప్రకటన వెలువడింది. ఈ పరీక్షతో బీఈ, బీఫార్మసీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో ప్రవేశాలు లభిస్తాయి.
బిట్స్‌లో సీటు తెచ్చుకోవాలంటే బిట్‌శాట్‌లో గరిష్ఠంగా మార్కులు తెచ్చుకోవాలి. ఈ ప్రశ్నల స్థాయి ఎంసెట్‌ కంటే కొంచెం ఎక్కువగా, జేఈఈ మెయిన్స్‌ కంటే కాస్త తక్కువగా ఉంటుంది. అందువల్ల జేఈఈ మెయిన్స్‌ సన్నద్ధతతో బిట్‌శాట్‌ ఎదుర్కోవడం ఇబ్బందేమీ కాదు. మెయిన్స్‌లో మెరవలేనివారికి బిట్‌శాట్‌ మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు.
బిట్‌శాట్‌ కోసం పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమికాంశాలు, భావనలు బాగా చదువుకోవాలి. 11, 12 తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలకే పరిమితమైతే సరిపోతుంది. ప్రశ్నపత్రాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలంటే మాక్‌ పరీక్షల సాధన చేయాలి. పరీక్షకు ముందు కనీసం పది టెస్టులైనా రాసేలా ప్రణాళిక వేసుకోవాలి.

బీఈ: కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌, మెకానికల్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, బయోటెక్నాలజీ విభాగాలున్నాయి. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీలతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తుకు అర్హులు..
బీఫార్మసీ: ఎంపీసీ లేదా బైపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణత ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఈ, బీఫార్మసీ రెండు కోర్సులకూ ఇంటర్‌లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. సంబంధిత సబ్జెక్టుల్లోనూ విడిగా 60 శాతం మార్కులు ఉండాలి. 2019లో పరీక్షలు రాస్తున్నవాళ్లు, 2018లో ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు.
ఎమ్మెస్సీ: బయలాజికల్‌ సైన్సెస్‌, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, జనరల్‌ స్టడీస్‌.

పరీక్షలో 4 విభాగాలుంటాయి.
పార్ట్‌ 1 ఫిజిక్స్‌ 40 ప్రశ్నలు, పార్ట్‌ 2 కెమిస్ట్రీ 40 ప్రశ్నలు,
పార్ట్‌ 3 ఎ. ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 15 ప్రశ్నలు, బి. లాజికల్‌ రీజనింగ్‌ 10 ప్రశ్నలు, పార్ట్‌ 4 మ్యాథ్స్‌ / బయాలజీ (బీఫార్మసీ కోసం) 45 ప్రశ్నలు. మొత్తం 150 ప్రశ్నలు.
వీటికి 3 గంటలు కేటాయించారు. రుణాత్మక మార్కులున్నాయి. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పాఠ్యాంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి. మాదిరి ప్రశ్నలు బిట్స్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సెక్షన్లవారీ సమయ నిబంధన లేదు. నిర్ణీత సమయం కంటే ముందే ప్రశ్నపత్రం పూర్తిచేసినవారికి అదనంగా 12 ప్రశ్నలకు జవాబు రాసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రతి సరైన సమాధానానికీ 3 మార్కులు, తప్పు జవాబుకు ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు.

పాత ప్రశ్నపత్రాలు
పాతప్రశ్నపత్రాలను కనీసం గత అయిదేళ్లవి పరిశీలించాలి. ప్రశ్నల తీరు, స్థాయి, ఆయా పాఠ్యాంశాలకు లభిస్తోన్న ప్రాధాన్యం వీటిద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యమైన సూత్రాలు గుర్తుంచుకోవాలి. గణితంలో కొన్ని చాప్టర్ల నుంచి అడిగే ప్రశ్నలకు షార్ట్‌కట్‌ మెథడ్స్‌ ద్వారా తక్కువ వ్యవధిలో జవాబు గుర్తించవచ్చు. పుస్తకాలను పరిమితంగానే ఎంచుకుని వాటినే ఎక్కువసార్లు చదువుకుంటే సమయం ఆదా అవుతుంది. కాల్‌క్యులేషన్స్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
బిట్‌శాట్‌- 2018లో 400, ఆపైన 280 మంది సాధించారు.. 350, ఆపై 2044 మంది పొందారు.. గత మూడేళ్ల స్కోర్‌లు పరిశీలిస్తే 350 మార్కులు సాధించినవాళ్లు ఏదో ఒక బిట్‌ క్యాంపస్‌లో చెప్పుకోదగ్గ ఇంజినీరింగ్‌ బ్రాంచిలో సీటు పొందవచ్చు.
* దరఖాస్తులకు గడువు: మార్చి 20, 2019
* ఆన్‌లైన్‌ పరీక్షలు: మే 16 నుంచి 26 వరకు.
* పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం
వెబ్‌సైట్‌: www.bitsadmission.com

Posted on 22-01-2019